Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేల ఏండ్లుగా ఈ దేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ నడుస్తూ ఉంది. అందువల్ల మనకు లభించే చరిత్ర కూడా ఆ మనువాద వ్యవస్థలోంచి వచ్చిందే అయివుంటుంది. మరి నిజమైన అసలు చరిత్ర తెలుసుకోవడం ఎలా? అంటే, మనకు మనం విషయాన్ని హేతువుతో కడిగి శుభ్రం చేసుకుని, అర్థం చేసుకోవాలి. అందుకు మన వివేకాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు చరిత్ర గ్రంథాల్లో చత్రపతి శివాజీ రక్తం కక్కుకుని మరణించాడని నమోదయి ఉంది. యుద్ధంలో చనిపోవాలి. లేదా ప్రమాదవశాత్తు చనిపోవాలి. లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో నైనా చనిపోవాలి. అంతే గాని, ఎవరైనా ఉన్నఫళంగా రక్తం కక్కుకుని చనిపోయారంటే, ఎవరో ఏదో కుట్ర చేశారని అర్థం. అది మరెవరో కాదు, మనువాదులైన బ్రాహ్మణులే. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం క్షత్రియులకే రాజయ్యే అర్హత ఉంది. కానీ, ఇక్కడ శూద్రుడైన శివాజీ చక్రవర్తి అయ్యాడు. అది బ్రాహ్మణ వర్గానికి ఇష్టం లేదు. ఆ కారణంగా.. పట్టాభిషేకం చేయడానికి ఆ ప్రాంతంలోని బ్రాహ్మణులెవరూ ముందుకు రాలేదు. చివరకు వారణాసి నుండి గాగాభట్టును పిలిపించారు. ఆయన అసలు పేరు విశ్వేశ్వర భట్టు. ఆయనకు 'విదో నారాయణ' అనే బిరుదు ఉంది. వారణాసిలో పెద్ద పేరున్న బ్రాహ్మణ పండితుడు. ఆయన శివాజీకి పట్టాభిషేకం చేస్తూ చేతితో తిలకం దిద్దకుండా, కాలి బొటనవేలితో దిద్ది అవమానించాడు. పైగా క్షేత్రపతి అయిన రాజును ఛత్రానికి పరిమితం చేశాడు. ఛత్రపతి అంటే గొడుకు ధరించిన వాడని అర్థం. రాజుగా ఆయన అధికారం గొడుగు పరిధిలోనే ఉండాలని అన్యాపదేశంగా చెప్పడం. శివాజీ భోంస్లేను రాజుగా ఆమోదించడానికి బ్రాహ్మణ వర్గానికి మనస్కరించలేదు. ఆ విషయం ప్రతి అంశంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
మౌర్యుల చివరి రాజైన బృహద్దత్ మౌర్యుని - అతని దగ్గర సేనాపతిగా ఉన్న పుష్యమిత్ర శృంగుడనే బ్రాహ్మణుడు కుట్రపూరితంగా హత్య చేయడం దగ్గర నుండి శివాజీ, అతని కుమారుడు శంభాజీ హత్యల వరకు - అంతా మనువాదుల కుట్రలేనన్నది ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. కుట్రలు చేయడంలో బ్రాహ్మణ మనువాదుల్ని మించిన వారు లేరు. చరిత్రను నిశితంగా అధ్యయనం చేసి విశ్లేషించుకుంటే నిజాలు బయటపడతాయి. ఛత్రపతి శివాజీ తన 50వ యేట, ఏప్రిల్ 3, 1680న రక్తం కక్కుకుని చనిపోయాడని చరిత్రలో నమోదయ్యింది. కానీ, అది అర్థ సత్యం. శివాజీ కొడుకు శంభాజీ అధికారం చేపట్టగానే తన తండ్రి విష ప్రయోగం వల్ల చనిపోయాడని ప్రకటించాడు. అంతే కాదు, అందుకు కుట్ర పన్నిన బ్రాహ్మణ మంత్రుల్ని ఉరితీయించాడు. వారు - అన్నాజీ దత్తో సచిన్; దత్తో జి పంత్; నీలో సోండియో; బాలజీ అవజీ - అసలు శూద్రుడయిన శివాజీ భోంస్లే చక్రవర్తి కావడమే గిట్టని బ్రాహ్మణ మనువాదులు - శంభాజీ భోంస్లేపై మరింత కక్ష పెంచుకున్నారు. అసలే ఆ కుటుంబంపై పగతో రగిలే వారికి శంభాజీ రాజు చర్య మరింత ద్వేషాన్ని పెంచింది. తమ బ్రాహ్మణ వర్గీయుల్ని శంభాజీ ఉరితీయించాడన్న అక్కసు వారిని ఊరికే ఉండనివ్వలేదు. ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రయత్నించసాగారు.
