Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు కాశ్మీర్లో పరిస్థితులేమిటో, ఇక్కడ ప్రజలు అనుభవిస్తున్న విషాదాలేమిటో వాటిని ఉన్నవి ఉన్నట్టు చిత్రీకరించడం అవసరం. ఆ విధంగా చెప్పేటప్పుడు చారిత్రక వాస్తవాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కానీ, ఈ చిత్రంలో (కాశ్మీరీ ఫైల్స్) ఆ విధంగా చూపినట్టు లేదు. నిజాన్ని ఒక కంటితోటే చూడలేరు. రెండు కళ్ళనూ ఉపయోగించాలి. ఆ నిజాలను అనేక కళ్ళు స్వయంగా చూశాయి. అవే అసలైన తీర్పు చెప్తాయి.
గత కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ అనేక విషాద పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. ఆ విషాదాలన్నింటి లోకీ అత్యంత విషాదకరమైనది వలసలు పోవలసి రావడం, భయం కారణంగా స్వంత గృహాలను వీడిపో వలసి రావడం. కాశ్మీరీ సమాజంలో ఒక గుర్తింపు, ప్రాధాన్యత ఉన్న కాశ్మీరీ పండిట్లు. ఆ విధంగా భయంతో కాశ్మీర్ లోయను విడిచిపెట్టిపోవలసి వచ్చింది. ఇది మన చరిత్రలో ఒక విషాదకర అధ్యాయం. అందులో సందేహం లేదు. హింసకు పాల్పడిన శక్తులు ఎవరు ఏ మతానికి చెందినవారో, ఎవరు ఏ కులానికి చెందిన వారో, ఎవరి విశ్వాసాలేమిటో చూడలేదు. వాళ్ళు బౌద్ధుల్ని చంపారు, హిందువుల్ని చంపారు, ముస్లిములనీ చంపారు. అన్నింటికన్నా ఘోరం, వాళ్ళు మరణశయ్య మీద ఉన్న వృద్ధుడు, పండితుడు అయిన మౌలానా మసూద్‌ని కూడా చంపారు. మీర్వైజ్ కశ్మీర్ మౌలానా ఫరూక్‌ను ఎవరి బుల్లెట్లు బలి తీసు కున్నాయి? ఆ హత్య అనంతరం ఆయన అంతిమయాత్రలో వందలాది మంది సామాన్య జనం పాల్గొన్నప్పుడు వారిని తుపాకులతో ఎవరు కాల్చి చంపారు? ఆ కాల్పులలో మరణించినవారు చేసిన నేరం ఏమిటి? ఇది కూడా కాశ్మీర్ ముఖ చిత్రంలో రెండో పార్శ్వమే.
హెచ్.ఎం.టి. జనరల్ మేనేజర్ ఖేరా సాహెబ్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. అదే సమయంలో కాశ్మీర్ యూనివర్సిటీ ఉప కులపతిగా ఉన్న ముషిరుల్ హక్ సాహెబ్‌ను, అతని ఆంతరంగిక కార్యదర్శి అబ్దుల్ ఘనీ సాహెబ్‌ను సైతం ఆ ఉగ్రవాదులు విడిచిపెట్టలేదు. పెద్దగా పలుకుబడి లేని, రాజకీయాలతో సంబంధంలేని సామాన్య ప్రజానీకాన్ని సైతం వాళ్ళు విడిచిపెట్టలేదు. మా కాశ్మీరీ సోదరి శీతల్ కౌల్ శ్రీనగర్‌కు చెందిన మహిళ. ఆమె ను క్రూరంగా హత్య చేశారు. అనంతనాగ్‌లో ప్రేమ్ నాథ్ భట్‌ను, గులాం నబి క్వాలర్ సాహెబ్‌ను అంతం చేశారు.
ఈ రోజున అధికారాన్ని చెలాయిస్తూ, వేరువేరు చోట్ల కాశ్మీరీ రక్తంతో వ్యాపారం చేస్తున్న పెద్ద మనుషుల్ని నేనొకటే అడుగుతున్నాను. ఈ వ్యవహారాన్ని ఇక ఆపివేయండి. చంపినదెవరు? చనిపోయినదెవరు? చనిపోయినవారంతా నా బంధువులే. నాకత్యంత ఇష్టులైనవారూ మరణించారు. మా కుటుంబ పెద్దలూ ఆహుతయ్యారు. చనిపోయినవారి పేర్లేమిటి? వాళ్ళు ఏ గ్రూపునకు చెందినవాళ్ళు? చనిపోయిన వారంతా కాశ్మీరీయులే. వాళ్ళంతా నావాళ్ళే. వాంధామాలో జరిగిన దారుణం మరిచిపోలేనిది. అదే విధంగా గావ్కదల్ దుర్ఘటన కూడా మరిచిపోగలిగేది కాదు. బుద్గాంలో అమాయకులైన మైనారిటీలు హత్య కావించబడ్డారు. కుప్వారాకు వస్తున్న బస్సు మీద ఎవరు కాల్పులు జరిపారు? పండిట్ల కుటుంబానికి చెందిన ఒక అమాయక మహిళను సోపోర్‌లో ఎవరు మానభంగం చేసి చంపివేశారు? కునన్ పోష్పోరా సంఘటనలో ఎవరి మానాల్ని ఆ అర్థరాత్రి దోచుకున్నారు ?
