Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెలెబ్రిటీలు, మంత్రులూ, స్పీకర్లు, హైసొసైటీ లేడీస్ చాలామంది వుండొచ్చు. కానీ మహిళా నేత అనుకోగానే గుర్తుకు వచ్చే మల్లు స్వరాజ్యం వంటి వారెందరు? ఫలానా వారి భార్య, కుమార్తె, చెల్లెలు... ఫలానా పార్టీ అధినేత ప్రత్యేకంగా ప్రోత్సహించిన నాయకురాలు... ఇలా చాలా వింటుంటాం. కాని పన్నెండేండ్ల వయసులోనే ప్రజా సమరంలో దూకి తొంభయ్యవ పడిలో కన్ను మూసేదాకా అదే అరుణాశయ పతాక నీడలో పయనం సాగించిన మహిళామణులు ఎందరున్నారు? చెప్పడానికి లోపం, వేలెత్తి చూపడానికి వివాదం, అభిశంసించడానికి లేశ మాత్ర స్వార్థం కనిపించని కదన యోధురాళ్లు ఎంత అరుదుగా ఉన్నారు? మల్లు స్వరాజ్యం వారిలో అగ్రగణ్యగా ఆఖరి వరకూ నిలిచిపోవడానికి కారణమైన విశిష్టతలేమిటి? పెద్ద కుటుంబంలో పుట్టి అన్న, భర్త కూడా ఉద్యమ నేతలైనా సరే ఆమెను ఆమెగానే గుర్తుచేసుకోవడానికి కారణాలేమిటి? కాకలు తీరిన వీర విప్లవనారిని తల్చుకోగానే సాదాసీదా చీర కట్టుకుని పదిమందితో నడచివచ్చే దృశ్యం తప్ప ఏమైనా పటాటోపాలు, అట్టహాసాలు ఎప్పుడైనా ఎవరైనా చూశారా? రెండు సార్లు శాసనసభ్యత్వం, ఇంట్లో పార్లమెంటు సభ్యులు, రాజకీయంగా అత్యున్నత కమిటీలలో సభ్యత్వాలు, అశేష ప్రజాభిమానం ఉన్నా అధికార దర్పం, అతిశయం ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం స్వరాజ్యం. తెలంగాణ పోరాటాన్ని చారిత్రాత్మకం చేసిన వీరనారుల ప్రతినిధిగా ప్రతీకగా మనతో నడిచిన సజీవ వీరగాధామూర్తి (లివింగ్ లెజండ్) మల్లు స్వరాజ్యం.
ఆశయమే ఆయుధం!
తుపాకుల గురించి మాత్రమే మాట్లాడితే ఆమె సంపూర్ణ వ్యక్తిత్వం కళ్లకు కట్టదు. 'నా మాటే తుపాకి తూటా' అన్న శీర్షికకు అర్థం ఆమె ఆశయాన్నే ఆయుధంగా అంత శక్తివంతంగా ప్రతిధ్వనింపచేయగలదు అని. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో పోల్చదగినవి ప్రపంచంలో ఎన్నో లేవు. ఆ పోరాటంలో చిరు ప్రాయంలోనే తుపాకి పట్టడం, మహిళల మహాశక్తిని కూడా గుర్తింపునకు తేవడం గొప్ప విషయమే. అయితే అది ఆమె విప్లవ జీవితంలో ఆరంభ ఘట్టం. తుపాకి పట్టుకుని మనకు కనిపించే ఫొటోలో ఆరుట్ల కమలాదేవి, ప్రియంవద ఇంకా కొందరు వీరనారులున్నారు. కమలాదేవి వంటివారు శాసనసభా నాయకులు కూడా అయ్యారు. జీవితపు ఒడుదుడుకుల లోనూ కుటుంబ సమస్యలు సవాళ్లలోనూ ఆరోగ్య సమస్యలలోనూ చాలామంది కూరుకుపోయారు. ఒక దశలో తుపాకి గొట్టమే నినాదంగా వచ్చిన, కొన్ని పోరాటాలలో పాల్గొన్న పలువురు మహిళలు ఇప్పుడు పాలక పార్టీలలో ప్రముఖంగా దర్శనమిస్తుంటారు. అధినేతల స్తోత్రపాఠాలు వల్లిస్తుంటారు. వ్యక్తిగత ప్రచారానికి పాకులాడుతుంటారు. మల్లు స్వరాజ్యం జీవితం వీటన్నిటికీ భిన్నం. ఆమె అర ఘడియైనా ఆశయపథం తప్పలేదు. కర్తవ్యం మరవలేదు. ఇంటి బాధ్యతలు, ఇతర సమస్యలు వెంటాడినప్పుడు కూడా తనతో తను పోరాడి మళ్లీ పాత చైతన్యం పునర్జ్వ లింపచేసుకుంది. అమ్మగా అగ్రభాగాన నిలిచింది. విప్లవ పోరాట నాయకుడూ తర్వాత చట్టసభల సభ్యుడైన అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డికి తీసిపోని విధంగా తనూ నాయకత్వం అందించింది. పార్టీ పదవులలో ఒక మెట్టు పైనున్న భర్త వెంకట నరసింహారెడ్డి కన్నా పాపులర్ అనిపించుకుంది.
