Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆఫీసు నుండి ఉసూరుమంటూ వచ్చి ఇంట్లో కూలబడ్డాడు శేఖర్. అంతకు ముందే స్కూలు నుండి వచ్చిన పిల్లలు తండ్రి మీద వాలిపోయారు. ఒక్కసారిగా శేఖర్‌కి అలసట తీరినట్లైంది. ఈలోగా భార్య రేఖ టీ తీసుకుని వచ్చింది.
''ఏమండి! కాశ్మీర్ ఫైల్స్ చూద్దామండి!'' అన్నది రేఖ భర్తకు టీ అందిస్తూ.
''అబ్బా - ఇంట్లోకి ఫైల్స్ ఎవరు తెచ్చాడు? నీవెందుకు ఆ ఫైల్స్ తీసుకున్నావు! ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా?'' అని అరిచాడు శేఖర్.
''రేఖ, పిల్లలు అదిరిపడ్డారు!'' శేఖర్ ఇంట్లో అంతగట్టిగా ఎప్పుడూ అరవలేదు.
''అది కాదండి! కాశ్మీర్ ఫైల్స్ అంటే ఆఫీసు ఫైల్స్ కాదు. సినిమా! అందరూ ఆ సినిమా బాగుందంటున్నారు! మనమూ చూద్దామండి!'' అన్నది రేఖ అభ్యర్థిస్తూ...
''సినిమా చూసిన వాళ్ళంతా ఏడుస్తున్నారంటా! హిందువులకు, ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లకు జరిగిన నష్టాన్ని బాగా చూపించారట!'' అన్నది పెద్ద కూతురు.
''మనమూ వెళ్దాం నాన్నా!'' అన్నది చిన్న కూతురు.
ఇక శేఖర్‌కి తప్పలేదు! అంతా వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చారు! ఎవరికీ అన్నం తినాలనిపించటం లేదు! అంతా హాల్లోనే కూచున్నారు.
''నాన్న సినిమాలో చూపింది నిజమేనా?'' అడిగింది చిన్న కూతురు.
''నిజమేనంటా! అందుకే మన ప్రధాని కూడా సినిమా చూడమని పబ్లిసిటీ చేశాడు!'' అన్నది పెద్ద కూతురు.
''మీ నాన్న ఏమీ మాట్లాడటం లేదు!'' అన్నది రేఖ. శేఖర్ వంక చూస్తూ..
''ఏం మాట్లాడాలి! ఇలాంటి సినిమాల గురించి కొద్దిగా మాట్లాడితే చాలదు! అందుకే చాలానేమాట్లాడాలి!'' అన్నాడు శేఖర్.
''ఆ సినిమాలో చూపినట్లు ముస్లింలంతా దేశద్రోహులేనా నాన్నా?'' పెద్ద కూతురు సందేహం!
''టెర్రరిస్టులైన ముస్లింలు, కాశ్మీర్‌లోయ నుండి కాశ్మీర్ పండిట్లను వెళ్ళగొట్టడం చూస్తే చాలా బాధన్పించింది. ఈ క్రమంలో కొన్ని వేల మంది కాశ్మీరీ పండిట్లు చిత్రహింసల పాలయ్యారు. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోవటం చూస్తే గుండె తరుక్కుని పోయింది!'' అన్నది రేఖ బాధగా.
''దేశ భక్తికి, దేశద్రోహానికి, కులం, మతం ఉండవమ్మా! కాశ్మీర్లో ఉన్న ముస్లింలంతా దేశద్రోహులూ కాదు, కాశ్మీరీ పండిట్లంతా దేశభక్తులూ కాదు!'' అన్నాడు శేఖర్.
''మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థంకావటం లేదు!'' అన్నది రేఖ.
''ఇందులో అర్థం కానిదేమీ లేదు! ఒక మతంలోని వాళ్ళంతా ఒకే విధంగా ఉండరని చెబుతున్నారు. ముస్లిముల్లో కూడా మౌలానా అబ్దుల్ కలాం, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడినవారున్నారు! హిందువుల్లోనూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని రాసిచ్చి, జైలు నుండి బయటపడ్డ సావర్కర్, గాంధీని రివాల్వర్‌తో కాల్చి చంపిన గాడ్సేలు ఉన్నారు కదా!'' అన్నాడు శేఖర్.
''సినిమాకీ మీరు చెప్పేదానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు'' అన్నది రేఖ.
''సినిమాలో కాశ్మీర్లో జరిగిన అంశాలను వక్రీకరించి చూపారు. కాశ్మీర్‌లోని ముస్లింలంతా టెర్రరిస్టులని చూపించారు. అంతేకాదు ముస్లింలు అంతా హిందూ కాశ్మీరీ పండిట్లను చిత్రహింసలు పెట్టినట్లు వేలాది మంది చంపినట్లు చూపించాడు. అది వాస్తవం కాదు. కాశ్మీర్ ముస్లింలలో కొందరు మాత్రమే దారితప్పి టెర్రరిస్టులయ్యారు. మిగిలిన వారంతా దేశం పట్ల ప్రేమతోనే ఉన్నారు. ముస్లిం ట్రెరరిస్టులు హిందువులనూ, సిక్కులనూ హింసిస్తుంటే, ఆ హిందూ సిక్కులను అనేకులైన ముస్లిం ప్రజలు ఆశ్రయం ఇచ్చి కాపాడారు! ఈ క్రమంలో టెర్రరిస్టుల చేతిలో ఎందరో ముస్లింలు కూడా ప్రాణాలు కోల్పోయారు! అందుకే దేశద్రోహానికీ, దేశభక్తికీ కుల మతాలు ఉండవని చెప్పాను'' అన్నాడు శేఖర్.
