Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యం ప్రజల తలలో నాలుకలా ఉండే కామ్రేడ్ వై. వెంకటయ్య (వై.వి.) ఇక లేరంటే నమ్మడం కష్టంగా ఉంది. విద్యార్థి దశలోనే మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన వెంకటయ్య... తన ఉన్నత చదువును, ఉద్యోగావకాశాలను త్యాగంచేసి వృత్తి విప్లవకారుడిగా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని కొనసాగించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామంలో 1958 జులై16న యనమల బుచ్చిరాములమ్మ-వెంకటమల్లయ్య అనే నిరుపేద దంపతులకు ఆయన చిన్న కుమారుడిగా జన్మించాడు. రెక్కల కష్టంపై బతికే అత్యంత నిరుపేద కుటుంబం కావడంతో మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ హాస్టల్లోనే ప్రాథమిక, ఉన్నత విద్యలను కొనసాగించాడు. సరిగ్గా ఎమర్జెన్సీ సమయం 1975లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు విద్యార్థి సంఘం ద్వారా ఆయన ఉద్యమ కృషి ప్రారంభించాడు. ఎమర్జెన్సీ తర్వాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య సమక్షంలో కామ్రేడ్ ఓంకార్ నాయకత్వంలో మార్క్సిస్టు పార్టీలో చేరారు. అప్పటినుండి ఊరూరా పార్టీని నిర్మించడానికి కాలినడకన కంజర చేతుల్లో పట్టుకొని సంచి సంకన వేసుకొని కొన్ని రోజుల పాటు ఇంటి మొహం చూడకుండా తిరిగేవారు. ప్రధానంగా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు, ప్రజనాయకుడుగా ఉన్న కామ్రేడ్ పెరుమాండ్ల జగన్నాధంను నక్సలైట్లు భూస్వాములు కలిసి కాల్చి చంపినప్పుడు... పార్టీ కార్యకర్తలకు, జగన్నాధం కుటుంబ సభ్యులకు కామ్రేడ్ వై.వి ధైర్యం, భరోసా కల్పించిన తీరే అక్కడ ఉద్యమాన్ని నిలబెట్టింది. విద్యార్థి, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుడిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు. తొర్రూరు మండల పార్టీ కార్యదర్శిగా, డివిజన్ కార్యదర్శిగా, మహబూబా బాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆయన కృషి అవిశ్రాంతమైనది. నిరాశకు, అసంతృప్తికి అవకాశమే ఇవ్వకుండా నిత్య ఉత్సాహంతో కార్యకర్తలను కదనరంగంలోకి నడిపిన వ్యక్తి వై.వి.
తొర్రూరు మండల కేంద్రంలో 2007లో జరిగిన భూపోరాటాల్లో భాగంగా అమ్మాపురం రోడ్లో ఉన్న దేవాదాయ భూమిలో పేదల ఇండ్ల స్థలాల కోసం అనేక సార్లు లాఠీఛార్జీకూ, అక్రమ కేసులకూ గురై, ఆ తర్వాత 15రోజులపాటు జైలు జీవితం గడిపాడు. 24రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెలోనూ ఆయన జైలుకు వెళ్ళాడు. అనేక నిర్బంధాల్లో పార్టీ కార్యకర్తలకు తన ఇల్లునే షెల్టర్‌గా ఇచ్చి వారికి నిత్యం ధైర్యం చెబుతూ ఉండేవాడు. తొర్రూరు మండలం కంటాయిపాలెం గ్రామంలో బీసీలకు ఇండ్ల స్థలాలకు భూమి కేటాయింపులో, నాటి టీడీపీ నాయకులు వారి అనుయాయులకు మాత్రమే అవకాశం కల్పిస్తే, పోరాడి అవి అర్హులైన పేదలకు సాధించి పెట్టాడు. కంటాయిపాలెంలోని నేటి బీసీ కాలనీ ఆయన పోరాట ఫలితమే. పార్టీ మహబూబాబాద్ వచ్చి పనిచేయాలని కొరగానే వెంటనే మహబూబాబాద్‌కు ఫ్యామిలీతో మకాం మార్చాడు. బి.ఎ., ఎల్.ఎల్.బి పూర్తి చేసుకున్న ఆయనకు ఉద్యోగం వచ్చినా పార్టీకోసం తృణప్రాయంగా వదులుకున్నాడు. మాజీ ఎమ్మెల్యేగా బండి పుల్లయ్య తన సర్టిఫికెట్లను చింపి రైల్వే పట్టాలపై పడేసినప్పుడు వై.వి. నవ్వుతూ ఉండిపోయాడు. తనకు డిగ్రీలు, ఉద్యోగాలు ప్రజాజీవితం కంటే ఎక్కువ కాదని వృత్తి విప్లవకారుడుగా కొనసాగాడు. మహబూబాబాద్ తాలూకా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా అనేక గ్రామాల్లో ఆయన కూలీ పోరాటాలకు నాయకత్వం వహించాడు. ఆయన అంతక్రియలకు వెళ్తుంటే తొర్రూరులో ఓ ముసలమ్మ కలిసి గోపాలగిరి వెంకటయ్య గొప్ప కమ్యూనిస్టు అని ప్రశంసించింది. స్నేహమే ఆస్తిగా, పేదలే ప్రాణంగా వర్గకసితో పార్టీ కార్యక్రమాలు అమలుచేసేవాడు. ప్రజలతో రక్త సంబందికులవలే, కుటుంబ సభ్యులవలె కలిసి ఉండేవాడు. తొర్రూరు ప్రాంతంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ వారికి నిరంతర ధైర్యం నూరిపోసేవాడు. నా ఆరోగ్యం బాగులేదు. నన్ను జిల్లా కమిటీ నుండి తగ్గించి కొత్త వారికి అవకాశమివ్వండి అని ఆయన పార్టీ నేతలను కోరేవాడు. కానీ పార్టీ తప్పదని ఆదేశించడంతో కొనసాగేవాడు. గత నాలుగు నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కూడా ఆయన పార్టీ పిలుపులను జయప్రదం చేసేందుకు తపనపడ్డాడు. వై.వి. అంత్యక్రియల రోజు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ఇతర పార్టీల నాయకులు ఆయన జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరయ్యారు. అంతిమయాత్ర పొడవునా ఒకరి తర్వాత ఒకరుగా ఆయన భౌతిక కాయాన్ని మోసారు.
వై.వి జీవితం అనేక స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకాలను మన ముందుకు తెస్తుంది. ఒక కొవ్వొత్తి తాను కరుగుతూ సమాజానికి వెలుగునిచ్చినట్టుగానే వై.వి తన సౌఖ్యాన్ని ఒదులుకొని పేద ప్రజల జీవితాల్లో మార్పుకోసం తుది శ్వాస వరకు కృషి చేశారు. ఆయన చూపిన మార్గంలో ఎన్ని ఒడిదోడుకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆయన ఆశయ బాటలో పయనించడమే మనం ఆయనకు అర్పించే నివాళి.
- టి. స్కైలాబ్‌బాబు
సెల్: 9177549646