Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉగాది పండగ రోజు. పొద్దున్నే బయలుదేరి తిరిగి, తిరిగి మధ్యాహ్నం దాటుతుండగా ఇల్లు చేరాడు యాదగిరి. ఇద్దరు ఆడపిల్లల సహాయంతో ఇంటి పనులు, వంట పనులు అన్నీ పూర్తి చేసుకుని భర్త కోసం ఎదురుచూస్తున్న లక్ష్మికి భర్తను చూడగానే సంతోషమయ్యింది.
''ఏమయ్యా! పండగనాడన్నా ఇంటి పట్టున ఉండకపోతే ఎట్లా! పద తిందువుగాని!'' అంటూ భర్తను లోనికి తీసుకెళ్ళింది. పిల్లలు అప్పటికే తినటానికి సిద్ధంగా ఉన్నారు. పేరుకి పండుగ భోజనం! కాని రోజూ చేసే భోజనమే! ఉగాదిపచ్చడి చేయక తప్పదు కాబట్టి ఒక చిన్న గిన్నెలోనే చేసింది. భోజనం అయ్యాక అందరికీ పచ్చడి పెట్టింది!
పచ్చడి రుచి చూసి అందరూ ఒకే మాటన్నారు.
''పచ్చడి చేదుగా ఉంది!'' అని
''బాగుంది వరస! ఏదో మాయదారి తెగులుసోకి, వేపచెట్లన్ని ఎండిపోతే, వెదికి వెదికి రెండంటే రేండే వేప పువ్వులు తెచ్చి వేశాను. దానికే చేదు ఎట్లా అవుతుంది!'' అంటూనే తనూ రుచి చూసింది లక్ష్మి.
''అబ్బ ఇంత చేదుగా ఉందేమిటీ!'' అంది లక్ష్మి వికారంగా
''చెప్పలా! మేం చెప్పలా!'' అన్నారు తండీ, పిల్లలు ఏకకంఠంతో.
''చాల్లెండి! సంబడం! పెరుగుతున్న ధరల దెబ్బకు జీవితాలే చేదు అవుతున్నాయి. ఇక పచ్చడి లెక్కా పత్రమూ? ఆవునూ అయ్యగారు పొద్దున్న వెళ్ళి ఇప్పుడొచ్చారు! ఏం చేసొచ్చారు?'' అన్నది లక్ష్మి.
''ఇంకేముంది, పంచాంగ శ్రవణం చేసొచ్చాను. ఈ సారి మూడుచోట్ల పంచాగం విని వచ్చాను!'' అన్నాడు యాదగిరి నీరసంగా.
''మూడు చోట్ల విన్నానని నీరసంగా చెప్తారేమిటి?'' అన్నది లక్ష్మి ఆశ్చర్యంగా.
''ఎక్కడెక్కడ ఏమి చెప్పారు! క్లియర్‌గా చెప్పునాన్నా!'' అన్నారు ఇద్దరు పిల్లలు.
''మొదట మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పంచాంగ శ్రవణానికి హాజరయ్యాను. అక్కడ వానలు బాగా కురుస్తాయని, వాగ్దాటి బాగున్నవారికి అంతా బాగుంటుందని, పార్టీలు మారేవారికి మాత్రం మంచి కాలం లేదని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రిగారు చెప్పారు!'' అన్నాడు యాదగిరి.
''మరి తెలంగాణ వడ్లు కేంద్రం కొంటుందో లేదో చెప్పారా?'' అంది లక్ష్మి.
''అట్లాంటివి పంచాంగంలో రాయలేదంట!'' అన్నాడు యాదగిరి.
''ఆ తర్వాత బీజేపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణానికి వెళ్ళాను. అక్కడ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావచ్చని, తలమీద వెంట్రుకలు లేనివారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మెండుగా ఉందని, డబుల్ ఇంజన్ ఇంపాక్ట్ తెలంగాణలో కూడా బాగా పనిచేస్తుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులకు ప్రాణగండాలు వస్తుంటాయని, వాటి నివారణకు నెమళ్ళు పెంచాలని శాస్త్రిగారు చెప్పారు!''
''పెట్రోలు, డీజిలు రెట్లు తగ్గుతాయా. ఎప్పుడు తగ్గుతాయని చెప్పారు?'' అడిగింది లక్ష్మి.
''ఆఁ చెప్పారు! ఏదైనా ఎన్నికలు వస్తే మాత్రమే పెట్రోలు, డీజిల్ ధరలు పెరగటం ఆగుతుందనీ, ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్ళీ పెరుగుతాయనీ చెప్పారు. అంతే కాదు, వచ్చే ఉగాదిలోగా ఇద్దరు దేశభక్తులే దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నీ అధీనం చేసుకుంటారని, వారిద్దరి పేర్లలో 'అ' అనే అక్షరం ఉంటుందని, వారికి అడ్డుపడితే అది దేశద్రోహం అని శాస్త్రిగారు హెచ్చరించారు!'' అన్నాడు యాదగిరి.
''మరి మూడవది ఎక్కడ విన్నావు నాన్నా!'' అన్నారు పిల్లలు.
''కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విన్నాను! ముందస్తు ఎన్నికలు వస్తాయని, 'ర' అక్షరంతో ప్రారంభమయ్యే పేరుగల వారి గోచారం చాలా బ్రహ్మాండంగా ఉందని, వారే ముఖ్యమంత్రి అవుతారని, అయితే టీఆర్ఎస్, బీజేపీ కోవర్టుల దోషం ఉందని, నివారణకు పాదయాత్రలు, సభలు నిరంతరం జరుపుతుండాలని అక్కడి శాస్త్రిగారు చెప్పారు!'' అన్నాడు యాదగిరి.
