Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర బీజేపీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగాన్ని ధ్వంసం చేయడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వరంగం వల్ల దేశ ఆర్థిక, సార్వభౌమత్వానికి కలిగిన ప్రయోజనం, ఆ సంస్థల్లో పనిచేసే కార్మికుల హక్కులు, భద్రతా, సామాజిక న్యాయం వంటి పలు సానుకూల ఫలితాలు దేశప్రజల కండ్ల ముందున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంతం ఆధారంగా పాలకులు అనుసరించిన విధానమే దీనికి ప్రధాన కారణం. 75ఏండ్ల స్వాతంత్య్రానంతరం ముఖ్యంగా ఎనిమిదేండ్ల మోడీ పాలనలో బీజేపీ ప్రభుత్వ లక్ష్యాలు బడా కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వరంగాన్ని దోచిపెట్టడం. దీని అమలు కోసం ఆకర్షణీయమైన నినాదాలను బీజేపీ సర్కార్ ఎంచుకున్నది? ఆత్మనిర్భర్ భారత్, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా వంటివి అందులో భాగమే. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పలు సందర్భాల్లో చెప్పినట్లు మన దేశంలో రెండు 'భారత దేశాలు' నిర్మాణం అవుతున్నాయని, వాటి దుష్ప్రభావాల వల్ల ధనికులు, పేదల మధ్య అసమానతలు తీవ్రంగా పెరిగాయి. దేశ ప్రజల సంపదతో నిర్మితమైన ప్రభుత్వరంగాన్ని పేకమేడల్లా కూలగొట్టే పనిని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే మార్చి 28, 29 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు రాష్ట్ర కార్మికవర్గం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సమ్మెకు సమాయత్తమయ్యాయి.
ప్రభుత్వరంగానికి ఉరితాడు బిగిస్తున్న మోడీ సర్కార్ : బిహెచ్‌ఇఎల్‌కి ఇవ్వాల్సిన ఆర్డర్లను రిలయన్స్, ఎల్ అండ్ టికి ప్రభుత్వం కట్టబెడుతున్నది. బిహెచ్ఇఎల్ను ప్రొడక్షన్ డైవర్సిఫికేషన్ పేరుతో బిహెచ్ఇఎల్ను అభివృద్ధి చేస్తామన్న హామీ 20 ఏండ్లుగా అమలుకు నోచుకోలేదు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు ఆర్డర్లు మెరుగ్గా ఉన్నప్పటికీ డిజిన్వెస్ట్‌మెంట్ 48.84శాతం చేయడం తీవ్రమైన నష్టం. మరో 2శాతం డిజిన్వెస్ట్‌మెంట్ జరిగితే పూర్తి ప్రయివేటీకరణకు దారి తీసినట్టే. ఈ సంస్థలో 6 నెలల నుండి రిటైరైన చైర్మన్ Ê మేనేజింగ్ డైరెక్టర్ స్థానంలో కొత్తవారిని పెట్టకుండా జాప్యం చేయడం ఈ కుట్రలో భాగమే. ఇప్పటికే బిడిఎల్, హెచ్ఎఎల్లో 25శాతం, మిథానీలో 26శాతం డిజిన్వెస్ట్‌మెంట్ జరిగింది. మరో 10శాతం డిజిన్వెస్ట్మెంట్కు ప్రభుత్వం క్లియరెన్స్ కూడా ఇచ్చింది. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్‌కు చెందిన బిఇఎల్, బిడిఎల్, హెచ్ఎఎల్, మిథాని ఈ నాలుగు సంస్థలను విలీనం చేసి పూర్తి ప్రయివేటీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. సింగరేణిలో 4 బొగ్గు బావులను ప్రయివేటీకరించే ప్రక్రియను కార్మికులు సమ్మెల ద్వారా ప్రతిఘటించడం వల్లనే తాత్కాలికంగా బ్రేక్ పడింది. బిఎస్ఎన్ఎల్కు 4జి సేవల అనుమతులకై 2017 నుండి కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులు అడుగుతున్నా ఇవ్వకుండా జియో లాంటి సంస్థకు 4జి అనుమతులిచ్చింది. 5జి సేవలను ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించింది.
గత పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల రిజర్వు ఫండ్స్‌ను బైబ్యాక్ పాలసీ ద్వారా కేంద్ర ప్రభుత్వమే వాడుకుంటున్నది. దీనివల్ల ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ తన కార్యకలాపాల నిర్వహణకు క్యాష్‌ఫ్లో కోసం బ్యాంకులపై ఆధారపడాల్సి వస్తున్నది. అందుకు ప్రతి సంస్థ వడ్డీల రూపంలో వందల కోట్ల రూపాయ లు చెల్లించాల్సి రావడం ప్రభుత్వరంగ సంస్థలను కనుమరుగు చేయడం తప్ప మరొకటి కాదు.
