Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్ మాతాకీ జై అనే నినాదంతో దేశ ప్రజలను ఆకర్షించి, వారి ఓట్లు సంపాదించి గద్దెనెక్కిన నేటి మన పాలకులు.. ఆ భారతమాత ఒంటి మీదున్న ఆభరణాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఒలిచి, విదేశీయులకు అప్పజెప్పి, భారతమాతను నిరుపేదగా నిలబెట్టే తతంగం నేడు మన కళ్ల ముందే నడుస్తున్నది. ఈ మాట మీకు అతిశయోక్తిగా అనిపిస్తున్నదా? అయితే.. ఈ మార్చి 9న మన దేశ ప్రధాని ఏం చేసాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజున మన దేశ ప్రధాని నరేంద్రమోడీ గారు విదేశీ పెట్టుబడిదారుల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశంలో చేపట్టనున్న ప్రభుత్వరంగ సంస్ధల పెట్టుబడుల ఉపసంహరణ మరియు మానిటైజేషన్ పైప్ లైన్ పథకం ఎలా అమలు చేయాలి అనే విషయంలో విదేశీ పెట్టుబడిదారులతో చర్చించడం కోసమే ప్రత్యేక సమావేశమని ఆ రోజు పేపర్లలో వచ్చింది. ఈ దేశంలో అమలయ్యే విధానాలను నిర్ణయించాల్సింది ఈ దేశ ప్రజలు కాదట. అభిప్రాయమూ అంగీకారమూ తెలపాల్సింది విదేశీపెట్టుబడి దారులేనన్నట్టుగా.. మనచే ఎన్నుకోబడిన మన దేశ ప్రధాని గారు విదేశీ దొరలతో చర్చలు జరిపి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నాడు ఒక్క ఈస్టిండియా కంపనీ మన దేశాన్ని రెండువందల యేళ్ల బానిసత్వంలోకి నెట్టేసింది. నేడు అలాంటి ఈస్టిండియా కంపనీలెన్నింటికో మన పాలకులు తలుపులు బార్లా తెరుస్తున్నారు. ఈ తరహా వినాశ కర విధానాలపై దేశభక్త శ్రామిక జనులు ఎక్కుపెట్టిన ధర్మాగ్రహమే రేపు మార్చి 28, 29 లలో దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె.
దేశవ్యాప్తంగా అన్ని రంగాలలోని సుమారు 20కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులూ.. సంఘాల కతీతంగా ఐక్యమై రేపటి మార్చి 28, 29న రెండురోజుల సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె జరుగనున్నది. పైవేటీకరణ విధానాలను విరమించుకుని ప్రభుత్వరంగసంస్థలను బలోపేతం చేయాలి, అధిక ధరలను అరికట్టాలి, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరించాలి, కనీస వేతనాలు చెల్లించాలి, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలు విరమించుకోవాలి, కార్పొరేట్ల కోసం కాకుండా కష్టజీవులకు మేలు కలిగేలా విధానాల రూపకల్పన జరగాలి అనేవే.. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్లు. తొలినుండీ పెట్టుబడిదారులకు అండగా నిలుస్తున్న బిఎంఎస్ సంఘం మినహాయించి మిగతా సంఘాలన్నీ సమ్మె లో భాగస్వాములైనవి. కాంగ్రెస్, వామపక్షాలతో సహా అనేక రాజకీయ పార్టీలు సమ్మెకు మద్దతు తెలుపుతున్నవి.
1991లో ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ''నూతన ఆర్థిక విధానం'' అనే ఒక విషపూరిత వైరస్ ఇంజెక్ట్ చేయబడినది. ఆనాటినుండి.. అంబేద్కర్ రాసిన సంక్షేమ రాజ్యాంగం పక్కకు పోయి.. అంబానీ అదానీల కోసం లిఖించబడిన 'సరళీకరణ' రాజ్యాంగం అమలు కావడం మొదలయింది. ఈ సరళీకరణ - ప్రపంచీకరణ - ప్రయివేటీకరణ వినాశకర విధానాలను ప్రభుత్వాలు అనుసరించడం మొదలుపెట్టిన నాటినుండి.. దేశంలోని కోట్లాది మంది శ్రామికులూ, సామాన్య జనమూ అనేక విధాలుగా బాధలు పడుతున్నారు. మన దేశ ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులు.. ప్రపంచ బ్యాంకు నిర్దేశిత విధానాలను తలకెత్తుకుని దేశ జనాభాలో 90 శాతం గా ఉన్న కష్టజీవులు సామాన్య ప్రజల బాగోగులు మా ఎజెండాలో లేనే లేవని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వాలు చేసే పని ''ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'' మాత్రమేనని.. కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీల లాభాల ప్రవాహానికి దారులు వేయడమేనని.. ఇవి తప్ప, ఇక వేరే బాధ్యతలు మాకు లేనేలేవని గద్దెనెక్కిన నేతలు నిర్లజ్జగా ప్రకటిస్తున్నారు.
