Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్ఞాపకాల దొంతరను నెమరేసుకోవడం, గతంలోకి జారిపోయి పిల్లలైపోవడం వర్ణించలేని ఆనందం. అయితే, ఈ ఆనందానికే పరిమితమవకుండా ప్రభుత్వ విద్యను కాపాడాలని ఆలోచించడమే పస్రా గ్రామ పూర్వ విద్యార్థుల ప్రత్యేకత. ములుగు జిల్లా పస్రా గ్రామంలో మార్చి 13న 50బ్యాచిల పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం 'ప్రభుత్వ విద్యను కాపాడాలని' జరిగిన గొప్ప బడిపండగ.
పస్రాలో 1953లో సర్కారు బడి ప్రారంభమైంది. దట్టమైన అటవీ ప్రాంతమైనప్పటికీ ఆ కాలంలోనే అక్కడ బడి ఏర్పడటం విశేషం. ఈ బడి ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పింది. అభ్యుదయవాదులు, మేధావులను తయారు చేయడంలో కీలకపాత్ర పోషించింది. 1982లో పదవ తరగతిగా అప్‌గ్రేడ్ అయిన ఈ స్కూల్లో 2011లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభమైంది. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్ మీడియంతో 2021 వరకు 50 పదవ తరగతి బ్యాచుల్లో ఎంతో మందికి విద్యను అందజేసింది. ఈ 50బ్యాచిల్లో 3,306 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక ఊరు అభివృద్ధి కావాలంటే ముందు ఆ ఊర్లో పాఠశాల అభివృద్ధి కావాలి. పస్రా నేడు అభివృద్ధి చెందిన తీరుకు ఈ పాఠశాలే పునాది. ఈ 70ఏండ్ల పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం మరువలేనిది. ఈ పాఠశాల ఎంతోమంది టీచర్లు, డాక్టర్లు, వ్యాపార వేత్తలు, రాజకీయవేత్తలు, ఎన్నారైలను తయారు చేసింది. బడిలో బాల్యం, పిల్లల స్నేహం కల్మషం లేనిది. ఏమీ ఎరుగని బాల్యం ఓ మల్లెతీగలా స్నేహాల్ని అల్లు కుంటుంది. చిన్ననాటి చదువులు కుల, మతాలకు అతీతంగా ఉంటాయి. ఉపాధ్యాయులూ వారి వారి భావాలు ఏమైనా పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధికే పాటుపడతారు. పస్త్రా పాఠశాలలో అలాంటి ఉపాధ్యాయులు ఈ 70ఏండ్ల కాలంలో 200మందికి పైనే ఉన్నారు. ఈ పాఠశాలకు వందకు పైగా గ్రామాల విద్యార్థులు వచ్చి విద్యనభ్యసించారు.
భవిష్యత్‌కు దారినిచ్చే బడిపండుగ ఎందుకు
కార్పొరేట్ విద్య వచ్చి ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న తరుణంలో ప్రభుత్వ విద్య కనుమరుగు అవుతున్నది. పాలకులు పాఠశాలలను అభివృద్ధి చేయడంలో సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. ఒకనాడు 700పైగా విద్యార్థులు ఉన్న ఈ బడిలో ప్రస్తుతం 220మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల ఆవరణ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నది. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వాలు నిధులు కేటాయించే పరిస్థితి లేదు. అందువల్ల కనీస అవసరాలకు, పాఠశాల నిర్వహణకు ఎంతో కష్టమైతున్నది. ప్రభుత్వం వాచ్మెన్, స్వీపర్ పోస్టులను కూడా నింపడం లేదు. ఇవి గమనించిన కొద్ది మంది పూర్వ విద్యార్థుల ఈ బడిని బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకోసం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించాలని సమిష్టిగా నిర్ణయించాం. అలా 50బ్యాచ్‌ల సమ్మేళనం నిర్వహించాలని యోచించాం. పూర్వ విధ్యార్థుల సమ్మేళనం అంటే కేవలం గురువులకు సత్కారం చేసి, భోజనం చేసి, గత జ్ఞాపకాలు నెమరు వేసుకుని పోవడం కాదు. ఈ పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే కొత్త ఆలోచనలకు పునాది వేశాం. ''బడిపండుగ'' అని పేరు పెట్టి, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి , పాఠశాల భౌతిక అభివృద్ధి లక్ష్యంతో ముందుకు పోవాలని అనుకున్నాం. ప్రతి బ్యాచ్ నుండి ఒక ఐదుగురుని తీసుకొని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వారి అభిప్రాయాలు తీసుకుని చర్చ జరిపాం. ఆ తర్వాత ఊర్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఒక్కతాటి మీదకు తీసుకువచ్చాం. డిసెంబర్ 13న 27మందితో కోర్ కమిటీ ఏర్పడింది. 