Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ ఆధిపత్యాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్న సర్కస్ ఫీట్లు రోజురోజుకూ మరింత వికృతంగా తయారవుతున్నాయి. మొదట నాటో పరిధిని రష్యన్ సరిహద్దుల అంచు దాకా విస్తరించడానికి ప్రయత్నాలు చేసినది అమెరికాయే. ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోడం రష్యాకు ఏ మాత్రమూ నప్పేది కాదని అమెరికాకు బాగా తెలుసు. అయినా, ఆ ప్రయత్నాలు చేసి రష్యాను రెచ్చగొట్టింది అమెరికాయే.
రష్యా నుండి సరఫరా అయ్యే చమురు. సహజ వాయువు మీద పశ్చిమ యూరప్ దేశాలు (ఫ్రాన్స్, జర్మనీలతో సహా) ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఆ క్రమంలో ఆ దేశాలకు రష్యా మరింత సన్నిహితం అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఎలాగైనా అడ్డుకోవడమే అమెరికా అసలు లక్ష్యం. నిజానికి ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలకు ముందే రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఒప్పందం కుదిరే విధంగా ఫ్రాన్స్, జర్మనీ మధ్యవర్తులుగా ఒక ప్రయత్నం జరిగింది. అది కార్యరూపం దాల్చకుండా చెడగొట్టింది అమెరికా. దాని తర్వాతే ఉక్రెయిన్, రష్యాల నడుమ విభేదాలు ముదిరి అది యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధాన్ని సాకుగా చూపి ఇప్పుడు అమెరికా రష్యా మీద ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వలన రష్యా తాను చేసే ఎగుమతుల ద్వారా పొందవలసిన డాలర్ల రూపంలోని ఆదాయాన్ని పొందలేకపోతుంది. అయితే రష్యా చేసే చమురు, సహజ వాయువుల ఎగుమతులను ఈ ఆంక్షల పరిధి నుండి మినహాయించింది. అమెరికా కూడా రష్యా నుండి వీటిని దిగుమతి చేసుకుంటూ ఉంది. అమెరికా దేశీయ అవసరాల్లో 8శాతం రష్యా నుండి దిగుమతి అవుతాయి. ఇప్పుడు తన దేశం వరకూ ఆ దిగుమతులను నిలిపివేసింది. కాని ఇతర పశ్చిమ యూరప్ దేశాలకు రష్యా నుండి చమురు, సహజ వాయువు ఎగుమతి కొనసాగుతోంది. ఆ దేశాల అవసరాల్లో 40శాతం రష్యా నుండే సరఫరా అవుతున్నాయి. ఆంక్షలను ఆ దేశాలకు దిగుమతయ్యే రష్యన్ చమురుకు వర్తింపజేస్తే ఆ దేశాల ప్రజలు వెంటనే ఇబ్బందుల్లో పడతారు. అప్పుడు ఏకంగా ఆ దేశాలకు, అమెరికాకు స్నేహం చెడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే అమెరికా ఈ మినహాయింపు ఇవ్వక తప్పలేదు.
రోజుకు 50లక్షల బ్యారెళ్ళ ముడి చమురును రష్యా ఎగుమతి చేస్తోంది. ఇదే ఆ దేశపు ప్రధాన ఎగుమతి సరుకు. దానిని ఆంక్షల పరిధి నుండి మినహాయించాక అమెరికా విధించిన ఆంక్షల వలన రష్యాకు కలిగే ఇబ్బంది పెద్దగా ఏముంటుంది? ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసి లొంగదీసుకోవాలన్నదే కదా ఆ ఆంక్షల వెనుక అసలు లక్ష్యం? ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. అందుచేత ఇప్పుడు తక్కిన చమురు ఉత్పత్తి దేశాలను తమ తమ ఉత్పత్తి లక్ష్యాలను బాగా పెంచమని అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఇతర దేశాల చమురు ఉత్పత్తులు పెరిగితే ఇక ప్రపంచానికి రష్యా చమురు అవసరం ఉండదని అమెరికా అభిప్రాయం. అందుచేత సౌదీ అరేబియా తన ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని అమెరికా పట్టుపడుతోంది. ఇంకా ఇరాన్, వెనెజులా దేశాలు కూడా తమ చమురు ఉత్పత్తులను పెంచాలని కోరుతూ రాయబారాలను సాగిస్తోంది.
ఇరాన్, వెనెజులా దేశాల మీద కూడా అమెరికా ఆంక్షలను విధించింది. అవి నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను చితికిపోయేట్టు చేసి దెబ్బ తీయడానికి అమెరికా ప్రయత్నించింది. ఆ దేశాల ప్రజలకు అత్యవసరమైన ఔషధాలను సైతం దిగుమతి చేసుకోనీయకుండా నిషేధాలు పెట్టింది. తద్వారా చిన్న పిల్లలతో సహా వేలాదిమంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైంది. రష్యా కంటే ముందు ఈ రెండు దేశాలనూ తన ఆంక్షలకు గురి చేసింది అమెరికా. అయితే ఇప్పుడు అవే దేశాలను అమెరికా బతిమిలాడుతోంది. ప్రస్తుతం వాటికన్నా ఎక్కువ బలమైన శత్రువుగా రష్యా ముందుకు రావడమే కారణం.
