Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో స్వచ్ఛమైన నీరు వేగంగా కనుమరుగవుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానాల ఫలితంగా పర్యావరణంలో కలుగుతున్న మార్పులు మళ్ళీ సరిదిద్దుకోలేని విధంగా ఉంటున్నాయి. అంతే కాదు, అవి మన ఉనికినే సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి.
పర్యావరణ మార్పుల వలన రుతువులలో వచ్చే మార్పులు క్రమం తప్పుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నీటి వ్యవస్థలు భారీగా ధ్వంసం అవుతున్నాయి. నీటి వ్యవస్థలను సంరక్షించి అవి దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత ఆ యా ప్రభుత్వాలది. కానీ అవి నీటి వనరుల యాజమాన్యాన్ని ప్రయివేటు రంగానికి అప్పజెప్తున్నాయి. వాటి మీద కార్పొరేట్ల పట్టు బిగుసుకుంటున్నకొద్దీ అది మానవ సమాజ సంక్షేమానికే ముప్పుగా మారుతోంది.
ప్రపంచం మొత్తం మీద తాగేందుకు వినియోగించే నీటిలో 50శాతం భూగర్భ జలాలే. వ్యవసాయంలో వినియోగించే వాటిలో 40శాతం, పారిశ్రామిక వినియోగం లో 33శాతం భూగర్భ జలాలే. భూగర్భ జల వనరులు పరిమితంగా ఉంటాయి. మనకు ఎన్నటికీ తరగనంతగా భూగర్భ జలాలు ఉన్నాయని కొందరు అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు. మన చుట్టూ ఉన్న జీవావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో, పర్యావరణంలో వచ్చే మార్పులకను గుణంగా మానవ సమాజం తనను తాను మార్చుకోవడంలో భూగర్భ జలాలకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది.
ప్రపంచంలో, భారతదేశంలో కూడా నగరాలకు ప్రధాన నీటి వనరుగా భూగర్భ జలాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 18శాతం. కాని భూగర్భ జలాలలో మన వాటా కేవలం 4శాతమే. అంటే నీటి వనరు లేమి అతి తీవ్రంగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి అని బోధపడుతున్నది. వేసవి రాగానే దేశంలోని కొన్ని నగరాలలో నీరు బంగారం కన్నా విలువైన సరుకుగా మారిపోతుందని నీటి వనరులపై ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఒక పత్రం పేర్కొంది. దానికి పరిష్కారం చూపే బదులు నీటి వనరుల నిర్వహణను మరింత పెద్ద ఎత్తున వ్యాపారంగా మార్చివేస్తున్నారు పాలకులు.
''నీరు ఒక అవసరమే కాని హక్కు కాదు'' అంటున్నారు నయా ఉదారవాద విధాన కర్తలు. నీరు మన హక్కు అయితే దానిని మనకు అందించే బాధ్యత ప్రభుత్వానిది అవుతుంది. అదే ఒక అవసరం మాత్రమే అయితే దానిని మనమే సమకూర్చుకోవాలి. అదీ ''అవసరానికి'', ''హక్కు''కి ఉన్న తేడా. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ (జెజెఎం) నీటిని కేవలం ఒక అవసరంగా మాత్రమే పరిగణిస్తోంది. ఆ పథకం మౌలికంగానే ఒక వ్యాపార ప్రాతిపదిక మీద రూపొందిందని దీనిని బట్టే తెలుసుకోవచ్చును.
ఇండియా టుడే ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం త్వరలోనే మన దేశంలో 30శాతం నగరాలు తాగు నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయి. వాటి నీటి వనరులు మొత్తంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. దేశంలో దాదాపు 31శాతం ఇండ్లకు కొళాయిల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. పట్టణాల్లో అమలు జరిగే నీటి సరఫరాలో 48శాతం భూగర్భ జలాల నుండే అందిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా మన ప్రధాన నగరాలు పదింటిలోను ఏడు నగరాల్లో భూగర్భ జలాల మట్టం గణనీయంగా పడిపోతున్నది. 70శాతం నీరు కలుషితం అయిపోయిందని నిటిఆయోగ్ నివేదిక చెప్తోంది. 18.93 కోట్ల గృహాలకు గాను కేవలం 3.23 కోట్ల గృహాలకు మాత్రమే కొళాయి కనెక్షన్లు ఉన్నాయని జెజెఎం వెబ్సైట్ చూపిస్తోంది. ఎనిమిదేండ్ల మోడీ పాలన తర్వాత పరిస్థితి ఇది.
తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న ''ఆపరేషన్ భగీరథ'' నమూనా, జెజెఎం నమూనా ఒక్కటే. అవి రెండూ ప్రకటించిన లక్ష్యాలు చూస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. 'ప్రతీ ఇంటి గడపకూ మంచినీరు', 'నీళ్ళ మోత భారం నుండి మహిళలకు విముక్తి' వంటివి మంచిగానే అనిపిస్తాయి. కాని తాగునీటి సరఫరా నిర్వహణ, నీటి పంపిణీ వ్యవస్థ నిర్వహణ ప్రయివేటు రంగానికి అప్పజెప్పాలని ఈ రెండు నమూనాలూ గట్టిగా నొక్కి చెప్తాయి. రెండు నమూనాలూ యూజర్ ఛార్జీలను వసూలు చేయాలని చెప్తాయి. నీటి పంపిణీలో జరిగే లీకేజిలకు కూడా వినియోగదారులే చెల్లించాలని చెప్తాయి.
ప్రస్తుతం మన దేశంలో ఏటా 1.8లక్షల కోట్ల మంచి నీటి వ్యాపారం నీళ్ళ బాటిళ్ల అమ్మకాల ద్వారా జరుగుతోందని దైనిక్ భాస్కర్ పత్రిక వెల్లడించింది. 2023 నాటికి ఇది 4.5లక్షల కోట్లకు చేరుతుందని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. 3500కోట్ల లీటర్ల నీటిని బాటిళ్ళలో మన దేశంలో తాగుతున్నారు. వాటర్ ప్యూరిఫైయర్ల ద్వారా జరిగే వినియోగం దీనికి అదనం. ఇదంతా కలిసి లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి పిండుకుంటున్నారు. ప్రజలకు తాగునీటిని తన బాధ్యతగా అందించవలసిన పని చేయకుండా ప్రభుత్వాలు తాగు నీటిని వినియోగపు సరుకుగా మార్చి, తద్వారా ప్రయివేటు కంపెనీలకు భారీ లాభాలను సమకూర్చి పెడుతున్నాయి.
నీటి వనరులను సంరక్షించడం, వాటిని నిర్వహించడం, ప్రజలకు తాగునీటిని అందించడం ప్రభుత్వాల బాధ్యత. ఢిల్లీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు నీటిని అందించడం కోసం హిమాచల్ ప్రదేశ్లోని సిర్మూర్ జిల్లాలో గల అడవులను ధ్వంసం చేసి అక్కడ ఒక రిజర్వాయరు నిర్మించింది. అక్కడి నుండి నీటిని ఢిల్లీ తరలిస్తోంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో నుంచి రోజూ నీటిని తరలించడానికి అయ్యే ఖర్చును, పర్యావరణానికి కలిగిన నష్టాన్ని కలిపి చూస్తే అదెంత అనాలోచితమైన చర్యో అర్థం అవుతుంది.
ప్రతీ నగరమూ తన పరిధిలో ఉన్న భూముల్లో నీటిని పరిరక్షించే చర్యలను ఎందుకు చేపట్టడం లేదు? నీరు దుర్వినియోగం కాకుండా తగు చర్యలు చేపడుతున్నారా? చాలా నగరాల్లో సహజసిద్ధంగా ఉన్న నీటి వనరులన్నీ దురాక్రమణలకు గురయ్యాయి. లేదా కాలుష్యమయం అయిపోయాయి. నగరాభివృద్ధి నమూనాలన్నీ లోపభూయిష్టమైనవే. ఢిిల్లీ సమీపంలో ఉన్న గుర్గావ్ ఇటువంటి అవకతవక అభివృద్ధి నమూనాకి ఓ మచ్చుతునకగా నిలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దురాశకు నగర పరిసరాల్లోని చెరువులు, నీటికుంటలు అన్నీ బలైపోయాయి. ఏరులు, గెడ్డలు వంటివి దురాక్రమణలకు గురయ్యాయి. లేకపోతే మరుగునీటి డ్రెయినేజిలుగా దిగజారిపోయాయి.
ఇప్పుడు బడా కార్పొరేట్ కంపెనీలు నగరాల్లో నీటి సరఫరా, డ్రెయినేజి, మురుగునీటి నిర్వహణ స్కీముల రూపకల్పనకు తమ కన్సల్టెన్సీలను రంగంలోకి దించాయి. ఆ కన్సల్టెన్సీలు ఏ సందర్భంలోనూ స్థానిక ప్రజలను గాని, వారి ప్రతినిధులను గాని సంప్రదించవు. వారి అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవు. భారీ పెట్టుబడితో చేపట్టే ఈ స్కీములు ఆచరణలో కొద్ది సంవత్సరాల లోపే నిర్వహణ సాధ్యం కాక మధ్యలో విడిచిపెట్టేయడం జరుగుతోంది.
లెవీ పట్టణంలో చేపట్టిన నీటి సరఫరా స్కీము ఇందుకొక ఉదాహరణ. ప్రజలను సంప్రదించకుండా, వారు చెప్పిన సూచనలను పెడచెవిన పెట్టి లెవీ పట్టణానికి నీటిని సరఫరా చేయడం కోసం సింధు నది నుండి లిఫ్ట్ ద్వారా నీటిని సరఫరా చేసే స్కీమును రూపొందించారు. లెవీ పట్టణానికి ఉత్తరాన ఎగువన ఉన్న మంచు కొండల నుండి కరిగి వచ్చే నీటిని సంరక్షించి వినియోగించుకోమని మేమంతా సూచనలు చేశాం. వాటిని వినిపించుకోలేదు. మంచుకొండల నుండి జాలువారే నీరు గ్రావిటీ ద్వారా పట్టణానికి అందించడానికి రూ.10 కోట్ల కన్నా ఖర్చు కాదు. కాని అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ ఖర్చుతో లిఫ్ట్ స్కీమును చేపట్టారు. ఆ ఖర్చునంతా ప్రజల మీద రుద్దారు.
సిమ్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ సంస్థ ఆవరణలో చాలా పెద్ద మంచినీటి చెరువు ఉంది. వర్షపు నీరంతా అందులో చేరుతుంది. దాని నుండి నీటి అవసరాలను తీర్చుకునే బదులు, 70కి.మీ. దూరంలో ఉన్న నగరం నుంచి భారీ ఖర్చుతో నీటిని ఆ సంస్థ తెచ్చుకుంటుంది.
హైదరాబాద్లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల దిగువన పది కి.మీ. విస్తీర్ణం లోపల ఏ నిర్మాణాలూ చేపట్టకూడదన్న నిబంధనలు గతంలో ఉండేవి. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వం ఆ నిబంధనలను రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. దాని వలన ఆ చెరువుల్లోకి చేరే నీరు తగ్గిపోతుంది. నీటి మట్టం తగ్గిపోయాక వాటి నుండి నగరానికి సరఫరా అయే నీరు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కిలో లీటరుకు రూ.2 నుండి 5 మధ్య ఖర్చు అవుతోంది. ఇకముందు గోదావరి నది నుండి నీటిని తెచ్చుకుని సరఫరా చేయడానికి కిలో లీటరుకు రూ.150 అవుతుంది. ఈ భారం అంతా ప్రజలపైనే పడుతుంది. ఆ చెరువుల సమీపంలో ఉన్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాభాల కోసం అప్పజెప్పడానికి ఈ విధమైన తప్పుడు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అందుకు మూల్యం ప్రజలు చెల్లిస్తున్నారు.
నగరాల్లో భూగర్భ జలాల సంరక్షణ కోసం, నగరాల్లో ఉన్న చెరువుల, కుంటల సంరక్షణ కోసం ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు బాధ్యత తీసుకునేవిధంగా ఒత్తిడి తెచ్చే బలమైన ఉద్యమాలు నేడు అవసరం. అది తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్న ఉద్యమంతో ముడిపడి ఉండాలి. అప్పుడే నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేయగలుగుతాం.
- టికేందర్ సింగ్ పన్వర్
(స్వేచ్ఛానుసరణ)