Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలా చెలగాటమాడుతుందో, సమాఖ్య సూత్రాలకు ఎలా మంగళం పాడుతుందో అర్థంకావడానికి తాజా ఉదాహరణ తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రహసనం. ఒక్కసారిగా కేసీఆర్ ప్రభుత్వ మనుగడనే ప్రశ్నించే స్థాయికి ఆమె వెళ్లడం కొందరికి ఆశ్చర్యంగా కనిపించవచ్చు గాని, మోడీ హయాంలో గవర్నర్ల తీరు చూస్తున్న వారికి అలా అనిపించదు. కేవలం కేంద్రం తరపున నియమితులై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వ్యవహరించాల్సిన గవర్నర్లు వాటిపై స్వారీ చేయడానికి ప్రయత్నించడం, వాటిపై విషపుదాడికీ బహిరంగ వివాదాలకూ దిగడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్, కేరళ గవర్నర్ అరిఫ్ మొహ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ ఇలా చాలా మంది రాజ్భవన్లను రాజకీయభవన్లుగా మార్చేయడమే గాక రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యక్ష శత్రువులుగా తయారై కూచున్నారు. ఇక కేంద్రం అదీనంలోనే నడిచే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వంటివారి సంగతి చెప్పనవసరం లేదు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి తెలంగాణ గవర్నర్‌గా వచ్చిన తమిళిసై కూడా ఏకు మేకైనట్టు ఆ జాబితాలో చేరిపోయారు. నేను తల్చుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడో రద్దయి ఉండేది కాదా అని ఆమె సవాళ్లు విసరడం రాజ్యాంగ సూత్రాలను ఘోరంగా అవమానించే అప్రజాస్వామికతకు పరాకాష్ట. అలాంటి అవకాశం ఏ కోశాన ఉన్నా ఆమె గాని, ఆమెను శాసించే మోడీ సర్కారు గాని వదలిపెట్టి ఉండేవారేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ రామ్‌లాల్ నాదెండ్ల భాస్కరరావు కుమ్మక్కుతో కూలదోసినప్పుడు ప్రజలు ఎలాంటి పాఠం నేర్పారో ఎవరికి తెలియదు? ఇంచుమించు అదే సమయంలో కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లాను కూలదోసిన ఫలితంగా పెరిగిన తీవ్రవాదానికి దేశం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తూనే ఉంది. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ రాజ్‌భవన్‌ను గాంధీభవన్‌గా మార్చిన మరో జగడాలమారి కుముద్‌బెన్ జోషికూడా ఎలా నిష్క్రమించాల్సి వచ్చింది. వందల సార్లు 356వ అధికరణాన్ని దుర్వినియోగం చేసిన గవర్నర్ల నిర్వాకాలు... సర్కారియా కమిషన్ సిఫార్సులు, ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ బీజేపీ కేంద్రంలో ఆధిక్యత సంపాదించాక ఆ ఉదంతాలను మరిపించేలా రాజ్‌భవన్ లను కమల్ భవన్లుగా మార్చి కమాల్ చేస్తున్నది.
