Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మికవర్గ పోరాటాలు వర్గ పోరాటాలుగా పరిణామం చెందక పోవడానికి అవరోధాలను అధ్యయనం చేయాల్సి ఉన్నది. అప్పుడే చరిత్ర ప్రగతిశీలంగా అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుంది. ఇజాజ్ అహ్మద్ రచనలు ఇందుకు విస్తృత స్థాయిలో ఉపయోగపడుతాయి. మానవుడే కేంద్ర బిందువుగా వాటిని అధ్యయనం చేస్తేనే మానవుల శక్తిసామర్థ్యాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. మానవులనే కేంద్ర బిందువుగా ఎందుకు అధ్యయనం చేయాలంటే సమాజంలో ఏర్పడే పర్యావసానాల వలన వాళ్ళే ఇబ్బందులు పడతారు, మళ్ళీ వాళ్లే దాన్ని మార్చుకునేందుకు పూనుకుంటారు... కదా!
''ఇంకేదీ లేకపోయినా, మనం కనీసం ఉషోదయాన్ని కలగనే ధైర్యం చేశాం. ఇది వరకు మనం చూసిన ఉషోదయమే అయినా అటు వైపే మన దృష్టి మరలుతున్నది''
- అస్ట్రార్ ఉల్ హఖ్ మజాజ్.
ఇది మత ఆలోచనల సంకెళ్లకు వ్యతిరేకంగా రాసినది. కానీ అది సంకెళ్ల మధ్య నలిగిపోతున్న ప్రతి సామాజిక వ్యవస్థకి వర్తిస్తుంది. మానవులు చైతన్యంతో కార్యాచరణకు పూనుకుంటేనే సంకెళ్లు తెగిపోతాయి... ఇజాజ్ అహ్మద్ రచనల వెలుగులో తప్ప మరో విధంగా ఆలోచించడం నాకు అసాధ్యం అయినది. మొట్టమొదటిగా నాకు ఆయన ఆలోచనల పరిచయం ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, సోషల్ సైంటిస్ట్ పత్రికలు చదవడం వలన అయ్యింది. ఆయన ఎంచుకున్న అంశాలు చాలా వైవిధ్యం కలిగినవి. భారతదేశంలో మితవాదం పుట్టుక నుంచి సల్మాన్ రష్డీ నవలలు, ఎడ్వర్డ్ సేడ్ ఓరియంటలిజం వరకు విస్తరించి ఉండేవి.
ప్రపంచ చరిత్ర, సామాజిక శాస్త్రాలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహనతో మార్క్సిజం సంవిధానంలో విశ్లేషణ చేసి ఒక స్పష్టమైన నిర్థారణకు వచ్చేవారు. భారతదేశంలో మితవాదంపై ఇతర రచయితలు రాసినవి భారతదేశంలోని పరిణామాలకే పరిమితమై ఉండేవి. ఎక్కువ అయితే యూరోపియన్ సమాజంలోని ఫాసిజం నుంచి కొంత మేరకు తీసుకునేవారు. ఇజాజ్ అహ్మద్ మాత్రం ఫాసిజం, మితవాదంపై ప్రపంచ వ్యాపితంగా వెలువడిన సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ దాని స్వభావాన్ని మన కండ్ల ముందు ఉంచేవారు. అందులో యూరోపిన్ చరిత్రలో సిద్ధాంతపరంగా జరిగిన చర్యలను కూడా తెలియచేసేవారు. భారతదేశ చరిత్ర నుంచి వివిధ అంశాల లోతులను తీసుకునే వారు. అక్కడితో ఆగకుండా లాటిన్ అమెరికాలో మితవాదం యొక్క పాత్రను, అరబ్ దేశాలపై అది వేసి ప్రభావాన్ని ప్రపంచ దేశాలలో దాని పాత్రను కూడ చర్చించేవారు. అప్పుడే ఒక సమగ్ర అవగాహన ఏర్పడుతుందని ఆయన విశ్వాసం. మితవాదం అనేది దేశాల సరిహద్దులకు పరిమితమైనది కాదు. అది ప్రపంచ వ్యాపిత పరిణామం అని ఆయన గట్టిగా భావించేవారు. తన రచనల ద్వారా ఆయన మనకు భారతదేశం యొక్క నిర్దిష్ట పరిస్థితులను ఒక విశాల దృష్టితో అధ్యయనం చేసి ఆలోచించి అవగాహన చేసుకోండని 'సవాల్' చేస్తున్నారు. ఆ విధంగా ఆలోచించడం ఆయనకు అతి సాధారణమైన మార్క్సిస్టు పద్ధతి.
