Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి 28, 29 దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె భారత కార్మికోద్యమ చరిత్రలో మరో చారిత్రాత్మక మైలురాయిగా మిగులుతుంది. కార్మికవర్గం ఇతర కష్టజీవులు పరిస్థితులు విసిరిన సవాళ్లను శక్తివంతంగా తిప్పికొట్టిన సమ్మె ఇది. ఒకవైపు దశాబ్దల తరబడి సాధించుకుని అనుభవిస్తున్న కార్మిక హక్కులపై దాడిచేస్తూనే వారి జీవన పరిస్థితులపై దాడి చేస్తోంది మోడీ సర్కార్. 4 కోడ్లు దాన్లో భాగమే. పైకి వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసినట్లు చెపుతున్నా సంయుక్త కిసాన్మోర్చాకిచ్చిన ఇతర వాగ్దానాలను అమలు చేయడంలేదు. ఆకాశాన్నంటిన ధరలను, కనీవిని ఎరుగని స్థాయిలో పెరిగిన నిరుద్యోగాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ ఖర్చును పెంచట్లేదు. ఆ విధంగా ఉపాధి పెంచడం లేదు.
బీజేపీ, ఆర్సెస్లు ప్రతి సందర్భాన్ని కులం, మతం, భాషల పేరుతో ప్రజల మధ్య చీలికలకు ఉపయోగిస్తున్నాయి. హిజాబ్, కాశ్మీర్‌ఫైల్స్, హలాల్ మాంసం, గుళ్ళవద్ద ముస్లిం వ్యాపారుల వివక్ష వంటివి గతం నుండి గోరక్షణ, లవ్జిహద్లకు కొత్తగా తోడైనాయి. ఒకపక్క ఇవి చేస్తూ కొన్ని సంక్షేమ చర్యల ద్వారా ఓట్లు సంపాదించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలను నిలబెట్టుకుంది బీజేపీ.
ఢిల్లీని రైతులు ముట్టడించి ఉన్న సందర్భంలో 2021 నవంబర్‌లో కార్మికులు ఈ రెండురోజుల సమ్మెకు నిర్ణయించారు. అప్పటివరకు మోడీ అజేయుడనే పేరు మట్టిలో కలిసిపోయింది. వ్యవసాయ చట్టాల్ని ఆయన రద్దు చేయవల్సివచ్చింది. అయితే ఆ చట్టాలను చేసినందుకు కాదు, వాటిని సరిగా అందరికి అర్థం చేయించలేక పోయినందుకు ఆయన క్షమాపణ కోరాడు. ఏమైనా ఈ రద్దు కష్టజీవుల ఉత్సాహాన్ని పెంచింది. కాని ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలుపుకోగలగడం ఈ ఉత్సాహంపై నీళ్ళు చల్లింది. కార్మికుల్లో కొందరు నిరాశకులోనయ్యారు. కోవిడ్ వల్ల ఫ్యాక్టరీల మూసివేతలు, లాక్డౌన్ కష్టాలు, ఉద్యోగాలు పోవడం, ఆదాయాలు తగ్గిపోవడం వంటివాటి వల్ల సమ్మె సరిగా జరగదని కొన్ని సంఘాలు నిరాశతో వెనుకడుగు వేశాయి. కాని ఈ ఊగిసలాటలను దేశ కష్టజీవులు, ప్రత్యేకంగా కార్మికవర్గం సరిచేసింది. మోడీ సర్కార్ విసిరిన సవాళ్లను, ముఖ్యంగా కార్పొరేట్ - మతోన్మాద ఎజెండాను దేశ కార్మికవర్గం తేలిగ్గా వదిలివేయదని ఈ రెండు రోజుల సమ్మె రుజువుచేసింది. ''దేశాన్ని రక్షించుకుందాం, మన ప్రజలను కాపాడుకుందా''మనే నినాదం తమ అద్భుత ప్రతిఘటన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. దశాబ్దాల ప్రజల ఆస్తులను, మౌలిక సదుపాయాలను చౌకగా పెట్టుబడిదారులకు కట్టబెట్టే విధానాన్ని అంగీకరించమని పెద్ద ప్రదర్శనలు, సమ్మెల ద్వారా అడ్డుకుంది.
