Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిష్యుడు: బాబోరు నేను తట్టుకోలేకపోతున్నాను గురువుగారూ తట్టుకోలేకపోతున్నాను.
గురువు: ఏం శిష్యా ఏమైంది? ఎందుకంత హైరానా, పెడబొబ్బలు..?
శిష్యుడు: లేకపోతే ఏంటండి. మొసలి కన్నీరు పెట్టుకుంటుందని విన్నాను. కాకి నెమలీక పెట్టుకుని డ్యాన్స్ చేసిందని చదివాను. కాని పులి ఆవులా మాట్లాడటం ఏంటండీ..?
గురువు: సూటిగా చెప్పు శిష్యా.
శిష్యుడు: 'ప్రజల కోసం ప్రతిపక్షాలతో కలసి సాగుతాం' అని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించడం, అదీ రెండవసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలుచేపట్టిన వెంటనే తొలిగా చెప్పడం నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను..!
గురువు: అందులో తప్పేముంది? ప్రజాస్వామ్యంలో అందరం కలసి పనిచేయాలి కదా..!
శిష్యుడు: ఆ... తప్పులేదా..? అవ్వవ్వవ్వ. అంటే బీజేపీ పాలకులు అంతా సవ్యంగానే... ప్రజాస్వామ్యయుతంగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..?
గురువు: మారు మనసు పొందారేమో... అందుకే కేంద్ర మంత్రి గడ్కరీ 'కాంగ్రెస్ బలపడాలి. ఎందుకంటే అది ప్రజాస్వామ్యానికి అవసరం' అని కూడా అన్నారు.
శిష్యుడు: బాబోరు దెబ్బ మీద దెబ్బ, పొద్దున్నే ఎగతాళికి నేనే దొరికానా గురువుగారూ..?
గురువు: నిజమైన ప్రజాస్వామ్యవాది ఏకకాలంలో మూడు ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని అంటాడు అబ్రహం లింకన్
శిష్యుడు: కాస్త వివరించండి..
గురువు: 1. పాలక పక్షం అధికార ప్రతిపక్షాన్ని చట్టసభల్లో ఎదుర్కొవాలి. 2. పాలక పక్షం - స్వపక్షంలోని ప్రతిపక్షాన్ని కూడా ఎదుర్కొవాలి. ఇది ఆంతరంగిక ప్రజాస్వామ్యం 3. పాలక పక్షం - విశాల ప్రజా బాహుళ్యంలోని ప్రజలు, పత్రికలు, మీడియా, కళారంగం, స్వతంత్ర న్యాయవ్యవస్థ చేసే విమర్శలను ఎదుర్కొవాలి. వీటిలో సహేతుకతను స్వీకరించాలి. నిర్హేతుకతను విసర్జించాలి. అందుకే పాలకపక్షానికి ధీటైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ అవశ్యం.
శిష్యుడు: ఇది వినడానికి, చదువుకోవడానికి బాగుంటుంది కాని అమలయ్యేది ఎక్కడండీ..?!
గురువు: పీడితప్రజల ప్రియతమ నేత సుందరయ్యగారు చట్టసభల్లో ప్రతిపక్ష నేతగా మాట్లాడేటప్పుడు ప్రధానితో సహా మంత్రులు, అధికారగణం పొల్లుపోకుండా శ్రద్ధగా వినేవారట. ఆయన వద్ద ఉన్న నిర్దిష్ట సమాచారం దేశాభివృద్ధికి, నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఎంతగానో తోడ్పడేవట. సుందరయ్యగారికి ప్రజల పట్ల ఉండే నిబద్దత, నిజాయితీ, ప్రజాసేవలో నిమగత ఇవన్నీ కూడా కారణం. ఆ తర్వాత పాలకులు తమకు తోచిన పద్దతుల్లో తాము వ్యవహరించేవారు.
శిష్యుడు: హమ్మయ్య, ఇప్పుడు నాదారిలోకి వచ్చారు. అదేనండీ బీజేపీ పాలకులు ఎక్కడికక్కడ బాగా నటిస్తున్నారనేదే నావాదన.
గురువు: ఎవరికైనా ఆచరణే గీటురాయి కదా... ఇక్కడ మళ్ళీ రెండు విషయాలు. 1. ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించడం 2. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకోవడం. ఇప్పుడున్న ప్రజాస్వామ్య శకంలో పాలకులకే కాదు ప్రతిపక్షాలకూ ప్రజలకూ అందరికీ ఇది వర్తిస్తుంది.
శిష్యుడు: ఎలా...?
గురువు: ముస్లిం బాలికలు హిజాబ్ ధరించకుండా యూనిఫాంతోనే కళాశాలలకు వెళ్ళాలని కర్నాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు భంగకరమని కొందరు పెద్దలు అభ్యంతరం తెలిపారు. అందుకు ప్రతీకారంగా హిందూ ఆలయాల వద్ద ముస్లింలు వ్యాపారాలు చేయరాదని, ముస్లింల వద్ద హిందువులు ఏ వస్తువులూ కొనరాదని కొన్ని హిందూ సంఘాలు పిలుపు ఇచ్చాయి.