దూకుడుగా ప్రయివేటీకరణ చర్యలు : ప్రయివేటీకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు అనేక సవరణలు చేసింది. కార్పొరేట్ సంస్థల బ్యాంకుల ఆర్థిక వనరుల దోపిడీని చట్టబద్ధం చేసేందుకు అవకాశాలు కల్పించింది. మేజర్ పోర్ట్ చట్టాన్ని ఆమోదించింది. బీమా కంపెనీలలో పబ్లిక్ షేర్లను అమ్మకాలకు పెట్టింది. కోలిండియా సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చి బొగ్గు గనులను ప్రయివేటు సంస్థలకు దారాధత్తం చేస్తున్నది. 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 7 కంపెనీలుగా మార్చింది. రక్షణరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించి దేశద్రోహ చర్యకు పాల్పడింది. ప్రణాళికా బోర్డును రద్దు చేసింది. నిటి అయోగ్‌ను ప్రవేశపెట్టి జాతీయ వ్యతిరేక విధానాన్ని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్నది.
ప్రయివేటీకరణ విధానానికి ఎన్ఎంపి పరాకాష్ట : నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ (ఎన్ఎంపి) 2021 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.111లక్షల కోట్ల లక్ష్యంగా నాలుగేండ్ల పాటు ఈ పథకం కొనసాగుతుందని, ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటీకరించడం లేదని, ముప్ఫై ఏండ్ల పాటు లీజుకు ఇచ్చి అరవై ఏండ్ల వరకు పొడిగించవచ్చని, ఉద్యోగుల పదవీ విరమణను బలవంతం చేయబోమని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పచ్చి దగా. ప్రభుత్వ ఆస్తుల్లో కోర్, స్ట్రాటజిక్ ఆస్తులు కూడా ఉన్నాయి. వీటి పనితీరు కూడా అద్భుతంగా ఉన్నది. ఇటీవల నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్‌ను కేంద్ర కేబినెట్ ఏర్పాటు చేసింది. అంటే ప్రభుత్వరంగ సంస్థల భూములు, భవనాలు అమ్మకానికి పెట్టడమంటే ప్రభుత్వరంగాన్ని నామరూపాలు లేకుండా చేయడమే. స్వాతంత్య్రానంతరం స్వయంకృషితో నిర్మించుకున్న మన ప్రభుత్వరంగాన్ని ధ్వంసం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? గత 30 ఏండ్లుగా ప్రయివేటీకరణ అంటే ప్రభుత్వరంగాన్ని ముక్కలుగా చేసి రిటైల్‌గా అమ్మడం. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ అంటే మొత్తం ప్రభుత్వరంగాన్ని హౌల్సేల్గా అమ్మేయడమే.
ట్రేడ్ యూనియన్ ఉద్యమంపై దాడి: 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల చట్టపరమైన కనీస హక్కులను హరిస్తున్నది. వీటి వల్ల ప్రభుత్వరంగంలోని పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు, ట్రేడ్ యూనియన్లు హక్కులు కోల్పోతాయి. కార్మికులు బేరసారాల హక్కును కోల్పోతారు. కొత్త ట్రేడ్ యూనియన్ల నమోదు ప్రక్రియపై తీవ్ర ఆంక్షలు విధించబడతాయి. ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి ట్రేడ్ యూనియన్ రిజిస్టార్లకు విస్తృత అధికారాలు కల్పించబడ్డాయి. కేంద్ర మంత్రిత్వశాఖ లేదా రాష్ట్ర కార్మిక మంత్రిత్వశాఖ ద్వారా నిర్వహించ బడుతున్న ప్రస్తుత ధృవీకరణ వ్యవస్థ తొలగించబడింది. ట్రేడ్ యూనియన్ నమోదును కూడా నిర్వహించడం చాలా కష్టం. మూడు వందల కంటే తక్కువ కార్మికులు పనిచేసే పరిశ్రమలకు స్టాండింగ్ ఆర్డర్స్ వర్తించవు. ఆచరణలో అనేక కార్మిక హక్కులు రద్దు చేయబడతాయి.
ఈ నేపథ్యంలో 2022 మార్చి 28, 29 తేదీల్లో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. యజమానులు, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలతో సమ్మె హక్కు రాలేదు. కోట్లాది కార్మికుల త్యాగాలతో సమ్మె హక్కును కార్మికవర్గం సాధించుకున్నది. కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వాలపై చేసే అనేక పోరాటాల్లో చివరి అస్త్రమే సమ్మె. అందుకే ఈ సమ్మెను కార్మికవర్గం జీవన్మరణ సమస్యగా భావిస్తున్నది. ఈ సమ్మెను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి గుణపాఠం చెప్పాలి. కనీస వేతనం రూ.26,000లు, లేబర్ కోడ్ల రద్దు, ఉద్యోగ భద్రత, అధిక ధరల నియంత్రణ, కేంద్ర స్కీమ్‌ల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, భవన నిర్మాణం, హమాలీ, ప్రయివేటు ట్రాన్స్పోర్ట్ తదితర అసంఘటితరంగ కార్మికుల న్యాయసమ్మత డిమాండ్ల సాధనకు ఒత్తిడి చేయాలి. ప్రయివేటీకరణ, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్, విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు, వ్యూహాత్మక అమ్మకాల వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలి. ప్రజల కోసం, దేశ ఆర్థిక స్వావలంబన కోసం, ప్రభుత్వరంగం, కార్మిక హక్కుల పరిరక్షణ కొరకు జరిగే ఈ సమ్మెకు ప్రజలు, రాజకీయ పార్టీలు అండగా నిలవాలి.
- జె. వెంకటేష్