Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ మధ్య అంటే చాలా ఏండ్ల క్రితం సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం బాగా జరిగేది. ఎవరైనా ఓ సీనియర్ నటుడు లేదా నటి ప్రెస్సు వాళ్ళతో కాస్త రాజకీయాలకు సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడితే అది సినిమాల విషయం కూడా కావచ్చు, వెంటనే ఫలానా నటి లేదా నటుడు త్వరలో రాజకీయ అరంగేట్రం అని వార్తా శీర్షికలు వచ్చేవి. అందుకే ఈ మధ్య కొత్త సినిమాలు ఒప్పుకోలేదు, ఒప్పుకున్న సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నారు అని అవీ ఇవీ కలిపి మసాలా వార్తలు రాసేవారు. గ్లామరు ప్రపంచంలో ఏది జరిగినా బయటి ప్రపంచానికి దాని గురించి తెలుసుకోవాలన్న ఉబలాటం ఎక్కువ. అందుకే వాటికి ఆదరణ ఎక్కువ.
కాలం మారింది. ఇప్పుడంటే ఇప్పుడే కాదు కాని కొన్ని సంవత్సరాల క్రితమే క్రికెట్ క్రీడాకారులు కూడా మేము సైతం అంటూ రాజకీయాల్లోకి దూకి, అలా అనడం కంటే దూరి అనొచ్చు, అక్కడా తమ పనితనాన్ని చూపిద్దామని ప్రయత్నిస్తున్నారు. కొంత కాలం బాగానే ఉన్నా తరువాత దెబ్బలు తింటూనే ఉన్నారు కూడా. బ్యాటు, బంతితో ఆడటం తమకు సులువైన పని. దాంతోనే పేరు, డబ్బు, తరువాత పదవులు, వ్యాఖ్యాతలుగా కూడా రాణించి వయసు మీదపడే కొద్దీ స్థిమితంగా ఉండలేక, అవతలవారిని ఉండనివ్వక తమదైన శైలిలో హల్చల్ సృష్టిస్తుంటారు. ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండడం ముఖ్యం. అంతకు ముందు ఆట ఆడే రోజుల్లో తమ శక్తికి ఈ పానీయమే కారణం అని చెప్పినోళ్ళను వయసు మీద పడ్డాక పక్కకు పెట్టి కొత్తవాళ్ళను తీసుకోవడంతో మొదలైన వీళ్ళ బాధలు మింగలేక కక్కలేక, ఎక్కడో ఓ చోట వాటిని ఖాళీ చేయాలి కాబట్టి రాజకీయాలనెంచుకుంటారు. లేదా ఆ క్రీడలోనే ఉన్నా అక్కడ రాజకీయాలను నడిపిస్తారు. ఇక బయట ఉన్న నిజమైన రాజకీయ నాయకులు మాత్రం రాజకీయాలంటే బ్యాటు బంతితో ఆడినంత సులువేమీ కాదు అన్న డైలాగులు వదులుతుంటారు. ఇంకోవైపు నాయకులు ఈ పాత ఆటగాళ్ళనే తమ రాజకీయ క్రీడలో వాడుకోవాలని చూస్తారు. మొత్తం మీద క్రీడలైనా, రాజకీయ క్రీడలైనా ఆడడం, ఆడుకోవడం ముఖ్యమని తెలుసుకోవాలి.
అసలు ఓ ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అదేమంటే సదరు క్రీడాకారులు తాము బాగా ఆడిన రోజుల్లో బ్యాటుతో ఎన్ని తలలు పగులగొట్టారు, బాలును గిల్లి ఎన్ని వికెట్లు సాధించారు, ఏ ఏ కప్పులు సాధించారు, అవి ఎలా సాధించారు, సాటి క్రీడాకారులను ఎలా బూతులు తిట్టారు, పరుగులు తీసేవారిని తెలియనట్టు ఎలా గాయపరిచారు, బంతిని విసిరేటప్పుడు పిచ్చుపై ఎలా గుంతలు పడగొట్టారు మొదలైన వివరాలు తెలుసుకోవాలి. నీ మిత్రులెవరో చెప్పు నీ గురించి చెబుతాను అన్న షేక్సిపియర్ మహానుభావుడి మాటలను అలాగే ఉపయోగించుకొని, ఇంకా ముందుకెళ్ళి ఆడేరోజుల్లో ఎలా ఉన్నావో చెప్పు, ఆట అయిపోయాక ఎలా ఉంటావో మేము చెబుతాము అనొచ్చు కూడా. ఎందుకంటే మానవుడి స్వభావం ఏ రంగంలోనికి పోయినా మారదు కాబట్టి.
ఇక రాజకీయాల్లో నటులను, క్రీడాకారులను మాత్రమే వాడుకుని ఆడుకుంటారా లేక ఇతరులను కూడా ఆ పనికి వినియోగించుకుంటారా అని పరికిస్తే మనకు చాలా విషయాలు బోధపడతాయి. అంతకు ముందు కొన్ని రాష్ట్రాల్లో తమ పార్టీల తరపున బాగా ఉల్లాసంగా పనిచేసిన, బాగా మాట్లాడి ఎందరినో ఆకర్షించి ప్రజల మనసుల్లో విషం నింపినవాళ్ళకు కూడా తమ రాజకీయాల తరువాత, లేదా తమను రాజకీయాలనుండి పక్కకు పెట్టిన తరువాత ఎలాంటి పదవులిచ్చి వారి సేవల్ని తిరిగి వాడుకోవడం చేస్తారో కూడా మనం గమనిస్తుండాలి. సై అంటే సై అంటూ ఇతర పార్టీ ప్రభుత్వాల మీదికి కాలు దువ్వడం ఇప్పుడు కొత్త కాదు. రాజకీయాల్లో ఉన్న అతి పురాతన పార్టీ నుండే ఇలాంటి రాజకీయ క్రీడలు మేము నేర్చుకున్నామని, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎలా పని చేశారు, ప్రభుత్వాలు పడగొట్టారు మొదలైన గణాంకాలు సిధ్ధంగా పెట్టుకొని ఇవతలవారూ సిధ్ధంగా ఉంటారు.
బంతీ చామంతీ మీద పాట రాసి అది సినిమాలో హిట్ చేయడం ఎంత సులభమో బంతి బ్యాటును వాడుకొని రాజకీయాల్లో హిట్లు సాధించడం కూడా కొందరికి వెన్నతో పెట్టిన విద్య. ఆ వెన్న, పాలు, పెరుగు, ఇంకా ఇతర పాల పధార్థాలు ఏ రాష్ట్రం నుండి తెప్పిస్తున్నారు అన్న ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు!! ఇందాక చెప్పుకున్నట్టు తమకు కావలసిన వారిని, డైరెక్టుగా రాజకీయాల్లోకి వస్తే తమకే అడ్డు తగులుతారని భావించిన వాళ్ళను, వాళ్ళ సేవలను వాడుకుని వాళ్ళనే బంతిలాగా వాడుకునే వాళ్ళనూ మనం చూడొచ్చు. ఒక్కటి మాత్రం నిజం, బంతీ చామంతి అంటూ స్టెప్పులేసినంత సులభం కాదు ఈ రాజకీయాలు. అలాగే బంతిలా ఎగిరెగిరిపడే రబ్బర్ సింగులు నానా రకాల వేషాలు వేసినా ప్రజలు దగ్గరినుండి గమనిస్తుంటారన్న విషయం మనం గమనించాలి.
ప్రపంచ ఖ్యాతి పొందిన క్రీడాకారులని పెద్ద పెద్ద జీతాలిచ్చి చట్టసభల్లో సభ్యత్వమిచ్చినా ఒక్కరోజు కూడా సభకుపోయి ప్రజల గురించి మాట్లాడిన దాఖలాలే లేని వాళ్ళనీ చూశాం. బంతినీ, బ్యాటునూ, అవి సంపాదించి పెట్టిన డబ్బునూ ప్రేమించినంతగా ప్రజలను ప్రేమించాలన్న సంగతి వీళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే వాటికి సార్థకత. ఒక దశవరకూ సంపాదించిన దాంట్లో కొంత భాగం ప్రజలకు ఖర్చుచేయాలన్న ఆలోచన కలిగి ఉండటం కనీస ధర్మం. సొంత ఆస్తి ఏమీ లేని నాయకులు, ఓ రెండు జతల బట్టలు మాత్రమే వేసుకొని ఎన్నో గొప్ప పదవుల ద్వారా ప్రజలకు దగ్గరవ్వడమే కాదు ఎంతో సేవ చేశారన్న విషయం కూడా తెలుసుకోవాలి. బంతి, బ్యాటు, ఓ రాజకీయ పార్టీనే కాదు, వాటికంటే ముఖ్యమైన ప్రజలు ఉన్నారన్న ఆలోచన కూడా ఉండాలి.
సెల్: 9849753298
- జె. రఘుబాబు