Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక చర్య ఇంకా ఎన్ని రోజులో సాగుతుందో, జనాలకు ఎన్ని ఇబ్బందులను తెస్తుందో అని ఆందోళన చెందుతున్నవారెందరో! అలా ఆలోచించటం, దాడులను ఆపాలని కోరుకోవటం సహజం. అదేమీ గొంతెమ్మ కోరికకాదు. కానీ అమెరికా, నాటో దేశాల పాలకులు అలా అనుకోవటం లేదు. వాటికి వంతపాడే పశ్చిమ దేశాల మీడియా రాస్తున్న కథనాలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయి. మన దేశంలోని టీవీలు, పత్రికలు కూడా వాటినే మనకూ అందిస్తున్నాయి. ఉక్రెయిన్ జనం కన్నీళ్ళు, మానవహక్కులు, ఇతర అంశాలను ముందుకు తెస్తున్న మీడియా అమెరికా, దాని కనుసన్నలలో నడుస్తున్న ఐరోపా ధనిక దేశాలు దశాబ్దాల తరబడి ఇతర దేశాలపై చేస్తున్న దాడులు, దుర్మార్గాలు, మానవహననం గురించి విస్మరిస్తున్నది.
ఇటీవలి ఉదంతాలను చూస్తే పశ్చిమాసియాలోని సిరియాపై 2009 నుంచి ఇప్పటికీ అమెరికా, దానితో చేతులు కలిపిన కిరాయి మూకలు దాడులు జరుపుతున్నాయి. బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్, ఇప్పుడు జో బైడెన్ ఎవరు అమెరికా గద్దెపై ఉన్నా దాడులు ఆపటం లేదు. లిబియా మీద 2009 నుంచి 2021జనవరి వరకు దాడులు చేసిన పుణ్యం, నాటో, బరాక్ ఒబామా, ట్రంప్‌కు దక్కింది. ఇరాక్ మీద రెండవసారి దాడులు 2009 నుంచి 2021 వరకు ఏదో రూపంలో కొనసాగాయి.2001 నుంచి సోమాలియాలో జోక్యం చేసుకొని ఏదో ఒకసాకుతో అమెరికా, దాని మిత్రదేశాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎమెన్‌లో 2001 నుంచి అమెరికా, దాని మిత్రపక్షం సౌదీ అరేబియా నాయకత్వంలోని దేశాలు ఇప్పటికీ దాడులు జరుపుతూనే ఉన్నాయి. 2001 నుంచి 2021వరకు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా, ఇతర దేశాల దాడుల గురించి తెలిసిందే. వీటి గురించి మీడియాకు ఎందుకు పట్టటం లేదు. ఎందుకీ వివక్ష? ఆ దేశాల్లోని వారు మనుషులు కాదా, వారికి శాంతి అవసరం లేదా?
యుద్ధానికి ఎవరు ఎంత మూల్యం చెల్లిస్తున్నారని కాదు అడగాల్సింది, దాని వలన లబ్ది పొందిందెవరన్నది కీలకమైన ప్రశ్న. 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రవాదదాడి జరిగింది. అదే నెల18న ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు జార్జి డబ్ల్యు బుష్ ఆదేశాలు జారీ చేశాడు. అక్కడి నుంచి జో బైడెన్ ఏలుబడిలో అమెరికన్ మిలిటరీ స్వదేశానికి పారిపోయి వచ్చేంతవరకు సగటున రోజుకు 30కోట్ల డాలర్ల వంతున అమెరికా చేసిన ఖర్చు మొత్తం 2.26లక్షల కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరు పేరుతో సాగించిన ఈ దాడుల ప్రత్యేకత ఏమంటే ప్రయివేటు కాంట్రాక్టర్లపై ఆధారపడటం. చిత్రం ఏమంటే చివరికి 2021 ఆగస్టులో అమెరికన్ సేనలు బతుకుజీవుడా అంటూ అఫ్ఘనిస్తాన్ నుంచి స్వదేశం చేరేందుకు కూడా 37 హెలికాప్టర్ల కోసం ప్రయివేటు కంపెనీలకు 45 కోట్ల డాలర్లు చెల్లించింది. వాటిని లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసింది.
ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌పై దాడులకు అమెరికా చేసిన ఖర్చు మొత్తం ఐదు లక్షల కోట్ల డాలర్లని అంచనా. ఆఫ్ఘనిస్తాన్‌లో దాడుల్లో పాల్గొన్నవారిలో ప్రయివేటు వారే ఎక్కువ మంది ఉన్నారు. ఆయుధ కంపెనీలతో పాటు దాడులకు అవసరమైన వారిని, ఆయుధాలను సరఫరా చేసేందుకు అవసరమైన చమురును కూడా ప్రయివేటు వారే సరఫరా చేసి లబ్ది పొందారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియాలో జరిపిన దాడుల్లో అమెరికా రక్షణశాఖ 27వేల మంది కాంట్రాక్టర్లను వినియోగించింది. 2008-2018 మధ్య 380 మంది ఉన్నత స్థాయి అధికారులు ఇలాంటి వారి అవతారమెత్తారని తేలింది. రెండు దశాబ్దాల క్రితం ఐదు అగ్రశ్రేణి ఆయుధ కంపెనీల వాటాలను పదివేల డాలర్ల విలువగలవి కొంటే ఇప్పుడు వాటి విలువ లక్ష డాలర్లకు పెరిగినట్లు అంచనా. అమెరికా దాడులకు చేస్తున్న ఖర్చులో లాక్‌హీడ్ మార్టిన్, రేథియన్, జనరల్ డైనమిక్స్, బోయింగ్, నార్తరప్ గ్రుమ్మన్ అనే ఐదు కంపెనీలకు 60శాతం మొత్తం దక్కింది. గతంలో పని చేసిన ఐదుగురు అమెరికా రక్షణ మంత్రుల్లో నలుగురు ఈ కంపెనీలతో లావాదేవీల్లో ఉన్నవారే అంటే కుమ్మక్కు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల సొమ్ముతో ఆయుధాలు, ఇతర పరికరాలను కొనుగోలు చేయిస్తారు.
అందువలన అమెరికా, బ్రిటన్ వంటి సామ్రాజ్యవాదులు జరిపే యుద్ధాలకు మూలం లాభార్జనే. గతంలో దేశాలకు దేశాలను ఆక్రమించుకుంటే ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు గనుక ఏదో ఒక సాకుతో దేశాలను ఆక్రమించుకొని అక్కడ తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ఉదంతాలు (ఉదా ఇరాక్, లిబియా) కొన్ని కాగా, సంస్కరణల పేరుతో మార్కెట్లను ఆక్రమించుకోవటం ఒకటి. వీటికి తోడు ఇలా యుద్ధాలను సృష్టించి అలా లబ్దిపొందేందుకు దగ్గర దారినెంచుకున్నాయి అమెరికన్ కార్పొరేట్ రాబందులు. దానికి అనుగుణంగానే దేశ విధానాలను రూపొందించి అమలు చేయిస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ముందుకు వచ్చిన ఈ వ్యవస్థకు ఏదో ఒక మూల ఏదో ఒక ఉద్రిక్తత లేకపోతే గడవదు. దీనిలో కార్పొరేట్లు, మిలిటరీ, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు ఉంటారు. అందుకే అమెరికాకు యుద్ధం ఒక లాభదాయక వాణిజ్యం. దానికోసం అదెంతకైనా తెగిస్తుంది. అందుకే అమెరికాలో నాలుగువేలకు పైగా లాబీలు (అన్ని రకాలుగా ప్రభావితం చేసే బృందాలు) మిలిటరీ- పారిశ్రామిక సంస్థల కోసం నేడు పని చేస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఏదో ఒక లాబీలో ఉంటారన్నది బహిరంగ రహస్యం. అందుకే రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏదో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్ధాలకు కారకులు ఆయుధకంపెనీల యజమానులే. వారు నిర్దేశించిన మేరకే అమెరికా స్వదేశీ, విదేశీ విధానాలు ఉంటాయి. దశాబ్దాలుగా ఎలాంటి ఘర్షణలు లేని మన దేశం-చైనా మధ్య ఉద్రిక్తతలను సృష్టించి మన దేశానికి పెద్ద మొత్తంలో ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఎత్తుగడ ఇప్పటికే ఫలించింది. అదింకా కొనసాగుతోంది. గతంలో పాకిస్థాన్‌ను మనమీదకు ఉసిగొల్పిన అంశం తెలిసిందే. చైనా వారు అమెరికా, ఇతర దేశాల వద్ద ఆయుధాలు కొనాల్సినపని లేదు. వారే ఎగుమతులు చేసే స్థితిలో ఉన్నారు.
అంతర్జాతీయ పోలీసు బాధ్యతను ఐరాస లేదా మరొక సంస్థగానీ అమెరికాకు అప్పగించలేదు. తన ఆర్థిక, మిలిటరీ శక్తితో ప్రపంచంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఉగ్రవాదంపై పోరు వంటి సాకుతతో ఆధిపత్యకోసం చూస్తున్నది. అమెరికా కార్పొరేట్లకు యుద్ధాలు ఎలా లాభాలు చేకూర్చుతున్నాయో చాలా మందికి అర్ధం కావటం లేదు. గతంలో సోవియట్‌ను బూచిగా చూపి ఆయుధాల అమ్మకాల కోసం ఉద్రిక్తతలను సృష్టిస్తే ఇప్పుడు చైనాను చూపి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకొనేందుకు చూస్తున్నారు. ఇతర దేశాలవే కాదు, అమెరికా రక్షణ బడ్జెట్‌నూ పెంచుతున్నారు. నౌకదళంలో ఇప్పుడున్న 300పెద్ద ఓడలను 350కి పెంచాలని ప్రతిపాదించారు. ఎఫ్35 విమానాల కొనుగోలు సంగతి చెప్పనవసరం లేదు. అణ్వాయుధాలను నవీకరించేందుకు 1.5లక్షల కోట్ల డాలర్లతో పధకాన్ని రూపొందించారు. ఇప్పుడున్న త్రివిధ దళాలకు అదనంగా అంతరిక్ష సేన ఏర్పాటుకు, దానికి శిక్షణ, ఆయుధాల పేరుతో పెద్ద ఎత్తున ఖర్చుపెట్టనున్నారు. ఇదంతా ప్రయివేటు కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు, ప్రపంచాధిపత్యం కోసమే అన్నది స్పష్టం.
