Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బి.ఆర్.డి మెడికల్ కాలేజీ నెహ్రూ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత గురించి సీనియర్ డాక్టర్ సతీష్ చౌబే అర్థరాత్రి పంపిన సందేశం మీ జీవితాన్ని ఎలా మార్చివేసింది?
ఆ మెసేజ్ రావడానికి ముందు కేవలం నా పని... నా కుటుంబం అంతే. సామాజిక కార్యకర్తగా ఎప్పుడూ ఎటువంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదు. అఖ్లాక్ ఎవరో, గౌరీ లంకేశ్ ఎందుకు చంపబడ్డారో అందరికీ తెలుసు. కానీ కులం, మతం పేరుతో ఈ ద్వేషం నాకు ఎప్పుడూ తెలియదు. మాకు చదువుకునే రోజుల్లో రోగి దేవుడని చెప్పారు. అందుకే ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడేందుకు నేను చేయగలిగింది చేశాను.
ఐదు వందల రోజుల జైలు శిక్ష తర్వాత ఈ నాలుగేండ్లలో నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి. మూడుసార్లు నన్ను హంతకుడని, దొంగ అని పిలిచి జైలుకు పంపారు. నా కుటుంబం విచ్ఛిన్నమైంది. మా అమ్మ, నా భార్య పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్‌ని, కమిషనర్ని కలవాల్సి వచ్చింది. నేను పుట్టి పెరిగిన గోరఖ్‌పూర్‌లో అంటరానివాడిని అయ్యాను. మా ఇంటికి ఎవరూ రారు. నేను జైలులో ఉన్న 9 నెలల కాలంలో ఎవరూ నన్ను కలవడానికి రాలేదు. నన్ను నాలుగేండ్లకు పైగా సస్పెండ్ చేశారు. కోర్టు నాకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా నన్ను తొలగించారు. అలా ఆ ఒక్క సందేశంతో నా జీవితం తలకిందులైంది.
ఇప్పుడు డాక్టర్ కఫీల్ కేవలం డాక్టర్ మాత్రమే కాదు. అతనో ఉద్యమకారుడు. హిస్టరీ షీటర్. చివరకు రచయితగా మారాడు. నేను వైద్య శిబిరాలు నడుపుతూనే ఉన్నాను. నా జీవిత లక్ష్యం మారిపోయింది. ఆరోగ్య సంరక్షణ హక్కును చట్టంగా తీసుకురావడమే నా లక్ష్యం. ప్రతి ఒక్క పౌరుడూ తన ఇంటికి మూడు-నాలుగు కిలోమీటర్ల దూరంలో వైద్యం పొందాలి. ఆ దిశగా కృషి చేస్తున్నాను.
గోరఖ్‌పూర్ ఆసుపత్రి విషాదం ఎలా నివారించబడిందని భావిస్తున్నారు? జపనీస్ ఎన్సెఫాలిటిస్ (మెదడువాపు వ్యాధి)తో ప్రతి సంవత్సరం పిల్లలు చనిపోతున్నారని అంటారు!
ఆక్సిజన్ సరఫరా చేసే 'పుష్పా సేల్స్' సంస్థ... బి.ఆర్.డి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌కు, ఆరోగ్యశాఖా మంత్రికి, ముఖ్యమంత్రికి 14 లేఖలు రాసింది. ఆ లేఖ అందిన వారెవరూ ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. వారు సకాలంలో డబ్బు చెల్లించి ఉంటే పెను ప్రమాదం తప్పేది. పైగా అదే సంవత్సరం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య బడ్జెట్‌ను 50శాతం తగ్గించింది.
ఇకపోతే ఏటా పిల్లలు చనిపోతున్నారు. ఇది సరి కాదు. ప్రతి ఒక్క ప్రాణం విలువైనదే. జపనీస్ మెదడువాపు వ్యాధి కారణంగా ప్రతి రోగి చనిపోతాడనేది అబద్ధం. ఆ 54 గంటల్లో మరణించిన పిల్లలలో డెబ్బై శాతం నవజాత శిశువులు. వారు ఆరు నెలల లోపు పిల్లలు. జపనీస్ ఎన్సెఫాలిటిస్తో నవజాత శిశువు ఎవరూ చనిపోరు. వారు ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్ అందక పద్దెనిమిది మంది పెద్దలు కూడా చనిపోయారు.
చిన్నారులకు ఆక్సిజన్ కొరత ఎందుకు ఏర్పడిందంటారు?
ఆగస్టు 10వ తేదీ ఉదయం... ఆక్సిజన్ తక్కువగా ఉందని, హెచ్చరికను పట్టించుకోలేదని... నా డిపార్ట్మెంట్ హెడ్ మహిమా మిట్టల్‌కు లేఖ వచ్చింది. డాక్టర్ సతీష్ కుమార్ ఆ లేఖను ప్రిన్సిపాల్‌కి ఫార్వార్డ్ చేసి, ముంబైలోని తన కుమారుడి కాన్వకేషన్‌కు ఎందుకు వెళ్లిపోయారో నాకు తెలియదు. డాక్టర్ శుక్లా కనీసం పిల్లల వార్డుకు కూడా రాలేదు. నేను ఆయనకు ఫోన్ చేసినప్పుడు, తన ప్రయివేట్ ప్రాక్టీస్‌లో ఉన్నారు. అది జాతీయ న్యూస్ అయ్యాక వారు కదిలారు.