రాజ్‌భవన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
వికె నరసింహన్ తర్వాత గవర్నర్‌గా వచ్చిన తమిళిసై మొదట్లో జాగ్రత్తగా వ్యవహరించినా ఆమె రాజకీయ ఉద్దేశాలు ఎన్నడూ బహిర్గతమవుతూనే వచ్చాయి. వృత్తిరీత్యా వైద్యురాలు గనక కరోనా కాలంలో తనకు తానే సమీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ విధానంపై వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. అధికారులను పిలిపించుకుని ఆదేశాలిచ్చేందుకు ప్రయత్నించారు. మీడియాతో తన వ్యక్తిత్వం, తన పద్ధతులు వీటి గురించి చాలాసార్లు చెబుతుండేవారు. అలాంటి ఒక సందర్భంలోనే ఈ వ్యాస రచయిత ఇతర రాష్ట్రాలలో బీజేపీ గవర్నర్లు సృష్టించిన వివాదాల గురించి చెబితే గవర్నర్‌గా నాపాత్ర కంటే ఎక్కువ చేయను తక్కువ చేయను అంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే ఆమెను పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా నియమించడం, అక్కడ ప్రభుత్వం కూల్చివేత తర్వాత బీజేపీతో కూడిన మిశ్రమ సర్కారును ప్రతిష్టించడం తమిళిసై ఆధ్వర్యంలోనే జరిగాయి. తెలంగాణ గవర్నర్‌గా ఉన్నా తమిళనాడులో సమావేశాలూ గోష్టులూ నిర్వహించి తన రాజకీయ స్థానాన్ని పెంచుకోవడానికి తాపత్రయపడటం తెలిసిన విషయమే. ఈ అత్యుత్సాహ వైఖరిని ఉపయోగించుకుని బీజేపీయే గాక కాంగ్రెస్ నాయకులు కూడా తరచూ రాష్ట్ర వ్యవహారాలలో ఆమెజోక్యాన్ని కోరడం పరిపాటి అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కౌశిక్‌రెడ్డిని కేసీఆర్ శాసనమండలికి నామినేట్ చేయాలని ప్రతిపాదించారు. నిస్సందేహంగా ఇది రాజకీయ నిర్ణయమే. కాని ఇదే మొదటిసారి కాదు. తమిళిసై ఆ సిఫార్సుపై ఎటూ తేల్చకుండా చాలా సమయం తీసుకున్నారు. ఈలోగా మీడియలో తన అనంగీకారం గురించి లీకులు వచ్చాయి. తర్వాత తిరస్కరించారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ ఆమోదించవలసిందే గాని తిరస్కరించడం సాధ్యం కాదు. మహా అయితే ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైతే తర్వాత కోర్టులో సవాలు చేయొచ్చు గానీ వీటో చేసే అధికారం గవర్నర్‌కు ఉండదు. పైగా ఈ విషయంలో బీజేపీ తీరు చాలా దారుణమనడానికి తమిళిసై నియామకమే నిదర్శనం. కొంతమందిలా ఆమె మాజీమంత్రి లేదా ఏదైనా పదవి నిర్వహించిన వ్యక్తి కూడా కాదు. కేవలం ఆపార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలు.
హుజూరాబాద్ తర్వాత వరస వివాదాలు
హుజూరాబాద్‌లో విజయం తర్వాత బీజేపీ దాడి పెరిగిన స్థాయిలోనే ఆమె కూడా దూరం పెంచుకుంటూవచ్చారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి వెళ్లకపోవడం ఇందులో మరో దశ. అయితే కొందరు మంత్రులు వెళ్లారు. ఈ సమయంలోనే సమ్మక్క సారక్క జాతరలో ఆమెను ఎవరూ స్వాగతించలేదని కాంగ్రెస్ ఎంఎల్ఎ సీతక్క దుమారం లేవదీయడంతో ఈ వివాదం కొత్తమలుపు తీసుకుంది. బడ్జెట్ సమావేశాల సంయుక్త సమావేశంలో ఆమె ప్రసంగం ఏర్పాటు చేయకపోవడం ఇందుకు పరాకాష్టగా మారింది. రాజ్యాంగం 175వ అధికరణం ప్రకారం ప్రతి ఏటా తొలి సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే గతసారి సమావేశాలు ప్రొరోగ్ కాలేదు గనక ఇది