నిజానికి అమెరికా రెండవ ప్రపంచయుద్ధం నుంచే కుట్రలు మొదలు పెట్టింది. చైనాలో కమ్యూనిస్టులు సాధిస్తున్న విజయాలు అమెరికా, బ్రిటన్లకు దడపుట్టించాయి. చైనా పాలకుడిగా ఉన్న చాంగ్‌కై షేక్‌ను పటిష్టపరచాలని చూసి విఫలమయ్యాయి. పక్కనే ఉన్న మయన్మార్‌లో అధికారానికి వచ్చిన జాతీయవాది అంగసాన్ (అంగసాన్ సూకీ తండ్రి)తో మొత్తం మంత్రులను హతమార్చిన కుట్రలో బ్రిటన్ హస్తం ఉంది. రెండు కొరియాల విలీనాన్ని అడ్డుకొనేందుకు అమెరికా యుద్ధానికి తలపడిన సంగతి తెలిసిందే. ఇండో చైనాలో వందేండ్ల ఫ్రెంచి పాలనకు కమ్యూనిస్టులు స్వస్తిపలికారు. 1954లో హౌచిమిన్ సారధిగా కమ్యూనిస్టులు ఫ్రెంచి సేనలను ఓడించారు. రెండుగా చీల్చిన వియత్నాం విలీనానికి 1956ను గడువుగా నిర్ణయించారు. అంతకు ముందే తెరవెనుక ఉన్న అమెరికా నేరుగా రంగంలోకి వచ్చి దక్షిణ వియత్నాంను కేంద్రంగా చేసుకొన్నది. దక్షిణ వియత్నాంలోని మిలిటరీ, కమ్యూనిస్టు వ్యతిరేకులకు శిక్షణ, ఆయుధాలను సరపరా చేసి ఉత్తర వియత్నాంను దెబ్బతీసేందుకు చూసింది. వారివల్ల కాదని తేలటంతో 1964లో టోంకిన్ గల్ఫ్‌లో తన నౌకలపై ఉత్తర వియత్నాం దాడి చేసిందనే కట్టుకధను ముందుకు తెచ్చి నేరుగా దాడులకు దిగింది. చివరికి 1975 ఏప్రిల్ 29-30 తేదీలలో అక్కడి నుంచి అమెరికా సేనల్లో చివరి బృందం పారిపోవటంతో ఆ దురాక్రమణ యుద్ధం ముగిసింది. వియత్నాం కమ్యూనిస్టులు అమెరికాకు పెద్ద గుణపాఠం నేర్పారు.
అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు జరిపిన ఈ దాడుల్లో ఒక్క అణ్వాయుధాలు తప్ప అన్ని రకాల మారణ, రసాయన ఆయుధాలను పెద్ద ఎత్తున ప్రయోగించి అమెరికా లక్షల సంఖ్యలో మానవ హననానికి పాల్పడింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు సాగుకు పనికిరాకుండా కలుషితమయ్యాయి.
ఇరాన్ - ఇరాక్ దేశాల మధ్య ఉన్న వివాదాలను ఆసరా చేసుకొని అమెరికా వాటి మధ్య తంపులు పెట్టింది. రెండు దేశాలకూ ఒకరికి తెలియకుండా ఒకరికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంది. పరస్పర దాడులతో రెండు దేశాలూ బలహీనపడితే వాటి మీద పెత్తనం, రెండు చోట్లా ఉన్న చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలన్నది దాని ఆలోచన. ఏడు సంవత్సరాల పదకొండునెలల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇరాన్ వైపున ఆరులక్షల మంది ఇరాక్ వైపున ఐదులక్షల మంది సైనికులు మరణించారని అంచనా. విజేతలు లేరు. కొరియా యుద్దంలో పదిహేనున్నరలక్షల మంది ఉత్తర కొరియన్లు, పదిలక్షల మంది దక్షిణ కొరియన్లు మరణించారు. పదిలక్షల మంది ఉత్తర కొరియా, రెండు లక్షల మంది దక్షిణ కొరియా సైనికులు మరణించారు. ఈ దుర్మార్గాలు, మానవ నష్టాలకు కారణం అమెరికా ఆధిపత్యకాంక్షే అన్నది స్పష్టం. ఇప్పుడు అమెరికా, నాటో కూటమి దేశాలు రష్యాకు ముప్పు తెచ్చేందుకు ఉక్రెయిన్ను పావుగా వాడుకుంటూ రష్యాను రెచ్చగొట్టి దాడులకు కారణమయ్యాయి. ఉక్రెయిన్ పౌరులను, ఇతర దేశాల వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తున్న వాటి దుష్ట రాజకీయాన్ని విరమించాలని వత్తిడి తేవాల్సి ఉంది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288