''అంటే సినిమాలో చూపిందంతా నిజం కాదా?'' అడిగింది పెద్ద కూతురు.
''కొంత మాత్రమే నిజం! టెర్రరిస్టు దాడుల్లో 89మంది కాశ్మీరీ పండిట్లు మాత్రమే చనిపోయారని, ముస్లింలు, సిక్కులు మొదలైన వారు 1635 మంది చిపోయారని ఆర్టీఐ చట్టం కింద ప్రభుత్వమే సమాచారం ఇచ్చింది. సినిమా నిజమా, ఆర్టీఐ చట్టం నిజమా అని మనమే నిర్ధారించుకోవాలి.''
''ఏదేమైనా కాశ్మీరీ పండ్లిపైనా దాడులు జరిగాయి కదా! అదే సినిమాలో చూపించారు!'' అన్నది రేఖ.
''కాశ్మీరీ పండిట్లపై దాడులు జరిగితే సినిమా తీశారు. సరే! అసత్యాలూ, అర్థసత్యాలూ చెప్పకూడదు కదా? మరి గుజరాత్‌లోనూ 2002లో దాడులు జరిగాయి. దానిమీద సినిమా తీస్తే ప్రభుత్వం, సినిమాను విడుదల చేయనిస్తుందా? కరోనాలో వేలాది మంది వలస కూలీలు పొట్టచేతబట్టుకుని వందల కిలో మీటర్లు పాదయాత్రలు చేశారు. దానిమీద సినిమాలు తీస్తే ఏం జరుగుతుంది? పవిత్రమైన గంగానదిలో వందలాది శవాలు తేలాయి. ప్రభుత్వ వైఫల్యం ఇందుకు కారణం. దీనిపై సినిమా తీస్తే ఒప్పుకుంటారా?'' ప్రశ్నించాడు శేఖర్.
రేఖ ఏమీ మాట్లాడలేదు. కాని చిన్న కూతురు మాట్లాడింది.
''1990 సంవత్సరంలో కాశ్మీరులో ఏం జరిగిందో చెప్పాలని సినిమా తీశామని అంటున్నారు కదా..!''
''నిజమే! 1990లో ఏమి జరిగిందో, 2002లో ఏమిజరిగిందో 1857లో ఏమిజరిగిందో, 1947లో ఏమి జరిగిందో తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. ఈ చరిత్ర ఇదివరకే హిస్టరీ కాంగ్రెస్‌లో నమోదై ఉన్నది. అది చదువుకుంటే తెలుస్తుంది. ఆ చరిత్ర తెలియకూడదని చరిత్రను మార్చి రాయటం, మార్చి సినిమాలు తీయటం చేస్తున్నారు! ఇది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతోనే మొదలు కాలేదు. శివాజీ, వివేకానందుడు, భగత్‌సింగ్ లాంటి వారి చరిత్రలను కూడా మార్చే ప్రయత్నాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే గాంధీ హత్యపై జరిగిన విచారణ ప్రతులను కాల్పించివేశారు. నాధూరాం గాడ్సే నేర నిరూపణ తెలియకుండా కుట్ర పన్నారు. ఇప్పుడు గాడ్సే సినిమా కూడా వస్తోంది!'' అన్నాడు శేఖర్.
''ఇట్లా చరిత్రను ఎందుకు మార్చుతున్నారు! దానివల్ల ఏమి లాభం?'' ప్రశ్నించింది చిన్న కూతురు.
''చరిత్ర నిజమైతే, అందులో ఎవరి పాత్ర ఏమిటో ప్రజలు అర్థం చేసు కుంటారు. చరిత్రలో ఏ పాత్రలేని బీజేపీ లాంటి వారు తమకు అనుకూలంగా చరిత్రను మార్చుకుంటారు. అంతే కాదు, ప్రజలు ఐక్యం కాకుండా వారిని చీల్చటానికి ఇలాంటి ఫైల్స్ రాస్తుంటారు, సినిమాలుగా తీస్తుంటారు. ప్రజలను ఏదో ఒక ఉన్మాదంలోనే ఉంచాలని, తద్వారా తమ అధికారం కొనసాగించుకోవాలని కుట్రలు పన్నుతుంటారు! అందుకే మనమంతా వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలి'' అన్నాడు శేఖర్.
''అవును! నాన్న చెప్పింది నిజం! అమ్మా అన్నం పెట్టు ఆకలేస్తోంది!'' అన్నారు పిల్లలు.
- ఉషాకిరణ్,
సెల్: 9490403545