Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామాయణంలో చెప్పే కిష్కిందకాండ గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో మన పూర్వీకులైన వానరాలు (కోతి నుంచే మనిషి ఆవిర్భవించాడని సైన్సు నిర్దారించింది) చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలో సైతం వివిధ పల్లెలు, పట్టణాల్లో కిష్కిందకాండ కొనసాగుతూ ఉన్నది. రాష్ట్రం వచ్చిన కొత్తలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... 'వానలు రావాలే.. కోతులు అడవులకు వాపస్ పోవాలే...' అంటూ ఉత్సాహపరిచారు. అడవులు తరిగిపోవటంతో కోతులు అరణ్యాలను, అభయారణ్యాలను వదిలి... జనారణ్యంలోకి వచ్చి నానా గోల చేస్తున్నాయి. ఈ క్రమంలో పంట చేలను పాడు చేస్తూ పాడి పశువుల మీదికి సైతం ఎగబడుతున్నాయి. మొన్నా మధ్య ఒక ఊళ్లో గంపకిందున్న కోడిని, గంప లేపి మరీ మెడకొరికి చంపేశాయి. ఆ కోడిపెట్టిన గుడ్లను గోడకేసి కొట్టి చిందరవందర చేశాయి. కొన్ని వానరాలైతే గుడ్లను పగులగొట్టి... లోపలున్న సొన నాకేసి మనుషుల మీదికి డొప్పలను విసురుతున్నాయి. పలు జిల్లాల్లో కోతులు కరుస్తున్నాయనే ఫిర్యాదులూ వస్తున్నాయి. ఇక దేవాలయాల దగ్గరైతే అవి చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. పూజకు సమర్పించే కొబ్బరి కాయలు, అరటి కాయలు ఏదైనా సరే.. ముందు మన తాతలకు (కోతులకు) సమర్పించిన తర్వాతే... పూజారికి సమర్పించుకోవాల్సి వస్తున్నదంటూ భక్తులు వాపోతున్నారు. కేసీఆర్ చెప్పినట్టు వానలు మంచిగానే కురుస్తున్నాయి.. హరితహారంలో భాగంగా చెట్ల సంఖ్య కూడా బాగానే పెరిగిందంటూ ప్రభుత్వం చెబుతున్నది. కానీ కోతులు మాత్రం వాపస్ పోవట్లే. జర... వీటి నుంచి తమను రక్షించాలంటూ వానర బాధితులు సర్కారుకు మొరపెట్టుకుంటున్నారు...
- బి.వి.యన్.పద్మరాజు