Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లీతండ్రీ అన్నీ తామే అయి బిడ్డలను పెంచే ఒంటరితల్లులు నిత్యం సమస్యలతో పోరాడుతుంటారు. స్థాయితో సంబంధం లేకుండా, ధనిక, బీద తారతమ్యం చూడని ఈ బాధలు ఎప్పుడూ వారి వెన్నంటే ఉంటాయి. అయితే బిడ్డల సంరక్షణలో తిండి, బట్ట కోసం నానాపాట్లు పడుతున్న ఎందరో తల్లులు వారి ఉన్నత చదువుల విషయంలో మరిన్ని బాధలకు గురవుతున్నారు. అలా తమకు ఎదురైన బాధలను అధిగమించేందుకు ఇద్దరు బిడ్డలు చేసిన పోరాటం ఎంతోమందికి ఆత్మస్థైర్యాన్నిచ్చింది.
'నా జీవితంలో ఎప్పుడూ భాగం కాని వ్యక్తి పేరు నా ధృవపత్రాల్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు.. నా చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన అమ్మానాన్న 'అమ్మ' ఒక్కత్తే. కాని నా గుర్తింపు పత్రాల్లో ఆమె పేరు అవసరం లేదని చెప్పడం నాకు చాలా అవమానంగా తోచింది' అంటారు సువమ్.
కోల్‌కతాలో చదువు పూర్తయిన సువమ్ స్కూలు లివింగ్ సర్టిఫికెట్ (ఎస్ఎల్సి) తీసుకునే సమయంలో గార్డియన్‌గా తండ్రి పేరుకు బదులు తల్లి పేరు చేర్చమని ప్రిన్సిపాల్‌ను అర్థించాడు. అందుకాయన ఒప్పుకోలేదు. దీంతో అతను ఈ సమస్యను ఎలాగైనా సంబంధిత అధికారులకు చేరవేయాలనుకున్నాడు. అలా కేంద్ర మాతా-శిశుమంత్రిత్వ శాఖకు ఈమెయిల్ పంపాడు. అప్పుడతని వయసు 15ఏండ్లే. 'సువమ్ చిన్నవాడే. కాని అతను చాలా దృఢనిశ్చయంతో ఉండేవాడు. ఈ మార్పు చేయకుంటే తాను ఉన్నత చదువు కొనసాగించనని ఖరాఖండిగా చెప్పేశాడు' అంటూ గతం గుర్తుచేసుకున్నారు తల్లి స్మృతి.
'నాన్న పేరు లేకుండా సర్టిఫికెట్ ఇవ్వమని సువమ్ అడిగినప్పుడు నాకు ఎంతో ధైర్యమొచ్చింది. అప్పటివరకు సమాజానికి భయపడి నేనొక వితంతువునని చెప్పుకునేదాన్ని. కాని ఆ రోజున నేను ఒంటరితల్లినని గర్వంగా చెప్పుకునేలా సువమ్ చేశాడు' అంటూ ఆమె భావోద్వేగమైంది. ఆధార్‌కార్డు, ఓటుకార్డు, పాన్‌కార్డు, ఎస్‌ఎల్‌సీలో తల్లిపేరుతో సర్టిఫికెట్లు సంపాదించడంలో దశాబ్దకాలంగా సువమ్ పోరాడాడు. 2018లో విదేశాల్లో చదవాలనుకుని పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి పేరుతో పాస్‌పోర్టు వచ్చింది. అయితే సువమ్కు తండ్రి పేరుతో గుర్తింప బడడం ఇష్టం లేదు. అదే విషయం అధికారికి చెప్పాడు. విషయం తెలుసుకున్న సదరు అధికారి 'మీకు పాస్‌పోర్టు వచ్చినందుకు సంతోషించక అభ్యంతరాలు చెబుతున్నారా? మీకేమైనా పిచ్చా? ఎవరైనా కిరాయి తండ్రిని చూపిస్తే మీ పని అయిపోతుంది కదా' అని స్మృతితో చెప్పాడు. 'కాగితాలపై తండ్రి పేరును ఎందుకు వద్దంటున్నానో చాలామంది అర్థం చేసుకోలేదు. ఆ కారణంగానే నా అభ్యర్థనను తిరస్కరించేవారు. నాకు సంబంధించిన పత్రాల్లో నా జీవితంలో ఎప్పుడూ తారసపడని వ్యక్తి పేరు ఉండడాన్ని నేను అంగీకరించను' అంటున్న సువమ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భాషా శాస్త్రవేత్తగా విద్యాభ్యాసం చేస్తున్నారు. గత నెల ఫిబ్రవరిలో సువమ్ దశాబ్దకాలం చేసిన పోరాటానికి తెరపడింది. అతనికి సంబంధించిన అన్ని ధృవపత్రాల్లో గార్డియన్ కాలంలో తల్లి పేరు చేర్చబడింది. 'ఆధార్ కార్డులో మొదటగా అమ్మ పేరు నమోదైంది. కాని పాన్ కార్డు అధికారికి ఈ విషయం చెప్పినప్పుడు అతని కనుబొమలు పెద్దవి చేయడం నాకు ఇప్పటికీ గుర్తే. ఆన్లైన్ పోర్టల్‌లో ఈ మార్పు జనవరి 2022 వరకు జరగలేదు' అంటారు సువమ్.
