Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటక హైకోర్టు హిజాబ్ సమస్యను పరిష్కరించలేక పోయింది. దాని తీర్పు ఉడిపి కళాశాలలో చదువుతూ, హిజాబ్ ధరిస్తున్న విద్యార్థినులను ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉంది. హైకోర్ట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. హైకోర్ట్ తీర్పు చాలా టెక్నికల్‌గా ఉంది, అది ఒక దరఖాస్తువలె, ఇతరుల వాదనను తిరస్కరించే విధంగా, మోసం చేయాలనే ఆత్రుతతో ఉన్నట్లుంది. వాదన సరిగా లేదని పేర్కొనడం ద్వారా ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నా యనే అభ్యర్థనను కొట్టివేసే స్థితికి ఈ అసాధారణ ఆత్రుత వెళ్ళింది.
ఈ హిజాబ్ సమస్య రాజకీయపరమైనది, రాజ్యాంగ పరమైనది కూడా. దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగపరమైన కోణంలో పరిశీలించి, ఈ సమస్య పరిష్కారానికి తగిన తీర్పు ఇస్తుందని ఆశించవచ్చు. కానీ హిజాబ్ సమస్యకు సంబంధించిన రాజకీయ దృష్టికోణం భారతీయ సమాజాన్ని ఇబ్బందులకు గురిచేయడం చాలా కాలం కొనసాగుతుంది. ఆకస్మికంగా బయటకు వచ్చిన ఈ సమస్య, మెజారిటీ మతస్థులలో అంతర్గతంగా గూడుకట్టుకున్న అసహనాన్ని ప్రతిబింబిస్తుందన్న వాస్తవాన్ని బహిర్గతం చేయడానికి గొప్ప పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఉత్తర భారతదేశంలో హిందూ, సిక్కు మహిళలు పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు, మతపరమైన వేడుకలు ఆచరించే ముఖ్యమైన సందర్భాలలో తలలు కనిపించకుండా ముసుగు ధరిస్తారు. వీధుల్లోకి వచ్చి, ఘర్షణ పడడానికి ఇప్పుడు ఓ చిన్న గుడ్డముక్క చాలు. అది భారతీయ సమాజంలో సంభవించిన మార్పుకు ఒక కొలమానంగా మారింది. ఇలాంటి అసహన వాతావరణం లో, సాంప్రదాయ బద్ధమైన సహనం, బహుళత్వం, ఉదారబుద్ధి లాంటి వాదనలు విడ్డూరంగా కనిపిస్తాయి.
నైతిక చట్రం
కానీ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి, ఒక స్నేహపూర్వక వాతావరణంలో, శాంతియుతంగా కొన్ని మిలియన్ల సంవత్సరాలపాటు జీవించడానికి అనుమతించిన ఘనమైన చరిత్ర భారతదేశం కలిగి ఉన్న మాట వాస్తవం. అన్యమతస్థులను తమ మతంలోకి మార్చే చర్యలు మద్దతుదారులను పెంచాయే కానీ, వారు అధిక సంఖ్యాక మతస్థులకు ఎటువంటి సవాలుగా, సమస్యగా తయారవలేదు. బుద్ధుని కారణంగానే ఇతర మతాలకు చెందిన వారి విశ్వాసాల పట్ల సహనం, తోటి మానవుల పట్ల సానుభూతీ, భారతీయ సాంప్రదాయాల్లో అంతర్భాగంగా మారాయి. ఆయనే భారతదేశానికి ఓ నైతిక చట్రాన్ని అందించాడు. ఆ చట్రంలోనే తోటి మానవులతో మన సంబంధాలు, భావనలు రూపుదిద్దుకుంటాయి. నేడు సంభవిస్తున్న మార్పులు ఆ నైతిక చట్రానికి అవతలనే జరుగుతున్నాయి. మనకు బుద్ధుడు వారసత్వంగా సంక్రమింప జేసిన గొప్ప జ్ఞానాన్ని అసాధారణ ప్రతీకారంతో వృధా చేస్తున్నారు.