ఆ కక్షకు మరో కారణం కూడా ఉంది. శివాజీ తన పెద్ద కొడుకు శంభాజీకి కేశవ్ పండిత్ దగ్గర చదువు చెప్పించాడు. ఆ రోజుల్లో ఆయన పేరు మోసిన పండితుడు. శంభాజీకి సంస్కృతం, హిందుస్థానీ భాషలు నేర్పించడమే కాక, పురాణ గ్రంథాలు కూడా చదివించాడు. విద్యావంతుడైన శంభాజీ పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. బ్రాహ్మణులకు మాత్రమే అందాల్సిన విద్యని శూద్రుడయిన శంభాజీ భోంస్లే దక్కించుకున్నాడని మనువాదులు మరింతగా మండిపడ్డాడు. గతంలో శివాజీని తర్వాత శంభాజీని చంపడానికి బ్రాహ్మణవర్గం పథకాలు రచించింది. ఔరంగజేబుకు తప్పుడు వార్తలు మోసింది. ఆయనను రెచ్చగొట్టి శంభాజీపైకి ఉసిగొల్పింది. మొఘల్ చక్రవర్తి సహాయంతో బ్రాహ్మణులు శంభాజీని దారుణంగా చంపించారు. కనుగుడ్లు పీకించారు. తల మొండెంతో వేరయ్యేట్లు నరికించారు. అప్పటికి శంభాజీ వయసు 31 సంవత్సరాలు. తమను వ్యతిరేకించిన వారికి ఏ గతి పడుతుందో అందరికీ తెలియడానికి శంభాజీరాజు తలను ఒక కర్రకు గుచ్చి, ఊరేగిస్తూ ఆనాటి బ్రాహ్మణ వర్గం విజయోత్సవాలు చేసుకుంది. ఈనాటికీ ఆ పద్ధతి మహారాష్ట్రలో 'గుడిపడవా'గా వాడుకలో ఉంది. శంభాజీ తలకు చిహ్నంగా ఒక కర్ర చివర చెంబు బోర్లిస్తారు. అందరికీ బాగా కనబడేట్లు చెంబు కింద పట్టు గుడ్డ కట్టి, దాన్ని పూలతో అలంకరించి - ఆ కర్రను ఊరేగిస్తారు. తర్వాత దాన్ని ఇంటిమీద పెడతారు. లేదా కిటికీలలో పెడతారు. ఈ ఆచారం శంభాజీ మరణం తర్వాత, 1689లో ఆరంభమైంది. దీన్నే 'గుడి పడవా' పర్వదినంగా జరుపుకుంటారు. ఇక్కడ తెలుగునాట ఉగాది జరుపుకునే రోజే అక్కడ మహారాష్ట్రలో గుడిపడవా జరుగుతుంది.
మరాఠా రాజు శంభాజీ - మరాఠీ, సంస్కృతం, హిందుస్తానీ భాషలు నేర్చుకున్నాడు. ఆయా భాషల్లో రచనలు ప్రకటించాడు. 'బుద్ధ భూషణం' అనే సంస్కృత రచనకు మంచి గుర్తింపు వచ్చింది కూడా! అందులోనే ఆయన తన తాత షాహాజీ భోంస్లేకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తండ్రి శివాజీ మహారాజును అవతార పురుషుడిగా చిత్రించుకున్నాడు. అందుకే కాబోలు ఇప్పటికీ మహారాష్ట్ర ప్రజలు శివాజీని తమ ఆత్మగౌరవ ప్రతీకగా భావించి గౌరవించుకుంటారు. ''నాయిక ఖేధ్'' ''సాల్ సతక్'' వంటి గ్రంథాలతో పాటు ''నక్షిక'' అనే గ్రంథం హిందుస్తానీ భాషలో రాశాడు. మనువాదుల కుట్ర ఫలితంగా యుక్తవయసులోనే అతి కిరాతకంగా చంపించబడ్డప్పటికీ - అప్పటికే శంభాజీ విశిష్ట సాహిత్య సేవ చేయగలిగాడు. మరీ ముఖ్యంగా రాజకీయ కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత.