ఎందరో అమ్మలు... అభిమానాలు
వ్యక్తిగతంగా ఈ ముగ్గురూ నాకు చాలా సన్నిహితం. నాన్న నరసింహయ్య అంతకుమించి అమ్మ లక్ష్మమ్మ సీనియర్ నాయకులు కావడం నన్ను మరింత దగ్గర చేసింది. ప్రజాశక్తిలో చేరిన తొలిరోజులలో 'మా లక్ష్మమ్మ కొడుకువా...?' అంటూ ఆమె దగ్గరకొచ్చి ఆప్యాయంగా పలకరించారు. తర్వాత కాస్త రిజర్వుడుగా ఉండే వి.ఎన్ గంభీరంగా సంచరించే బి.ఎన్ ఇద్దరిపైనా చలోక్తులు వేసేంత చనువుండేది. వి.ఎన్ అంత పెద్ద విగ్రహం నాతో వచ్చి హౌటల్లో ప్లేటు మీల్స్ చేస్తుంటే జోక్ వేసేవాణ్ని. ప్రజాశక్తి వారపత్రికలో మల్లు స్వరాజ్యం పేరుకు అనుగుణంగా ఉండాలని బొమ్మారెడ్డిగారు మల్లు నరసింహారెడ్డి అని రాస్తుండేవారు. ఆయనకేమో ఎం.వి. నరసింహారెడ్డి అని రాసుకోవడం అలవాటు. 'ఆమె కోసం నా పేరు పూర్తిగా రాయరా' అని నవ్వేసేవారు (నిజానికి బి.ఎన్, వి.ఎన్ అంతే). 2006లో తెలంగాణ పోరాట 60వ వార్షికోత్సవ వేదికపై ఈ అన్నా చెల్లెళ్లనూ అలాగే మరెందరో యోధులను సత్కరించడం గొప్ప జ్ఞాపకం. 2004లో కన్నుమూసిన వి.ఎన్ జ్ఞాపకాలతో ఒక పుస్తకం ఆ వేదికపై విడుదల చేశాం. దానికోసం స్వరాజ్యంగారితో భేటీ అయినప్పుడు వారిద్దరి అనురాగబంధం తొంగిచూసింది. పాత ఫొటోలు తీసినప్పుడు వి.ఎన్ చాలా అందంగా ఉన్నారని నేనంటే 'చాలా బాగుండేవాడు' అని ఆ వీరనారి హాయిగా నవ్వడం ఇప్పటికీ గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా ఇంటికి వచ్చి భోంచేసి మా అమ్మతో మాటలు పెట్టుకునేవారు. అయితే ఎప్పుడూ పార్టీ గురించి, పార్టీ కుటుంబాల గురించే. అమ్మ రెండు మాసాల పాటు ఐసీయూలో ఉండి చనిపోయినప్పుడు కర్నూలు తరలించేందుకు కాస్త ముందు వచ్చేశారామె. 