Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరి ధాన్యం కేంద్రమే కొనటం లేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రమే అబద్దాలాడుతుందని కేంద్ర ప్రభుత్వం పరస్పర ఆరోపణలతో పోటీపడుతున్నాయి. కానీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోసిన వండ్ల గింజలు కల్లాలకు చేరుతున్నాయి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా? కొనదా? అనే విషయంపై స్పష్టత లేదు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో పండిన వరి చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బల్ల గుద్దుతోంది. కేంద్ర ప్రభుత్వమేమో తమకు టీఆర్ఎస్ సర్కారు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన ప్రకారమే కొనుగోలు చేస్తామని మంకుపట్టు పట్టి బెట్టుచేస్తోంది. ఈ పంచాయతీ ఎటు పోతుందో ఆలోచించే పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం లేదు. ప్రస్తుతం వారికి కావాల్సింది ''వడ్ల సంగతేంది?'' అనేది మాత్రమే. ''నేను ఆ వస్తువును కొంటా. కానీ నా నుంచి వెంటనే వీడు కొనాలి'' అన్నట్టు కేసీఆర్ పట్టుబట్టాడు. నీ నుంచి వాడు ఎందుకు కొంటాడో, ఎలా కొంటాడో? మా రైతులకేం తెలుసు సామీ. మొదలు రాష్ట్రంలో పండిన మన పంట దిగుబడిని కొనుగోలు చేయాలి తమరు. కానీ నేటికీ ఆ వ్యవహారాల జోలికెళ్లినట్టు కూడా కనిపించడం లేదు. మరి ఈ పంచాయతీతో రైతులను ముంచుతారా ఏంటి? వాడు ఎలా కొనడో? ఎందుకు కొనడో? మనందరం కలిసి కొట్లాడుదాం. కానీ ముందు రైతు కష్టం తీర్చాలి కదా? అసలు పని పక్కన బెట్టి కొసరు కోసం కొట్లాడి రైతులను ఆగం చేస్తే ఎలా?
రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది బాగుంది. కేంద్రం కచ్చితంగా తెలంగాణలో పండిన ధాన్యం పంజాబ్ తరహాలోనే కొనాల్సిందే. కానీ ధాన్యం కొనాలని కేంద్రంపై కొట్లాడుతున్న రాష్ట్ర సర్కార్ రైతుల ఆందోళన తొలగించేందుకు ముందు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలిగా. ఏది ఏమైనా వరి ధాన్యం కొనాలంటున్న రాష్ట్ర సర్కార్ ముందు తన పని పూర్తి చేయాలి గదా. రాష్ట్ర ప్రభుత్వం అసలు ధాన్యం కొంటుందో లేదోనని ఇక్కడి రైతులు నిద్రాహారాలు మాని సర్కారువారి అమూల్యమైన పలుకుల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి సమాధానం చెప్పాలిగా. వారి ఆందోళనకు బాధ్యత వహించాలిగా. అసలే ఎండాకాలం. వరి ధాన్యం చేనుమీదే ఏండి ఉంటుంది. కోత కోసిన తర్వాత వరి ధాన్యాన్ని ఎండబెట్టాల్సిన పని కూడా ఉండదు. కోసిన వెంటనే తూకం వేసి మిల్లుకు తరలించాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇంత వరకూ ఆ ఏర్పాట్లు చేయకపోవడంతో రోజుల తరబడి కళ్లాల్లో ధాన్యం రాశుల కాపాలా కాయాల్సిన పరిస్థితి ఓ పక్కా, అసలు ప్రభుత్వం కొంటుందో కొనదో అనే ఆందోళన మరోపక్క రైతులను దహించి వేస్తోంది.
విచిత్రమేమిటంటే వరి ధాన్యం కొనాలనేదే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పెద్దల మాట. అంటే కొనటం అనేది తప్పనిసరి. కానీ అందుకే తగిన ప్రణాళిక ఇప్పటికీ మొదలు కాలేదు. అందరూ రైతుల పక్షమే. ధాన్యం కొనాల్సిందేననే. అయినా ఎవరు కొనాలి అనే దగ్గరే అసలు పేచీ. కేంద్రం కొనకుంటే మేం ఏం చేయాలి అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భరోసా ఇవ్వకుండా, కొనాలని రాజకీయం చేస్తోంది కేంద్రం. దానికి తగిన పనులు ఇంకా మొదలు కాలేదు. మొదట ఆ పనులు ప్రారంభించాలి. లేకుంటే తీవ్ర ఆందోళనతో ఉన్న రైతులను దళారులు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పంటలు సక్రమంగా పండక తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు అరకొరకు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో తీవ్ర ఆందోళనతో ప్రభుత్వ ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. క్వింటా వరి ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.1,960 ఉంటే దళారులు రూ.1,200 నుండి 1,450కే ధర నిర్ణయిస్తున్నారు. ఈ లెక్కన రైతులు భారీ స్థాయిలో నష్టపోతున్నారు. తమది రైతు ప్రభుత్వం అని పదేపదే చెబుతున్న రాష్ట్ర, కేంద్ర పాలకులు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులను నట్టేట్లో ముంచేసినవారవుతారు. అదే జరిగితే రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి మరో ఐదేండ్ల వెనక్కు నెట్టివేయబడుతుంది. అంతేకాదు, అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు మరింత తీవ్రమవుతాయి. అందుకే ముందు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి. త్వరత్వరగా ధాన్యం కొనుగోలు చేపట్టాలి. రాజకీయాలు మాని, కేంద్రం ఇందుకు తోడ్పడాలి. అందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు నడుం బిగించాల్సిన సమయమిది. కేంద్రంపై, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కొట్లాట పెట్టుకునే సమయం కాదిప్పుడు. రైతుల కన్నీళ్లు తుడవాల్సిన సమయమిదని ప్రభుత్వాలు గుర్తించాలి. లేకుంటే పాలకులపై ప్రజల తిరుగుబాటు మొదలవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల ఆర్థికస్థితి చేజారే ప్రమాదం పొంచి ఉంది. ఎన్ని ప్రాజెక్టులు కట్టించినా, ఎన్ని గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేసినా పండిన పంటను కొనకుంటే ఏం లాభం? ఆ ప్రాజెక్టులు, ఆ కరెంటు సరఫరా రైతు బాగుండాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలనే కదా? ఆ లక్ష్యం దారితప్పితే ఎలా? ఆకలి రాజ్యం, అన్నదాత చావు ఎప్పటికీ మంచిది కాదు. ఎద్దూ, ఎవుసం బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించాలి. అన్నదాతను ఆదరించాలి. వారి కష్టానికి ప్రతిఫలం దక్కేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది ఎంతో విలువైన సమయం. ఈ సమయంలో అసలు లక్ష్యం పక్కనబెట్టి కక్షసాధింపు రాజకీయాలు సరికాదు. ఈ పద్ధతి ఎవరికీ, ఎప్పటికీ మంచిది కాదు.
- ఓగోటి కిరణ్కుమార్
సెల్ : 8639518341