Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిజాబ్‌పై కర్నాటక హైకోర్టు తీర్పు సహేతుకమైన సర్దుబాటు ఆవశ్యకతను గుర్తించడంలో విఫలమైంది. విద్యాసంస్థల్లో విద్యార్థులు తలకు కండువాలు ధరించడంపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేక విధాలా తప్పు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై తలెత్తిన వివాదంపై ప్రశ్నలు లేవనెత్తిన తీరు రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీసేదిగా ఉంది. నిర్దేశిత యూనిఫామ్‌కు అదనంగా ధరిస్తున్నారా? యూనిఫామ్ రంగుకు ఎలాంటి తేడా లేని హిజాబ్ ధరించడం వల్ల పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించడం సరైనదా? కాదా? అన్న విషయాన్ని పరిశీలించడంలో కోర్టు విఫలమైంది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారమని, అందువల్ల, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ప్రసాదించబడిన మత స్వేచ్ఛలో భాగంగా దీనికి రాజ్యాంగపరమైన రక్షణ ఉందని విద్యార్థులు చేసే వాదనతో విభేదిస్తూ ఖురాన్‌లోని చరణాలను బెంచ్ ఉటంకించింది. ఇదా అసలు సమస్య? విద్యార్థుల మధ్య సమానత్వ భావనను దెబ్బతీయకుండా సామాజిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా తరగతి గదిని బహుళత్వంతో కూడిన సమాజం అనుమతించే 'సహేతుకమైన సర్దుబాటుకు అనుకూలమైన వాదనను కోర్టు తోసిపుచ్చింది. పాఠశాలల వంటి ''బహిరంగ స్థలాల్లో'' దుస్తులకు సంబంధించిన నియమాలు అవసరమే కావచ్చు. కానీ సూచించిన యూనిఫారానికి ఇబ్బంది కలిగించని రీతిలో అదనంగా చిన్న వస్త్రాన్ని ధరించే సర్దుబాటును సైతం తిరస్కరించడంలో హేతుబద్ధత ఏమిటో అర్థం కావడం లేదు.
'మనస్సాక్షి స్వేచ్ఛ'పై ఆధారపడిన వాదనను తిరస్కరించిన కోర్టు అందుకు పిటిషన్లలో తగిన వివరణ లేకపోవడాన్ని ఒక సాకుగా చూపింది. యూనిఫామ్ ఆవశ్యకతను గురించి కోర్టు నొక్కి చెబుతూ, సమానత్వం, సజాతీయత యొక్క ఉల్లంఘించలేని చిహ్నం అని ఉద్ఘాటించింది. సజాతీయత అంటే సర్దుబాటుకు ఆస్కారమిచ్చే వాదనలను మొత్తంగా తోసిరాజనడమన్నట్టుగా కోర్టు చూసింది. ఈ కేసులో 'ఎసెన్షియల్ ప్రాక్టీస్' (మౌలికమైన ఆచరణ)ను పరీక్షకు పెట్టాల్సిన అవసరం ఉందా అనేది మరో ప్రశ్న. పూర్తిగా మతతత్వంతో కూడిన దురాచారమైతే, దానిని కేంపస్ వెలుపల ఉంచవచ్చు. ఏకరూపత, వేరుపరిచే భావనను తొలగించడం అనేవి మంచి లక్ష్యాలే. అయితే, ఇటువంటి అంశాలపై తలెత్తే చిక్కులను వేదాంతాల జోలికి పోకుండానే పరిష్కరించవచ్చు. 'మౌలికమైన మతపరమైన ఆచారాలు'ను పరీక్షించడం మొదలు పెడితే దానికి ఇక హద్దు పద్దు ఉండదు. ఇటువంటి వాటిని నిర్ణయించడానికి సుప్రీంకోర్టు తిరుగులేని ప్రమాణాలను నెలకొల్పింది. మౌలికమైన ఆచారాలు అని దేనిని పిలుస్తామంటే, అది లేకపోయినా లేదా తొలగించబడినా మొత్తం మతమే నాశనమయ్యే ప్రభావాన్ని కలిగి ఉండేవాటిని మాత్రమే. కొన్ని మౌలికమైన ఆచారాలు కాపాడబడితే కాపాడుకోనివ్వండి. అటువంటి వాటివల్ల ఏ మతపరమైన ఆచారమూ మనుగడ సాగించదు. దానికి బదులు సమానత్వం, గౌరవం, గోప్యత, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన వంటి రాజ్యాంగ విలువలకు రక్షణగా ఆర్టికల్ 25ని క్లెయిమ్ చేయడాన్ని పరీక్షిస్తే ఎక్కువ ప్రయోజనం. ఏదేమైనప్పటికీ ఇటువంటి వాటిని 'మౌలిక' పరీక్షకు ఎన్నడూ పెట్టకూడదు.. ఎందుకంటే ఇది వేదాంత భావనలను మిగతా వాటిపై స్వారీ చేయడానికి సిద్ధాంతపరంగా అనుమతిస్తుంది. ఆ భావనలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమా, కాదా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఒక మతానికి ఆవశ్యకం గా పరిగణించబడుతూ ఉంటాయి. స్వేచ్ఛలు ముఖ్యం కాబట్టి మత స్వేచ్ఛ ముఖ్యమే. కానీ మతా లు కాదు ముఖ్యం.
- హిందూ సంపాదకీయం