Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 2.56లక్షల కోట్లతో 2022-23 సంవత్సరపు బడ్జెట్‌ను ఆమోదించుకున్నాం. ఏప్రిల్ 1 నుండి ఈ బడ్జెట్ అమలులోకి వస్తుంది. ప్రభుత్వం ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకొస్తుందన్న నమ్మకం కానీ, ప్రజల అవసరాల మేరకు ఆర్టీసి విస్తరణ జరుగుతుందన్న నమ్మకం కానీ ఈ బడ్జెట్ కలిగించలేకపోతుంది. అలాగే సంస్థ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్ధిక పరిస్థితిని సరిదిద్ది, దానిని ఆదుకొని ప్రజా రవాణాను కాపాడటానికి ఎటువంటి ప్రతిపాదనలూ ఈ బడ్జెట్లో లేవు. అనేకమంది మేధావులు, కార్మిక సంఘాలు కోరుతున్నట్లు రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 2శాతం నిధులు ఆర్టీసీకి కేటాయించాలని, ఆర్టీసీ అప్పులను ఈక్విటీగా మార్చాలన్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే రోజు రోజుకి పెరుగుతున్న డీజిల్ ధరల భారం నుండి ఆర్టీసీని బయటపడేయటానికి తమిళనాడు తరహాలో 2019 డిశంబర్ నాటి డీజిల్ ధరలపై స్థిరీకరణ చేసి, పెరిగిన భారాన్ని ప్రభుత్వం రీ-ఎంబర్స్ చేయాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో కరోనా పరిస్థితులు, డీజిల్ ధరల పెరుగుదల వల్ల మొత్తం 5118.35కోట్ల నష్టం వచ్చింది. దీని నుండి ఆర్టీసీని బయపడేయటానికి ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు.
ఇన్ని నష్టాలకు కారణం కార్మికులు, ప్రజలు అన్నట్లే ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నిజానికి కరోనా పరిస్థితుల వల్ల లాక్డౌన్ పెట్టింది. సర్వీసులు నడపవద్దని ఆదేశించినది ప్రభుత్వాలు. అటువంటప్పుడు అందువల్ల వచ్చిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి.
మెట్రో రైలును నడుపుతున్న ఎల్ Ê టి సంస్థకు కరోనా పరిస్థితుల వల్ల ప్రయాణీకుల సంఖ్య తగ్గిందని, దానిని భర్తీ చేయడానికి రాష్ట్ర బడ్జెట్లో 1500 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీకి మాత్రం బడ్జెట్లో కేటాయిం పులు చేయలేదు. (రీ-ఎంబర్స్మెంట్ కోసం 1500 కోట్లు తప్ప)
ఆర్టీసీ పరిస్థితి ఎలా మెరుగుపడుతుంది? : 2022-23 సంవత్సర బడ్జెట్ అంచనాలలో 130.18కోట్ల కి.మీ. బస్‌లు నడిపి 6002.07కోట్లు ఆదాయం ఆర్జించాలని అంచనాలు వేసినట్లు ప్రభుత్వ పత్రాలలో తెలిపారు. ప్రభుత్వం నుండి రాయితీల రీ-ఎంబర్స్మెంటు క్రింద రావలసిన 915.58 కోట్లు వస్తాయని అంచనాతో ఈ లెక్కలు వేశారు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోజుకి సగటున 16.44కోట్లు ఆదాయం వస్తుందని నిర్థారించారు. దీనికి ప్రాతిపదిక ఏమిటి? 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.75కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరాలలో 8.66కోట్లు అమాంతంగా 16.44కోట్లకు ఎలా పెరుగుతుంది? ఆర్టీసీ బస్‌ల సంఖ్యను పెంచుతారా? ఆర్టీసీ బస్లులేని వేల గ్రామాలకు బస్‌లు వేస్తారా? ఇప్పుడు తిప్పుతున్న 26లక్షల కిలో మీటర్లు కాస్తా 52లక్షల కి.మీ. పెంచుతారా? పెంచడానికి మన దగ్గర ఉన్న బస్‌లు, సిబ్బంది సరిపోవుకదా? మరి ఎలా అనే దానికి ప్రభుత్వం వద్ద, ఆర్టీసీ వద్ద ఎటువంటి జవాబు లేదు.
