Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మార్చి 22 నుండి 26 మధ్య అయిదు రోజుల్లో నాలుగు సార్లు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచారు. రాబోయే రోజుల్లో ఇదే విధమైన వడ్డింపులు మరిన్ని రానున్నాయి. తడవకు రూ.0.80 పైసల చొప్పున మొత్తం రూ.3.20 మేరకు ప్రతి లీటర్ మీదా పెరిగింది.
గత కొంత కాలంగా పెట్రో ధరలను పెంచకుండా స్తంభింపజేయడం వలన (ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల నేపథ్యంలో), అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా పెట్రో కంపెనీలు ఆ పెరుగుదలను తామే భరించవలసి వచ్చిందని, ఇప్పుడు మళ్ళీ ధరలను పెంచడానికి అనుమతించినందున గతకాలపు పెరుగుదల భారాన్ని ఇప్పుడు సర్దుబాటు చేస్తున్నామని వివరణ ఇస్తున్నారు. అటు కంపెనీలూ చమురు పెరుగుదల భారాన్ని భరించడానికి సిద్ధంగాలేవు. ఇటు ప్రభుత్వమూ పెరిగే ధరల ద్వారా తనకు లభించే అదనపు ఆదాయాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు. భారమంతా వినియోగదారులపైనే.
గతేడాది నవంబరు 4వ తేదీన పెట్రో ధరలను పెంచిన కంపెనీలు ఆ తర్వాత 137రోజులపాటు ధరలను పెంచలేదని చెపుతున్నారు. ఇదే కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్కు 82 డాలర్ల నుండి 117 డాలర్లకు పెరిగిందని, అందువలన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రూ.19,000 కోట్ల ఆదాయం కోల్పోయాయని వారు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఒకవేళ అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల దగ్గర స్థిరంగా నిలబడేటట్టైతే, తమకు ఆదాయంలో ఏవిధమైన నష్టమూ రాకుండా ఉండేందుకు లీటరుకు మరో రూ.7 వరకూ పెంచవలసి వస్తుందని వారు చెప్తున్నారు.
చమురు కంపెనీలు గనుక ఈ విధంగా ధరలను పెంచినట్టైతే, అది అక్కడితో ఆగిపోదు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో అనేక వస్తువుల ధరలు దాని ఫలితంగా పెరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం కూడా తన వ్యయాన్ని ఆ మేరకు పెంచవలసి ఉంటుంది (ప్రభుత్వ వ్యయం పెరగకపోతే ఆర్థిక వ్యవస్థ మరింత మాంద్యంలోకి కూరుకుపోతుంది). ఆ విధంగా అదనపు వ్యయం చేయాలంటే అందుకోసం ప్రభుత్వం తన ఆదాయాన్నీ పెంచుకోవాలి, అందుకు ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల మీద తనకు వచ్చే పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలి. ప్రభుత్వం మాదిరిగానే పెట్రో ఉత్పత్తులను వినియోగించే ప్రతీ సంస్థా (ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు వగైరా) తమ సేవల రేట్లు పెంచవలసి ఉంటుంది. ఇదంతా కలిసి ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి.
ఇలా అన్ని వస్తువుల, సేవల ధరలూ పెరిగిపోతూ ఉంటే, దాని ప్రభావాన్ని తట్టుకుని భరించే తరగతి సమాజంలో ఉండాలి. అంటే వారి ఆదాయాలు పెరగకుండా ధరల పెరుగుదలను భరించే తరగతి అన్నమాట. ఆ తరగతి శ్రామికవర్గమే. శ్రామికవర్గ ఆదాయాలు కూడా పెరిగే ధరలకు అనుగుణంగా పెరిగిపోతూ ఉంటే ఇంక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా, శ్రామిక ప్రజల ఆదాయాలు పెరగవని తెలుసు. భారమంతా శ్రామికవర్గమే అంతిమంగా భరిస్తోందనీ తెలుసు. తెలిసి కూడా పెట్రో ధరల పెరుగుదలకు పచ్చజెండా ఊపుతోంది. మరోపక్క పేదవారి పట్ల మొసలి కన్నీరు కారుస్తోంది. ఇదే ప్రభుత్వం వంచనా శిల్పానికి తార్కాణం.
అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ, దేశీయంగా పెట్రో ధరలను పెంచి తీరాలని సూత్రం ఏదీ లేదు. పెట్రో ధరల పెంపు అనేది ప్రభుత్వం అనుసరించే ద్రవ్య వ్యూహం బట్టి ఉంటుంది. ఈ ద్రవ్య వ్యూహాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అదేదో మార్చుకోడానికి వీలులేనిదైనట్టు చిత్రీకరిస్తూ ఆ వ్యూహం కారణంగానే పెట్రో ధరలను తమకు ఇష్టం లేకున్నా పెంచవలసి వస్తోందని వాపోవడం దొంగనాటకం. పెట్రో ఉత్పత్తుల ధరలో దాదాపు సగం భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకే పోతుంది. ఈ పన్నులకి, అంతర్జాతీయ చమురు ధరలకి సంబంధం లేదు. అయినా ఆ పన్నులను పెంచుకుంటూ పోతోంది ప్రభుత్వం. తన వంతు అదనంగా ప్రజలమీద భారాన్ని మోపుతూనే పోతోంది.
రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని కొంతవరకూ అర్థం చేసుకోవచ్చు. వాటి పరిధిలో పరిమితమైన ఆదాయ వనరులే ఉన్నాయి. ముఖ్యంగా జీఎస్టీ విధానం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు బాగా తగ్గిపోయాయి. పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రావు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు పెట్రో ఉత్పత్తుల మీద పన్నులు వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్ష పన్నులు విధించే అధికారం లేనందువలన వాటికి వేరే దారి లేదు.
కాని కేంద్ర ప్రభుత్వం వేరు. వేరువేరు మార్గాల్లో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు దానికి పుష్కలంగా ఉన్నాయి. కాని కావాలనే అది ఆ మార్గాలను ఉపయోగించడంలేదు. సంపన్నులమీద ప్రత్యక్ష పన్నులు విధించవచ్చు. ఆ సంపన్నుల పట్ల పక్షపాత వైఖరితో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రత్యామ్నాయాన్ని అది ఆలోచించడం లేదు. అది దాని వర్గ స్వభావానికి సంకేతం.
సంపన్న వర్గాలే పెట్రో ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగిస్తాయి గనుక పెట్రో ఉత్పత్తుల మీద ధరలు పెరిగితే వారిమీదే భారం ఎక్కువగా పడుతుందని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. పెట్రో ఉత్పత్తులలో కొన్నింటిని శ్రామిక ప్రజలు నేరుగానే వినియోగిస్తారు. ఇందుకు ఉదాహరణ వంట గ్యాస్. ఇక పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగితే రవాణా చార్జీలు అనివార్యంగా పెరుగుతాయి. దానితోబాటు వినిమయ వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. వాటిలో ఆహార ధాన్యాలతో సహా చాలా వస్తువులను శ్రామిక ప్రజలే ఎక్కువగా వినియోగిస్తారు. ఇక సంపన్నులు పెట్రో ఉత్పత్తులను వినియోగించి ఉత్పత్తి చేసే వివిధ రకాల సరుకుల రేట్లను పెంచి అమ్ముతారు. ఆ విధంగా కూడా అంతిమంగా వినయోగదారులపైనే భారం అంతా పడుతుంది. పెరిగే ధరల భారం నుండి సంపన్నులు తమను తాము కాచుకోగలరు. అదే విధంగా కాచుకోగల శక్తి శ్రామిక ప్రజానీకానికి లేదు.
