Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను కరిస్తే వార్త అని విలేకరులకు ట్రైనింగ్ తరగతుల్లో చెబుతారు. అంటే వార్త శీర్షిక చూడగానే అది ఆకర్షించాలి అని చెబుతారు. కరెంటు షాక్ కొట్టడం మామూలు విషయం. అలాంటిది కరెంటు బిల్లును ముట్టుకుంటే షాక్ కొడితే అది వార్త. వార్తల్లో ఉండటం ముఖ్యమైన పాయింటు కొందరికి. పెట్రోలు మండితే పెద్ద విషయం కాదు, దాని ధర మండితే అది వార్తా విశేషం. ఏదో మామూలు డ్రయివరు ప్రజలపైకి వాహనాన్ని పోనిస్తే అదేం పెద్ద న్యూస్ కాదు, అదే ఏ మంత్రో, ఎం.పీ.నో అలా నడిపితే అది పెద్ద వార్త. వాళ్ళు తప్పించుకోవడం పెద్ద వార్త. అలాంటి పనులు చేసినవాళ్ళే ఎన్నికల్లో గెలవడం అసలైన వార్త. మనం తెల్లబోయి చూసే వార్త. వీటన్నింటికీ ప్రజలను అలవాటు చేయడం, ఇవన్నీ సాధారణ విషయాలు అనే స్థాయికి రోజూ సోషియల్ మీడియాలో పెట్టే రెచ్చగొట్టుడు వార్తలే అసలైన వార్త.
ఇలా కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఒకసారి పాట రాశాను ''కరెంటు షాకు కొడుతోందిర అన్నా, కరెంటు బిల్లు షాకు కొడితోందిర అన్నా'' అంటూ. నిజంగా అలాగే జరుగుతోంది కూడా. పెట్రోలు, డీజిలు ధరలు మండుతున్నాయి అని కూడా వార్తలొస్తాయి. తరువాత వాటి ప్రభావంతో అన్ని ధరలూ పైపైకి ఎగబాకుతాయి. అప్పటికి ఇలాంటి వార్తలు మామూలువైపొయి ఉంటాయి. చూసే కళ్ళు, వినే చెవులు, స్పందించే మనుషుల మెదళ్ళు అప్పటికే మొద్దుబారి ఉంటాయి. ఇది మాత్రం వార్త కాని వార్త. ఇవన్నీ పట్టని యువత కొందరు యువ హీరోల సినిమాను తెల్లవారుజామునే ఐదువందల టికెట్ పెట్టి చూస్తున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడలేక, మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్న మాటలకి సరిపోయేలా చేస్తున్నారు. సమాజానికి చెందిన ఎన్ని షాకింగు న్యూసులొచ్చినా వాళ్ళకి పట్టవు. అది వాళ్ళ తప్పు కాదు ఈ వ్యవస్థది, మీడియాది అని ఒక మాట అనేసి ఊరకుంటారు మేధావులు. ఇంకొంతమంది కుర్రవాళ్ళు పెరుగుతున్న ధరలపైన, రావలసిన ఉద్యోగాలపైన, ఇంకా అలాంటి సమస్యలు తీసుకొని నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. ఆ మహాకవి చెప్పినట్టే వాళ్ళు ముందు యుగం దూతలు, భావన నవ జీవన బందావన నిర్మాతలు. వాళ్ళకి లాల్ సలాం కూడా చేస్తాడు మహాకవి. దేశానికి ప్రస్తుతం తగులుతున్న షాకులకు ఇలాంటివాళ్ళే సమాధానం చెబుతారు.
