Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివరిసారిగా 2 వేల రూపాయల గులాబీ రంగు కరెన్సీ నోటును మీచేత్తో ఎప్పుడు పట్టుకున్నారు? 'ఫ్రంట్ లైన్' ఈ ప్రశ్నను కొంతమందిని అడిగితే ఒకే విధమైన సమాధానం (చాలా నెలల క్రితం లేదా దాదాపు సంవత్సరం క్రితం) వచ్చింది. 2016 నవంబర్ నెలలో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో విడుదలైన రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్లో కనిపించడం లేదు. ఏటీఎంలలో ఈ నోట్లు చాలా అరుదుగా అందుబాటులో ఉంటున్నాయి, బ్యాంకుల్లో కూడా అవి కనుమరుగు అవుతున్నాయి. ఈ కరెన్సీ నోట్లు నల్ల ఆర్థిక వ్యవస్థ (బ్లాక్ ఎకానమీ) ఏర్పాటుకు ఆజ్యం పోస్తున్నాయనీ, వాటిని నేరగాళ్ళు, కుంభకోణాలకు పాల్పడే దొంగలు భారీగా సేకరిస్తున్నారని పౌరసమాజం భావిస్తుంది. ఈ పెద్దనోట్లు కనిపించకపోవడం వెనుక ఉన్న నిజాలను వెలికి తీసేందుకు, సమాచార హక్కు చట్టం కార్యకర్త అయిన మనోరంజన్ ఎస్ రారు, ఈ విషయాన్ని సీబీఐ చేత విచారణ చేయించాలని కోరుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక ఉత్తరం రాశారు. అదే ఉత్తరాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కూడా పంపుతూ, రారు ఆర్బీఐ అక్కౌంట్ పుస్తకాలపై సందేహాలను వ్యక్తం చేశారు.
రారు చెప్పేదాని ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం, రెండు వేల రూపాయల నోట్ల సరఫరా, 'భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేటు లిమిటెడ్' బెంగళూరు, 'నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్', 'బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్'ల నుండి జరుగుతుంది. కానీ ఆ మూడు ముద్రణాలయాల నుంచి సరఫరా అయిన నోట్ల వివరాలు, నివేదికలో చూపిన సరఫరా సంఖ్యలు భిన్నంగా ఉన్నాయి. ఆర్బీఐ చూపించే చలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య, ఈ మూడు నోట్ల ముద్రణాలయాల నుండి సరఫరా అయిన నోట్ల సంఖ్యను మించి ఉంది. 2017 నుండి 2021 వరకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1217.33 కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసింది. అయినా అవి మార్కెట్లో కనిపించవు. మరి, ఆ నోట్లు ఎక్కడ ఉన్నట్టు? దీన్ని గురించే విచారణ చేయించాలని రారు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. బాగా మాసిపోయిన, చినిగిపోయిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ తీసేసి ఉంటుందన్న వాస్తవాన్ని ఎవరైనా పరిగణలోకి తీసుకున్నాగానీ, మార్కెట్లో మిగిలిన నోట్లు పెద్ద సంఖ్యలో చలామణిలో ఉండాలి. ఇంత ఉన్నత విలువ కలిగిన ఈ కరెన్సీ నోట్లను దాచి పెట్టడం చాలా తేలికైన పని. నల్లడబ్బును పోగేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని రారు, అడ్వొకేట్ సచిన్ మనోహర్ బంద్కర్ కూడా సంతకం చేసిన ఉత్తరంలో కోరారు.
ఆర్బీఐ నివేదికలకు విరుద్ధంగా, రెండు వేల రూపాయల నోట్ల చలామణిని నిలిపి వేసినట్లు ప్రభుత్వం గత సంవత్సరం సూచనప్రాయంగా చెప్పింది. మార్చి 2021లో నాటి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, గడచిన రెండు సంవత్సరాలుగా రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను ముద్రించడంలేదని లోక్‌సభలో తెలిపాడు. 3,362 మిలియన్ల విలువచేసే రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లు మార్చి 30, 2018 నాటికి చెలామణిలో ఉన్నాయని ఠాకూర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు, అంటే మొత్తం కరెన్సీలో వాటి పరిమాణం 3.27శాతం. కానీ ఫిబ్రవరి 26, 2021 నాటికి 2,499 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి అంటే మొత్తం బ్యాంక్ కరెన్సీ నోట్ల పరిమాణంలో 2.01శాతం మాత్రమే.
