Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతా సూత్రాన్ని పసితనంలోనే గమనించి సాధించి చివరకు ఆస్పత్రిలో కూడా అదే ఆశయంతో సందేశం ఇస్తూ.. అస్తమించిన మల్లు స్వరాజ్యం చిరస్మరణీయురాలు. ఆమె నిత్యజీవితంలో అడు గడుగునా శ్రామికవర్గ దృక్పథమే కనిపిస్తుంది.
అది పశ్చిమగోదావరిజిల్లా భీమవరం పట్టణం... పెద్దకాలువ పెద్దవంతన దగ్గర పడవల రేవుగట్టు. పశ్చిమగోదావరిజిల్లా సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్త మత్స్య కార్మిక సంఘం నాయకులు కె. నాగయ్యవర్మను ఆయన స్వగ్రామంలోనే భూపోరాటంలో భూస్వాములు హత్య చేసిన సందర్భం. సరిగ్గా ఆ సమయంలోనే మానికొండ సూర్యావతి గారితో కలసి స్వరాజ్యం మహిళా సంఘం విస్తృత సమావేశాలకు పాలకొల్లు వచ్చారు. స్వరాజ్యంగారిని తీసుకుని నేను వర్మగారి సంతాప సభకు ఆయన స్వగ్రామం పడవలో వెళ్ళాను. రెండువేల మందితో పెద్ద సంతాప సభ జరిగింది. ఆ సభలో స్వరాజ్యంగారి ప్రసంగం వినాల్సిందే గాని మాటల్లో చెప్పలేము. ''భూమిలేని నిరుపేదలకు ఇవ్వాల్సిన ప్రభుత్వ లంకభూములు మీ సొంతం. మీదగ్గరికి వచ్చిన దోపిడీ భూస్వాములను తరమితరిమి కొట్టండి. మీవెంట మేముంటాము. దున్నేవాడిదే భూమి''అని నినాదాలిచ్చారు ఆమె. ఆ సంతాప సభ నిరుపేద శ్రామికులకు గొప్ప ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యంగా వీరతెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా చిన్నారి స్వరాజ్యం పసితనంలోనే ఆ ప్రజాపోరాటానికి మద్దతు కూడగడుతూ మద్రాసు నుండి విజయనగరం వరకూ ఆంధ్రా ప్రాంతమంతటా పెద్ద పెద్ద సభల్లో లక్షలాది మందికి తన కంచు కంఠంతో సందేశమిచ్చారు. తెలంగాణ ప్రజలపై ఆనాడు సాగిన రాక్షస కృత్యాలు, హింసలు, ఘోర హత్యలు వివరించి చెపుతూ పర్యటించారు. ఆమె ప్రసంగాలు ప్రజలను ఉర్రూతులూ రించాయి. ప్రజలు స్పందించి దోసిళ్ళ కొద్దీ విరాళాలు ఆమె ఒడిలో పోసారు. ఆ సందర్భంగా స్వరాజ్యంగారు వస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని విద్యార్థి సంఘం, అప్పుడు విద్యార్థి నాయకులుగా ఉన్న అల్లూరి సత్యనారాయణగారు వగైరా విద్యార్థులందరూ వందలాది మందిని ఆ సభకు కదిలించారు. స్వరాజ్యంగారంటే ఎవరో పెద్ద నాయకులు అనుకుని స్వాగత ఏర్పాట్లు చేశారట! తీరా వచ్చాక లంగా జాకెట్టుతో ఉన్న చిట్టి స్వరాజ్యాన్ని చూసి నమ్మలేకపోయారట. ఈ విషయం అల్లూరిగారి జ్ఞాపకాల్లో రాసుకున్నారు. అంతటి పసితనం నుండి జీవిత చరమాంకం వరకూ ఆరోగ్యం శిథిలమైనా శరీర బాధలతోనూ పోరాడుతూ కర్ర చేతపట్టుకుని సభలకు హాజరవుతూ దోపిడీ వ్యవస్థ అంతం కోసం ప్రజారాజ్యం ఏర్పాటు కోసం శ్రామిక వర్గ రాజ్యం సాధన కోసం తన బలమైన సందేశం ఇస్తూనే ఉన్నారు.
హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద నిర్మాణమైన ఐలమ్మ ట్రస్టు భవనంలోనే ఒక గదిలోనే స్వయంగా వంట చేసుకుంటూ ట్రస్టు ద్వారా సామాజిక సేవల కోసం ఆ భవనంలోనే నివాసం ఏర్పరుచు కున్నారు. ఆ ట్రస్టు కోసం తన శక్తి సామర్థ్యాలన్నీ ధారబోసి ప్రభుత్వం ద్వారా సాంక్షన్ చేయించారు. అనునిత్యం హైదరాబాద్ ఐద్వా నాయకత్వంలో ఆ సెంటర్ అద్భుతమైన సేవలు అందించింది.
ఒకసారి అల్లూరిగారిని చూడటానికి వచ్చి ఆయన మంచం దగ్గర కూర్చుని ఎన్నో ఆరోగ్య సలహాలిచ్చారు. ఆ మహాతల్లి తన కన్నబిడ్డల్ని కుటుంబాన్ని పార్టీకి ఆస్తిగా ఇచ్చి అస్తమించారు. స్వరాజ్యంగారి జీవిత చరితం అజరామజరం. ఈ దోపిడీ వ్యవస్థ అంతానికి అందరం కలసి కృషి చేయడమే ఆమెకు మనమిచ్చే నివాళి. స్వరాజ్యం గారికి జేజేలు.