వెనెజులాలో ఏర్పడిన నికొలస్ మదురో ప్రభుత్వం పట్ల అమెరికా ఎంత శత్రుపూరితంగా వ్యవహ రిస్తున్నదంటే, ఆ దేశాధ్యక్షుడిగా మదురోను అమెరికా గుర్తించడం లేదు. పైగా జువాన్ గైడో అనే ఓ బూటకపు నాయకుడిని వెనెజులా అధ్యక్షుడిగా గుర్తిస్తూ, అతడితోటే దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలని ఇతర దేశాల మీద కూడా ఒత్తిడి తెస్తోంది. ఇందులో అమెరికాకు దాని మిత్రులు సైతం తోడయ్యారు. ఇప్పుడు చమురు ఉత్పత్తి పెంచాలనే విషయం వచ్చేసరికి మాత్రం తాను గుర్తించిన గైడోను వదిలిపెట్టి వాస్తవంగా అధికారంలో ఉన్న మదురో ప్రభుత్వం తోటే సంప్రదింపులు చేయవలసి వస్తోంది. తమ వద్ద నుండి చమురు కావాలంటే ముందు తమ ప్రభుత్వాన్ని గుర్తించాల్సిందేనని మదురో ప్రభుత్వం కీలెరిగి వాత పెట్టినట్లు ఇప్పుడు షరతు పెట్టింది. దీంతో వెనెజులా విషయంలో తాను తీసిన గోతిలో తానే పడ్డట్టు అయింది అమెరికా పరిస్థితి. అందులోంచి బైట పడడం అంత సులువైన విషయం కాదు.
ఇక ఇరాన్ మీద దీర్ఘకాలం నుండీ వివిధ స్థాయిలలో ఆంక్షలను విధిస్తూనే ఉంది అమెరికా. మొదట 1979లో అమెరికన్ దౌత్య కార్యాలయ సిబ్బందిని ఇరాన్లో అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ తిరుగుబాటుదారులు బందీలుగా పట్టుకున్న సందర్భంలో ఆంక్షలు విధించారు. ఏడాది తర్వాత ఆ బందీలను విడిచిపెట్టాక, 1981లో ఆంక్షలను ఎత్తివేశారు. ఆ తర్వాత 1984లో ఆంక్షలను తిరిగి విధించడమే కాక 1987లో, 1995లో వాటిని మరింత కఠినతరం చేశారు. 2006లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఐరాస ఆంక్షలను విధించింది. 2016లో అణు కార్యక్రమం మీద చర్చలు జరిగి అంగీకారం కుదిరాక ఆంక్షలను తొలగించారు. 2019లో అమెరికా ఆ అణు ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలగింది. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. అప్పుడు మళ్ళీ ఆంక్షలు విధించాడు. తర్వాత 2021లో జోబైడెన్ అధ్యక్షుడైనాక ఇరాన్ మీద ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించాడు. ఇప్పుడు ఆ బైడెన్ ప్రభుత్వమే ఆ ఇరాన్ ప్రభుత్వంతో ముడి చమురు ఉత్పత్తిని పెంచమంటూ చర్చలు మొదలుపెట్టింది.
గతంలో విధించిన ఆంక్షల ఫలితంగా చమురు ఉత్పత్తి విషయంలో ఇరాన్, వెనెజులా - రెండూ నష్టపోయాయి. చమురు ఉత్పత్తి మధ్యలో నిలుపుచేస్తే ఆ బావుల నుండి మళ్ళీ చమురు తీయడం చాలా కష్టం. ఒకసారి మూతపడిన బావులను తిరిగి తెరవడం సాధ్యపడదు. ఒకవేళ తెరవాలంటే అది చాలా ఖర్చుతో కూడకున్న పని. అందువలన ఇరాన్ లోను, వెనెజులాలోను చమురు ఉత్పత్తి స్థాయి పడిపోయింది.
