Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత కార్మికోద్యమ నిర్మాతల్లో ఒకరు, భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రజులు కామ్రేడ్ బి.టి రణదివె (బాలచంద్ర త్రయంబక రణదివె) 32వ వర్థంతి నేడు. అసామన్య పోరాట యోధుడైన సీపీఐ(ఎం) అగ్రనేత ఆయన. 1904 డిసెంబర్ 19న మహారాష్ట్ర లోని బొంబాయి లో జన్మించిన బి.టి రణదివె బ్రిటిష్‌కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటిష్ కాలంలోనే బొంబాయిలో కార్మిక సంఘాలు స్థాపించి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. భారత దేశంలో మొట్టమొదటి అఖిల భారత ట్రేడ్ యూనియన్ (ఎఐటియుసి) జాతీయ నాయకుడిగా, 1970లో ఏర్పడిన నాటి నుండి 1991 వరకు సెంటర్ ఆఫ్ ఇండియన ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
కార్మికుల ప్రయోజనాలే తప్ప సొంత జీవితం పట్ల ఆసక్తి లేని నిస్వార్థ నేత బి.టి.ఆర్. తన తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా కార్మిక పోరాటంలో ఉన్న తీరు కార్మికవర్గానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనం. తన చివరి కాలంలో 85ఏండ్ల వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉండి కూడా పని హక్కు సమస్యపై వ్యాసం రాశారు. 1990లో చనిపోవడానికి కొద్ది రోజుల ముందు హాస్పిటల్లో మరణశయ్యపై ఉండి కూడా టైప్ రైటర్ తెప్పించుకొని తూర్పు యూరప్ దేశాల పరిణామాలపై ఒక డాక్యుమెంట్‌ని తయారు చేశారు. ఇది కార్మికోద్యమం పట్ల తన నిబద్ధతకు నిదర్శనం.
క్రమశిక్షణ, నిబద్ధతలకు మారుపేరు కామ్రేడ్ బి.టి.ఆర్. కమిటీల ఆమోదం లేనిదే నిధులు ఖర్చు చేయనిచ్చేవాడు కాదు. తన అవసరాలకు మాత్రమే నిధులు తీసుకునేవాడు అదనంగా ఇచ్చినా తిప్పి పంపించేవాడు. నిరాడంబరంగా ఉండటం ఆయనకు ఉన్న మరో ఉత్తమ లక్షణం. సౌకర్యాలకు అలవాటుపడితే సోమరిగా మారి, విప్లవ బాధ్యతలు నెరవేర్చలేమని ఆయన చెప్పేవారు. సిఐటియు అధ్యక్షునిగా తను పనిచేసిన 20సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే ఆయన విదేశాలకు వెళ్లారు.
బి.టి.ఆర్ మహా ధైర్యశాలి. 1931లో గాంధీజీ బొంబాయిలో ఒక బహిరంగసభలో ప్రసంగిస్తున్న సమయంలో బిటిఆర్ ధైర్యంగా వేదిక ఎక్కి భగత్ సింగ్ ఉరి శిక్ష, మీరట్ కుట్ర కేసు విషయంలో గాంధీజీ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు. ఆటంకాలను సైతం అవకాశాలుగా మార్చుకోగలిగిన నైపుణ్యాలు ఆయనవి. తనను 1940లో అరెస్టు చేసి జైల్లో ఉంచిన సందర్భంగా అక్కడ కూడా ఖైదీల సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు.