భారత రాజ్యాంగం, ఆ నైతిక చట్రం యొక్క విధానాన్ని భారతదేశ పరిపాలన కోసం ఆమోదించింది. ఆధునిక యూరప్ పునరుజ్జీవనానికి ఉన్న విధంగానే, సమానత్వం, సమ న్యాయం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు బౌద్ధ సాంప్రదాయాల్లో ఒక భాగంగా ఉన్నాయి. వాస్తవంగా భారతదేశం యొక్క భవిష్యత్తు, చారిత్రక అనివార్యత (నెహ్రూ, అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు రూపొందించిన ఆధునిక దేశ భావాలు) బౌద్ధ మతం యొక్క నైతిక సాంప్రదాయాల్లో, ఆధునిక ప్రపంచ సమానత్వపు ప్రేరేపణల (ప్రచోధనాల) మూలాల్లో ఉన్నాయి. ఆ విధంగా భారత రాజ్యాంగం ఒకవైపు మత స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ కోసం, మరోవైపు దేశ పాలన కోసం లౌకిక తత్వాన్ని సమకూర్చింది. భారతదేశంలో లౌకికతత్వం అంటే అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్ని కలిగి ఉండటం అని అనేక మంది చాలా తీవ్రంగా వాదిస్తారు. ఈ తప్పుడు అవగాహనే, పాలకులు (మతపరమైన ప్రత్యేక దుస్తులు ధరించి, బహిరంగంగా మతాచారాలను పాటిస్తూ) మతపరమైన ఉత్సవాలకు హాజరయ్యే పరిస్థితులకు దారి తీసింది. ఇవి వాస్తవానికి, తమ మత విశ్వాసాలతో ఆచరించే సాంప్రదాయాల కంటే కూడా, ఆ పేరుతో ప్రజలను ఆకట్టుకొని, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందే చర్యలని చెప్పవచ్చు.
విభజన
భారత రాజ్యాంగంలో కూడా యూరప్‌లో వలే రాజ్యం నుండి మతాన్ని వేరుచేసే ఒక విభజన ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి, యూరప్ పునరుజ్జీవన చరిత్రలో ఈ విభజన ఒక ప్రధానమైన పరిణామం. రాజ్యానికి మతం లేదనేది భారత లౌకికతత్వం యొక్క ముఖ్య సారం. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 27, 28లలో స్పష్టంగా ఉంది.
ఏదైనా ఒక మతాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి పన్నులు విధించకూడదని ఆర్టికల్ 27 చెపుతుంది. అంటే ఏ మతానికి అనుకూలంగా ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేయడానికి అనుమతి లేదు. ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థలలో ఎటువంటి మతపరమైన నిబంధనలు పాటించాలని ఆదేశించకూడదని ఆర్టికల్ 28 చెపుతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన లేదా ప్రభుత్వ సహకారంతో నిర్వహించబడుతున్న ఏ విద్యా సంస్థ కూడా మతపరమైన తరగతులకు లేదా ఆరాధనా కార్యక్రమాలకు హాజరు కావాలని ఎవ్వరినీ బలవంతం చేయకూడదని కూడా ఆర్టికల్ 28 చెపుతుంది. మతపరమైన ఆచారాలకు సంబంధించిన లౌకిక కార్యక్రమాలను క్రమబద్ధీకరించే అధికారాన్ని ఆర్టికల్ 25(2)(ఏ) ప్రభుత్వానికి ఇస్తుంది. మతం పేరుతో ఏ విధమైన వివక్షతనైనా ఆర్టికల్ 15 నిషేధిస్తుంది. అన్నిటినీ మించి మత స్వేచ్ఛ ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి ఉండేట్లు చేస్తారు. ఆ విధంగా మన రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ కూడా చట్టం ముందు సమానత్వం, వివక్షతకు గురికాకపోవడం, జీవించే హక్కు, స్వేచ్ఛగా ఉండే హక్కు లాంటి లౌకిక హక్కుల వలె ఎటువంటి అమలుకు నోచుకోవడం లేదు.
పై అంశాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యానికి మతం ఉండదనే నియమం ఆధారంగా భారత రాజ్యాంగంలో లౌకికతత్వాన్ని పొందుపరచారని స్పష్టం అవుతుంది. భారత రాజ్యం ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ శ్రీరాజ్ నారాయణ్ Ê ఏఎన్నార్ కేసు విషయంలో ''రాజ్యం తనకంటూ స్వంతంగా ఎటువంటి మతాన్ని కలిగి ఉండదని'' భారత సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించింది.
