Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2022-23 విద్యా సంవత్సరం నుంచి ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి విద్యార్ధులకు సిలబస్‌లో భాగంగా పాఠశాలల్లో భగవద్గీతను బోధించాలని గుజరాత్ విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటన రాజ్యం యొక్క లౌకిక విలువలను దారుణంగా ఉల్లంఘించడమే. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో ఏ రకమైన మత బోధనలు చేయరాదన్నది అన్ని లౌకికవాద ప్రభుత్వాలు పాటించాల్సిన ప్రాథమిక నియమం. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, పలు ఇతర దేశాలు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలల్లో ఏవైనా మతపరమైన నిర్దేశాలు జారీ చేసేందుకు స్వేచ్ఛ ఉంటుంది. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో ఇది కూడదు.
భగవద్గీత ఒక మత గ్రంథóం. హిందూ మత సాంప్రదాయాలు, తత్వ సిద్ధాంతాల ఆధారంగా జీవన మార్గాన్ని, నడతను అది వివరిస్తుంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్వాదులు చెబుతున్నట్లుగా మతపరమైన నేపథ్యం లేకుండా నైతిక విలువ లను, సూత్రాలను బోధించే పుస్తకంగా మాత్రమే దాన్ని చూడలేం.
కులానికి సంబంధించి చాతుర్వర్ణ వ్యవస్థ దైవికంగా వచ్చిందంటూ ప్రకటించడం, దానిపై కర్మ సిద్ధాంతాన్ని వివరించడం వంటి గీతలోని కొన్ని అంశాలను విమర్శనాత్మకంగా చూసేవారు హిందూ మతంలోనూ ఉన్నారు. ఇక్కడ అసలు సమస్య గీత కొన్ని తిరోగమన ఆలోచనలను ప్రోత్సహిస్తుందా లేదా అనేది కాదు. ఒక మతానికి చెందిన బోధనలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా ప్రవేశపెడతారనేదే ఇక్కడ ప్రశ్న.
''పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్వహించబడే ఏ విద్యా సంస్థల్లో కూడా ఏ మతాన్ని బోధించరాదు'' అని భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయంలో 28(1) అధికరణ స్పష్టంగా పేర్కొంటోంది. ప్రభుత్వ నిర్వహణలో లేని, అలాగే ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ నిధులను పొందుతున్న విద్యా సంస్థల్లో ఏదైనా మత బోధనలు జరుగుతున్నట్లైతే ఏ విద్యార్థీ (మైనర్ అయినట్లైతే) వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అనుమతిస్తే తప్ప అటువంటి మతపరమైన బోధనలు లేదా వర్క్‌షాప్‌ల్లో పాల్గొనరాదని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటున్నది. అందువల్ల, భగవద్గీతపై గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలో నిర్దేశించినదానికి విరుద్ధం. ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదా ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలల్లో ఎలాంటి మత బోధనలు జరపరాదని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. గుజరాత్ నమూనాను ఇప్పుడు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు అనుసరిస్తాయి. విద్యావేత్తలతో చర్చించిన మీదట తమ పాఠశాలల్లోనూ భగవద్గీతను ప్రవేశపెట్టే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కర్నాటక విద్యాశాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ''భగవద్గీత అనేది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైనది కాదని, అందరికీ చెందినదని'' ఆయన సెలవిచ్చారు. ఇదే కర్నాటక ప్రభుత్వం విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థ్ధినులు హిజాబ్‌ను ధరించడంపై నిషేధం విధించిందనే విషయం మరచిపోరాదు. ఈ విషయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మరో అడుగు ముందుకేసి ''భగవద్గీత మనకు నైతిక విలువలను, ప్రమాణా లను బోధిస్తుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి'' అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో హిందూ మత గ్రంథాలను, పుస్తకాలను ప్రవేశపెట్టే యత్నాలు భారతదేశాన్ని లౌకికవాద సిద్ధాంతాల నుండి మళ్ళించి, మతపరమైన దేశంగా మార్చాలన్న ఆర్ఎస్ఎస్-బీజేపీల ఓవరాల్ ప్రాజెక్టులో భాగమే. పాఠశాల సిలబస్‌లో గీతను చేర్చడాన్ని సమర్ధించుకోడానికి ''భారతీయ సంస్కతి, విజ్ఞాన వ్యవస్థలను సిలబస్సుల్లో చేర్చాలని కొత్త విద్యా విధానం సిఫార్సుల మేరకే ఈ చర్య తీసుకున్నా మని గుజరాత్ విద్యా మంత్రి చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇతర రంగాలకు సంబంధించి చూసి నట్లైతే, రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల్లో హిందూ మతతత్వాన్ని ప్రతిబింబించేలా చర్యలు తీసు కోవడం, హిందూ ఆరాధనా స్థలాలను పునరుద్ధ రించడం కోసం ప్రభుత్వ నిధులను ఇవ్వడం వంటివి సర్వసాధారణమైన అంశాలుగా మారి పోయాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని ప్రారంభించడం ఇందుకు ఒక ఉదాహరణ.
మెజారిటీ మతాన్ని ప్రభుత్వం పెంచిపోషించడం, దానికి ప్రభుత్వ సంస్థల్లో, వ్యవస్థల్లో చోటు కల్పించడం చూస్తుంటే ఇక లౌకికవాద భావనల చిహ్నాలు ఏ ఒక్కటీ లేకుండా తుడిచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది. లవ్ జిహాద్, మతమార్పిడులకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చట్టాలు ఆమోదించడం, మైనారిటీలు లక్ష్యంగా గోవధపై నిషేధం, పౌరసత్వానికి మతాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం వంటివి చేపడుతోంది.
గుజరాత్లో, పాఠశాలల్లో భగవద్గీతను ప్రవేశపెట్టడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ స్వాగతించింది. ఆ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ.. ''సిలబస్‌లో భగవద్గీతను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. కానీ, ఆ గీతను ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది'' అని వ్యాఖ్యా నించింది. ఆప్ కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడలేదు. ఆ పార్టీ ప్రతినిధి మాట్లాడుతూ... ''గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది'' అని వ్యాఖ్యానించారు. గుజరాత్లో ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన ఈ స్పందన చూస్తుంటే హిందూత్వ భావన క్రమంగా ఆధిపత్య స్థితిని పొందుతున్నదనే నూతన వాస్తవ స్థితిని సూచిస్తుంది. భారతదేశం లౌకికవాద దేశంగానే ఉండాలని కోరుకునే వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు ఈ నూతన వాస్తవికతను గమనంలో ఉంచుకుని హిందూత్వ కు ప్రత్యామ్నాయ దార్శనికత కోసం పోరాడేందుకు వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంది.
(పీపుల్స్ డెమొక్రసీ సంపాదకీయం)