Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జీవితం చేయలేని స్పష్టత కళ చేయాలి' అని అంటాడు మహా రచయిత టాల్స్టారు. సమకాలీన సంక్లిష్ట సంక్షుఛిత సామాజిక జీవనస్థితిని నిశితంగా పరిశీలించడమే కాదు, సరళంగా చూపడం, విశ్లేషించడం, చర్చించడం, ప్రేక్షకుల ఆలోచనలకు పదును పెట్టడం, అంతకు మించి పరిష్కార పథంలో ముందుకు నడిపించడం ఆధునిక నాటక కళ (రంగస్థల) కర్తవ్యంగా తోసుకువచ్చింది. మానవ సమాజ పరిణామంలో ఇదో అనివార్య ప్రక్రియ. చార్లీచాప్లిన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహా కళాకారులు ఈ కోవలో ఉద్భవించినవారే.
సమాజం నేడు ఎట్లుందో చూపడమే కాదు, భవిష్యత్లో ఎట్లుండాలో కూడా విశదపర్చాల్సిన బాధ్యత కళాకారులది. అందుకే నాటకం జీవితాన్ని అనుకరిస్తే, జీవితం నాటకాన్ని అనుసరిస్తుంది అనే నానుడి వచ్చింది. దాదాపు 140 ఏండ్ల పైగా ఆధునిక తెలుగు నాటకం నిత్యం మారుతున్న సమాజాన్ని చూస్తూనే ఉన్నది. పద్య నాటకాల గ్రాంథిక భాష నుండి వ్యవహార భాషకు, పఠన స్థాయి నుండి ప్రదర్శన స్థాయికి మన తెలుగునాటకం చేరడం ఓ మార్పు. దీనికి ఆధ్యుడు వీరేశలింగం పంతులుగారు. వ్యవహార ధర్మబోధిని (ప్లీడర్ నాటకం)తో దీనికి శ్రీకారం చుట్టాడు.
ఆ తదుపరి ఆధునిక నాటక లక్షణాలతో సామాజిక జీవనానికి దర్పణం పడుతూ సామాజిక ప్రయోజనమే నాటక పరమావధి అని దిశానిర్దేశం చేయడం మరోమార్పు. మహాకవి గురజాడ అప్పారావు 'కన్యాశుల్కం' నాటకంతో తెలుగు రంగభూమిని ఆవిధంగా సిద్ధం చేశారు.
''నటనకు నాటకానికి ఓ శిక్షణ, ఓ శాస్త్రం అవశ్యం. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి. పద్యనాటకాలకన్నా సాంఘిక నాటకాలు మిన్న'' అనిచాటి చెప్పి తెలుగు నాటకాన్ని పరభాషా స్థాయికి చేర్చడంతో పాటు నాటక కళాకారులకు సంఘంలో సముచిత గౌరవం కల్పించడం ఇంకోమార్పు. ఇందుకోసం నిజంగానే దీక్షా పోరాటం చేసినవాడు బళ్ళాం రాఘవ. తెలుగునాట నట శిక్షణాలయాలు, శిక్షణా సంస్థలు, నాటక పరిషత్లు శాస్త్రీయ పద్ధతుల్లో నడవడానికి రాఘవ ప్రేరణ అని మరువరాదు.
కళ కళ కోసం కాదు, కాసు కోసం కాదు, ప్రజల కోసం, ప్రగతి కోసం అని నినదిస్తూ సోషలిస్టు వాస్తవికతతో ప్రజా నాటకాల ఒరవడికి శ్రీకారం చుట్టి, ప్రజా కళకు పట్టం గట్టడం ఇంకో మార్పు. ఇందుకు ప్రధాన కారకుడు ప్రజానాట్యమండలి వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ గరికపాటి రాజారావు, భూమికోసం, భుక్తికోసం, పీడిత ప్రజ విముక్తికోసం సాగిన మహత్తర సాయుధ తెలంగాణ పోరాటాన్ని సజీవ దృశ్య మాంద్యం గావించి, వందల దళాలచే వేల ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా అశేష ప్రజానీకాన్ని పోరాటానికి సంఘీభావంగా ఉత్తేజితుల్ని గావించిన చరిత్ర ప్రజానాట్య మండలిది. దీనికి సుంక - వాసిరెడ్డి నాటక రచయితలతో పాటు డాక్టర్ రాజారావు, కోడూరు అచ్చయ్య వంటి దర్శక దిగ్గజాల పాత్ర అమోఘం.
ఇక నాటకాన్ని నాలుగు గోడలు మధ్యన కాకుండా ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి, ఆ ఆధునిక వీధి నాటకాన్నే శ్రామికవర్గ పోరాట ఆయుధంగా మలచడం భారతీయ నాటకరంగంలో పెనుమార్పు. వస్తువు - శిల్పంలోని గందరగోళాన్ని, నైరూప్యాన్ని (యాబ్స్ట్రాక్ట్) బ్రద్దలుకొట్టి, శత్రువును పసిగట్టడం, సమస్య పరిష్కారానికి సంఘటితంగా కదలడం వంటి అంశాలను ఈ పద్ధతిలో సులభంగా బోధించాడు హష్మీ. అందుకే కార్మికలోకం ఈ నాటకాన్ని తమదిగా స్వీకరించింది. హష్మీ స్ఫూర్తితో వీధి నాటిక ప్రక్రియనే ఉద్యమంగా తీసుకుని జనంలోకి విస్తారంగా వెళ్లింది. ప్రజానాట్యమండలి వంటి సంస్థలు. ప్రజాదర్శకులు రామనాథం వంటి వారి కృషితో సప్దర్ హష్మీ ఓపెన్ థియేటర్ (షాట్) పేర వీధినాటకోత్సవాలు రూపుదిద్దుకున్నాయి.
