Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుపమ కటకం
2002లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రక్తపాతంతో కూడిన అనాగరిక దాడుల్లో మూడు నెలల కాలంలో 2వేల మందికిపైగా ప్రజలు హత్యకు గురయ్యారు. ఆ కాలంలో మాన వత్వానికి వ్యతిరేకంగా అత్యంత క్రూరమైన నేరాలు జరిగాయి. కానీ దాడుల్లో దోషులైన 150మందిలో ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించలేదు. 2008లో అహ్మదాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో56 మంది చనిపోయారు. ఈ కేసులో దోషులైన 49మందిలో 38మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
7015 పేజీల తీర్పు సెక్షన్ 302 ఐపీసీ కింద 38మందికి మరణశిక్షను విధించిందని అహ్మదాబాద్‌కు చెందిన న్యాయవాదులు అన్నారు. అదనంగా 'ఉపా' చట్టంలోని సెక్షన్లు 10, 16(1)9ఏ),(బీ) కింద దోషులపై కేసులు నమోదు చేశారనీ, శిక్ష విధించిన వారికి ఒక్కొక్కరికి రూ.2.4లక్షలు జరిమానా విధించారని వారన్నారు. ఆ డబ్బు పేలుళ్లలో మరణించిన 56మంది బాధిత కుటుంబాలకు చెందుతాయని కోర్టు చెప్పింది. ''ఈ కేసు దర్యాప్తు చాలా రహస్యంగా జరిగిందనీ, దీనిని తెలుసుకునే ప్రయత్నం చేశాం కానీ కొంత సమాచారం మాత్రమే అధికారుల నుంచి పొందామనీ, నేరారోపణలు ఎదుర్కొంటున్న అనేకమందిని నిర్భంధంలోకి తీసుకోడానికి ముఖ్యమైన రుజువులు ఉన్నాయని మేము నమ్మడం లేదని'' అహ్మదాబాద్‌కు చెందిన కార్యకర్త, అడ్వకేట్ రియాజ్ పఠాన్ (మార్చిన పేరు) అన్నాడు. ప్రభుత్వ ఎజెండాకు తగినటువంటి రుజువులను వదంతుల ద్వారా సేకరించి ఉండవచ్చని రియాజ్ అంటాడు. ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారాడు. అతడిచ్చిన సమాచారం ఆధారంగానే దేశ వ్యాప్తంగా అరెస్టులు జరిగాయి. తీర్పులో మరణశిక్షను విధించినపుడు రుజువులు మరింత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
అహ్మదాబాద్ పేలుళ్ళు
జూలై 26, 2008న అహ్మదాబాద్ నగరంలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. గంట సమయంలో, నగరంలోని వివిధ ప్రాంతాల్లో 21బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లు ఒక క్రమపద్ధతిలో జరిగినట్లు కనిపించలేదని స్థానిక ప్రజలు అన్నారు. కొన్ని బస్సుల్లో, కొన్ని పార్కింగ్ చేసిన వాహనాల్లో పేలాయి. కొన్ని బాంబులు బజార్లలోని చెత్త కుండీలలో దొరికాయి. అధికారుల లెక్కలు ప్రకారం 56 మంది చనిపోయారు, సుమారు 200 మందికి గాయాలయ్యాయి. ఆ మరుసటి రోజు సూరత్‌లో 17 బాంబులు దొరికాయి, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 11 బాంబులు దొరికాయి. సూరత్‌లో బాంబులు చాలా ఇరుకైన ప్రాంతాల్లో పెట్టడం వల్ల బాగా నష్టం వాటిల్లి ఉండేది. కానీ, కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ఆ బాంబులు పేలలేదు.
బాంబు పేలుళ్లకు కొన్ని నిమిషాల ముందు ఒక టీవీ ఛానల్‌కు 14 పేజీల ఈమెయిల్ ఒక అపరిచిత ఉగ్రవాద సంస్థ అయిన 'ఇండియన్ ముజాహిదీన్' నుండి వచ్చినట్లు పోలీసు అధికారులు మీడియా సమావేశంలో చెప్పారు. 'రెయిజ్ ఆఫ్ జీహాద్' అనే టైటిల్‌తో వచ్చిన ఈమెయిల్లో దాడులు చేసింది మేమేనని ఉందని పోలీసులు తెలిపారు. మరొక మిలిటెంట్ గ్రూప్ అయిన 'హర్కత్-ఉల్-జీహాద్-అల్-ఇస్లామీ' సంస్థ కూడా దాడి చేసింది తామేనని చెప్పుకున్నారు, కానీ అధికారులు ఆ సంస్థకు చెందిన సమాచారాన్ని విడుదల చేయలేదు.