''కాంగ్రెస్‌పార్టీకి రాహుల్‌గాంధీ అధ్యక్షుడు అవుతాడా, అది చెప్పారా!'' అడిగింది లక్ష్మి.
''అలాంటివి పంచాంగంలో రాయరట!'' అన్నాడు యాదగిరి.
''ఈ మూడు చోట్ల మనలాంటి కష్టజీవుల గురించి, ఏమైనా చెప్పారా!'' అడిగింది లక్ష్మి.
''లేదు! లేదు! కష్టజీవుల గురించి ఈ మూడు చోట్ల ఏమీ చెప్పలేదు! బహుశా వారి పంచాంగాల్లో మన గ్రహచార ఫలితాలు ఏమీ లేవేమో! అందుకే చెప్పలేదేమో!'' అన్నాడు యాదగిరి.
''సర్లేండి! మన రచ్చబండ వద్ద కూడా పంచాంగం చెబుతారంట! అది కూడా వినొద్దాం పదండి!'' అంటూ అందర్నీ రచ్చబండవద్దకు తీసుకెళ్ళింది లక్ష్మి.
అప్పటికే అక్కడికి చాలామంది వచ్చి ఉన్నారు. ఒక పంచాంగం పట్టుకుని ఒక వ్యక్తి రచ్చబండపైకి వచ్చాడు.
''సోదరులారా! ఈ ఏడాది గ్రహచార బలాలు చెబుతాను వినండి! ఈ ఏడాదంతా పెట్రో ధరలు పెరుగుతూనే ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసినా ధరలు తగ్గవు! పెట్రో ధరలు పెరిగినట్లే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతూనే ఉంటాయి. మీరంతా భవిష్యత్‌లో మీ దేశభక్తిని పదే పదే నిరూపించుకుంటూ ఉండాలి! కేంద్ర ప్రభుత్వం మీకు దేశభక్తిని నిరూపించుకునే అవకాశాలు తరచూ కల్పిస్తుంటుంది. ''కాశ్మీర్ ఫైల్స్'' సినిమా చూడటం అలాంటి అవకాశాల్లో ఒకటి! భారతదేశంలో ప్రభుత్వరంగ సంస్థలంటే ఏమిటో, అవి దేశాన్ని ఎలా నిలబెట్టాయో తెలుసుకోవాలంటే అందులో పనిచేసి రిటైరైన వారిని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వమే మాయం చేస్తుంది! మన దేశాన్ని ఏలే నేతలే తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని స్వయంగా ప్రకటిస్తుంటారు. దానర్థం ఏమిటంటే.. ప్రతిపక్షనేతలకు ప్రాణప్రమాదం ఉందన్న మాట! విద్యార్థుల గ్రహచారం పూర్తిగా మారనుంది. ఇక వాళ్ళ సబ్జెక్టులో చరిత్ర ఉండదు. పాలకులే ప్రమోట్ చేసే సినిమాలు, నిషేధించిన సంస్థలు ప్రచురించిన పుస్తకాలే చరిత్ర! ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి, నిరుద్యోగం ప్రబలే కాలమే ముందున్నది! పకోడీలు అమ్ముకునే వారికి తీవ్ర పోటీలు నెలకొని, హే బిడ్డా! ఇది నా అడ్డా! అంటూ గొడ్డళ్ళు తీసుకుని యుద్ధాలు చేసే పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి!'' అంటూ వివరించాడు పంచాంగ కర్త.
''ఆహాఁ ఇది పంచాంగమంటే.. మనలాంటి వారి జీవితాలు కన్పిస్తున్నాయి!'' అన్నాడు యాదగిరి లక్ష్మితో.
''ఏమిటి? నాయనా నీ భార్యను ఏమి అడుగుతున్నావు. నన్నె అడగవచ్చు! నీ సందే హం తీర్చుతాను'' అన్నాడు పంచాంగకర్త.
''స్వామీ! నేను ఇంతకు ముందు మూడు చోట్ల పంచాంగం....
''ఆపు నాయనా! నీది ధర్మ సందేహం! నాకు అర్థమయ్యింది. ఆ మూడు చోట్ల స్పాన్సర్డ్ పంచాంగం శ్రవణం! అందుకే ఆయా పంచాంగాలలో మీలాంటి వారి గ్రహచారము చెప్పరు. ఇది గ్రౌండ్ లెవెల్ పంచాంగం! ఇందు లో మీలాంటి వారి గ్రహచారం మాత్రమే చెప్పబడుతుంది!'' అన్నాడు పంచాంగ కర్త.
''మరి మాలాంటి వారి గ్రహచారాలు బాగుండాలంటే, దోషాలు తొలగిపోవాలంటే నివారణ మార్గాలేమైనా చెప్పండి స్వామి!'' అడిగాడు.
''నివారణోపాయం నేను చెప్పనవసరం లేదు! పంజాబ్ రైతులు నిరుడు చెప్పటమే కాదు చేసి చూపించారు! మీరూ దాన్నే ఆచరించండి!'' అంటూ పంచాంగకర్త పంచాంగం మూసేశాడు.
- ఉషాకిరణ్, సెల్: 9490403545