Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి 11న గేబ్రియల్ బోరిక్ చిలీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు. చిలీ చరిత్రలో ఈ సందర్భం ఒక నూతన అధ్యాయానికి తెర తీసింది. చిలీలో అధ్యక్ష పదవికి కనీస వయస్సు 35ఏండ్లు ఉండాలి. సరిగ్గా అంతే వయస్సు ఉన్న బోరిక్ చిలీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడయాడు. చిలీ కమ్యూనిస్ట్ పార్టీతో సహా పలు పార్టీల, ఉద్యమాల కూటమిగా ఏర్పడిన 'అప్రెబో డిగ్నిడాడ్ ' తన నేతగా బోరిక్ను ఎన్నుకుంది. ఆ కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్న 'ఫ్రెంటె ఆంప్లియో' (విశాల వేదిక) పార్టీలో బోరిక్ సభ్యుడు. 51సంవత్సరాల క్రితం కమ్యూనిస్టులతో కలిసి కూటమి ఏర్పాటు చేసి దేశాధ్యక్షుడిగా సాల్వడార్ అలెండీ విజయం సాధించాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే విధంగా బోరిక్ దేశాధ్యక్షుడయాడు.
దేశాన్ని మొత్తంగా మార్చివేసే విధానాలను అమలు చేయడం కోసం పని చేసే కొత్త ప్రభుత్వపు మంత్రి వర్గంలో దేశంలోని వివిధ తరగతులన్నింటి నుండీ ప్రాతినిధ్యం ఉండేలా రూపొందించారు. బోరిక్ మంత్రివర్గంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఉన్నారు. 25మంది సభ్యులున్న మంత్రివర్గంలో 14మంది మహిళలు. మంత్రివర్గం సగటు వయస్సు 42సంవత్సరాలు. మగవారు, నడివయస్కులు ఎక్కువగా ఉండే మంత్రివర్గం స్థానే యువత, మహిళలు ప్రధానంగా ఉండేవిధంగా కొత్త కూర్పు ఉంది.
33సంవత్సరాల యువతి కామిలా వాల్లెజో కమ్యూనిస్టు మంత్రి. ఆమె ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. 35ఏండ్ల జియార్జియో జాక్సన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి. వీరంతా బోరిక్‌కు విద్యార్థి ఉద్యమంలో సహచరులు. దేశంలో వ్యాపారమయమైన విద్యా విధానానికి వ్యతిరేకంగా వీరంతా కలిసి ఉద్యమం నిర్వహించారు. 36ఏండ్ల యువతి ఇజ్కియా సిచెస్ దేశ హౌం శాఖామంత్రి. గతంలో క్లీనర్‌గా పని చేసి కార్మికోద్యమాన్ని నిర్మించిన 48ఏండ్ల లజ్ విడాల్ కొత్త మహిళా సంక్షేమ మంత్రి. 1973లో మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని కోల్పోయిన అలెండీకి మనుమరాలు మయా ఫెర్నాండెజ్ (50 ఏండ్లు) చిలీ కొత్త రక్షణమంత్రి.
పదవీస్వీకారం సందర్భంగా అధ్యక్ష భవనం బాల్కనీ నుండి ప్రసంగిస్తూ బోరిక్ ఆనాడు అలెండీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సామ్రాజ్యవాదుల అండతో పినోచెట్ మిలిటరీ కూటమి చేసిన కుట్రను ప్రస్తావించారు. అప్పటి నుండి దేశంలో సైనిక నియంతృత్వ పాలనలో సాగిన హింసను, అణచివేతను గుర్తు చేశారు. గతంలో జరిగిన ఆ దుర్మార్గాలను మళ్ళీ సాగనివ్వబోమని స్పష్టం చేశారు.