''సబ్కా సాత్ సబ్కా వికాస్'' అనే మాయ మాటలతో అధికారాన్ని దక్కించుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడేండ్ల పాలనలో చేసిన పనులన్నీ కూడా కార్పొరేట్లకు, ధనిక స్వాములకు, విదేశీ బహుళజాతి సంస్ధలకు అనుకూలంగా సాగినవే. అంబానీలు, అదానీలు, కార్పొరేట్ల సంపద వందల రెట్లు పెరగగా.. దేశంలోని మెజారిటీ వర్గాలకు దక్కాల్సిన కనీస హక్కులు దక్కకుండా పోయాయి. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ధనిక వర్గాలకు లాభాలు కట్టబెట్టే పనులన్నీ మోడీ ప్రభుత్వం చకచకా చేస్తున్నది. కార్మిక హక్కులను హరించివేసే వేజ్ కోడ్ బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేసుకున్నది. కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ. 670గా ఉండాల్సిందేనని ఆర్థికవేత్తల నివేదికలు తేల్చి చెప్పగా.. వాటినన్నిటినీ తోసిరాజని కనీస వేతనం రూ.178గా నిర్ధారిస్తూ పార్లమెంటులోని పెద్దలందరూ చప్పట్లు కొట్టి చట్టం చేసేసారు. స్వయంగా కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత నివేదిక సిఫారసు చేసిన రూ.375 ప్రతిపాదనను సైతం ప్రభుత్వం నిస్సిగ్గుగా తిరస్కరించింది. కష్టజీవుల కడుపు కొట్టే ఈ చట్టాన్ని మేము ఒప్పుకోమంటూ.. కేవలం ఎనిమిది మంది ఎంపీలు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. మరోవైపు ధనిక వర్గాలకు ఊడిగం చేస్తున్న చర్యలకు ప్రజలనుండి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడే క్రమంలో.. మత ప్రాతిపదికన ప్రజలని విభజించి.. తప్పుదారి పట్టించే రీతిలో రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను సైతం మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
లాభాలు ఆర్జిస్తూ, సమర్ధవంతంగా పనిచేస్తున్న విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలను, ఎల్ఐసి లాంటి బీమా సంస్థనూ, బ్యాంకులనూ ప్రైవేటు దొరలకు అప్పజెప్పుతున్న మన నాయకులు.. వ్యాపారాలు నిర్వహించడం ప్రభుత్వాలు చేయాల్సిన పని కాదంటూ బుకాయిస్తున్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వాలు చేయాల్సిన పనే అయినపుడు.. ఆ మౌలిక సదుపాయాల కల్పన కోసం కావాల్సిన నిధులను అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వనిర్వహణలోనే ఉండడం సమంజసం కాదా..? బంగారు గుడ్లు అందించే బాతుల లాంటి ప్రభుత్వరంగ సంస్థలను నేడు ప్రైవేటు వాళ్ళకి అప్పజెబితే.. రేపు ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు ఎవరు అందిస్తారు? ప్రభుత్వ పెద్దలు అనునిత్యం వల్లె వేస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ అంటే అర్థం ఇదేనా? దేశ ప్రజలను నిత్యం మతం మత్తులో ఉంచే కుతంత్రంలో భాగంగా.. గుళ్ళూ గోపురాల రాజకీయాలు నడుపుతున్న మన నాయకులు.. లక్షలాది మంది భారతీయలకు ఉపాధిని, రిజర్వేషన్ల సామాజికన్యాయాన్ని అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలరూపంలోనున్న ఆధునిక దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం ఏ తరహా దేశభక్తి అవుతుంది?
మతోన్మాద పాచికలతో ప్రజలను మభ్యపెడుతూ.. కార్పొరేట్ల సేవలో తరిస్తున్న మోడీ ప్రభుత్వపు ప్రజాద్రోహకర విధానాలని ప్రతిఘటించే ఉద్దేశంతో దేశంలోని కోట్లాదిమంది కష్టజీవులు చేపడుతున్న దేశభక్తి యుత పోరాటమే.. రేపటి రెండు రోజుల సార్వత్రిక సమ్మె. గద్దె మీద కూర్చున్న నాయకులు తీసుకురావాల్సిన చట్టాలు.. చేపట్టాల్సిన చర్యలు.. ఈ దేశంలోని మెజారిటీ వర్గాల మేలు కోసం జరగాలి కానీ.. కొద్దిమంది కార్పొరేట్ ప్రభువుల కోసం, విదేశీ బహుళజాతి రాబందుల కోసం కానే కాదు - అంటూ నిలదీస్తున్న శ్రమజీవుల సమర నినాదమే రేపటి సమ్మె. సమ్మెల ద్వారా, నిరసనల ద్వారా పాలకుల మొద్దు నిదుర వదులుతుందనుకుంటే.. అపోహ మాత్రమే. కార్మిక జనావళి రేపు చేపట్టబోతున్న సమ్మె కార్యాచరణ.. దేశ ప్రజలందరి ఆలోచనా సరళిలో మార్పు తీసుకురావడానికి దోహదం కావాలి. కార్పొరేటు ప్రభువులకు, ధనిక స్వాములకు ఊడిగం చేసే దుష్ట విధానాలు పోయి.. సంక్షేమ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే ప్రజానుకూల విధానాలకు పట్టం కట్టే దిశలో.. మతోన్మాద దేశద్రోహులను చెత్తబుట్ట దాఖలు చేసే దిశలో.. రావాల్సిన రాజకీయ మార్పుకి రేపటి సమ్మె సరైన తోవ చూపాలి!
- ఆర్. రాజేశమ్
సెల్:9440443183