శ్రామిక ప్రజల మీద పెట్రో ధరల భారం పడకుండా, అదే సమయంలో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగితే ఆ భారాన్ని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఇంకో ద్రవ్య వ్యూహాన్ని అనుసరించవచ్చును. సంపన్న వర్గాల మీద ప్రత్యక్ష పన్నులను పెంచడమే ఆ వ్యూహం. సంపద పన్ను, వారసత్వ పన్ను వంటివి సంపన్నుల మీద విధించవచ్చు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పుడు పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోవడం కూడా అవసరమే కదా? పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచితే అప్పుడు వాటి వినియోగం తగ్గుతుంది కదా? వాటి ధరలను పెంచకుండా వినియోగాన్ని తగ్గించడం ఎలా సాధ్యం? అని ప్రశ్నించేవారున్నారు.
అంతిమంగా పెట్రో ధరల భారాన్ని భరించేవారు మాత్రమే వాటి వినియోగాన్ని తగ్గించాలని యోచిస్తారు. వినియోగం ఎంత పెరిగినా ఆ భారాన్ని ఇతరుల మీదకు నెట్టివేయగల అవకాశం ఉన్నవారు వాటి వినియోగాన్ని తగ్గించాలని ఎందుకు ఆలోచిస్తారు? అంటే పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలని ప్రయత్నించేవారు శ్రామిక ప్రజలు మాత్రమే. వారు పరిమితంగా వినియోగించే పరిస్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు ధరలు పెరిగినందువలన వారి పెట్రో ఉత్పత్తుల ప్రత్యక్ష వినియోగం మరింత కుదించుకుపోతుంది. అంతే కాదు, అనివార్యంగా పెట్రో ఉత్పత్తులను ప్రతీ రోజూ వినియోగించవలసి వస్తున్నందువలన శ్రామిక ప్రజలు ఇతర వస్తువుల వినియోగాన్ని మరింత తగ్గించడానికి పూనుకుంటారు. దాని వలన మొత్తం మీద వస్తు వినియోగం తగ్గిపోతుంది. అందువలన మార్కెట్లో మాంద్యం మరింత పెరుగుతుంది. అది మరింత ఎక్కువగా నిరుద్యోగానికి దారి తీస్తుంది. ఆ విధంగా ఒక వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు మాంద్యం - వెరసి మాంద్యోల్బణం ముదురుతుంది.
అటువంటి పరిస్థితిని ఏదో ఒక మేరకు నివారించేలా, పెట్రో ఉత్పత్తుల వినిమయాన్ని తగ్గించాలంటే అందుకు ఒకటే మార్గం. ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల పంపిణీని నియంత్రించి రేషనింగ్ విధానాన్ని అమలు చేయడం. అప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచకుండా, వాటి వినియోగాన్ని అదుపు చేయవచ్చు. ప్రస్తుతం ధనవంతులు ఏ నియంత్రణా లేకుండా విచ్చలవిడిగా వినియోగి స్తున్నారు. మరోవైపు పెరిగిన ధరల భారంతో శ్రామిక ప్రజలు తమ అవసరాలకు సైతం వినియోగించలేకపోతు న్నారు. రేషనింగ్ అమలు చేస్తే ఆ పరిస్థితి మారుతుంది. కొంత మేరకు సామాన్యులకు ఊరట కలుగుతుంది.
అందుచేత అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే ఇక్కడ కూడా పెట్రో ధరలను పెంచడం తప్ప మనం ఇంకేం చేయగలం? అంటూ నాటకాలు ఆడడం బదులు, నిజాయితీ ఉంటే ప్రత్యామ్నాయ ద్రవ్య విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడాలి. ఆ ప్రత్యామ్నాయంలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది సంపన్నుల మీద ప్రత్యక్ష పన్నులు విధించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడం. రెండవది పెట్రో ఉత్పత్తుల పంపిణీని రేషనింగ్ ద్వారా నియంత్రించడం. అప్పుడు పెట్రో భారాల నుండి ప్రజలను కాపాడవచ్చు. ఇటువంటి ప్రత్యామ్నాయం చేపట్టకపోతే దేశం రాబోయే కాలంలో అనేక విషాద పరిణామాలను చూడవలసి వస్తుంది.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)