2002లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన మారణహౌమానికి ప్రతీకారమే ఈ పేలుళ్లని బాంబు పేలుళ్ల తరువాత కొంతమంది ప్రజలు ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. అంతే కాకుండా, టెర్రరిస్టులకు గుజరాత్‌లోకి ప్రవేశించే ధైర్యంలేదని నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ బాకా ఊదుకున్నాడు. కాబట్టి ఆయనకు, ఆయన పార్టీకి మిలిటెంట్లు ఒక సందేశం పంపించాలని అనుకున్నట్లు ప్రజలు భావించారు.
దర్యాప్తులు, అరెస్ట్‌లు
అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో ఉపయోగించిన పేలుడు పదార్థాలు, పరికరాలు, 2008 మేలో జైపూర్ వరుస పేలుళ్లలో, 2007 నవంబర్ నెలలో లక్నో కోర్టు భవనాల్లో, వారణాసి, ఫైజాబాద్ పేలుళ్లలో, 2007 ఆగస్ట్‌లో హైదరాబాద్ పేలుళ్లలో, 2006 మార్చి నెలలో వారణాసి బాంబు పేలుళ్లలో ఉపయోగించిన పేలుడు పదార్థాలను పోలిఉన్నాయని ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ, ఈ నగరాల్లోని అధికారులకు పంపిన ఈమెయిల్‌లు, అహ్మదాబాద్ పేలుళ్లకు ముందు పంపిన ఈమెయిల్‌లు ఒకే విధంగా ఉన్నాయి. బాంబులను తయారు చేసిన వారు ఒకరే అయి ఉండాలి లేదా బాంబులను తయారు చేసిన వారికి శిక్షణ ఇచ్చిన వారు ఒకరే అయి ఉండి ఉండొచ్చని రుజువులు సూచించాయి.
ఉగ్రవాద సంస్థ పంపిన ఈమెయిల్స్‌లో 2002 గుజరాత్ అల్లర్ల చిత్రాలు ఉన్నాయనీ, గుజరాత్ మత హింసకు, 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా వారు బాంబు పేలుళ్లను తలపెట్టినట్లు, గుజరాత్ క్రైం బ్రాంచ్ అధికారులు మీడియా సమావేశంలో చెప్పారు. ఇదే విధమైన బాంబుల తయారీ కూర్పులో ఉపయోగించిన వివిధ రసాయనాలను నిషేధిత 'స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా' (సిమి) వారు ఉపయోగించారని ఫోరెన్సిక్ నిపుణులు వారు సేకరించిన పదార్థాల ద్వారా తేల్చారు. సిమి సభ్యులే ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్ గా ఏర్పడ్డారని దర్యాప్తు చేసిన అధికారులు భావించారు. రాష్ట్రంలో మతతత్వీకరణను పరిశీలిస్తున్న రియాజ్ పఠాన్, ఇతర కార్యకర్తలు, బాంబులను పెట్టిన వ్యక్తులెవరనే సమాచారం పోలీసుల వద్ద లేదని అన్నారు. వారు కొంత మేరకు మాత్రమే సమాచారాన్ని విడుదల చేశారు, కానీ వారు మల్లగుల్లాలు పడుతున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని బాంబులు చెత్తకుండీలలో లేదా పార్క్‌లలో దొరికాయని ఒక కార్యకర్త అన్నాడు. చెత్తలో బాంబులు పెట్టే టెర్రరిస్టులు ఎవరుంటారని అతనన్నాడు.
2010-2017 మధ్య కాలంలో, కేరళ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 78 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల సమాచారం ప్రకారం, నిందారోపణలు చేయబడిన వారిలో కొంతమంది 'సిమి' కార్యకర్తలు కూడా ఉన్నారు.దోషులుగా నిర్ధారించిన వారికి సంబంధించిన కుటుంబాలవారు, బాంబు పేలుళ్లతో వారికి ఎటువంటి సంబంధం లేదనీ, తప్పుడు సమాచారంతో వారిని ఇరికించారని అన్నారు.
తాము పేద కుటుంబాల నుంచి వచ్చామని, వారిని వారు రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల దోషులుగా సంవత్సరాల తరబడి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రియాజ్ పఠాన్ అన్నాడు. ఈ విచారణలో అనేక మలుపులు ఉన్నాయి. 2013లో జైలును పగులగొట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సబర్మతీ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, 213 అడుగుల సొరంగం తవ్వారని 14 మంది ఖైదీలపై కేసు నమోదు చేశారు.