ఇలాంటి పిలుపుల వల్ల శాంతి సామరస్యాలకు విఘాతం వాటిల్లుతుందని ప్రజాస్వామ్య వాదుల ఆందోళన నిజం కూడా. మత విద్వేషాలు పెచ్చరిల్లడం, హింసా చర్యలు పేట్రేగడం సంభవిస్తాయి. విశేషం ఏమంటే ఇదే విషయాన్ని అదే బీజేపీ ఎంఎల్‌సి విశ్వనాథ్ ఖండించారు. అన్ని మతాల్లోని బడుగు జీవులకు చిన్నా చితక వ్యాపారాలే జీవనాధారం. మతం పేరుతో వారి పొట్టకొడితే ఎలా...?
శిష్యుడు: అదే కదా... నేనిందాకటి నుండి మొత్తుకుంటున్నదీ...
గురువు: ప్రజాస్వామ్యంలో చెప్పేదానికీ, చేసేదానికి తేడా ఉండకూడదు. అంతా పారదర్శకమే. ఇండోనేషియాలో 45లక్షల మంది మలేషియాలో 20లక్షల మంది, యు.ఎ.లో తొమ్మిది లక్షల మంది, ఒమెన్‌లో కువైట్‌లో ఆరున్నర లక్షల మంది చొప్పున, సౌదీలో, ఖతర్‌లో మూడున్నర లక్షల మంది చొప్పున, బహ్రయిన్లో రెండున్నర లక్షల మంది హిందువులు జీవిస్తున్నారు. ఈ ముస్లిం దేశాల్లో హిందువులు మైనార్టీలు. మోజార్టీ మతం వారు ఎక్కడికక్కడ మతం పేరుతో ఆంక్షలు విధించుకుంటూపోతే మైనార్టీలు ఏంకావాలి? ప్రజాస్వామ్యంలో ఇది చెల్లదు. అన్నిటికంటే ముఖ్యంగా దేశాధినేతలకు ప్రజాస్వామ్యయుతంగా స్పందించే గుణం ఉండాలి.
శిష్యుడు: మళ్ళీ ఏదో మెలిక, వివరంగా చెప్పండి.
గురువు: పాలకుల విధానాల వలన ప్రజలకు కలిగే ఈతిబాధల గురించి పాత్రికేయులు రాస్తుంటారు. అది వారి వృత్తి ధర్మం. ప్రజాస్వామ్య బాధ్యత. పాలకవర్గాలకు నచ్చని విధంగా రాస్తున్నారనే కారణంగా అటువంటి పాత్రికేయులు ఒక్కోసారి హత్య గావించబడుతుంటారు. నిజమైన ప్రజాస్వామ్యవాదులు అలాంటి హత్యలను దుర్మార్గాలను నిర్ద్వందంగా ఖండిస్తారు. కానీ గౌరీలంకేశ్ వంటి ప్రముఖ పాత్రికేయురాలు హత్యగావించబడితే ప్రధాని మోడీ సైతం ఖండించలేదన్న విషయం గుర్తుందా...?
శిష్యుడు: గుర్తుంది.. గుర్తుంది.
గురువు: ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు చర్చల సరళి, అభిప్రాయ బేధాలు అందరికీ ఉంటాయి. సహేతుకమైన, గౌరవప్రదమైన నిజాయితీగల చర్చలతో ఎలాంటి పెద్ద యుద్ధాన్నైనా రూపుమాపవచ్చు. ఎంతటి వారైనా చివరకు ప్రజాస్వామ్యం ముంగిట్లోకి రావాల్సిందే. అదే ప్రజాస్వామ్యపు గొప్పతనం.
శిష్యుడు: అవునవును. రష్యా - ఉక్రేన్ యుద్ధం కూడా ఒక కొలిక్కి వస్తున్నది.
గురువు: బాగా గుర్తుంచుకో ప్రజాస్వామ్య గుణం కోల్పోయినవారు మాత్రమే అంతిమంగా యుద్ధాలకు భౌతిక దాడులకు దిగుతారు.
శిష్యుడు: నిజమే. కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని విమర్శించాడని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ వారు దాడిచేశారుగా...
గురువు: ప్రజాస్వామ్యాన్ని పాటించేవారే ప్రజాస్వామ్యన్ని కాపాడతారు. మన కాలపు మార్కిస్టు విద్యావేత్త మార్తా హర్నేకర్ ఏం చెప్పాడోతెలుసా... ప్రజాస్వామ్యపు సోపోనాల మీదుగానే సమసమాజ సౌధాన్ని చేరుకుంటామని...
శిష్యుడు: చక్కగా సెలవిచ్చారు గురువుగారు... 'ప్రజాస్వామ్యమా వర్థిల్లు.'
- కె. శాంతారావు
సెల్:9959745723