చిలీలో మానవ హక్కుల ఉల్లంఘనను సాగనివ్వం అని బోరిక్ హామీ ఇచ్చారు. నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలపై గత మిలిటరీ ప్రభుత్వాలు సాగించిన దమనకాండ వంటివి అనుమతించబడవని ప్రకటించారు. ఇప్పుడు అమలవుతున్న లోపభూయిష్టమైన విధానాలన్నిటినీ సరిచేస్తామన్నారు. స్థానిక మూల వాసులను వారి భూములనుండి వెళ్ళగొట్టే విధానాలను నిలుపు చేయనున్నట్టు ప్రకటించారు. భిన్న జాతుల, తెగల సమాహారంగా ఉన్న చిలీ దేశపు సాంస్కృతిక వైవిధ్యాన్ని రక్షిస్తామని, కళాకారుల హక్కులను కాపాడతామని ప్రకటించారు. అలెండీ కాలంలో చేపట్టిన విధానాలను గుర్తు చేస్తూ ఆ నాటి ఉత్తేజపూరిత అనుభవాలనుండి ప్రేరణ పొందుతూ ముందుకు సాగుతామని ప్రకటించారు.
బోరిక్ మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్మక్రమం కూడా నూతన సాంప్రదాయాన్ని నెలకొల్పింది. దేశంలోని అన్ని స్థానిక, మూలవాసుల సమూహాల ప్రతినిధులు ఈ కార్మక్రమంలో పాల్గొన్నారు. ఇంతకాలమూ అభివృద్ధికి నోచుకోకుండా ఒక మూలకు నెట్టివేయబడ్డ ఈ సమూహాలనన్నింటినీ అభివృద్ధి పథంలో కలుపుకు పోతామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అవసరమైన సామాజిక మార్పులు జరిగేవిధంగా కొత్త విధానాలు ఉంటాయని తెలిపింది.
సాధారణ దుస్తులను ధరించి బోరిక్ ప్రమాణస్వీకారం చేశాడు. సాంప్రదాయ పద్ధతి ప్రకారం ''ఒట్టు పెట్టే'' బదులు ''ప్రజలందరికీ వారి సమక్షంలో హామీ'' ఇచ్చాడు. తద్వారా ఏ అతీత శక్తుల కన్నా ప్రజలే తన ప్రభుత్వం దృష్టిలో అధికులని స్పష్టం చేశాడు. అధికారికంగా కేటాయించిన గృహాన్ని తిరస్కరించి ''స్వేచ్ఛ''కు, ''ఆశ''కు మధ్య ఏర్పడిన ''అనాధల'' వీధిలోనే తన నివాసాన్ని కొనసాగిస్తున్నాడు.
ఎన్నికల హామీలను నెరవేర్చడం బోరిక్‌కు అంత తేలికేమీ కాదు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో అసమానతలు ఉన్న దేశాలలో చిలీ ఒకటి. కేవలం ఒక్క శాతం వ్యక్తుల వద్ద దేశ సంపదలో 25శాతం పోగుబడివుంది. దానికి తోడు దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఆర్ధిక సంక్షోభం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, పెట్టుబడిదారీ వర్గాల కూటమికి పార్లమెంటులో ఇంకా గణనీయమైన బలం ఉంది. రాజ్యాంగయంత్రం మీద గట్టి పట్టే ఉంది. ఈ ఆటంకాలను అధిగమించి బోరిక్ ముందుకు సాగవలసివుంటుంది. అయితే, ఇంతవరకూ విద్యార్థి ఉద్యమనేతగా, వామపక్ష ఉద్యమకారుడిగా వ్యవహరించిన బోరిక్ ఇవేమీ తెలియనివాడుకాదు. అందుకే.. ''నయా ఉదారవాద విధానాల అమలుకు పుట్టినిల్లు చిలీ. అందుచేత ఇక్కడే ఆ విధానాలకు సమాధి కూడా కడదాం. ఈ కృషిలో ముందుండే యువశక్తి ఏం చేయబోతోందో అని అనవసరంగా భయాందోళనలకు లోనుకావద్దు'' అని బోరిక్ అన్నాడు.
బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ బోరిక్ పదవీ స్వీకార కార్యక్రమానికి హాజరయాడు. ఆ సందర్భంగా ''ఇప్పుడు బోరిక్కి చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు తయారవుతారు. వారిలో అనేకులు అతను తన లక్ష్యసాధనలో విజయం సాధించకూడదని కోరుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఈ సమాజం మెరుగుపడి సామాజిక న్యాయం, ప్రజారోగ్యం, సార్వత్రిక విద్య వంటివి అభివృద్ధి చెందాలన్న బోరిక్ ఎన్నికల హామీలు నెరవేరకూడదని వారు కోరుకుంటారు. అటువంటివారి బారి నుండి బోరిక్ చాలా అప్రమత్తంగా ఉండాలి'' అన్నాడు.