గోద్రా సంఘటనకు 20 ఏండ్లు
2022, ఫిబ్రవరి 27, 28కి గోద్రా మారణహౌమం జరిగి 20 ఏండ్లు. అధికార లెక్కల ప్రకారం 1000 మంది హత్యకు గురయ్యారు, 233 మంది జాడ తెలియలేదు. కానీ అనధికార లెక్కల ప్రకారం 2000 మంది ప్రాణాలు కోల్పోయారు, జాడ తెలియని వారి సంఖ్య 233కు రెట్టింపే ఉంటుంది.
అయోధ్య నుంచి సబర్మతీ ఎక్స్‌ప్రెస్ రైల్లో తిరిగి వస్తున్న కరసేవకుల కోచ్‌కు నిప్పు పెట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అనాగరిక దాడులు జరిగాయి. కొన్ని సంవత్సరాలపాటు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాల వారు సేకరించిన రుజువులు రైలు బోగీకి నిప్పు పెట్టిన చర్య పథకం ప్రకారమే జరిగిందని తెలిపాయి. గుజరాత్ అల్లర్లలో మహిళలపై అత్యాచారాలు జరిగినా, పిల్లలను చంపినా, ప్రజలను సజీవంగా రోడ్డు పైనే దహనం చేసినా, ఇళ్ళను లూటీ చేసినా, దోషుల్లో ఏ ఒక్కరికీ మరణశిక్ష విధించలేదు. మాయాకొడ్నానీ, అమిత్ షాపై కూడా అల్లర్లలో నేరారోపణలు ఉన్నాయని రియాజ్ పఠాన్ అన్నాడు.
ఉదాహరణకు, అహ్మదాబాద్‌లోని నరోదాగామ్ ప్రాంతంలో మితవాదుల నాయకత్వంలో జరిగిన మూకుమ్మడి మానవ సంహారంలో 97మంది ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ మంత్రి మాయాకొడ్నానీ అల్లరిమూకకు ఆజ్ఞలు జారీ చేస్తూ ఆ ప్రాంతం లో కనిపించాడని సాక్షులు చెప్పారు. 2012 ఆగస్ట్‌లో ప్రత్యేక కోర్టు మాయాకొడ్నాని, బాబు బజరంగీ అనే బజరంగ్ దళ్ ప్రముఖునితో పాటు 32మందికి 28ఏండ్లు జైలుశిక్ష విధించింది.
2018లో మాయాకొడ్నానీతో పాటు 29మందిని నిరపరాధులుగా (సరైన రుజువు లేదని) ప్రకటించింది. బజరంగీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2019లో సుప్రీంకోర్టు అతనికి మెడికల్ బెయిల్ మంజూరు చేసింది, ఆ తరువాత అతడు మళ్ళీ జైలుకు తిరిగి వెళ్లలేదు. 2002లో మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో నేరాలకు పాల్పడిన వారు, కుట్రదారులు వీధుల్లో నిర్భయంగా తిరుగుతూ, ద్వేష భావంతో హింసాత్మక చర్యలకు పాల్పడడం ద్వారా ఫాసిస్టు ఎజెండాను కొనసాగిస్తున్నారు. మిలియన్ల సంఖ్యలో ప్రజలను అసత్యాలు, ద్వేషభావాలతో రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో భయభ్రాంతులకు గురి చేయడంలో నేడు దేశాన్ని పాలిస్తున్న కొందరు ప్రముఖులు కృతకృత్యులయ్యారని, అహ్మదాబాద్ మత ఘర్షణలు జరుగుతున్న చీకటి రోజుల్లో అనేకమంది ముస్లింలకు ఆశ్రయాన్నిచ్చిన ఫాదర్ సెడ్రిక్ ప్రకాశ్ చెప్పాడు.
ఈ రక్తపాతంతో కూడిన చీకటి అధ్యాయంలో నేరస్తులెవరికీ మరణశిక్షను విధించలేదు. దోషులుగా నిర్ధారించబడి, జైలుకు వెళ్లిన కొందరు ప్రముఖులు బెయిల్‌పై విడుదల అయ్యారు. నేడు వారు అనుభవిస్తున్న స్వేచ్ఛకు దేశంలోని అత్యంత శక్తివంతులు రక్షకులుగా ఉంటున్నారు. ఇది, అత్యంత దయనీయమైన మన క్రిమినల్ న్యాయవ్యవస్థ పరిస్థితి.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451