ఇప్పుడైనా మన ప్రధానమంత్రి కాస్త ధైర్యాన్ని ప్రదర్శించాలని నేను కోరుతున్నాను. దక్షిణాఫ్రికాలో జాతివివక్ష పాలన అనంతరం అక్కడి కొత్త ప్రభుత్వం వాస్తవాలేమిటో బైటకు తీసి సామరస్యాన్ని నెలకొల్పడానికి ఒక కమిషన్‌ను నియమించింది. అదే విధంగా కాశ్మీర్ ప్రజలలో విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పడానికి ఒక కమిషన్‌ను నియమించండి. ఎవరు చంపారు, ఎవరు మరణించారు అన్నది తేల్చమనండి. చనిపోయిన వారెలాగూ తిరిగిరాలేరు. కాని వారి మరణాలకు బాధ్యు లెవరన్నది తేలాలి కదా? మరణించినవారి కుటుంబ సభ్యులైనా తమ వారెందువలన చనిపోయారో తెలుసుకోగలగాలి.
మన శాసనసభ స్పీకర్‌ను, శాసనసభ్యులను కూడా నేనడుగుతున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలెందుకు సంభవించాయి? వారినెవరు చంపారు? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని అన్నందుకు వారు మరణించారు. అత్యంత దారుణంగా చంపబడిన మొదటి వ్యక్తి నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్త మహమ్మద్ యూసఫ్ హల్వారు. ఆగస్టు 15న బ్లాకౌట్ పాటించాలని ఉగ్రవాదులు ప్రకటించారు. దానిని వ్యతిరేకించినందుకు వారతడిని చంపారు. ఇప్పుడు మీరతడిని ఎవరి పక్షం వైపు ఉన్నట్టు పరిగణించనున్నారు? అతడి మతం బట్టి లెక్కలు వేస్తారా? కాశ్మీరీయులు చిందించిన రక్తంతో సాగిస్తున్న ఈ రాజకీయ వ్యాపారం దేశానికి చేటు తెస్తుంది. అది కాశ్మీర్‌కు సైతం చేటు తెస్తుంది.
దేశంలో అధికారాన్ని చెలాయిస్తూ పలుకుబడి కలిగివున్న పెద్దల ముందు నేను మరోసారి స్పష్టం చేయదలుచుకున్నాను. కాశ్మీర్ కేవలం ఒక భూభాగపు పేరు మాత్రమే కాదు. కాశ్మీర్ ఒక జీవన విధానం. ఒక నాగరికత. అయిదువేల సంవత్సరాల చరిత్ర మాకుంది. దానిని ఈ భూమ్మీద ఏ శక్తీ చెరిపివేయజాలదు. అది దేశానికి వెలుపలి శక్తి అయినా సరే, దేశంలోని శక్తి అయినా సరే. మా అస్తిత్వం, మా జీవనవిధానం కొంతమందికి భయం కలిగించవచ్చు. మమ్మల్ని మేము పరిరక్షించు కోకుండా, మమ్మల్ని మేము నిలబెట్టుకోకుండా అడ్డుకునే శక్తి మాత్రం ఏదీ లేదు.
కాశ్మీరీ పండిట్లను కొందరిని చంపివేసిన మా ప్రాంతంలోనే బిజ్బెహరా ఉదంతం కూడా జరిగింది. అందులో ప్రశాంతంగా నమాజ్ చేసుకుంటున్న వారిని కూడా చంపివేశారు. ఎక్కడ హిందువులు చనిపోయారో, అక్కడ ముస్లింలు కూడా చనిపోయారు. చిట్టిసింగ్పురాలో సిక్కు సోదరులు కూడా మరణించారు. ఆ సిక్కు బిడ్డల కళ్ళల్లో జాలువారిన కన్నీరు మానవత్వపు కన్నీరు. కాశ్మీరీ ఫైల్స్ చిత్రం తీసిన వారిని, దేశ పాలకులను నేనొకటి అడుగుతున్నాను. ఆ బిడ్డల కళ్ళ వెంబడి కారిన కన్నీటి రంగు ఏమిటి? ఆ కన్నీళ్ళను కూడా ఏదైనా మార్కెట్లో అమ్మకానికి పెడతారా? ఇక చాలు! ఆపండిక!
అశోక్ మరణించాడు. హజన్ యూసఫ్ కూడా మరణించాడు. బషీర్ అహమ్మద్ కూడా మరణించాడు. ఎవరు వీళ్ళంతా? నాకత్యంత ఆప్తులైనవారు మరణించారు. వీళ్ళందరూ నా బంధువులే. వాళ్ళని నేను విభజించలేను. వాళ్ళు దేవాలయానికి వెళ్తారా లేక మసీదుకి వెళ్ళారా అన్నది ప్రాతిపదిక కాదు.