మా తరం మార్క్సిస్టుల ఆలోచనా సరళిని ఆయన రూపుదిద్దారు అంటే అతిశయోక్తి కాదు. బాబ్రీ మసీదు కూల్చివేసిన నేపథ్యంలో అంటే 1992లో ఆయన రచనలను చదివిన వారు దీనిని తప్పక అంగీకరిస్తారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో భారతదేశంలో హిందూత్వ శక్తులు పుంజుకున్నాయి అనే పరిమితులలోనే ఆలోచించకుండా, అదే కాలంలో ప్రపంచ వ్యాపితంగా జరిగిన ఇతర విధ్వంసాలను కలిపి చూడాలని ఆయన ప్రతిపాదించారు. సోవియట్ యూనియన్ కూలిపోవడం, కమ్యూనిస్టు పరిపాలనా వ్యవస్థ పతనం కావడం, సరళీకరణ విధానాల పుట్టుక, భారతదేశ సామాజిక వ్యవస్థలో ఉన్న నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఆధారంగా జరుగుతున్న దారుణమైన వివక్షత దాడులను సహించడం అనే ధోరణి ఏర్పడింది. సోషల్ డెమొక్రసీ లొంగుబాటు, వామపక్షాలు బలహీనపడటంలాంటి అంశాలను కూడా కలుపుకుని చూడాలని, కేవలం దాన్ని ఒక విధ్వంసంగా మాత్రమే చూడకూడదని ఆయన మనకు నేర్పారు. బాబ్రీ మసీదు కూల్చిన సమయంలో ఆయన మనలని మార్క్సిజం పునాదిగా ఒక సరైన అవగాహనకురావాలని పురికొల్పి ఒక రక్షణ కవచాన్ని ఇచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కేవలం మతవాద శక్తుల బెదిరింపులను అడ్డుకోవడానికే పరిమితం కాకుండా, స్వాతంత్య్ర పోరాటం యొక్క వారసత్వ లక్షణాలు ఎలా నిర్వీర్యం అవుతున్నాయో అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో ఆ ఇబ్బందికర పరిస్థితుల పరిష్కారానికి సులభమైన సమాధానాలు లేవని, మతోన్మాదం, చిక్కుముడిలాంటి సరళీకరణ విధానాలపై పోరాటం చేయాలంటే చాలా ఓపికతో నిష్టతో కూడిన విప్లవ క్రమశిక్షణ అత్యంత అవసరం అని ఆయన అర్థం చేయించారు. మనం చాలా దూరం సాగాల్సి ఉంటుందనీ, అందుకోసం ఒక స్పష్టతతో, పట్టు విడవకుండా నిలకడగా పనిచేయడానికి లోతైన అధ్యయనం ఎలా చేయాలో, పోరాటాలు ఎలా చేయాలో నేర్పారు.
