Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1975 నాటికి కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాపితంగా పోరాటాలు ఉధృతమయ్యాయి. ఈ కాలంలోనే చారిత్రాత్మకమైన రైల్వే సమ్మె జరిగింది. బెంబేలెత్తిపోయిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి పౌరహక్కులను సంపూర్ణంగా హరించి వేసింది. వేలాది మందిని జైళ్ళలో నిర్బంధించింది. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంతో పాటు సీపీఐ(ఎం) కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిపింది. తరువాత 1977 ఎన్నికల్లో జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. సీపీఐ(ఎం) నాయకత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ బెంగాల్, త్రిపురల్లో అఖండ విజయం సాధించింది.
పశ్చిమ బెంగాల్లో రిగ్గింగు ద్వారా 1972లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధఫాసిస్టు భీతావహాన్ని తీవ్రతరం చేసింది. పౌర హక్కులను హరించి వేసింది. బెంగాల్లో అధికార యంత్రాంగం, పోలీసులు, సీఆర్పీ, కాంగ్రెస్ గూండాలు గ్రామాలపై పడి కౌలు రైతులను భూముల నుంచి వెళ్ళగొట్టారు. పంటలను లూటీ చేశారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ కాలంలో పేద రైతులు ఆక్రమించుకున్న భూస్వాముల బినామీ భూములను మళ్ళీ భూస్వాములకు అప్పగించారు. పేదలకు పంచిన సీలింగ్ భూములను కూడా స్వాధీనం చేసుకున్నారు. హత్యలు, దాడులు, అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి. వందల సంఖ్యలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు హత్యలకు గురికాగా, వేలాది మంది తమ నివాస ప్రాంతాలను వదిలి వెళ్ళవలసి వచ్చింది. కేరళలో కూడా సీపీఐ -కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం విస్తృతంగా జరుగుతున్న సమ్మె పోరాటాలపై విపరీతమైన అణచివేతకు పాల్పడింది. ఇదే కాలంలో దేశ వ్యాపితంగా అధిక ధరలు, నిత్యావసర సరుకుల కొరతకు వ్యతిరేకంగా, ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చెయ్యడానికి వ్యతిరేకంగా, వేతనాల పెంపుకోసం, ప్రజాతంత్ర హక్కుల కోసం ఉధృత పోరాటాలు జరిగాయి. 1974 చివరి అర్ధభాగంలో మూడు వారాల పాటు జరిగిన రైల్వే సమ్మె భారత కార్మికోద్యమ చరిత్రలోనే ఒక మైలు రాయి వంటిది. ఇదే సమయంలో జయప్రకాష్ నారాయణ్ బీహార్‌లో అవినీతికి వ్యతిరేకంగానూ, కాంగ్రెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానూ ఉద్యమాన్ని ఆరంభించారు. జనసంఫ్‌ు, కాంగ్రెస్ (ఓ), సోషలిస్టు పార్టీ, ఎస్ఎస్పీ లాంటి పార్టీలు ఈ ఉద్యమంలో భాగస్వాములై జనసంఘర్షణ సమితులను ఏర్పాటు చేశాయి. ఈ సమితుల్లో చేరకుండానే జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంతో సమన్వయం చేసుకోవాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది.