అయితే బోరిక్‌కు తోడ్పడే కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ప్రజామోదంతో ఎన్నికైన రాజ్యాంగ చట్టసభ రిఫరెండం ద్వారా ఏర్పడింది. ఈ రాజ్యాంగ అసెంబ్లీ చేసే నిర్ణయాలను పూర్తిగా అమలు చేస్తానని బోరిక్ ఇదివరకే ప్రకటించివున్నాడు. ఆ రాజ్యాంగ సభ రూపొందించే ముసాయిదా రాజ్యాంగం 2022లోనే ప్రజామోదం పొందడానికి వీలుగా రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించాడు. చిలీ ఒక బహుళ సంస్కృతితో కూడిన దేశం అని రాజ్యాంగసభ ఇప్పటికే తీర్మానించింది. ఇంతవరకూ అమలులో ఉన్న రాజ్యాంగం స్థానిక తెగల, మూలవాసుల సమూహాల హక్కులను గాని, వారి ప్రత్యేకతలను గాని గురించడానికి నిరాకరించింది. స్థానిక తెగల స్వయం నిర్ణయాధికారాన్ని ప్రస్తుత రాజ్యాంగం నిరాకరించింది. ఇప్పుడు రాజ్యాంగసభ చేసిన తీర్మానం స్థానిక తెగలు చాలా కాలం నుంచి కోరుతున్న స్వయం నిర్ణయాధికార హక్కును గుర్తించినందున బోరిక్ వారి డిమాండ్‌ను నెరవేర్చగలిగే అవకాశం బాగా ఉంది.
చిలీలో మహిళా ఉద్యమాలు చాలా కాలం నుంచి సంతానోత్పత్తి విషయంలో, అబార్షన్ విషయంలో, తమ ఆమోదంతో మాత్రమే లైంగిక సంపర్కం ఉండాలన్న విషయంలోఉద్యమాలు నిర్వహించారు. ఈ అంశా లన్నింటినీ కొత్త రాజ్యాంగ సభ పరిగణనలోకి తీసుకుంది. మహిళల డిమాండ్లను హక్కులుగా గుర్తిస్తూ రాజ్యాంగంలో పొందుపర్చాలని తీర్మానించింది. బిడ్డల్ని కనే విషయంలో గాని, కనకూడదనే విషయంలో కాని మహిళలకు హక్కులు ఉన్నాయని గుర్తించింది. గత 200సంవత్సరాలుగా సాగుతున్న వివక్షతను ఇప్పుడు అధిగమించ గలుగు తున్నామంటూ మహిళా ఉద్యమ నాయకులు హర్షామోదాలు తెలియజేస్తున్నారు.
బోరిక్ విజయం కన్నా ముందు పెరూలో పెడ్రో కాస్టిల్లో, హౌండూరాసలో క్సిమారా కాస్ట్రో, ఎన్నికల్లో విజయాలు సాధించారు. వీరిద్దరూ వామపక్ష శక్తుల ప్రతినిధులే. 2022 మే నెలలో కొలంబియాలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ వామపక్ష శక్తులు అమెరికా-అనుకూల శక్తులను ఓడించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. ఇక అక్టోబర్ లో బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలలోనూ లూలా డిసిల్వా గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే వామపక్ష శక్తులు అధికారంలో ఉన్న అర్జెంటినా, బొలివియా, వెనెజులా, నికరాగ్వా, క్యూబా దేశాలతో కలిసి ''లాటిన్ అమెరికా స్వతంత్రంగా, ఎవరికీ లొంగకుండా, లాటిన్ అమెరికన్ ప్రజలందరి మధ్య పరస్పర సహకారం, స్నేహభావం పెంపొందేలా'' కృషి చేస్తామని బోరిక్ ప్రకటించాడు.
- ఆర్. అరుణ్ కుమార్