1992ల ఇజాజ్ అహ్మద్ రాసిన ప్రమాణిక గ్రంథం ''ఇన్ థియరీ'' క్లాసెస్ నేషన్స్, లిట్రేచర్ విడుదలైంది. ఆ సందర్భం ఏటువంటిదంటే అప్పుడే సోవియట్ యూనియన్ కూలిపోయింది. తూర్పు యూరప్‌లోని సోషలిస్టు రాజ్యాలు ఒక దాని తరువాత మరోకటి కూలిపోవడం ప్రారంభమైంది. భారతదేశం లౌకిక రాజ్యాంగంగా ఉండటానికి ఇచ్చిన హామీ నుంచి వైదొలగింది. దేశంలో నిర్మించబడుతున్న ప్రభుత్వ పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో నయా ఉదారవాద విధానాలు అంటే సరళీకరణ విధానాలు ప్రవేశించి మనలని ప్రపంచీకరణ ఊబిలోకి లాగాయి. మూడవ ప్రపంచ దేశాలు తమ కార్మికులను సట్టా వ్యాపారంలాంటి ప్రపంచ గొలుసుకట్టు పరిశ్రమ ఉత్పత్తివిధాన వేతన దోపిడీకి అప్పగించాయి. ఇక రాబోయే కాలంలో అమెరికా ఒక ఎదురులేని దేశంగా ఏర్పడి ప్రపంచం దాని వశం అవుతుందనే విధంగా కనబడింది. కానీ, ఒక్కొక్కటిగా ఆ భ్రమలు తొలగిపోవడం ప్రారంభమైంది. అప్పటి వరకు ఏ సిద్దాంతాలు ఖాయం అనుకున్నామో అవి చెదరగొట్టబడ్డాయి. ''అనంతరవాదం'' అనే పదం చాలా సిద్ధాంతాలకు జోడించ బడింది. ఆధునిక అనంతరవాదం, వలసవాద అనంతరవాదం, మార్క్సిజం అనంతరవాదం, వ్యవస్థీకృత అనంతరవాదం లాంటివి కొత్తవి తన్నుకువచ్చాయి. అయితే ఇవేవీ ప్రపంచాన్ని పునర్ నిర్వచించే విధంగా సైద్ధాంతిక స్పష్టతను ఇవ్వలేకపోయాయి. వాటిలో ఎక్కువ అంశాలు అవివేకమైన, నిస్సారమైన ప్రయోగాలుగా కనబడుతున్నాయి తప్ప సామాజిక వ్యవస్థ పునాదిలో ఏర్పడిన మార్పులను అర్థం చేసుకునే శ్రద్ధతో కూడిన ప్రయత్నంగా కనబడటం లేదు. అయితే ఈ పూర్వరంగంలో ఇజాజ్ అహ్మద్ మార్క్సిస్టు సిద్ధాంతం ప్రాతిపదిక గా రాసిన ఈ పుస్తకం ఒక సంచలనం అయ్యింది. అచ్చయిన పుస్తకానికి ముద్రాపకులు వెనుక అట్టమీద మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతకర్త టెర్రి ఈగల్టన్తో రాయించిన వర్ణనలో ఇలా ఉన్నది..
''కొంత మంది ర్యాడికల్ విమర్శకులు మార్క్సిజాన్ని మరచిపోయి ఉండవచ్చు. కానీ ఇజాజ్ అహ్మద్ ధైర్యంతో ఆర్బాటం ప్రదర్శించకుండా రాసిన విమర్శ మార్క్సిస్టు పద్ధతిలో అన్నింటిని పూర్వపక్షం చేస్తూ ఉన్నది. ఆయన మాత్రం మార్క్సిజాన్ని మరచిపోలేదు.'' ఇక్కడ వెంటనే రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి అప్పటివరకు క్యాజువల్ విమర్శకులుగా ఉన్నవారు మార్క్సిజం పట్ల ఉన్న నిబద్దతను వదులుకున్నారు. వారి నిష్క్రమణతో ప్రవేశించిన కొత్త సిద్ధాంతాలు ఏమాత్రం ఉపయోగం లేనివని తేలిపోయింది. రెండు ఇజాజ్ అహ్మద్ మార్క్సిజం అనే సాంప్రదాయం నుంచి వచ్చాడనీ, ''అనంతరవాదం'' రాజ్యం ఏలుతున్న కాలంలో మార్క్సిజానికి గట్టిగా కట్టుబడి ఉన్నాడనీ రుజువైంది. సోవియట్ యూనియన్ పతనం అయిన కాలంలో అమెరికా నీచమైన అవమానకరమైన విమర్శలను మార్క్సిజం ఎదుర్కొవాల్సి వచ్చింది. ''ఇన్ థియరీ'' అని ఇజాజ్ అహ్మద్ రాసిన పుస్తకం ముందుమాటలో ప్రస్తుత పరిస్థితులకు ఆయన చారిత్రక నేపథ్యాన్ని రెండు ఆలోచనా విధానాల ఆధారంగా వివరించాడు. అవే ఇజాజ్ అహ్మద్ అందించిన పాఠాలను నిర్దేశిస్తాయి. ఒకటి ఆయన చరిత్ర, మానవ సమాజం గురించి చేసిన విస్తృత అధ్యయనం యొక్క పునాదే ఆయన సుదీర్ఘమైన చరిత్రలో ప్రపంచ పరిణామాలను ఈ కాలపు వైరుధ్యాలకు వర్తింప చేసి అధ్యయనం చేయడానికి ఒక నేపథ్యాన్ని ఏర్పాటు చేసింది. రెండు మార్క్సిజం మీద ఆయనకు ఉన్న పట్టు. సజీవ మార్క్సిజం, అంటే పాశ్చాత్య మార్క్సిజాన్నీ జాతీయ విముక్తి పోరాటాల మార్క్సిజాన్నీ ఈ రెండు స్రవంతులను తనలో ఇముడ్చుకున్న మార్క్సిజం ''ది తియరీ''కి రాసిన ముందుమాట లెనిన్ ప్రబోధించిన నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా అధ్యయనం చేయడమే మార్క్సిజం యొక్క సజీవసారం అన్న మాటలను ధృవీకరించింది.
