Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇదే రీతిలో వాడు పసిపిల్లాడైనా, ముసలోడైనా మాకు సంబంధం లేదు. తగ్గేదే లేదు, గల్లీ మే సవాల్... కరిచి పారేస్తామంటూ తొడగొడుతున్నాయి వీధి కుక్కలు. వాటితో కరిపించుకున్న బాధితులందరూ లబోదిబోమంటూ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కోసం కుక్కల దవాఖానాలకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో కుక్క కరిచిన బాధితుడు... నగర పాలక సంస్థ వారికి ఫిర్యాదు చేసి, సదరు కుక్క గార్ని పట్టించేందుకు ప్రయత్నించారు. ఆ గ్రామ సింహాన్ని (కుక్కలకు గ్రామ సింహాలనే పేరు కూడా ఉంది) బంధించేందుకు మున్సిపాల్టీ వారు నానా తిప్పలు పడుతుండగా...ఓ నడి వయస్కురాలు అక్కడికొచ్చి దాన్ని బంధించటానికి వీల్లేదంటూ గొడవకు దిగారు. దాన్ని ఎందుకు బంధించకూడదో చెప్పాలని మున్సిపాల్టీ సిబ్బంది అడగ్గా... 'కుక్కలు మాత్రం ప్రాణులు కావా..? వాటికి మాత్రం హక్కులుండవా...? వాటి హక్కుల్ని హరిస్తే మేం చూస్తూ ఊరుకోవాలా...' అంటూ యమ సీరియస్ అయ్యారు. పైగా తమ బ్లూ క్రాస్ సంస్థ (అక్కినేని అమల నాయకత్వంలో జంతువుల హక్కుల పరిరక్షణ కోసం నడుస్తున్న సంస్థ) వాటికి ఏ మాత్రం హాని జరిగినా ఊరుకోబోదని హెచ్చరించారు ఆవిడ. దాంతో కుక్కతో పిక్కలు పట్టించుకుని ముక్కుతూ మూలుగుతూ ఉన్న బాధితుడు కలుగజేసుకుని... 'మేడమ్.. కుక్కలు, వాటి హక్కుల గురించి మీరు మాట్లాతున్నారు బానే ఉంది. కానీ దాని దంతాల దెబ్బకు నా పిక్క ఊడొచ్చింది. ఇప్పుడు నెల రోజులపాటు నేను ఆఫీసుకు సెలవు పెట్టి... ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ వ్యాక్సిన్లు పొడిపించుకుంటున్నా. మరి నా పరిస్థితి, నెల రోజుల సెలవులు పెడితే నా జీతం పరిస్థితి ఏమిటి...?' అంటూ అశోక వనంలో సీతమ్మలా వాపోయారు. సో.. అమలా మేడమ్... జర ఇలాంటి బాధితుల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి...
- కెఎన్ హరి