హల్లాబోల్, గోగ్రహణం, గొర్రెలు తిరగబడ్తాయి, అప్పా-అమ్మకమా? రైతు, మన చరిత్ర. టామిటామిటామి, ఎలిమెంటరీ స్కూల్, ప్రశ్నించండి, భారతమ్మ ఎక్కడ, వీరతెలంగాణ వంటి నాటికలు వందల వేల ప్రదర్శనలతో లక్షలాది జనాన్ని కదిలించాయి, ఉద్యమ పథన నడిపించాయి అంటే అతిశయోక్తి కాదు.
నాటకాలు రాత్రుళ్ళే ప్రదర్శించక్కర్లేదు. పట్టపగలు నడివీధుల్లో కూడా ప్రదర్శించవచ్చని ఇలాంటి వీధి నాటికలతో పాటు అక్షరాస్యత, శాస్త్ర కళాజాతా ప్రదర్శనలు నిరూపించాయి.
ప్రజలు ఉద్యమ బాటను పడుతున్నప్పుడు సహజంగానే ఆందోళనా కళారూపాలు ముందుపీఠిన ఉంటాయి. అలాగాక ప్రజలు అజ్ఞానాంధకారంలో మగ్గిపోతున్నప్పుడు మనస్సుకు పట్టే విధంగా చైతన్యవంతమైన శాస్త్రీయ కళారూపాలు ఎంతో అవశ్యం. అందుకు అవసరమయ్యే అధ్యయనం, ప్రతిభ, సామర్థ్యం, సాధన కళాకారులకు తప్పనిసరి.
కుల మత అశాస్త్రీయ ఛాంధస భావాలతో నేడు ఆధునిక యువత కొట్టుకుపోవడం మనం చూస్తున్నాం. పెట్టుబడిదారీ దోపిడీ విధానాలు యువతను వెర్రిమొర్రి అశ్లీలత, హింస, మత్తు పదార్థాల వెంట పడేలా నిర్వీర్యం చేస్తున్నాయి. పాలకవర్గాలు తమ స్వార్థం కోసం వీటిని బహిరంగంగానే ప్రోత్సహిస్తున్నాయి. విషాదమేమంటే పాలకుల విధానాలకు ప్రజల బాధలకు ప్రత్యక్ష సంబంధం ఉందనే కనీస రాజకీయ చైతన్యాన్ని మరిచిపోతున్నారు. ఆది నుండి నాటకం ఓ ధిక్కార స్వరమని, ప్రశ్నించడం నేర్పకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమని చాలామంది నాటకకర్తలు తెలుసుకోలేకపోతున్నారు. పాలకవర్గాలకు నిస్సిగ్గుగా కొమ్ముకాస్తున్నారు. అదే కళని భ్రమసిపోతున్నారు.
రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు. యువతకు సరైన ఉపాధిలేదు. నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం పెరుగుతున్నాయి. పర్యావరణానికి తూట్లు పడుతున్నాయి. కాలుష్యంతో పల్లె పట్టణాలు కాసారాలుగా మారుతున్నాయి. ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వేలు, పోర్టులు, గనులు అన్నీ బాజాప్తుగా ప్రయివేటు పరం అవుతున్నాయి. ఫలితంగా సంపన్నులు కోట్లకు పడగలెత్తుతుంటే ప్రజలు బికారులవుతున్నారు. స్త్రీలు, పిల్లలు, బడుగులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కళ్ళముందున్న వాస్తవం ఇది. ఈ దుర్గతిని మనిషే మార్చుకోవాలి. ఒక్కడిగా కాదు, సంఘటితంగా, ఉద్యమాల ద్వారానే. అయితే ఈ సత్యాన్ని ప్రజలకు హృద్యంగా నిర్భయంగా తెలపాలంటే ప్రత్యామ్నాయ నాటకమే దిక్కు. నాటకం సర్వకళల సమాహారం. మనిషికే సాధ్యమైన సజీవ దృశ్య శబ్ద మాధ్యమం. ఆత్మలను పలికించే భాషేకాదు, ఆత్మఘోషలను వినిపించగలదు. చూపగలదు. చిరకాలం గుర్తుండేలా చేసి వెన్నుతట్టి నడపగలదు.
గత 60ఏండ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ నాటకరంగ దినోత్సవం మార్చి 27న జరుగుతున్నది. ప్రపంచ ప్రఖ్యాత ఓపేరా కళాకారుడు పీటర్ సెల్లార్స్ (అమెరికా) ఈసారి సందేశం ఇచ్చారు. అన్ని భాషలో వ్యక్తమయ్యే ఈ సందేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో ఐక్యతను, సామరస్యాన్ని పెంచుతుంది. కళాకారుల కర్తవ్యాన్ని ప్రబోధిస్తుంది. 'రంగస్థలం ఓ శాంతి సంస్కృతి' అనే సత్యాన్ని వక్కాణిస్తుంది.
- కె. శాంతారావు
సెల్:9959745723