50బ్యాచ్‌ల నుండి 100మందితో అల్ కమిటీలు ఏర్పడబడ్డాయి. మూడు నెలల నుండి ఈ పండుగ కోసం తీవ్రంగా కష్టపడ్డాం. అలా మూడు నెలల శ్రమ ఫలితంగా 4 వేల మంది పూర్వ విద్యార్థులం కలిశాం. ఈ బడి పండుగను ఊరి పండుగలా చేశాం. ఈ కార్యక్రమానికి మూడుతరాల వాళ్ళు హాజరయ్యారు. చిన్న పెద్ద అందరూ 50బ్యాచ్‌ల వారు వచ్చి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ పండుగకు ముందే స్కూల్లో నాలుగు లక్షల తోటి కొన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. గ్రౌండ్ లెవెలింగ్, స్టేజి, బడికి రంగులు వేయించాం. భవిష్యత్తులో ఈ స్కూల్‌కి సోలార్‌తో కూడిన ప్రహరీ గోడ, గ్రంథాలయం, 50 కంప్యూటర్లతో కూడిన గది, గ్రౌండ్ సీసీ, ఆట వస్తువులు, సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు, ప్యూరిఫైడ్ వాటర్ ఇలా అనేక సదుపాయాలు కల్పించాలని బడి పండుగలో చర్చించాం. ఇవన్నీ సమకూరుస్తే మనబడి అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. విద్యార్థులు ఎక్కువ మంది చేరడానికి అవకాశం ఉంది. ఈ బడిలో ప్లే స్కూల్ ఏర్పాటుకు, సదుపాయాలకు కావాల్సిన డబ్బులు కూడా పూర్వ విద్యార్థుల సంఘం ఇవ్వాలని ఆలోచన చేసాం. అలా బడి పండుగతో అభివద్ధి ఆరంభమైంది. యాభై బ్యాచ్‌లలో ఒక బ్యాచ్‌కి 25 వేల రూపాయలు ఇస్తామని ముందుకొచ్చారు. బడి పండుగకు వచ్చే నాలుగు వేల మంది పూర్వ విద్యార్థులకు కాట్రగడ్డ సతీష్ కుమార్, సుధీర్ బాబు భోజనం పెడతామన్నారు. వచ్చే వారికి ఆరువేల వాటర్ బాటిల్స్‌కు అనిశెట్టి రామకృష్ణ, ముందు స్టేజికి పన్నాల శ్రీనివాస్‌రెడ్డిలు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అనేకమంది మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా సాయం చేశారు. పూర్వ విద్యార్థుల సంఘం జెడ్పీఎస్ఎస్ పస్రా పేరుతో ఒక సొసైటీ ఏర్పాటు చేసి ప్రతి పైసా అకౌంట్లో పడే విధంగా చేశాం. బడి పండుగ రోజు వ్యాపారవేత్త అయిన పూర్వ విద్యార్థి కలకుంట్ల రామారావు 16లక్షలు, ఎన్నారైలు సతీష్‌చౌదరి, అప్పన చౌదరి 5లక్షలు, తాసిల్దార్ సోలిపురం రాజిరెడ్డి 3లక్షలు, వ్యాపారవేత్త సూర్య కిరణ్ గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలు ఇస్తామన్నారు. కొండ్రెడ్డి బ్రదర్స్ 2లక్షలు, కీర్తిశేషులు రెడ్డి సోమి రెడ్డి పిల్లలు లక్ష రూపాయలు ఇలా అనేక మంది దాతలు రూ.30 లక్షలు వరకు హామీ ఇవ్వడం జరిగింది. 13న జరిగే బడి పండుగ నుండే స్కూల్ అభివృద్ధి ప్రారంభమైనట్టు. పండుగకు వచ్చిన ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు అతిథులు భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధిలో మా పాత్ర తప్పకుండా ఉంటుందని రెట్టించిన ఉత్సాహంతో చెప్పారు. కన్న తల్లి రుణం తీర్చుకున్నట్టే. చదువు నేర్పిన పాఠశాల రుణం కూడా తీర్చుకుందాం అనే నినాదంతో ఈ బడి పండుగ జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. మా పస్రా పూర్వవిద్యార్థుల కమిటి కోరుకునేది ఒకటే... రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి. మన పాఠశాలను మనమే రక్షించుకోవాలి. ఇలా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవాలనే లక్ష్యం పెట్టుకోవాలి. ''ఎడ్యేకేషన్ బచావో... దేశ్ బచావో'' అన్న నినాదంతో మేం ముందుకు వెళ్దాం. లేదంటే ఈ పాలకు ప్రభుత్వ విద్యను బతుకనివ్వరు.
- బిరెడ్డి సాంబశివ
సెల్:9490300329