కొనసాగింపేనని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ విషయం ఆమెకు చెప్పారు కూడా. దానికి అంగీకరించి ఆమె సభలు నిర్వహించడానికి, ఫైనాన్స్ బిల్లు సమర్పణకు అనుమతిస్తూ సంతకం చేశారు. కానీ, మరోవైపున బీజేపీ నాయకులు ఇది రాజ్యాంగ ఉల్లంఘన, అవమానం అంటూ గగ్గోలు మొదలు పెట్టారు. గవర్నర్ హాజరైనప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చదవాల్సిందే. (కేరళలో ఆరిఫ్‌ఖాన్ అందుకు భిన్నంగా వ్యవహరించి విమర్శలు మూటకట్టుకున్న ఉదంతం ఇక్కడ గుర్తుచేయాలి) టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాయితీ పాటించలేదన్నది నిజమైనా నిబంధనల ప్రకారం వ్యవహరించినప్పుడు ఎవరైనా ఎలా తప్పు పడతారు? దీనికొనసాగింపుగా యాదాద్రి పర్యటన పెట్టుకున్నారు. యాదాద్రికి ప్రధాని మోడిని పిలిచివచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ విధానమార్పుతో అసలైన ముహూర్తానికి ఆహ్వానించలేదు. అసలు ముహూర్తం పెట్టిన చినజీయర్ స్వామితోనూ దూరం పాటిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్ యాదాద్రికి వెళ్లడంలో రాజకీయం లేదనిచెప్పలేం. ఆమెకు ప్రొటోకోల్ మర్యాదలు జరగలేదని మీడియా కథనాలు రాసింది. గంటముందే తమకు చెప్పడం వల్ల చేయలేకపోయామని, యాదాద్రి దేవస్థానం చైర్మన్ ఆమెను స్వాగతించారని సంబంధిత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెబుతున్నారు. ఏదైనా ఇవన్నీ మర్యాదలకు సంబంధించిన విషయాలే గాని ప్రజలకు లేదా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కాదు.
ఈ పూర్వరంగంలో గవర్నర్ ముందుగా ప్రకటించి మరీ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీకి, హోం మంత్రి అమిత్‌షాకు తనను అవమానిస్తున్నట్టు ఫిర్యాదుచేయడం అసాధారణ పరిణామం. మోడీపై పార్లమెంటులో టీఆర్ఎస్ సభ్యులు హక్కుల తీర్మానం ఇచ్చారు గనకే ఈ వైఖరి తీసుకున్నట్టు మీడియాకు చెబుతున్నారు. ఏమైనా ఢిల్లీ ఫిర్యాదు తర్వాత ఆమె తీరు గమనిస్తే ప్రభుత్వంతో ఘర్షణ పెంచుకోవాలనీ, దాడి పెంచాలనీ కేంద్రం ఆదేశించినట్టు స్పష్టమవుతుంది. ఢిల్లీలోనే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అస్త్రాలు సంధించారు. కౌశిక్‌రెడ్డి నియామకం తప్పన్నారు. వద్దనుకున్నా అది అంతర్గతంగా తెలియజేయవలసిన విషయమే గాని బహిరంగ వివాదం చేయాల్సిన పనిలేదు. రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడు స్వప్నదాస్ గుప్తా రాజీనామా చేసి బెంగాల్లో బీజేపీ తరపున శాసనసభకు పోటీచేశారు. ఓడిపోయాక ఆయనను మళ్లీ నామినేట్ చేశారు. అలాంటి పార్టీ ఇతరులకు నీతులు చెప్పడమా? తను ఎక్కడకైనా రోడ్డు మార్గంలోనో రైలులోనో వెళ్లవలసిందేనంటూ హెలికాఫ్టర్ లేదా విమానం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని దెప్పిపొడిచారు. గతంలోనూ గవర్నర్లు అన్ని మార్గాలలో ప్రయాణించారు గానీ ప్రభుత్వం హెలికాఫ్టర్ ఇచ్చి తీరాలని నిబంధనలేమీ లేవు. ఇవన్నీ సంప్రదాయాలే తప్ప రాజ్యాంగ నిబంధనలు కాదు. ఇప్పుడు ఆమె భద్రాద్రి వెళితే ముఖ్యమంత్రి వెళ్లకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అది ఆయన నిర్ణయం.
సెంటిమెంట్లు, బెదిరింపులు
ఒకవైపు తనతల్లి మరణిస్తే పరామర్శించలేదని, కనీసం సోదరిగానైనా తన ఆహ్వానాన్ని మన్నించి ఉగాది వేడుకలకు రాలేదని సెంటిమెంటుతో మాట్లాడుతూనే... మరోవైపు తను తల్చుకుంటే ఈ ప్రభుత్వం ఉండేదా అని ఆమె సవాలు చేయడం అన్నిటికన్నా తీవ్రమైన అంశం. తన ప్రసంగంలేకున్నా బడ్జెట్ సమావేశాలకు అనుమతినివ్వడం గొప్ప ఔదార్యంగా ఆమె చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో గవర్నర్‌ది నామాకార్థపు పాత్ర తప్ప ప్రభుత్వ సిపార్సును ఎలా తిరస్కరిస్తారు? రాజ్యాంగం ఆ అవకాశం ఇచ్చిందా? మహా అయితే పిలిచి మాట్లాడవచ్చు. అంతేగాని రాజ్యాంగ బద్దంగా అంతర్గత చర్చకు పరిమితం కాలేదు. బడ్జెట్ సమావేశాలకు అనుమతి నిరాకరించి ఆరునెలలు వ్యవధి దాటేలా చేస్తే ప్రభుత్వం ఉండేదికాదన్న మాట బీజేపీ గవర్నర్ మనోగతాన్ని బహిర్గతపర్చింది. అయితే అలాచేసివుంటే ఆమె మాత్రమే గాక మోడీ సర్కారు కూడా మరో ప్రజాస్వామిక పోరాటం చూసి ఉండేది. ఈ సమయంలో బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆమెకు వంతపాడటం వింతగొల్పుతుంది. మిగతా తేడాలు ఎలా ఉన్నా సమాఖ్య పునాదులు కాపాడుకోవాలనే ఆలోచనైనా లేకపోవడం విచిత్రమే. మర్యాదలు మన్ననలు పాటించలేదు గనక ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చని ఆమె మాట్లాడుతుంటే ఖండించలేని కాంగ్రెస్ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలో ఆ పార్టీ వారికే తెలియాలి. తాము గౌరవం ఇస్తూనే ఉన్నామని గవర్నర్ ఏదో ఊహించుకుంటే ఏం చేయలేమని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఇంకా సమాచార లోపాలు సమన్వయాలు ఉంటే సరిచేసుకోవచ్చు. కాని ఆ పేరుతో అసలు ప్రభుత్వ మనుగడే తన దయాభిక్ష అన్నట్టు తమిళిసై మాట్లాడటం రాజ్యాంగ విరుద్దమే గాక రాష్ట్ర ప్రజల రాజకీయ చైతన్యాన్ని పరిహసించడమే. డ్రగ్స్‌పై ఎంపిక చేసిన ప్రకారం దాడులు చేస్తున్నారని ఆరోపించినప్పుడు ఆ పబ్ బీజేపీ నాయకురాలి కుమారుడికి చెందినదన్న విషయం తెలిసే అలా అంటున్నారా అని సందేహం కలుగుతుంది. కేసీఆర్ సర్కార్ తప్పొప్పులు ఒకటైతే ఈ విషయమై బీజేపీ నేతలు గానీ గవర్నర్ గానీ పూర్తి మౌనం పాటించడం ద్వంద్వనీతికి దర్పణం పడుతుంది. ఇకనైనా రాజ్‌భవన్ పరిమితులు ఆమె గ్రహిస్తారని ఆశించాలి. తను ఏం చేసినా ప్రజల కోసమే అంటున్న గవర్నర్ ఇప్పుడు తను లేవనెత్తిన వివాదాలన్నీ అధికారానికి మర్యాదలకు సంబంధించినవేనని గుర్తించడం అవసరం.
- తెలకపల్లి రవి