'నాకు చెప్పరా' అని కోప్పడి కడసారి నివాళి అర్పించారు. మల్లు స్వరాజ్యం, మోటూరు ఉదయం, మానికొండ సూర్యావతి, భిక్షావతి గార్లు, అమ్మాజీ ఇలాంటి వారంతా మాకందరికీ అమ్మలే. మానికొండ సూర్యావతిగారి పుస్తకానికి 'మహిళా ఉద్యమ మణిపూస' అని పేరు పెట్టినప్పుడు ఈ మణిపూసలంతా దృష్టిపథంలో ఉన్నారు. నిజానికి వారి ఇంటి పక్కనే లీలా సుందరయ్య గారు. వీరిలో ఒక్కొక్కరు ఎంత త్యాగం, ఎంత సేవాభావం, ఎంత ఆశయబలం, ఎంత అమ్మతనం చూపించారో తల్చుకుంటే బిడ్డగా కళ్లు చెమరుస్తాయి. ఉద్యమ పరంగా చరిత్ర కదలాడుతుంది. అర్థాంగులు కాదు, పూర్ణ స్వరూపులు అని ఇలాంటివారి గురించే అభివర్ణించడం. ఇప్పుడు ఆమె కుమారుడు నాగార్జున రెడ్డి సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా... కోడలు లక్ష్మి ఐద్వా తెలంగాణ కార్యదర్శిగా ఉండటం ఈ వారసత్వానికి ఒక కొనసాగింపు.
ఉద్యమ ఘట్టాలు.. ఉజ్వల అధ్యాయాలు
కమ్యూనిస్టు ఉద్యమం, రాజకీయ కార్యక్రమాలు ఒక పార్శ్యమైతే మహిళా ఉద్యమం ఐద్వా పెరుగుదల మరో పార్శ్యం. 1980లో సూర్యాపేటలో మహిళా మహాసభ కొత్త కదలిక తెచ్చింది. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వంటి వారంతా వచ్చారు. వీరనారి అయిలమ్మను చాలా ఏండ్ల తర్వాత ఆ వేదిక పైకి తీసుకొచ్చారు. అప్పుడు తీసిన ఆమె ఫొటోనే ఇప్పటికీ ఎక్కువగా వాడుకలో ఉంది. అప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వ హయాంలో ఉద్యమాలపై దాడి చాలా ఎక్కువగా సాగుతున్నది. స్వయంగా సుందరయ్య దానిపై పుస్తకం రాశారు. నల్లగొండ జిల్లాలో వీరారెడ్డి, అందె నరసయ్య, సుందరి బసవయ్య వంటి వారు ఘోరంగా హత్య చేయబడ్డారు. వారి సతీమణులు సభలకు వచ్చి మాట్లాడుతుంటే ఉద్వేగం నిండేది. మహిళల ధనమాన ప్రాణాలకు రక్షణలేని స్థితి సహించేది లేదని సబలల సింహగర్జన అని సూర్యాపేట సభకు శీర్షికనిచ్చాం. ఆ స్ఫూర్తికి తొలి ప్రేరణ స్వరాజ్యం తదితరులే. ఆ కాలంలో సంచలనం కలిగించిన రమిజాబీ, షకీలా అత్యాచార ఘటనలతోపాటు వేధింపులు, అత్యాచారాలపై పోరాటంలో ఆమె ముందుండే వారు. ఉద్యమాల నిర్మాణంలోనూ పార్టీ అంతర్గత యంత్రాంగంలోనూ మహిళల పాత్ర సమస్యల గురించి సదా అప్రమత్తంగా ఉండటం అవసరమైన సహాయం అందించడం మరో ప్రత్యేకత.