ఒకవేళ ఈ రెండు దేశాలూ చమురు ఉత్పత్తిని ఏదో ఒక విధంగా పెంచడానికి అంగీకరించినా, రష్యా సరఫరా చేస్తున్న మోతాదులో ఇవి సరఫరా చేయలేవు. ఆంక్షలకు ముందు కాలంలో ఇరాన్ రోజుకు 40లక్షల బ్యారెళ్ళు ఉత్పత్తి చేయగలిగేది. ఇప్పుడది సగానికి పడిపోయింది. గతంలో రోజుకు 40లక్షల బ్యారెళ్ళు ఉత్పత్తి చేయగలిగిన వెనెజులాలో ఇప్పుడు రోజుకు 10లక్షలు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు అదనంగా రోజుకు 50లక్షల బ్యారెళ్ళు ఉత్పత్తి చేయాలంటే అది సాధ్యమయ్యేది కాదు. అమెరికా ఆంక్షలు విధించినందువల్లనే ఆ దేశాల్లో చమురు ఉత్పత్తి దెబ్బ తినిపోయింది. ఇప్పుడు వేరే దేశం మీద ఆంక్షలను బలంగా అమలు చేయడానికి ఉత్పత్తి పెంచమంటే అది జరిగే పని కాదు. గతంలో అమెరికా విధించిన ఆంక్షలే ఇప్పుడు రష్యాపై ప్రయోగించబోయేసరికి అమెరికాకు ఆటంకం అయిపోయాయి.
రష్యా తక్కిన దేశాలకన్నా 25 డాలర్ల నుండి 30 డాలర్ల వరకూ తక్కువ రేటుకి చమురును ప్రపంచ మార్కెట్లో అమ్ముతోంది. ఒకవేళ రష్యన్ చమురు బదులు వేరే దేశపు చమురును కొనుగోలు చేయాలంటే ఆయా దేశాలు అదనంగా రేటు చెల్లించడానికి సిద్ధపడాల్సి ఉంటుంది. రష్యన్ చమురుపై ఎక్కువగా ఆధారపడిన యూరోపియన్ యూనియన్ దేశాలు అంత ఎక్కువ ఖరీదు చెల్లించి మరీ రష్యా మీద ఆంక్షలను అమలు చేయాడానికి ఎంతమాత్రమూ సుముఖంగా లేవు.
రష్యా తక్కిన దేశాలకన్నా తక్కువ ధరకే చమురును అమ్మజూపడంతో భారతదేశం కూడా రష్యా నుండి ముడి చమురు దిగుమతులను ఈ మధ్య కాలంలో నాలుగు రెట్లు పెంచింది. ఇప్పుడు రోజుకు 3,60,000 బ్యారెళ్ళ రష్యన్ చమురును మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఇదే మోతాదులో కొనసాగించితే నెలకు మన దిగుమతుల బిల్లు మీద 20 కోట్ల డాలర్ల మేరకు ఆదా అవుతుంది. ఇటువంటి అవకాశాన్ని వదులుకోవడం ఏ దేశానికైనా బుద్ధిలేని పనే ఔతుంది. అప్పుడు అమెరికా రష్యన్ చమురును కొనుగోలు చేయవద్దని ఏ దేశాన్నైనా ఒత్తిడి చేయాలంటే ఆ దేశానికి ఆ మేరకు సబ్సిడీ ఇవ్వవలసి వస్తుంది. అలా చేయడం అమెరికా వలన కాదు. ఇక మిగిలిన ఒకే ఒక మార్గం ఆ దేశాలను బలవంతంగా ఒప్పించడానికి బెదిరింపు లకు, దాడులకు దిగడం. ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలను బెదిరించడం గాని, వాటిపై దాడి చేయడం గాని దాదాపు అసంభవం.
ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలు యుద్ధాన్ని నిలుపు చేసి చర్చల ప్రక్రియ ద్వారా పరిష్కారానికి పూనుకోవాలని గట్టిగా చెపుతున్నాయి. కాని అమెరికా మాత్రం ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తూ యుద్ధాన్ని ఏదోవిధంగా కొనసాగించాలని చూస్తోంది. ఇటీవలే ఇటలీలోని పీసా విమానాశ్రయంలో కార్మికులు ఉక్రెయిన్‌కు 'సహాయం' అని రాసివున్న ప్యాకేజిలలో ఆయుధాలను పంపుతున్నట్టు గమనించి వాటిని ఆ విమానాలలోకి ఎక్కించడానికి నిరాకరించారు. ఒక ప్రధానమైన యూరోపియన్ యూనియన్ దేశంలోని కార్మికులు చేసుకున్న ఈ విధమైన జోక్యం యొక్క ప్రకంపనలు తక్కిన దేశాల్లో కూడా కానరావచ్చు.
ఏదో ఒక విధంగా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందుకోసం పడుతున్న పాట్లు ఆ ఆధిపత్యాన్నే దెబ్బ తీస్తున్నాయి. ఇప్పుడు ఆ పెత్తనాన్ని ప్రశ్నించడం, సవాలు చేయడం ఎక్కువవుతోంది. ప్రపంచం మొత్తం మీద సామ్రాజ్యవాదానికి గల ఆధిపత్యం క్రమంగా బలహీనపడుతున్న క్రమాన్ని నేడు మనం చూస్తున్నాం.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)