ప్రజా జీవితంలో మత దురహంకారం
భారతదేశంలో, ప్రజా జీవితంలో తీవ్రమైన మత దురహంకారం కనపడుతుంది. కాబట్టి, మనం చాలా సౌకర్యంగా లౌకికతత్వం యొక్క అర్థాన్ని 'సర్వ ధర్మ సమభావం'గా మార్చుకున్నాం. ఇది కేవలం అధిక సంఖ్యాకుల ఆధిపత్యానికి (మెజారిటేరియనిజం) దారితీసి, చివరకు మత ప్రాతిపదిక గల రాజ్యం ఏర్పడుతుంది. 'సమభావం' అనే భావన వాస్తవానికి నేటి భారతీయ సమాజంలో లేదు. మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యం, దేశ పతనానికి హామీ ఇస్తుంది. సుమారు 200 మిలియన్ల అల్ప సంఖ్యాక ప్రజలున్న భారతదేశంలో అనేక మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. భారత ప్రభుత్వం, దేశంలో ఆరు అల్ప సంఖ్యాక మతాలను గుర్తించింది. కాబట్టి మత ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యంలో అధిక సంఖ్యాకుల మతమే రాజ్య మతంగా ఉండడం అనేది ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదన.
భారతదేశంలో మత ప్రాతిపదికన రాజ్యం ఏర్పాటు అసాధ్యమని చెప్పే మరొక కీలకమైన అంశం ఏమంటే, అధిక సంఖ్యాకుల మతం ఒక సంక్లిష్టమైన, అసమానతలతో, శ్రేణీగత వ్యవస్థ, అణచివేతతో కూడిన సామాజిక నిర్మాణాన్ని కలిగి ఉంది. మత రాజ్యం, మత సూత్రాల ఆధారంగా పని చేస్తుంది. అంటే భారతదేశంలో అయితే ధర్మ శాస్త్రాల ప్రకారం ఒక ప్రత్యేకమైన కులం మాత్రమే పాలించే హక్కును కలిగి ఉంటుంది. అధిక సంఖ్యాక ప్రజలకు అధికారంలో పాలుపంచుకునే హక్కు ఉండదు. వారికి మానవహక్కులు ఉండవు, అణచివేతకు, అన్యాయానికి వారు శాశ్వత బాధితులుగా ఉంటారు. మత ప్రాతిపదికన ఏర్పడే రాజ్యం మత గ్రంథాలపై ఆధారపడుతుంది. అంటే, భారతదేశంలో రాజ్యం సమానత్వాన్ని, సమాన రక్షణను నిరాకరిస్తుంది. కుల ప్రాతిపదికన వివక్షతను ప్రదర్శిస్తుంది. ఇది శాశ్వత వైరుధ్యాలకు, సమాజ పతనానికి దారి తీస్తుంది.
ప్రాతిపదిక సూత్రం
కాబట్టి, ఒక దేశంగా భారతదేశం, మతంలేని రాజ్యంగా, ఏ మతాన్ని ప్రోత్సహించని లౌకిక రాజ్యంగానే ఉనికిలో కొనసాగుతుందనే ఒక అనివార్యమైన నిర్థారణకు వస్తాం. విద్యావంతులైన భారతీయులు లౌకికతత్వాన్ని ఎగతాళి చేసి మాట్లాడుతూ, అధిక సంఖ్యాకుల మతం ఆధారంగా ఏర్పడే మతరాజ్య భావనను బలపర్చడం అనేది ఆలోచనలు లేని చర్య తప్ప మరొకటి కాదు. వారి మానసిక స్థితి నేటి మత రాజకీయ అల్లరిమూకల ఆర్భాటపు ప్రచారాలతో రూపొందించబడుతుంది. భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి, రాజ్యాంగాన్ని రూపొందించిన మేథావులకు భారతదేశంలోని బహుళ మతాల, బహుళ సంస్కృతుల లక్షణాలు, భారతదేశం యొక్క సామాజిక నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతల గురించి చాలా లోతైన అవగాహన ఉంది. దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి రిపబ్లిక్ యొక్క ప్రాథమిక సూత్రంగా లౌకికతత్వాన్ని ఎంపిక చేశారు. ఒకవేళ లౌకికతత్వాన్ని ఉనికిలో లేకుండా తిరస్కరిస్తే, కష్టపడి సాధించుకున్న దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లుతుందనే వాస్తవాన్ని విజ్ఞులైన ప్రజలు తెలుసుకోవాలి. లౌకికతత్వాన్ని బలోపేతం చేసి, రిపబ్లిక్‌ను కాపాడాల్సిన దేశభక్తియుతమైన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉంది.
- పి.డి.టి. ఆచారి
(''ద హిందూ'' సౌజన్యంతో)
(రచయిత: పి.డి.టి.ఆచారి లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451