Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని... అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని... మారదు లోకం మారదు కాలం... దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమయిపోనీ... మారదు లోకం మారదు కాలం...'' 'గాయం' సినిమా కోసం సమాజం మీది కసితో సిరివెన్నెల సీతారామశాస్త్రి చల్లిన నల్లసిరా మరకలు అవి. ఆయన ఏ ఉద్దేశ్యంతో రాసారో కానీ, ఇప్పటికీ అవి అక్షర సత్య నిష్థూరాలే! పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా పెరుగుతున్నాయి. సెంచరీలు దాటి మండుతున్నాయి. వంటగ్యాస్ సహస్రం దాటింది. ఆర్టీసీ బస్ టిక్కెట్లు, కరెంటు చార్జీలు పెరిగాయి. ప్రాణాధార మందుల ధరలూ ఆకాశాన్నంటాయి. టోల్ గేట్ చార్జీలూ పెరిగాయి. వేలకోట్ల భారాలు జనం నెత్తిన పడ్డాయి. అయినా ఎవ్వరిలోనూ చలనం లేదు. అదేదో తమకు సంబంధమే లేని విషయమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ధరలు తగ్గించమని రోడ్లపైకి వస్తే, ఆ మాత్రం భారం మోయలేని 'దరిద్రుడివా' అని ఎక్కడ తమను చిన్నచూపు చూస్తారో అనే ఆత్మన్యూనత పేరుకుపోయినట్టు ఉంది. పైపెచ్చు కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిందని రాష్ట్రంలో అధికారం పార్టీ టీఆర్ఎస్ ధర్నాలు చేయబట్టే! మీరు పెంచిన ఆర్టీసీ, కరెంటు చార్జీలు తగ్గించండంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిగా ధర్నాలు చేయబట్టే! వీరు... వారి మీద... వారు వీరి మీద... నువ్వంటే నువ్వు అంటూ తిట్లూ, శాపనార్థాలు పెట్టుకుంటూ జనాన్ని వెర్రోళ్లని చేయబట్టిరి. అసలు రోడ్డుమీదికొచ్చి వీళ్ళిద్దరి తాట తీయాల్సిన ప్రజలు 'తగ్గేదే లే' అంటూ సినిమా డైలాగులు కొడుతూ... ఏ సినిమా ఎంత కలెక్షన్లు సాధించిందనే బాక్సాఫీసు లెక్కల్ని కోట్లల్లో లెక్కలు కట్టబట్టిరి. 'దొందూ దొందే... తోడు దొంగలు' అని నెత్తినోరు కొట్టుకొని చెప్తున్న ఎర్రజెండాలోళ్ల మాటల్ని పట్టించుకోకపోగా, జనం కోసం వాళ్లు చౌరస్తాలో ఓ అరగంట నిలబడి నినాదాలు చేస్తుంటే చోద్యం చూడటమే తప్ప, వాళ్లతో గొంతు కలుపుదామనే సోయి కూడా లేకపాయే! ఒక్కడితో ఏమవుతుందని ఎవరికి వాళ్లు అనుకుంటే దేశానికి స్వాతంత్య్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేవే కావు. ప్రజలు వేసే ఒక్కో అడుగూ ప్రభుత్వాలను భయపెట్టేలా ఉండాలి. తమ జోలికొస్తే జనం తాట తీస్తారనే భయం పాలకుల్లో కలగాలి. ప్రస్తుతం ప్రజలు ఆ చైతన్యాన్ని కోల్పోయినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో ఓటు వెయ్యడానికే ఇంట్లోంచి రాని జనం రోడ్లమీదికొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తారనుకుంటే అత్యాశేనేమో! మళ్లీ ఓ సినిమా డైలాగుతో ముగిద్దాం...''ఏమిరా బాలరాజు నీవల్ల ఈ సమాజానికి ఉపయోగం!!''
- ఎస్ఎస్ఆర్ శాస్త్రి