Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్జిత్ తరువాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ప్రకాశ్ కరత్ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి పార్టీ నాయకుడిగా ఎదిగారు. ఆయన 1948 ఫిబ్రవరి 7న బర్మాలో జన్మించారు. 1970లో పార్టీలో చేరి, సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అప్పటి పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు ఎ.కె.గోపాలన్‌కు సహాయకారిగా పనిచేశారు. తరువాత జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యా లయంలో ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ, 1973-74లో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1974 నుంచి 1979 ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమర్జెన్సీ కాలంలో ఏడాదిన్నరపాటు అజ్ఞాత జీవితం గడిపారు. 1979లో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీలో పనిచేస్తూ 1982-85లో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1988-91 కాలంలో కేంద్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యునిగా పనిచేశారు. 1992లో మద్రాసులో జరిగిన 14వ పార్టీ మహాసభలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. 1995లో అఖిల భారత పార్టీ పిలుపు మేరకు జరిగిన పికెటింగ్ సందర్భంగా అరెస్టై, కొద్ది రోజుల పాటు జైలు జీవితం గడిపారు. కరత్ బ్రిటన్‌లో రెండేళ్లపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చదివారు. క్యూబా, చైనా, జపాన్‌లను సందర్శించారు. 1972లో లాంగ్వేజ్ అండ్ నేషనాలిటీ పాలిటిక్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం రచించారు. ఎవరల్డ్ టు విన్ - ఎస్సేస్ ఆన్ కమ్యూనిస్టు మానిఫెస్టో పుస్తకాన్ని రచించారు.