అంతర్జాతీయ మీడియాలో ఈ సమ్మెపై మంచి కవరేజి వచ్చింది. చివరికి 'గోడీమీడియా' సైతం అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థలోని కీలకరంగాలన్నీ స్తంభించాయి. పవర్గ్రిడ్లోని అనేక సబ్ స్టేషన్స్ మొట్టమొదటి సారి బంద్ అయ్యాయి. జమ్ము-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాంలోని అనేక హైడల్ స్టేషన్స్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. పెట్రోలియం సెక్టార్లో ప్రత్యేంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ టెర్మినల్స్, ఎల్పిజి ఫిల్లింగ్ పూర్తిగా మూతబడింది. శుద్ధికర్మాగారాల్లో కాంట్రాక్టు కార్మికులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. హైకోర్టు బ్యాన్ ఉన్న కొచ్చిన్ రిఫైనరీ కార్మికులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. ట్యూటికోరిన్, పారదీప్ పోర్టు, మంగుళూరు పోర్టు కార్మికులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. విండ్మిల్ బ్లేడ్లను మోసుకుపోయే షిప్‌ను సీఐఎస్ఎఫ్ ద్వారా కదిలించాలనే ప్రయత్నం చేసిన ట్యూటికోరిన్ పోర్ట్‌లో శాశ్వత, కాంట్రాక్టు కార్మికులు వీరోచితంగా సముద్రంలోకి దూకి 'షిప్ రోకో' నిర్వహించడం ఒక అపూర్వ ఘటన. రోడ్ ట్రాన్స్ పోర్ట్రంగం దేశవ్యాపితంగా పెద్ద ఎత్తున ప్రభావితమైంది. కేరళ, హర్యానా, పంజాబ్, జమ్ము కాశ్మీర్లలో దాదాపు బస్సులు తిరగలేదు. పారాదీప్ పోర్టులో డంపర్ డ్రైవర్లు కూడ సమ్మెలో పాల్గొన్నారు. తమిళనాట 350 డిపోల్లోని లక్షమందికి పైగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఆటోలతోపాటు ఇతర ప్రయివేటు రవాణా సంపూర్ణంగా బంద్ అయ్యింది.
విద్యుత్ కార్మికులు కేరళ, తమిళనాడు, హర్యానాల్లో పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనగా ఇతరచోట్ల ప్రదర్శనలు చేశారు. ఇన్సూరెన్స్‌రంగంలో సమ్మె సంపూర్ణం కాగా, బ్యాంకుల్లో పెద్ద ఎత్తున విజయవంతం అయ్యింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో పాక్షికంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వశాఖల్లో రెండు రోజులూ ఉత్సాహవంతంగా సమ్మె జరిగింది. దీన్లో పోస్టల్, ఇన్‌కమ్‌టాక్స్, ఆడిట్శాఖల్లో అత్యధిక మంది సమ్మెలో పాల్గొనగా మిగిలినశాఖల్లో పాక్షికంగా పాల్గొన్నారు. ఎన్‌పిఎస్ రద్దు విషయంలో రెండవరోజు యువ ఉద్యోగులు బాగా కదిలారు. పదిరాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా పాల్గొన్నారు. అనేక రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. అనేక ప్రయివేటు రంగ పరిశ్రమల్లో, బహుళజాతి కంపెనీల్లో సమ్మె అద్భుతంగా జరిగింది. అనేక రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు. పవర్‌లూం కార్మికులు తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ మొదలైన చోట్ల పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగులు అనేక ప్రాంతాల్లో సంఘీభావ ప్రదర్శనలు చేశారు. సెంట్రల్ జోన్, దక్షిణ జోన్ వంటి చోట్ల రైల్వే కాంట్రాక్టు కార్మికులు స్వతంత్రంగా ప్రదర్శనలు నిర్వహించారు.
సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో జరిగిన రైతాంగ ప్రదర్శనలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. డబ్ల్యూఎఫ్టియు నుండి సమ్మెకు అందిన మద్దతు కీలకమైంది. అనేక కార్మిక సంఘాలు మద్దతు తెల్పటమే గాక ప్రభుత్వ విధానాలను ఎండగట్టాయి. వివిధ దేశాల్లో ఉన్న భారత నావికులు ప్రభుత్వ విధానాలపై తమ గళం విప్పారు. ఎ.ఐ.కె.ఎస్, ఎ.ఐ.ఎ.డబ్ల్యు.యు, ఐద్వా, డివైఎఫ్ఐ వంటి సంఘాలు ఈ రెండు రోజులూ సంఘీభావం తెలిపాయి. మొత్తం మీద భారత ప్రజలు ఈదేశ రక్షణ కోసం కృతనిశ్చయంతో ఉన్నారని, ప్రభుత్వాల విధానాలను ప్రతిఘటించేందుకు తమ సన్నద్ధత తెల్పారని ఈ సమ్మె రుజువు చేసింది.
- కె. హేమలత