ఏదైనా బ్యాంక్ నోట్ల ముద్రణ చేయాలంటే, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్బీఐతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. 2019-20, 2020-21 సంవత్సరాలలో రెండు వేల రూపాయల కరెన్సీ నోట్ల ముద్రణకు ఎటువంటి ఇండెంట్ పెట్టలేదని అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పాడు. రెండు వేల రూపాయల నోట్ల చలామణి బాగా తగ్గిపోయిన విషయం, అవి ఏటీఎంలలో కూడా అందుబాటులోలేని విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందా, లేదా? అనే అంటూ ఎండీఎంకే ఎంపీ అవినాశి గణేషమూర్తి అడిగిన ప్రశ్నకు ఠాకూర్ సమాధానం ఇస్తూ... నవంబర్, 2021 నాటికి మొత్తం బ్యాంక్ నోట్లలో రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లు కేవలం 1.75శాతం (అంతకుముందు 8 నెలల క్రితం 2.01శాతం ఉన్నాయి) మాత్రమే ఉన్నాయని అన్నాడు.
జనవరి 2019లో, రారు(ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే 'సెంట్రల్ ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో', విచారణ చేయాలని దాఖలు చేసిన తన దరఖాస్తును నిరాకరించిన తరువాత) బొంబాయి హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిల్) దాఖలు చేశారు. పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో చలామణిలో ఉన్నవాటి కంటే ఎక్కువ ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను ఆర్బీఐ వసూలు చేసిందని రారు పిటిషన్ పేర్కొంది.
సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన ఆర్బీఐ నివేదికలను (ఏప్రిల్ 1, 2000 నుండి మార్చి 31, 2018 వరకు) అధ్యయనం చేసిన తరువాత, పైన ఉదహరించబడిన కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్ల విలువ 14.11 లక్షల కోట్లు. కానీ అతికొద్ది కాలంలో, అంటే 2016లో పెద్దనోట్ల రద్దు తరువాత బ్యాంకులు 15.28 లక్షల కోట్ల విలువ చేసే ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను వసూలు చేశాయి. అంటే1.16 లక్షల కోట్లు అదనంగా వసూలు చేశాయి. ఈ విషయంలో ఒక కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేసే విధంగా ఒక స్వతంత్ర సంస్థ విచారణ చేయాలని రారు కోరారు.
చాలా సంవత్సరాలుగా భారీగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి తాను పిటీషన్ వేశానని, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బు దుర్వినియోగం అవుతుంది కాబట్టి వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని రారు అన్నారు. అంతేకాకుండా, సమాచార హక్కుచట్టం ద్వారా పొందిన ఆర్బీఐ నివేదికలు, ఇతర డాక్యుమెంట్లను ఉదహరిస్తూ, ఆర్బీఐ ముద్రించిన నోట్ల కంటే ఎక్కువ నోట్లను ఉనికిలో లేకుండా ధ్వంసం చేసిందని రారు అన్నారు. ఆయన చెప్పినదాని ప్రకారం, 2000-2018 మధ్య కాలంలో ఆర్బీఐ, కరెన్సీనోట్ల ముద్రణాలయాలు ముద్రించిన నోట్ల కంటే అదనంగా పాడైపోయిన, చినిగిపోయిన కరెన్సీ నోట్లను ఉనికిలో లేకుండా ధ్వంసం చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి స్థిరంగా, ఉనికిలో లేకుండా చేసే కరెన్సీ నోట్ల సంఖ్య ప్రెస్‌లు ముద్రించే కరెన్సీ నోట్ల సంఖ్య కంటే చాలా ఎక్కువ అని, రారు పిటిషన్ పేర్కొంది. 2000-2018 మధ్య కాలంలో 37,523 ఐదు వందల కరెన్సీ నోట్లను ముద్రించారు కానీ, 39,875 కరెన్సీ నోట్లను ధ్వంసం చేశారని రారు పిటిషన్ తెలిపింది. చట్టబద్ధంగా ముద్రించబడిన నోట్ల కంటే కూడా పాడైపోయి, చిరిగిపోయి ధ్వంసం చేయబడిన కరెన్సీ నోట్ల వాటి సంఖ్య చాలా ఎక్కువ అని ఫిబ్రవరి 26, 2020న బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఆర్బీఐ బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది.