ఇంకా మండేవి, షాకులిచ్చెవి ఏవి అని చూస్తే , మూఢత్వం మన దేశంలో ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. నీళ్ళలో పసరు కలిపి పెట్రోలు చేశానంటే నమ్ముతారు, కరోనాకు మందు రెడీగా ఉందంటే నమ్ముతారు, ఇంగ్లీషు మందులనే నూరి భస్మమేదో కనిపెట్టామంటే నమ్ముతారు, విగ్రహం పాలు తాగిందంటే నమ్ముతారు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. దేశంలో మంటలు రాజేసినోళ్ళనూ నమ్ము తారు. నమ్మకాలకు పుట్టినిల్లు మనదేశమేమో అనిపిస్తుంది. చిన్నప్పుడు మా పక్కింటాయనకు వారానికి ఒకసారి తలకు షాకు పెట్టుకొస్తారని చెప్పేవాళ్ళు. ఎప్పుడూ ఏదో ఒకదానికి అరుస్తూ నానా అల్లరీ చేసేవాడు ఇంట్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టిగా అరిచేవాళ్ళకు కాదు అసలు నోరు విప్పని వారి మెదళ్ళకు షాకు పెట్టించాలి. మెదళ్ళు పనిచేసేలా చేయాలి. అవి తప్పుగా ఆలోచిస్తున్న విధానాన్ని వాళ్ళు గుర్తించేలా చెప్పాలి.
ఇక ఈ ధరలు, ధరాఘాతాలు ఎవరిని తగులుతాయన్న విషయం చెప్పే పనేలేదు, మధ్య, కింది తరగతుల వాళ్ళకే. పైనున్న వాళ్ళను ఎందుకు ముట్టుకోలేదు అంటే మంచి మంచి సమాధానాలు వస్తాయి. తోడేలును మేకపిల్లను ఎందుకు చంపవలసి వచ్చింది అని అడిగితే మంచి కన్నీటి కథ చెబుతుంది, అలాగే సింహాన్ని జింకపిల్లని ఎందుకు చంపావు అని అడిగితే తన పిల్లల ఆకలి చూడలేకపోయానని చెప్పి సీను పండిస్తుంది. ఏ పులినో, హైనానో, లేదా ఇంకో తోడేలునో చంపొచ్చు కదా అంటే మాత్రం సమాధానం ఉండదు. లేదంటే మా పిల్లలు జింక మాంసం మాత్రమే తింటాయి అని బుకాయించవచ్చు కూడా. అలాగే మధ్యపానంపై నిషేదం పెడతానన్న పెద్ద మనిషి ఎందుకు ఆ పని చేయలేదంటే వాటి ధరలు పెంచేశాను, ప్రజలు తాగడం ఆపుతారని అనుకున్నానంటాడు. అసలు ప్రజలందరికీ అవసరమైన ఎన్నెన్నో పనులు చేయాలంటే సారా నుండి వచ్చే పైసలే ఆధారం అని ఇంకో అమాత్యుడు చెప్పొచ్చు. ఈ విధంగా కరెంటు కథలు, సారా కథలు ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి. చెప్పేవాడికి వినేవాడంటే ఎప్పుడూ లోకువే అని ఊరకే చెప్పలేదు పూర్వులు. అలాగే రేట్లు పెంచేవాడికి అవి కట్టేవాళ్ళంటె ఎప్పుడూ లోకువే మరి!
షాకింగుతో పాటు షేకింగు వార్త ఇంకోటి ఉంది. అదేమంటే వంటనూనెల ధర కూడా కూరగాయలు, నిత్యావసరాలతో పాటు పైకిపోయి కూచుంది. నూనెల ధరలు అమాంతం ఎందుకు పెరిగాయి అంటే యుద్ధం బూచిని చూపెడుతున్నారు. అంతకు ముందు కరోనా బూచి. ఒక్కటీ మీద వేసుకునే సమస్యేలేదు. అసలు విషయానికి వస్తే చాలా రోజులనుండే వంటనూనెలను విదేశాలనుండి దిగుమతి చేసుకోవడం జరుగు తోంది. దాంతో నూనెగింజలను రైతులు పండించ కుండా చేశారు, పండించినా సరైన ధర లేకుండానూ చేశారు. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధం ఎక్కడ వచ్చినా దాని ప్రభావం మనపై ఉంటుంది అని నమ్మబలుకుతున్నారు. ఒకవైపు రైతుల నడ్డి విరిచినవారే ఇప్పుడు ప్రజల కష్టాలకు కారకు లైనారు. ఏ షాకు, షేకు లేకుండా తమ సింహాసనం కాపాడుకోగలమన్న నమ్మకంలో ఉన్నారు. ప్రజ లెప్పుడొ ఒకసారి షాకింగు న్యూసు తప్పక చూపెడ తారు. వేచిచూడాలంతే...
- జంధ్యాల రఘుబాబు
సెల్:9849753298