పుస్తకం మొత్తంలో మీరు ఆక్సిజన్ సిలిండర్ల కొరత గురించి మాట్లాడతారు. అయితే ఎలాంటి కొరత లేదని జిల్లా మేజిస్ట్రేట్ మీడియాకు తెలిపారు. అంతేగాక ... 24 గంటల్లో 23 మంది పిల్లలు చనిపోయారని విన్నాం. అసలు వాస్తవాలేంటో చెప్తారా?
జిల్లా మేజిస్ట్రేట్ మధ్యాహ్నం తన కార్యాలయంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆక్సిజన్ కొరత ఉందని స్పష్టంగా చెప్పారు. అనేక చోట్ల నుండి సిలిండర్లు ఏర్పాటు చేయబడ్డాయి. కమిషనర్ కూడా ఆక్సిజన్ కొరతపై నివేదిక ఇచ్చారు. సాయంత్రం జిల్లా మేజిస్ట్రేట్ తన వైఖరి మార్చుకున్నారు. బి.ఆర్.డి వైద్య కళాశాలలో 54గంటల పాటు లిక్విడ్ ఆక్సిజన్ లేదు.
చిన్నారుల ప్రాణాలను కాపాడిన మీరు అందరికి హీరో అయ్యారు. హఠాత్తుగా అంతా ఎలా మారిపోయింది?
ఆగస్టు 10 రాత్రి నుండి రెండు రోజుల పాటు, పిల్లలను రక్షించడానికి నేను చేసిన ప్రయత్నాలను చూసి స్థానిక స్ట్రింగర్ రాసిన కథనాన్ని ప్రధాన మీడియా ప్రసారం చేసింది. ఆ కథే నన్ను హీరోగా నిలబెట్టింది. అయితే ఆగస్టు 13 రాత్రి ముఖ్యమంత్రిని కలిసిన నేపథ్యంలో నేను విలన్‌గా మారాను.
ఆదిత్యనాథ్‌ను గద్దె దింపడానికి భారతీయ జనతా పార్టీలో కుట్ర జరిగిందని నేను భావిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి వైద్యుల బృందాన్ని పంపడం నాకు ఇప్పటికీ గుర్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా కూడా వచ్చారు. ముఖ్యమంత్రి వారితో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. తనను తాను రక్షించుకోవడానికి, ముఖ్యమంత్రికి ఒక బలిపశువు అవసరం. ఆయనొక బలిపశువును కనుగొన్నారు.
నాతో మాట్లాడేందుకు ప్రధాన మీడియాకు సంబంధించిన వారెవరూ గోరఖ్‌పూర్‌కు రాలేదు. ''తూ సోచ్తా హై సిలిండర్ లా కర్ తూ హీరో బన్ జాయేగా (ఆక్సిజన్ సిలిండర్లు తీసుకురావడంతో హీరో అయిపోతాననుకుంటున్నావు)'' అన్న సి.ఎం మాటలు నాకే కాదు. నడ్డా సాహిబ్‌ని కూడా ఉద్దేశించినవి. 'ఇది నా (ఆదిత్యనాథ్) గోరఖ్‌పూర్' అన్న సందేశాన్ని... ఎంపిక చేసిన మీడియా సంస్థలు పంపిణీ చేశాయి. ఆక్సిజన్ సిలిండర్లను దొంగిలించి నా ప్రయివేట్ క్లినిక్‌కి తీసుకెళ్లానని వారు ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాపించింది. ఘటనను కప్పిపెట్టడంలో సహకరించిన వారికి 'ప్రతిఫలం' లభించింది. ఉదాహరణకు, డాక్టర్ మహిమా మిట్టల్ (పీడియాట్రిక్స్ హెచ్ఒడి) ఇప్పుడు గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆమెనెవరూ ప్రశ్నించలేదు.
మీలోని డాక్టర్‌ను సామాజిక కార్యకర్త అధిగమించాడా?
అవును, డాక్టర్ కఫీల్ ఖాన్ ఇప్పుడు కార్యకర్తగా మారాడు. జీవితంలో మంచి పని చేసినా, ఉన్నత చదువులు చదివినా శిక్ష పడవచ్చని జైలులో ఉన్నప్పుడు గ్రహించాను. నేను 500రోజుల తర్వాత బయటకు వచ్చాను. కాని చదువు లేనివారు, పేదలు, అణగారినవారు... హైకోర్టులు, సుప్రీంకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లేందుకు వనరులు లేని వారి పరిస్థితి ఏమిటి? పది, ఇరవయ్యేండ్లగా జైల్లో ఉన్నవారిని చూశాను. వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఆదిత్యనాథ్ ప్రభుత్వం నా మీద ఎన్.ఎస్.ఎ ప్రయోగించినప్పటికీ, కోర్టు నాకు ప్రతిసారీ క్లీన్ చిట్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఒక పౌరుడిగా ఎవరికైనా, ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. కానీ వైద్యం నా వృత్తి. నా వృత్తి అంటే నాకు చెప్పలేనంత ప్రేమ. ఒక బిడ్డ అనారోగ్యాన్ని నయం చేసిన రోజు నేను సంతోషంగా ఉంటాను. గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్ర పోగలుగుతాను.