Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రమాదాలు అరికడతామనే సాకుతో బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా మోటార్ వాహన చట్టం-2019 అమలులోకి తెచ్చింది. కేంద్రంలోని ఈ చట్టం రవాణారంగ కార్మికులు, ప్రజలపై అనేక భారాలను మోపుతున్నది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో రవాణారంగ కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులను తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పుండు మీద కారం చల్లిన చందంగా ఏప్రిల్ 1 నుండి వివిధ రకాల పెనాల్టీలను భారీగా పెంచింది. ముఖ్యంగా ఫిట్నెస్ రెన్యువల్ గడువు దాటిన ప్రతిరోజు రూ.50లు ఫైన్ చెల్లించాలని రూల్స్‌లో పేర్కొంది. లక్షల సంఖ్యలో ఉన్న వాహనాలపై ఫిట్నెస్ చేయించాలంటే వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక ఆటో కార్మికుడు ఫిట్నెస్ కోసం స్లాట్ బుక్ చేస్తే లేట్ ఫీజు పేరుతో రూ.47,350లు వచ్చింది. దీంతో రవాణా కార్మికులు బెంబేలెత్తి పోతున్నారు. గూడ్స్ వాహనంలో ఓవర్ లోడింగ్ ఉందన్న నెపంతో రూ.25,000లు ఫైన్ వేశారు. గతంలో రూ.1,000లు ఉండేది. రెండు టన్నులు ఎక్కువ ఉందని రూ.2,000లు అదనపు ఫైన్ వేశారు. మొత్తంగా రూ.27,000లు ఫైన్ వేశారని కార్మికులు తమ గోడును వెళ్ళబోస్తున్నారు. ఈ రకంగా ప్రస్తుతం ఉన్న పెనాల్టీలపై వందల రెట్లు పెంచి కార్మికుల వద్ద డబ్బులు గుంజుతున్నారు. హెల్మెట్ లేకపోతే రూ.1,000లు, సీట్ బెల్ట్ లేకపోతే రూ.1,500లు, లైసెన్స్ లేకపోతే రూ.2,000లు, యూనిఫామ్ లేకపోతే రూ.1,000లు జరిమానా, వాహనం ఓవర్ స్పీడ్‌గా నడిపితే రూ.5,000లు జరిమానా, వాహన ఇన్సూరెన్స్ లేకపోతే రూ.2,000లు...! రిజిస్ట్రేషన్ చేయని వాహనం నడిపితే గతంలో రూ.2,000లు జరిమానా ఉండేది, ఇప్పుడు వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.5,000లు, 2వ సారి పట్టుబడితే రూ.10,000లకు పెంచారు. లైసెన్స్‌కు అర్హులు కాని వారు (వయస్సురీత్యా) వాహనం నడిపితే గతంలో రూ.1,000లు జరిమానా ఉండేది. ప్రస్తుతం రూ.2,500లతో పాటు 3 నెలలు జైలు శిక్ష ఉంటుందనే నిబంధనలు పెట్టారు. ఈ పెంచిన పెనాల్టీలతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న ఆటో, ట్రాలీ, క్యాబ్, డిసిఎం, లారీ, స్కూల్ బస్, అంబులెన్స్, ట్రాక్టర్, మినీ డిసిఎం, హైయర్ బస్, జెసిబి, ట్రక్కు కార్మికులు, సొంత వాహనదారులపై తీవ్రమైన ఆర్థిక భారాలు మోపుతున్నారు. దీని ప్రభావంతో రవాణారంగ కార్మికులు ఈ వృత్తి నుండి దూరమయ్యే ప్రమాదం ఉంది.
15ఏండ్లు దాటిన కమర్షియల్ Ê పర్సనల్ వాహనాలను గడువు పూర్తయ్యిందనే పేరుతో స్క్రాప్ చేయాలని చట్టం తెచ్చారు. దీనియొక్క నష్టం కార్మికుల పైనే కాదు, స్వంత వాహనాలు కలిగిన వారి మీద కూడా ఉంటుంది. ఉదా: ఒక రిటైర్డ్ ఆర్టిఓ అధికారి మాట్లాడుతూ... నేను నా వాహనం కొని 15ఏండ్లు దాటింది. ఆ వాహనం నేను ఇళ్ళు, ఆఫీస్‌కు మాత్రమే ఉపయోగించాను. లక్ష కిలోమీటర్లు కూడా దాటలేదు. అయినా ఇప్పుడు దానిని స్క్రాప్ చేయాలంటే నేను అన్నివిధాలా నష్టపోతున్నాను. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏరకం గానూ సరికాదన్నారు. ఇలాంటి వాహనాలు లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇవి స్క్రాప్ చేస్తే వాటి స్థానాల్లో కొత్త వాహనాలు కొనాల్సి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడానికే బీజేపీ ప్రభుత్వం రవాణారంగ కార్మికులపై, ప్రజలపై ఈ రకమైన భారాలు వేస్తున్నది.
కరోనా కారణంగా గత రెండేండ్లుగా ఆటో, ట్యాక్సీ, గూడ్స్ కార్మికులకు సరైన కిరాయిలు లేవు. ఇప్పటికే లక్షలాది రవాణారంగ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఇక పెట్రోల్ ధర రూ.120లు, డీజిల్ ధర రూ.106లకి పెరిగాయి. మరోపక్క ఈఎంఐలు చెల్లించాలని ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిడి పెంచి వాహనాలను సీజ్ చేస్తున్నారు. పెరిగిన ధరలు, పెనాల్టీల వల్ల కనీసం ఈ కార్మికులు రోజుకు సగటున రూ.700లు కూడా సంపాదించలేక తమ వాహనాలు అమ్మివేసి ఇతర కూలీ పనులకు వెళ్ళాల్సిన దుస్థితిని అనుభవిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 15లక్షల మంది రవాణారంగ కార్మికులు పని చేస్తున్నారు. ఈ కార్మికులు రోడ్డున పడకుండా, రవాణా రంగ రక్షణకై టిఆర్ఎస్ ప్రభుత్వం చొరవ చేయాలి. పెంచిన ఫిట్నెస్, లైసెన్స్ తదితర ఫైన్లు రాష్ట్రంలో వసూలు చెయ్యమని, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. సింగరేణి బ్లాకులు అమ్మనీయకుండా, రైతుల ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఏవిధంగా పోరాడుతున్నదో, అదే పద్ధతిలో స్వయం ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న ఈ రవాణారంగ కార్మికులను, రవాణారంగాన్ని రక్షించుకోవడం కోసం అండగా నిలబడాలి. అన్ని రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను కలుపుకొని కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.
దేశంలో మొన్న రైతాంగం చేసిన చారిత్రాత్మక పోరాటం, నిన్న కార్మికవర్గం చేసిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రవాణారంగ కార్మికులకు ఆదర్శం కావాలి. మన హక్కులు కాపాడుకోవాలన్నా, రవాణారంగాన్ని రక్షించుకోవాలన్నా, పెరిగిన పెనాల్టీలను వెనక్కి కొట్టాలన్నా మనకు పోరాటం తప్ప మరో మార్గం లేదు.
అందుకే ఏప్రిల్ 11న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ముందు ధర్నాలు జరపాలని తెలంగాణ పబ్లిక్ Ê ప్రయివేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐఆర్టిడబ్ల్యుఎఫ్- సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ ధర్నాలో కార్మికులు వేలాదిగా పాల్గొనాలి.
- పుప్పాల శ్రీకాంత్