మహారాష్ట్రలో జరుపుకునే గుడి పడవాకు శివాజీ, శంభాజీ రాజుల చారిత్రక నేపథ్యం ఉంది. దాని పక్కనే ఉన్న గోవాలో కొంకణి ప్రజలు 'సంవత్సర్ పడ్వో' పేరుతో జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో ఉగాదిగా జరుపుకునే ఈ పండగని కేరళలో 'విషు', పంజాబ్‌లో 'వైశాఖి' తమిళనాడులో 'పుతాండు'గా - పశ్చిమ బెంగాల్లో 'పహలా బైశాఖ్'గా - ఇలా వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. అంతే కాదు, నేపాల్, మయన్మార్, మలేసియా, సింగపూర్, కంబోడియాలలోనూ వేరు వేరు పేర్లతో జరుపుకుంటారు. మనువాదులు ఏర్పరిచిన పండగలన్నీ ఇతరుల చావులతో ఏర్పరుచుకున్నవే.హింసాత్మకమైనవి, అమానవీయమైనవి. పురాణ కల్పిత పాత్రలు రావణుడు చస్తే పండగ, హౌళిక చస్తే పండగ. అలాగే చారిత్రక పురుషుడైన శంభాజీ రాజును చంపించామని పండగ! ఈ మనువాదులు మానవత్వాన్ని, మానవీయ విలువల్ని బతికించింది ఎక్కడీ అందుకే చెప్పేది... ప్రతి విషయాన్ని మానవీయ కోణంలో పునఃనిర్వచించుకోవాల్సి ఉందని! మొఘలులైన ముస్లింలను మనువాదులు చక్రవర్తులుగా అంగీకరించారు. క్రైస్తవులైన బ్రిటిష్‌వారి అధికారాన్ని అంగీకరించారు. భారతీయుల్లో శూద్రులయిన వారు రాజ్యాధికారం దక్కించుకుంటే మాత్రం భరించలేక పోయారు. నిమ్నవర్గాల వారు ఎప్పటికీ బానిసలుగానే ఉండాలి. వారి కష్టం మీద తాము సునాయసంగా బతుకుతూ ఉండాలన్నది వారి సిద్ధాంతం! బయటి వారు ఎవరు అధికారం చేపట్టినా సరే, 'జీ హుజూర్' అంటూ దేబరిస్తారు. కానీ, నిమ్నవర్గం వాడు రాజయితే మాత్రం, వాడిని రాజుగా అంగీకరించలేరు. అదీ వారి ధర్మం? అదీ వారి సమస్య! తర్వాత కాలంలో కొందరు శూద్రులుకూడా మనువాదుల ఆలోచనా ధోరణిని అనుకరిస్తూ, వారి లాగే మూర్ఖంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అది ఇప్పుడు మన సమకాలీన సమాజంలోనూ గమనిస్తున్నాం.
గుడి పడవా - అంటే బ్రహ్మధ్వజమనీ, ఈ విశ్వాన్ని బ్రహ్మ సృష్టించాడని చెప్పడానికి సూచనగా అలా ధ్వజాన్ని ప్రదర్శిస్తామని - మనువాదులు మళ్ళీ కథలు సృష్టించి ప్రచారం చేశారు. ఈ విషయాలన్నీ బ్రహ్మపురాణంలో రాయబడ్డాయని కూడా చెపుతారు. కానీ, మరి అదే ధ్వజాన్ని - 'ఇంద్ర ధ్వజం' అని ఎందుకు అన్నారూ? అదీగాక, పద్నాలుగేండ్లు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు, పట్టాభిషక్తు డయ్యాడన్న దానికి సంకేతంగా గుడిపడవా ప్రదర్శిస్తారని కూడా చెపుతారు. ఒకదానితో మరో దానికి పొంతనలేని పిట్టకథలు కల్పించి చెప్పడం వల్లనే అవన్నీకల్పితాలని, అబద్దాలని తేలిపోయింది. శంభాజీ రాజు తల నరికి కర్రకు గుచ్చి ఊరేగించడమే నిజం! ఆ చారిత్రక అంశాన్ని తప్పుదారి పట్టించడానికి, కప్పి పుచ్చుకోవడానికి మనువాదలు చిత్ర విచిత్రమైన అభూత కల్పనలు ప్రచారం చేశారని అర్థం అవుతూనే ఉంది. భ్రమల్లో బతక కుండా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటూ ఉండాలి!
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి వారి ఐ.టి.సెల్ జనం మీదికి పుంఖాను పుంఖాలుగా అబద్దాల్ని గుప్పిస్తోంది. దేశ నాయకుల నుండి కింది స్థాయి నాయకుల దాకా అహేతుకమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు వారి స్థాయిని వారు మరిచిపోతే పోయారు. కానీ, ప్రజల స్థాయిని తక్కువగా అంచనా వేస్తున్నారు. అది క్షమించరాని నేరం! అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 'స్పెషల్ సోషల్ మీడియా సెంటర్'ను ప్రారంభించారు. ఇది అక్కడి రాష్ట్ర పోలీసు డిపార్టుమెంటు ఆధ్వర్యంలో నడుస్తుంది. అబద్దపు వార్తల్ని (ఫేక్‌న్యూస్ / వీడియోస్) ప్రచారం చేసేవారినీ - జాతి, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఈ సెంటర్ పసిగడుతుంది. చట్టానికి అప్పగించి, శిక్షపడే విధంగా చూస్తుంది.
ఈ సెంటర్ స్థాపనకు, కావల్సిన శాస్త్ర, సాంకేతిక పరికరాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 10,285కోట్లు కేటాయించింది. ఇలాగే ఫేక్ న్యూస్ నివారణకు బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసికట్టుగా ముందుకు వస్తే దేశాన్ని అబద్దపు వార్తల నుండి రక్షించుకోవచ్చు. ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది మంచిపాలన ఇవ్వమని, ఉపాధి కల్పించమని, హంగర్ ఇండెక్స్‌లో దిగజారి ఉన్న దేశ పరిస్థితిని మెరుగు పరచమని... అంతేగాని, ఎప్పటికప్పుడు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోమని కాదు! ఉక్రేయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని కూడా భారత కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకోవడం చూస్తున్నాం!
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమి విజేత, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు