Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన వ్యాఖ్యల ద్వారా మరోసారి భాషా వివాదాన్ని రాజేశారు కేంద్ర హౌం మంత్రి అమిత్ షా. 'వేరువేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు స్థానిక భాషలు, ఇంగ్లీష్‌లో కాకుండా తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి' అంటున్నారు. ఇప్పటికే మతాలు, ప్రాంతాల పేరుతో విద్వేషాలను రాజేసి... ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచి.. గొడవలు సృష్టించి.. అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీ, ఇప్పుడు భాష పేరుతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు, ప్రజలను విభజించి ఉత్తరాది రాష్ట్రాల్లో మరింత బలోపేతం కావడానికే భాషా వివాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత
హిందీని బలవంతంగా రుద్దడంపై దక్షిణాది రాష్ట్రాల్లో ముందు నుంచీ తీవ్ర వ్యతిరేక ఉంది. హిందీ గురించి అమిత్ షా కామెంట్ చేయగానే దక్షిణాదికి చెందిన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇది 'భారతదేశ భిన్నత్వంపై దాడి' అని ప్రతిపక్షాలు విమర్శించాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని రుద్దడానికి బీజేపీ చేస్తున్న యత్నాలను అడ్డుకొంటామని టీఎంసీ పేర్కొన్నది. 'హిందీ అధికార భాషే కానీ, జాతీయ భాష కాదు' అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై బీజేపీ సాంస్కృతిక ఉగ్రవాదానికి తెగబడు తున్నదని కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. 'భారత ప్రజలు ఏం తినాలి.. ఏం మాట్లాడాలి అనేది వారికే వదిలేయాలి' అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. 'నేను మొదట భారతీయుడిని. ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగువాడిని, తెలంగాణ వ్యక్తిని. నా మాతృభాష తెలుగు. ఇంగ్లీష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లీష్ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి'' అని అన్నారు. అమిత్‌షా ప్రకటన దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటిదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హిందీ కంటే తమిళమే ప్రాచీనమైందని, సంస్కృతం, ఉర్దూ, ఇతర భాషల మిశ్రమం హిందీ అని దానిని ప్రత్నామ్నయంగా అంగీకరించేది లేదన్నారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియాలో 'తమిళ తల్లి' ఫొటోను షేర్ చేస్తూ 'ప్రియమైన తమిళం.. మన ఉనికికి మూలం' అనే వాక్యాన్ని ఆ పోస్టుకు జోడించారు.
ఎనిమిదో షెడ్యూల్లో...
భారతదేశానికి జాతీయ భాష లేదు. కేంద్ర స్థాయిలో హిందీ, ఇంగ్లిష్ అధికార భాషలుగా ఉన్నాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా ఉపయోగిస్తున్నారు. 1960 ప్రాంతంలో హిందీ భాషను 'రుద్దడాన్ని' తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళనాడులో పెద్దయెత్తున ఆందోళనలు పెల్లుబికాయి. ఆ తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నిటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకొచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషల్ని ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ గుర్తించింది. హిందీ అధికార భాషగాలేని రాష్ట్రాలతో కేంద్రం ఇంగ్లిష్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధికార భాషల చట్టాన్ని సవరించారు.
బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మూలం భాషే
పాకిస్థాన్ రెండు ముక్కలు కావడానికి, అందులో ఒకటి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించడానికి ప్రధాన కారణం భాషేనన్న వాస్తవాన్ని దేశ పాలకులు మరిచిపోకుంటే బాగుంటుంది. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్‌ను తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవారు. వారి మాతృభాష బెంగాలీ. కానీ, వారి భాషకు తగిన గుర్తింపులేదు. అందుకే, తమ భాషకు గుర్తింపు ఇవ్వాలని అక్కడి ప్రజలు ఉద్యమించారు. ఆ ఉద్యమం 1952 నుంచి నాలుగేండ్లపాటు సాగింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం మేధావుల్ని, అధ్యాపకులను జైళ్లలో వేసింది. ఫిబ్రవరి 21న పోలీసులతో కాల్పులు జరిపించింది. మాతృభాష కోసం మొదలుపెట్టిన ఆ ఉద్యమంలో నెత్తురు ఏరులైపారింది. ఆ తర్వాత రెండు ప్రాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం నెలకొంది. ఆఖరికి దేశం రెండుగా విడిపోవడానికి కారణమైంది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది.
మాతృభాషతోనే లాభం ..
భాష ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. భారతదేశం బహుభాషా, బహుళ-మత గుణములు కలిగిన ఒక విశ్వ విఖ్యాతమయిన దేశం. అంతేకాదు ఎవరికైనా మాతృభాష అంటే మమకారం ఉంటుంది. భాష అనేది కేవలం భావాలు వ్యక్తం చేయడమే కాదు.. ఒక జాతి ఉనికిని, సంస్కృతిని, జీవన విధానాన్ని పరిచయం చేస్తుంది. మాతృభాష ఎంత గట్టిగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషల్ని అంత గట్టిగా నేర్చుకోగలరని మెకంజి, వాకర్ లాంటి భాషా శాస్తవ్రేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇతర భాషలకన్నా మాతృభాషలో నేర్చుకోగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని సాథియాసీలన్, కీసర్ ఎట్ ఆల్ లాంటి పరిశోధకులు తేల్చి చెప్పారు.
దేశం విచ్ఛిన్నం కాకుండా..
స్వాతంత్య్రానికి పూర్వం సైతం హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరిగితే, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి ప్రత్యేక ద్రవిడనాడు ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడేవారు 60శాతం మంది ఉంటే... హిందీ, దానికి దగ్గరగా ఉండే భాషలు మాట్లాడేవారు 40శాతం మంది ఉంటారు. వాస్తవాలిలా ఉంటే హిందీ భాష మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనడం అవివేకం. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసినా, ఉద్యోగావకాశా లకు షరతుగా విధించినా ఆందోళనలు చెలరేగే ప్రమాదముంది. అలాంటి చర్యలు హిందీ భాషపై తీవ్ర విముఖతను పెంచుతాయి. దేశం మనుగడకు ఒకేఒక్క అధికారిక భాష ఉండాల్సిన అవసరం లేదు. ఏడున్నర దశాబ్దాలుగా భారతదేశం ఒకే ఒక్క అధికారిక భాషను అమలు చెయ్యకుండా మనుగడలో ఉంది. నిజానికి భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణం.
బీజేపీ ఎత్తుగడే..!
ఒక్క కర్నాటక మినహా ఇతర దక్షిణ రాష్ట్రాల్లో బీజేపీ మనుగడ అంతంత మాత్రమే. సమీప భవిష్యత్తులో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేకపోవడం, లోక్‌సభ స్థానాలు సైతం ఎక్కువ గెలిచే అవకాశాలు లేకపోవడం వంటివి బీజేపీ సృష్టిస్తున్న భాషా వివాదానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా రెండేండ్ల కంటే తక్కువ సమయమే ఉండడంతో భాషా వివాదాన్ని రాజేసి.. ఉత్తరాదిలో మళ్లీ బంపర్ మెజార్టీతో గెలవాలని బీజేపీ భావిస్తున్నట్లున్నది. అంతేకాకుండా హిందీ ప్రజలు గుజరాతీయుల ఆధిపత్యాన్ని నిరసిస్తున్నారే మోననే భయం కూడా బీజేపీని వెంటాడుతోంది. అందుకే ఇప్పుడు ఈ హిందీ భాషా సమస్యను లేవనెత్తినట్లు కనిపిస్తోంది. కొత్త కొత్త వివాదాలను సృష్టించడం ద్వారా దేశంలోని నిజమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా బీజేపీకి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడీ భాషా విభేదాలు.
- ఫిరోజ్ ఖాన్
సెల్:9640466464