Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది జాతీయోద్యమ కాలం. ఉషార్పూర్కు గవర్నర్ వస్తున్న సందర్భంగా బ్రిటిష్ పతాకాన్ని తొలగించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని భగత్‌సింగ్, సహచరులు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వం భారీగా సైన్యాన్ని మోహరించి, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థిగా ఉన్న హరికిషన్ సింగ్ సూర్జిత్ ఆ సంఘటనను చూడటానికి వెళ్లాడు. ఉన్నట్టుండి తానే ఆ భవనం మీదికి ఎక్కి బ్రిటీష్ పతాకాన్ని తొలగించాడు. సైన్యం కాల్పులు జరపబోగా ఆనాడు కలెక్టర్‌గా ఉన్న భాఖలే వారించాడు. సూర్జిత్ చిన్నవాడని, కాల్పులు జరపవద్దని నివారించారు. తరువాత సూర్జిత్‌కు నాలుగేండ్లు జైలు శిక్ష పడింది. మూడేండ్ల జైలు అనంతరం ఒక ఏడాది ముందుగానే విడుదల చేశారు. 1934లో ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరారు.
హరికిషన్‌సింగ్ సూర్జిత్ 1916 మార్చి 23న పంజాబులోని జలంధర్ జిల్లాలో జన్మించారు. మీరట్ కుట్రకేసు ముగిశాక ఆయన సోదరుడు సోహన్‌సింగ్ జోష్ జలాలాబాద్‌లో 1934 సెప్టెంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి సూర్జిత్‌ను ఆహ్వానించాడు. 17 మందితో జరిగిన ఆ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు. ఆ విధంగా పార్టీ స్థాపకుల్లో సూర్జిత్ ఒకరు. సూర్జిత్ మొత్తం పదేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఇందులో 1963 - 65లో రెండేళ్లపాటు కాంగ్రెస్ పాలనలోనే జైలు జీవితం అనుభవించారు. తాము కోరిన విధంగా చదువుకొనసాగించ కపోయినా చేపట్టిన పార్టీ మార్గాన్ని విడనాడవద్దని తండ్రి విదేశాల నుంచి సూర్జిత్‌కు లేఖ రాసి ప్రోత్సహించారు. సూర్జిత్ 1953లో మధురై మహాసభలో ఉమ్మడి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత పంజాబ్‌లో పార్టీ పని కోసం పొలిట్‌బ్యూరో బాధ్యతల నుంచి రిలీవయ్యారు. అక్కడ నీటి సరఫరా కోసం ప్రజలపై రూ.142 కోట్ల మేరకు బెటర్మెంట్ లెవీని ప్రభుత్వం విధించగా, దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిపారు సూర్జిత్. తెలంగాణా సాయుధ పోరాటం తరువాత అంత ప్రాధాన్యత గల పోరాటంగా దానిని పార్టీ కేంద్ర కమిటీ తీర్మానంలో పేర్కొంది.
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య త్యాగనిరతి, కామ్రేడ్‌గా నడవడిక, లక్ష్య సాధనకు నిబద్ధతా విశిష్టమైనవని.. ఆయనంటే సూర్జిత్‌కు ఎంతో గౌరవం. 1955లో ఆంధ్రా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన సూర్జిత్ సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావులతో నెల రోజులు గడిపారు. రాష్ట్రమంతటా పర్యటించారు. ఎన్నికల ప్రచారం కోసం సూర్జిత్ పంజాబ్ నుంచి 12 జీపులను తీసుకువచ్చారు. పంజాబ్‌లో కిసాన్ ఉద్యమాన్ని నిర్మించిన సూర్జిత్ అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారు. పార్టీలో అంతర్జాతీయ వ్యవహారాల బాధ్యతలను కూడా నిర్వహించారు. అన్ని సోషలిస్టు దేశాలను, ఇతర దేశాలను సందర్శించారు. పార్టీ 14వ మహాసభలో ఇఎంఎస్ ప్రధాన కార్యదర్శి బాధ్యత నుంచి తప్పుకున్నాక సూర్జిత్ ఆ పదవికి ఎన్నికయ్యారు. సూర్జిత్ భార్య, ఇద్దరు కుమారులు పార్టీలో పనిచేశారు. 2008 ఆగస్టు 1వ తేదీన సూర్జిత్ కన్నుమూశారు.