ఒకవైపున ఈ విధంగా దేశ వ్యాపితంగా ఉద్యమాలు చెలరేగడం, అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలై ప్రజాప్రతిష్ట కోల్పోయిన విషయం స్పష్టం కావడం, అలహాబాద్ కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని భయపడటంతో ఇందిరాగాంధీ 1975 జూన్ 26న ఎమర్జెన్సీ విధించారు. పశ్చిమ బెంగాల్‌లోని అర్ధ ఫాసిస్టు భీతావహం దేశమంతటికీ విస్తరిస్తుందని సీపీఐ(ఎం) చేసిన హెచ్చరిక నిజమైంది. ఎమర్జెన్సీ విధించి రాత్రికి రాత్రే జయప్రకాష్ నారాయణ్ సహా వేలాది మంది ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైళ్ళలో వేశారు. సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు వెయ్యి మందికిపైగా అరెస్టు చేయబడ్డారు. అన్ని రకాల సభలు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, పేదల ఇళ్ళను బుల్డోజర్లతో కూలగొట్టడాలు యధేచ్ఛగా సాగాయి. కార్మికులపై పనిభారాన్ని పెంచడం, విచక్షణా రహితంగా పనుల నుంచి తొలగించడం లాంటి చర్యలు సర్వసాధారణమయ్యాయి. కానీ, కొద్ది నెలల్లోనే కార్మికులు, గ్రామీణ పేదలు ఈ అణచివేతను ప్రతిఘటించడం ఆరంభించారు. ఒకవైపున కాంగ్రెస్ నిరంకుశత్వానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం నిర్వహిస్తూనే ఆ ప్రభుత్వం అంతర్జాతీయ రంగంలో తీసుకున్న సానుకూల చర్యలను సీపీఐ(ఎం) సమర్ధించింది. 1976 ద్వితీయార్ధం నాటికి ఎన్నికలు నిర్వహించి విజయం సాధించగలనన్న నమ్మకం ఇందిరాగాంధీకి కుదిరింది. 1977 జనవరి 18న ఆమె లోక్‌సభను రద్దు చేసి, మార్చిలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు మాత్రం చెప్పలేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయప్రకాష్ నాయకత్వంలోని పార్టీలన్నీ జనతా పార్టీగా ఏర్పడ్డాయి. సీపీఐ(ఎం) ఆ పార్టీతో రాజకీయ పొత్తు పెట్టుకోలేదు. సీట్ల సర్దుబాటు మాత్రం చేసుకొంది. ఎమర్జెన్సీని ఎత్తివేత, పౌరహక్కుల పునరుద్ధరణ అనే ప్రధాన అంశం ఆధారంగా వీరు ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఇందిరతో సహా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. జనతాపార్టీ అఖండ విజయం సాధించింది.
పశ్చిమ బెంగాల్ ప్రజలు సీపీఐ(ఎం) నాయకత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్‌కు బ్రహ్మాండమైన విజయం చేకూర్చారు. 1978లో జరిగిన ఎన్నికల్లో త్రిపురలో కూడా సీపీఐ(ఎం)కు అత్యధిక మెజార్టీతో ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో జనతాపార్టీ ఎమర్జెన్సీని రద్దు చేసి పౌరహక్కులను పునరుద్ధరించినప్పటికీ, ఆర్థిక, సామాజిక పరమైన మౌలిక అంశాల్లో తనకు కాంగ్రెస్ పార్టీకి ఏమీ తేడా లేదన్న విషయాన్ని త్వరలోనే రుజువు చేసుకుంది. ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తిని ఇందిరాగాంధి చాకచక్యంగా ఉపయోగించుకోసాగారు.
ఈ పూర్వరంగంలో 1978 ఏప్రిల్ 2 - 8 తేదీల్లో పంజాబులోని జలంధర్‌లో సీపీఐ(ఎం) 10వ మహాసభ జరిగింది. పశ్చిమ బెంగాల్లోను, కొంత తక్కువ స్థాయిలోనే అయినప్పటికీ కేరళలోను కాంగ్రెస్ నియంతృత్వానికి, అణచివేతకు, భీతావహానికి అందరికన్నా ఎక్కువగా గురైన సిపిఎం, దేశవ్యాపితంగా కూడా పౌర హక్కుల ఉద్యమంలో మరింత చొరవ చూపి ఉండాల్సిందని మహాసభ భావించింది. అలా చేసి ఉన్నట్లయితే విస్తృతమైన ప్రజాతంత్ర శక్తులు మరింతగా పార్టీ వెనుక సమీకృతమై ఉండేవని అభిప్రాయపడింది. పార్టీ నిర్మాణం గురించి ప్రత్యేకంగా చర్చించేందుకు ఒక ప్లీనం సమావేశం నిర్వహించాలని కూడా ఈ మహాసభ నిర్ణయించింది.