Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1977లో సీపీఐ(ఎం) ప్రధాన కార్య దర్శిగా బాధ్య తలు స్వీకరించిన ఇఎంఎస్. నంబూద్రిపాద్ 1992 వరకు ఆ స్థానంలో కొనసాగారు. తన ఏడు దశాబ్దాల ప్రజా జీవితంతో, విప్లవ కార్యక్రమాలతో భారత కార్మికవర్గ ఉద్యమం మీద చెరగని ముద్ర వేశారు. సంప్రదాయ, భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన చిన్న వయసులోనే కుల వ్యతిరేక, సాంఘిక సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు. 1931లో స్వాతంత్య్రోద్యమంలోకి దూకారు. కేరళలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సంయుక్త కార్యదర్శిగా కొనసాగు తూనే మార్క్సిజంతో పరిచయం ఏర్పరు చుకున్నారు. 1936లో కేరళ కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన ఐదుగురు సభ్యుల్లో ఇఎంఎస్ ఒకరు. సమైక్య భాషా రాష్ట్రంగా కేరళ ఆవిర్భవించడానికి దారి తీసిన ఐక్య కేరళ ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 1940లో ఆయన తన యావదాస్తిని పార్టీ కోసం విరాళంగా ఇచ్చారు. 1946లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1950 డిసెంబర్లో ఉమ్మడి పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యులయ్యారు. 1962లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1939లో మొట్టమొదటిసారిగా మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1957లో కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. ఇఎంఎస్ దేశంలోనే తొలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయ్యారు. భూసంస్కరణ చట్టాన్ని తెచ్చిన ఇఎంఎస్ మంత్రివర్గం ఇతర ప్రజాస్వామ్య చర్యలకూ శ్రీకారం చుట్టింది. 1967లో ఇఎంఎస్ యునైటెడ్ ఫ్రంట్ అధినేతగా మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969 వరకు కొనసాగారు. 1964లో సీపీఐ(ఎం) ఏర్పడినపుడు ఆయన కేంద్ర కమిటీకి, పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. 1977లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, 1992 వరకు ఆ స్థానంలో ఉన్నారు. ఇఎంఎస్ గొప్ప మార్క్సిస్టు సిద్ధాంత వేత్త. మార్క్సిజం-లెనినిజాన్ని భారత సామాజిక పరిస్థితులకు అన్వయించడం లోనూ, భారత విప్లవానికి అవసరమైన వ్యూహాన్ని, ఎత్తుగడలను రూపొందించడం లోనూ ఆయన సేవలు గణనీయం. ఆయన విస్తారంగా రచనలు చేశారు. 1998 మార్చి 19వ తేదీన ఆయన చనిపోవడానికి కొద్ది గంటల ముందు కూడా ఆయన రచనలను డిక్టేట్ చేస్తూనే ఉన్నారంటే ఆయన విప్లవ దీక్షను అర్థం చేసుకోవొచ్చు.