భారతదేశ పాస్‌పోర్టు పత్రాల్లో ఈ రకమైన మార్పు వెనుక సువమ్ ఒక్కడే లేరు. ఐస్లాండ్ ఎంబసీలో పనిచేస్తున్న ప్రియాంకగుప్తా కూడా దీనివెనుక ఉన్నారు. ఒంటరితల్లిగా కూతురు బాధ్యతలు తీసుకున్న ప్రియాంక ప్రపంచ పోర్టల్ 'చేంజ్.ఆర్గ్'కు 'పాస్‌పోర్ట్ ఫర్ మై డాటర్ విత్ మదర్స్ నేమ్(తల్లి పేరుతో నా కూతురుకు పాస్‌పోర్ట్ ఇవ్వండి)' అంటూ 2016లో పిటిషన్ చేసుకున్నారు.
'నేను ఒంటరితల్లిని. నన్ను, నా కూతురుని నా భర్త వదిలివేశాడు. అతను తిరిగి చూడలేదు. మేము చచ్చామో, బతికామో కూడా అతను ఎప్పుడూ పట్టించుకోలేదు. అటువంటి వాడి పేరుతో నా కూతురుకు గుర్తింపు పత్రాలు ఇవ్వవద్దు' అని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రియాంక ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది. తండ్రి పేరుతో వచ్చిన పాస్‌పోర్టు తీసుకుని విదేశాల్లో చదివేందుకు ఆమె కూతురు గరిమా ఇష్టపడలేదు. గరిమా ఓటరు ఐడి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలన్నీ గార్డియన్‌గా తల్లిపేరుతోనే ఉండేవి. కాని పాస్‌పోర్టు మాత్రం తండ్రి పేరుతో వచ్చింది. ఈ విషయంపై సంబంధిత అధికారులను కొన్ని వందలసార్లు కలిశారు. 'రూల్స్ అలాగే ఉన్నాయి. మార్చలేం' అంటూ అధికారులు చెప్పేవారు.
'ఈ దేశంలో తల్లి పేరుతో గుర్తింపబడడాన్ని ఎవరూ అంగీకరించరు. పైగా అవమానంగా చూస్తారు. కాని నేనెప్పుడూ చూడని వ్యక్తి పేరు నా పత్రాల్లో ఉండడాన్ని నేను అంగీకరించను' అంటోన్న గరిమా పాస్‌పోర్టు ఈ కారణంగానే 2015లో తిరస్కరణకు గురైంది. దీంతో ఉన్నతవిద్య కోసం రష్యా వెళ్లే అవకాశం ఆమెకు చేజారిపోయింది. తను సంపాదించడం మొదలు పెట్టిన తరువాత గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరుకు బదులుగా తల్లి పేరు చేర్చడంపై న్యాయపరంగా పోరాడాలని ఆరోజే ఆమె గట్టినిర్ణయం తీసుకుంది. 'నాన్న పేరుతో పాస్‌పోర్టు తీసుకున్నట్లైతే నన్ను, అమ్మని అనాథలుగా వదిలివేసిన వ్యక్తిని నేను పదేపదే గుర్తుచేసుకోవాల్సి వస్తుంది. అందుకే నాకు ఆ పాస్‌పోర్టు అవసరం లేదని చెప్పా' అంటుంది గరిమా.
'గరిమా నిర్ణయంతో నేను మొదట చాలా భయపడ్డాను. అందరి దృష్టి నా మీద పడుతుందని ఆందోళన చెందాను. అయితే చేంజ్. ఆర్గ్ నన్ను సంప్రదించి దీనిపై ప్రచారం చేయమని నన్ను ప్రోత్సహించినప్పుడు నాతో చాలామంది కలిశారు. అప్పుడే నాకు అర్థమైంది. నాలాంటి బాధితులు ఎందరో ఉన్నారని' అంటారు ప్రియాంక. ఆ పిటిషన్‌కు అంగీకారంగా లక్షలాదిమంది సంతకాలు చేయడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. మాజీ విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ హయాంలో వచ్చిన ఈ పిటిషన్లపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పడింది. సమస్య మూలాల్లోకి వెళ్లి చేసిన పరిశీలన ఆధారంగా సువమ్, గరిమా లాంటి ఒంటరితల్లుల పిల్లలు గార్డియన్ కాలమ్‌లో తల్లిపేరుతో పాస్‌పోర్టు పొందేలా నియమాలు సవరించబడ్డాయి. ఇటీవల కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఒంటరితల్లుల బిడ్డలకే కాక దత్తత తీసుకున్నవారు, అనాథలు, పెళ్లి కాకుండా పుట్టిన పిల్లలకు కూడా నియమాలు సులభతరం చేయబడ్డాయి.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్