(తరిగామిని ఈ సమయంలో ఒక విలేకరి ఇలా అడిగాడు: కాశ్మీర్‌ను వదిలిపెట్టి వలసపోయిన మొదటి వ్యక్తి మీరేనని, అక్కడి నుంచి మీరు జమ్ము వెళ్ళాక అక్కడ కూడా మీపై దాడులు జరిగాయని, జమ్ముకు వలస వచ్చిన కాశ్మీరీ పండిట్లను మొట్టమొదట ఎదురేగి ఆదరించినది మీరేనని మేం విన్నాం. ఇందులో నిజమెంత ?)
1989లో అప్పటికి నేను కనీసం ఒక గ్రామ సర్పంచ్‌ను కూడా కాదు. ఇక ఎమ్మెల్యే అయ్యే ప్రసక్తే అప్పటికి లేదు. ఆ కాలంలోనే కొంతమంది మా ఇంటికి వచ్చి ఘెరావ్ చేశారు. నేను అప్పుడు మా ఇంటిని వదిలిపెట్టాల్సి వచ్చింది. అక్కడి నుంచి నేను జమ్ము వెళ్ళాను. అక్కడ సెక్రటేరియట్లో ఉద్యోగిగా ఉన్న ఒక కాశ్మీరీ పండిట్ ఇంట్లో నాకు ఆశ్రయం లభించింది. గాంధీనగర్‌లో నేను ఉండేందుకు ప్రభుత్వం చోటు కల్పించినదాకా నేనక్కడే ఉన్నాను. కాశ్మీరీ పండిట్లు తమ నివాసాలను విడిచిపెట్టి జమ్ము వచ్చినప్పుడు వారి నిస్సహాయతను స్వయంగా చూసిన మొదటి వ్యక్తిని నేను. ప్రభుత్వం వైపు నుండి వారి పట్ల ఏ విధమైన శ్రద్ధా కానరాలేదు. ఏ మద్దతూ లభించలేదు. వారికి ఉండేందుకు ఏ చోటూ దొరకలేదు. వారిని ఒక ఊరేగింపుగా ప్రభుత్వ వసతిగృహానికి తీసుకువెళ్ళి ఆ గృహపు తలుపులు తెరవమని నేను డిమాండ్ చేశాను. ''వాళ్ళు కాశ్మీరీ ప్రజలు. వాళ్ళేమీ అడుక్కునేవాళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడికి విహారయాత్ర కోసం రాలేదు. వాళ్ళు ఇక్కడికి భయంతో వచ్చారు. వాళ్ళు మిమ్మల్ని అర్థించరు. వాళ్ళ హక్కుల్ని డిమాండ్ చేస్తారు. ఇక్కడ భద్రత కల్పించడం మీ బాధ్యత'' అని అధికారుల్ని నేను డిమాండ్ చేశాను. ఆ కాశ్మీరీ పండిట్లందరికీ, ఆ సోదరీ సోదరులందరికీ ఈ సంఘటన గురించి తెలుసు.
ఇంక నేనేం చెప్పాలి? నా బంధువులెందరో చనిపోయారు. అశోక్ నా బంధువు. నా ఉద్యమ సహచరుడు. ఇంకా చాలా మంది చంపబడ్డారు. నాకు పిల్లనిచ్చిన మామని చంపివేశారు. నా మేనల్లుడినీ చంపేశారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వలీ మహమ్మద్ ఐటును కూడా చంపేశారు. శాసనసభ్యుడు గులాం నబి దర్ని కూడా చంపేశారు. పుల్వామాలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే లను చంపేశారు. గులాం కాదిర్ ఒక ఎమ్మెల్యే. ఆయన్ని పుల్వామాలో చంపేశారు. ఈ మరణాలన్నింటినీ ఏ ఖాతాలో వేయాలి నేను?
ఈ దేశంలోని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మహానుభావులారా! మా కన్నీళ్ళను, మీ ఓట్ల కోసం విభజించకండి. ఈ గడ్డ మీద మరణించినవారందరూ మావాళ్ళే. మా కాశ్మీరీయులే. ఈ రోజు కాశ్మీర్ యావత్తూ నష్టపోతోంది. మా అస్థిత్వం దెబ్బతింటోంది. మా జీవనవిధానం దెబ్బతింటోంది. మేమంతా ఒక తాటిపైకి వచ్చి మా ఇంటిని మేమే చక్కదిద్దుకోడానికి పూనుకునే వరకూ ఈ విధంగానే జరుగుతుంది. ఈ దుఃఖం మా అందరిదీ. ఈ దుఃఖం కాశ్మీరీ పండిట్లది, సిక్కులది, ముస్లింలది, పాత్రికేయులది, లాయర్లది, సామాన్య కార్మికులది, నిరుపేదలది, మన సోదరీమణులది. మా కన్నీళ్ళను దయచేసి విభజించకండి.