ఇజాజ్ అహ్మద్ రచనలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన మార్క్సిజంలోని వివిధ స్రవంతులను గ్రహించినట్టు అర్థమవుతుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఉత్పత్తి శక్తుల పురోగతి ఎప్పుడూ నికరంగా అభివృద్ధివైపే ఉండదనీ, దానికి భిన్నంగా కూడా ఉంటుందనీ తెలుస్తుంది. సామ్రాజ్యవాద వ్యవస్థ నిర్మాణంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి పెట్టుబడి పోగుపడే మార్గం, రెండు రాజకీయ రంగంలో సైనీకీకరణ. జాతీయ ఉద్యమం, సామాజిక ఉద్యమాలలో వర్గ ప్రయోజనాల మధ్య వచ్చే ఘర్షణ వలన ఏర్పడే ఎగుడు దిగుడుల గురించి ప్రస్తాన ఉంటుంది. మరి కొన్ని సందర్భాలలో సందేహాస్పదమైన అంశాలు బాగా చెవికెక్కిపోయి తిరుగుబాటులాగా ఏర్పడి మితవాదానికీ, మితవాద ఉద్యమాలకూ తోడ్పడుతుంది. కొన్ని సందర్భాలలో మొత్తం ప్రజలు దానికి దాసోహం అనే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. సమాజంలో వారసత్వంగా వచ్చిన పెడధోరణులు సామాజిక మార్పుకోసం ఉండే అవకాశాలను మొద్దుబార్చావచ్చు. మార్క్సిస్టు అధ్యయన పద్ధతిలో అన్ని కోణాల నుంచి అధ్యయనం వలన మాత్రమే ఒక సమగ్ర అవగాహనకు రావడం జరుగుతుంది. మానవ జీవితంలో ఏదో ఒక కోణాన్ని మాత్రమే అధ్యయనం చేస్తే సమగ్ర అవగాహన ఏర్పడదు. సమగ్ర అవగాహన ఏర్పర్చుకోవాలంటే ఆ అంశంలో జరిగిన క్రమ పరిణామాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. అప్పుడే ప్రస్తుత పరిస్థితిని మార్చడానికి చేసే ఒక నిజమైన ఉద్యమానికి సైద్ధాంతిక ప్రతిపాదిక ఏర్పడుతుంది.
అనేక కారణాల వలన వర్గపోరాటం చేయడంలో కార్మికవర్గం సైద్ధాంతిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో బలహీనంగా ఉన్నది. పటిష్టమైన సంఘ నిర్మాణం లేకపోవడంతో పురోగమించడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. కార్మికవర్గ పోరాటాలు వర్గ పోరాటాలుగా పరిణామం చెందక పోవడానికి అవరోధాలను అధ్యయనం చేయాల్సి ఉన్నది. అప్పుడే చరిత్ర ప్రగతిశీలంగా అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతుంది. ఇజాజ్ అహ్మద్ రచనలు ఇందుకు విస్తృతస్థాయిలో ఉపయోగపడుతాయి. మానవుడే కేంద్ర బిందువుగా వాటిని అధ్యయనం చేస్తేనే మానవుల శక్తిసామర్థ్యాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. మానవులనే కేంద్ర బిందువుగా ఎందుకు అధ్యయనం చేయాలంటే సమాజంలో ఏర్పడే పర్యావసానాల వలన వాళ్ళే ఇబ్బందులు పడతారు, మళ్ళీ వాళ్లే దాన్ని మార్చుకునేందుకు పూనుకుంటారు... కదా!
అనువాదం: టి.యన్.వి.రమణ,
సెల్: 8985628662
విజయ్ ప్రసాద్