మరోవైపున ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన వెంటనే విఆర్ఎస్ను వెలుగులోకి తెచ్చి పత్రికలలో లీకులు ఇచ్చి చర్చ చేస్తున్నారు. రవాణా పద్దుపై జరిగిన చర్చలకు గౌరవ మంత్రి సమాధానం చెప్తూ, ఆర్టీసీ పరిస్థితి మెరుగైతేనే కార్మికులకు ఇవ్వాల్సిన 2017 పేస్కేలు గురించి ఆలోచిస్తామని ప్రకటన చేశారు. దీనర్థం ఏమిటి? రాష్ట్రంలో 9లక్షల మంది ఉద్యోగులకు జీతాలు పెంచామని, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు ఈ రాష్ట్రంలోని కార్మికులు కాదా? వారికి మాత్రం ఆర్టీసీ పరిస్థితి మెరుగయితేనే జీతాల గురించి ఆలోచిస్తామని చెప్పడం ఏమిటి? నిజానికి 2017, 2021లో రావలసిన వేతన ఒప్పందాలు, 6 డిఎలు (26.6శాతం) బకాయి ఉన్నాయి. వాటి గురించి మాటమాత్రం కూడా మాట్లాడని ప్రభుత్వాన్ని ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఎలా నమ్ముతారు? సంస్థ ఫిలాసఫి గురించి పద్దుల పుస్తకంలో పాయింటు (బి)లో ఇలా రాసి ఉంది. 'ఆర్థిక, మానవీయ పరంగా ఉద్యోగులకు సంతృప్తిని అందించడం'... అని చెప్పిన దాని అర్థం ఇదేనా? ఈ ప్రకటనలు, చర్యలు కార్మికులకు సంతృప్తినిస్తాయా.
నిజాలు చెప్పని పత్రం : కార్మికుల సంక్షేమం కోసం ఎస్బిటి సంస్థను నడుపుతున్నామని, ఉద్యోగంలో ఉండి చనిపోతే 1,50,000 ఇస్తామని, వ్యక్తిగత రుణం 10శాతం వడ్డీతో లక్ష రూపాయలు ఇచ్చి 60నెలల్లో రికవరీ చేస్తారని చెప్పారు. అలాగే ఎస్ఆర్బిఎస్ నుండి లక్ష రూపాయల లోన్లు ఇస్తామని రాశారు. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి డబ్బులు ఆర్టీసీ సంస్థ అవసరాలకు వాడుకోవడం కోసం కార్మికులకు ఇచ్చే లోన్లకు 2017 నుండి నిలిపివేశారు. ఆ సంస్థల నుండి (ఎస్బిటి నుండి 125.33 కోట్లు, ఎస్ఆర్బిఎస్ నుండి 358.59 కోట్లు) 484 కోట్లు సంస్థ వద్దే ఉంచుకొని, ఆ ట్రస్ట్‌లకు మూడు నెలలకొకసారి ఇవ్వాల్సినా వడ్డీ డబ్బులను కూడా పూర్తిగా ఇవ్వకుండా తన అవసరాలకు వాడుకొంటూ, కార్మికులను ప్రయివేటు అప్పుల వైపు నెట్టింది.
అలాగే సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు, మెడికల్ అన్‌ఫిట్ అయిన కుటుంబాలకు ఇవ్వాల్సిన డబ్బులతో పాటు, ఉద్యోగాలు కల్పిస్తామని బడ్జెట్ పత్రంలో చెప్పారు. మరి సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వక, ఎప్పుడిస్తారో తెలియక సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాల పరిస్థితి పట్టదా? పి.ఎఫ్ సభ్యులై ఉండి, సర్వీసులో వుండి చనిపోతే ఆ కుటుంబానికి కనీస మొత్తం 2.5లక్షలు చెల్లించాలని (15.2.2020 నుండి వర్తింప చేయాలని) గరిష్టం 7లక్షలు చెల్లించాలని జిఎస్ఆర్ నెం 299(ఇ) - తేది. 28.4.2021ని పి.ఎఫ్ సంస్థ గెజిట్‌ను విడుదల చేసింది. సంవత్సర కాలం గడచినా దీనిని ఆమోదించి, టిఎస్ ఆర్టీసిలో అమలు చేయని విషయాన్ని బడ్జెట్ పత్రాలలో చెప్పకుండా, పాత వివరాలనే ముద్రించారు. ఇది ఎలా సరైంది. శాసనసభను, ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు కాదా?
ఇప్పటికైనా బడ్జెట్లో కేటాయింపులను సవరణ చేయాలి. ఆర్టీసీకి 2శాతం నిధులు కేటాయించాలి. ఆర్టీసీ అప్పులను ఈక్విటీగా మార్చాలి. బస్‌లు కొనుగోలుకు, ఆర్టీసీ విస్తరణకు నిధులు సమకూర్చాలి. ఆర్టీసీని లాభ, నష్టాల ప్రాతిపదికన చూడకుండా ప్రజా రవాణా సంస్థగానే చూడాలి. విద్యా, వైద్య రంగాలకు ఇస్తున్నట్లు నిధులు కేటాయించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అప్పుడు మాత్రమే ఆర్టీసీకి భరోసా కల్పించినట్లు భావిస్తారు.
- పుష్పా శ్రీనివాస్