తన జీవితాంతం కార్మికవర్గ ఐక్యత కోసం కృషి చేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా కార్మికవర్గం ఐక్యంగా ఉండాలని ప్రయత్నించారు. దానికోసం ఎఐటియుసిలోనే ఉండి పని చేశారు. కానీ ఎఐటియుసి ప్రధాన నాయకత్వం ప్రభుత్వానికి మద్దతుగా, కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్మికవర్గానికి ద్రోహం తలపెట్టింది. ఈ నేపథ్యంలో కార్మికవర్గ ప్రయోజనాల కోసం 1970లో సిఐటియు ఆవిర్భవించింది. సిఐటియు జాతీయ అధ్యక్షుడిగా బిటిఆర్ అనేక ఐక్య వేదికల ఏర్పాటుకు కృషి చేశారు. 1972లో కార్మిక సంఘాల ఐక్య మండలి (యుసిటియు) ఏర్పాటుకు మార్గదర్శకత్వం వహించారు. ఈ వేదిక బోనస్ కోసం, కంపల్సరీ డిపాజిట్ స్కీంకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించింది. 1974లో రైల్వే కార్మికులను ఐక్యం చేసి, రైల్వే కార్మికుల పోరాట జాతీయ సమన్వయ కమిటీ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. 1974లో జరిగిన రైల్వే కార్మికుల సమ్మె భారతదేశ కార్మిక ఉద్యమంలో చరిత్ర సృష్టించింది. రైల్వే కార్మికులపై భారత ప్రభుత్వం నిర్బంధానికి వ్యతిరేకంగా మొత్తం ప్రజానీకం, కార్మిక వర్గం రైల్వే కార్మికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో, నిర్బంధ కాలంలో రైల్వే కార్మికులకు పక్షాన ముందుండి పోరాడారు. 1979లో మొరార్జీ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక వివాదాల బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులను, ఉద్యోగులను ఐక్యంగా కదిలించి, కార్మిక సంఘాల జాతీయ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే 1982లో మొట్టమొదటి దేశ వ్యాప్త సమ్మె జరిగింది. కార్మికోద్యమంలో ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఐక్యం చేసి వారికి ఒక వేదికను (సిపిఎస్టియు) ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. కార్మిక వర్గం తన ప్రధాన పోరాటాన్ని వర్గ శత్రువుపై కేంద్రీకరించాలని ఆకాంక్షించారు. అందుకు సంస్కరణ వాద సంఘాలను సైతం కలుపుకొని విశాల ఐక్య వేదికగా ట్రేడ్ యూనియన్ల సమాఖ్య ఏర్పడాలని కూడా ప్రతిపాదించారు. శత్రువును ఒంటరి చేసేందుకు ఒక పరిశ్రమలో ఒకే సంఘం ఉండాలని సూచించారు బిటిఆర్. కార్మిక సంఘాలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, అన్ని నిర్ణయాలలో కార్మికులను కూడా భాగస్వామ్యం చేయాలని ఆయన కోరుకున్నారు. దాని కోసం జీవితాంతం కృషి చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్వవహరించక పోవడం అనేది దేశంలోని కార్మిక సంఘాలను పీడిస్తున్న జాడ్యం అని, దానిని వదిలించుకోవాలని సిఐటియు వ్యవస్థాపక సమావేశంలోనే ఆయన వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రేడ్ యూనియన్ హక్కులు, రాజకీయ హక్కులు ఉండాలని ఆయన ప్రతిపాదించారు. అవి ఇవ్వకపోవడం వల్ల వారు రెండో తరగతి పౌరులుగా మారి కార్మిక సంఘాలకు దూరమె,ౖ ఒంటరి బాట పట్టాల్సి వస్తుందని ఆవేదన చెందారు. నిరుద్యోగ సమస్యపై కార్మికవర్గం పోరాడాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఉపాధి సమస్యపై నిరుద్యోగులను కలుపుకొని కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. శ్రామిక మహిళల సమస్యలపై ప్రత్యేక పోరాటాలు అవసరమని దానికోసం 1979లో చెన్నైలో మొట్టమొదటి శ్రామిక మహిళా సదస్సును నిర్వహించారు.
కార్మిక, కర్షక ఐక్యత కోసం బిటిఆర్ ఎనలేని కృషి చేశారు. రైతుల గర్భం నుండే కార్మికవర్గం ఆవిర్భవించిందనీ, అటువంటి రైతాంగానికి కార్మిక సంఘాలు రక్షణ ఇవ్వాలనీ కోరుకున్నారు. 1973 కరువు సందర్భంలో రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు.
వివిధ సందర్భాలలలో భారత కార్మికోద్యామానికి దిశా నిర్దేశం చేయడంలో ఉపాధ్యయుడి పాత్రను పోషించారాయన. దేశంలోని ప్రజలు, కార్మికవర్గం, రైతాంగం అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకోసం నిరంతరం శ్రమించిన ఆదర్శ విప్లవకారుడు కామ్రేడ్ బిటీఆర్. 1990 ఏప్రిల్ 6న ఆయన కన్నుమూసే వరకూ అవిశ్రాంత పోరాటమై సాగిన కమ్యూనిస్టు యోధుడు. నేడు బిటిఆర్ మన మధ్య లేకపోయినా ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు ఇంకా అలానే ఉన్నాయి. ఆనాడు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులు నేటి పాలకుల విధానాల వల్ల కాలరాయబడు తున్నాయి. ప్రజలపై మరిన్ని భారాలు పెరుగు తున్నాయి. ఒకపక్క కార్పొరేట్ల ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పోగుబడుతుంటే, మరోపక్క ఆకలి, పేదరికం, ఆకలి చావులు, రైతాంగ ఆత్మహత్యలు, నిరుద్యోగం రోజు రోజుకు పెరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య కార్మికోద్యమాన్ని నిర్మించడమే బిటిఆర్కి మనం అర్పించే నిజమైన నివాళి. ఆదిశగా కృషిని కొనసాగిద్దాం...
- బి. మధు
సెల్:9490098155