ప్రజా నాయకురాలుగా ప్రజాప్రతినిధిగా మల్లు స్వరాజ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. పోలీసు స్టేషన్లలో తప్పుడు కేసుల్లో ఇరికించిన కార్యకర్తలను విడిపించడం, ప్రజా సమూహాలతో నాటి పాలక కాంగ్రెస్ నాయకులను సవాలు చేయడం, ఆ తర్వాత సభ జరిపి అనర్గళ స్వరంతో గర్జించడం ఇదే నిత్యకృత్యం. జీవితం లోంచి పొంగివచ్చిన ఆమె భాష, నుడికారం, పోలికలు, ప్రయోగాలు అనితర సాధ్యం. వేదికపై ప్రముఖ నాయకులుండగా జనం స్వరాజ్యం ఉపన్యాసం కోసం కేకలేయడం సర్వసాధారణం. నిజానికి అది ఉపన్యాసం కాదు. ఉప్పొంగే సముద్రం. అందులో చిన్న చితక వివరాలు నిర్వచనాలకు అందని ప్రవాహం. శత్రు శక్తులకు కంపరమెత్తించే పోరాట స్వరం. తెలంగాణలో భూస్వామ్య శక్తులకు ఆమె గొంతు, ఉనికి ఎప్పుడూ సింహస్వప్నమే. అలాంటి వ్యక్తి భూస్వాముల కోట నుంచే శాసనసభకు వెళ్లారు. మరగుదొడ్ల నుంచి సమాన ఆస్తిహక్కు వరకూ అక్కడా మహిళల హక్కులు సాధనకే సమిష్టి పోరాటం నడిపించారు. ఇదంతా తట్టుకోలేకే 1985లో ఆ శక్తులు ఆమెను ఓడించాయి. తర్వాత ఆ స్థానం మళ్లీ గెలవలేదు.
విప్లవమాత వినమ్రత
ఇంత నేపథ్యం, బహుముఖ విజయాలు, ప్రజల్లో చెరగని స్థానం ఉన్నా మల్లు స్వరాజ్యం ఉద్యమంలో భాగంగా ఉన్నారే గాని అతిశయాలు అహంభావాలకు ఎన్నడూ లోనుకాలేదు. మౌలికంగా సమరశీల స్వభావం, దూసుకుపోయే తత్వం. అయినా నాయకులు, మేధావులు, రచయితల పట్ల ఎంతో గౌరవంగా ఉండేవారు. కొత్త విషయాలను అందుకోవాలని తహతహలాడేవారు. ప్రత్యేకంగా వచ్చి చర్చించి నోట్సు రాసుకునేవారు. అధ్యయనం అవసరాన్ని, విధానపరమైన అంశాలను తక్కువ చేసేవారుకాదు. తనకు వేరే భావనలుంటే చర్చించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. అమ్మ గనక అందరినీ కలుపుకుని పోవాలనే తాపత్రయం ఉండేది. తన మనసులో మాట మళ్లీ మళ్లీ చెప్పినా అంతిమంగా తన పార్టీ తీసుకున్న రాజకీయ విధానాన్ని పాటించేవారు. ఉద్యమంలో ప్రత్యేకించి ఆ జిల్లాలో ఒడుదుడుకులు వచ్చినప్పుడు ఐక్యత కాపాడటంలోనూ ముఖ్యపాత్ర నిర్వహించారు. ప్రత్యర్థులకు చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చేవారు. పాటలు కట్టి పాడేవారు. చిందేసేవారు. భావాలలో సూటిదనమే ఆమెకు భావ వ్యక్తీకరణకు శక్తినిచ్చింది. ఆశయబద్దమైన జీవితమే ఆమెకు అచంచలమైన ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఇచ్చింది. నిస్వార్థ ప్రజా జీవితం, నిరాడంబర ఉద్యమ నిబద్దతలే ఆమెను ప్రతివారినీ ప్రేమించే అమ్మగా నిలిపాయి. అమేయమైన ఆమె ఆశయబలమే ఆమెను అరుణతారను చేసింది. ధృవతారగా నిలిపింది. కమ్యూనిస్టు ఉద్యమంలోనే కాదు, తెలుగువారి ప్రజా జీవితంలోనే అత్యంత అరుదుగా నిలిచే ఉదాహరణ మల్లు స్వరాజ్యం జీవితం. పుస్తకాలపై పరిశోధనలు జరిపినట్టే ఆమె లాంటి నారీమణుల పోరాటపథంపై సమగ్ర అధ్యయనం చేస్తే రానున్న కాలానికి అమూల్యమైన పాఠాలు లభిస్తాయి. మరింత మంది స్వరాజ్యాలను తయారు చేసుకోవడానికి మార్గం వేస్తాయి.
- తెలకపల్లి రవి