నవంబర్ 8, 2016 న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆజ్ఞలు జారీ చేశాడు. నోట్ల రద్దు వలన ప్రజలకు కలిగిన ప్రయోజనాలు ఏమిటని, రారు రాసిన ఉత్తరం ఒక చర్చకు తెరలేపింది. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి, రెండు వేల రూపాయల నోట్లను విడుదల చేసిన ఐదు సంవత్సరాల తరువాత కూడా నోట్ల రద్దు చర్య చారిత్రక తప్పిదమని, ఇప్పటికీ ప్రజలు భావిస్తున్నారు. ఆ సమయంలో దాదాపుగా ప్రతీ భారతీయుడు డబ్బు కోసం ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు అనివార్యంగా బారులుతీరి నిలబడాల్సి వచ్చింది. బారులుతీరి నిలబడిన వారిలో అనేకమంది చనిపోయారు. ఈ పెద్ద నోట్లరద్దు చర్య, ఆ సమయంలో 85శాతం పైగా చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను లేకుండా చేసింది. ఈ చర్య ఫలితంగా ఏర్పడిన కొరతను అధిగమించేందుకు రెండు వేల రూపాయల కరెన్సీ నోట్ల ప్రవాహాన్ని మార్కెట్లోకి వదిలారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం, (నగదు రహిత భారతదేశాన్ని తయారు చేయాలనే ఆలోచనను ప్రచారం చేస్తూ) ''డిజిటల్ ఇండియా'' అనే ఒక కొత్త ఊతపదాన్ని కనిపెట్టింది. అయినా, పెద్ద నోట్లు రద్దైన ఆరు సంవత్సరాల తరువాత కూడా భారతదేశంలో ఆర్థిక లావాదేవీలలో నగదు చాలా కీలకమైన పాత్రను పోషించడం కొనసాగుతూనే ఉంది. డిజిటల్ వ్యవస్థలోని లొసుగులు ''డిజిటల్ ఇండియా'' కలను ఇబ్బందులకు గురిచేయడం కొనసాగి స్తూన్నాయి. కరెన్సీని రహస్యంగా దాచే ఉద్దేశ్యంతోనే వెయ్యి రూపాయల కరెన్సీ నోట్ల స్థానంలో ఎక్కువ విలువ కలిగిన రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను తీసుకొచ్చారని అనేక మంది అప్పుడే హెచ్చరించారు. కానీ ప్రభుత్వం వారి మాటలను పట్టించుకోలేదు.
ఐదు సంవత్సరాల కాలం గడిచిన తరువాత రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను దాచి పెడుతున్నారు కాబట్టి ఆ నోట్లను చెలామణిలో లేకుండా క్రమంగా నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పార్లమెంటులో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను నిలుపుదల చేస్తే, ఏదైనా ఒక సర్క్యులర్‌ను ప్రభుత్వం ఖచ్చితంగా జారీ చేయాల్సి ఉంటుందని రారు అంటారు. పెద్దనోట్లను రద్దు చేసినట్లు ఆకస్మికంగా, ఏకపక్షంగా ప్రకటించినట్లే, రెండు వేల రూపాయల కరెన్సీ నిలుపుదల నిర్ణయం ప్రకటన కూడా ఏకపక్షంగా ఉండకూడదు. పెద్దపెద్ద బాంబులు పేల్చే ఏకపక్ష నిర్ణయాల ప్రకటనలు ప్రస్తుత ప్రభుత్వం యొక్క లక్షణంగా మారింది. పెద్దనోట్లరద్దు, వస్తువులు, సేవల పన్నులు (జీఎస్టీ), కరోనా వ్యాప్తి కారణంగా విధించిన ఆకస్మిక లాక్డౌన్ నిర్ణయాలు ఎవరితోనూ చర్చించకుండా తీసుకున్న ఫలితంగా వాటి దుష్ప్రభావాలు మిలియన్ల సంఖ్యలో భారత ప్రజల జీవితాలపై పడ్డాయి.
- దివ్యా త్రివేది
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, సెల్: 9848412451