Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1954 ఏప్రిల్ 12వ తేదీన జన్మించిన ప్రజా కళాకారుడు కామ్రేడ్ సప్దర్ హష్మి 1989 జనవరి 1వ తేదీన కాంగ్రెస్ కిరాయి గూండాల చేతిలో హత్యగావించబడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 1989 ఏప్రిల్ 12న (హష్మిజయంతిని) జాతీయ వీధినాటకపోత్సవంగా జరపమని ఢిల్లీ జన నాట్యమంచ్ (హష్మీ స్థాపించిన కళాసంస్థ - జనమ్) పిలుపునిచ్చింది. ఆ రోజు భిన్న రాష్ట్రాల్లో భిన్న భాషల్లో ఆగిపోని నాటిక (నాటక్ జారీహై - నాటకం కొనసాగుతుంది) ప్రజాకళాకారులచే అసంఖ్యాకంగా ప్రదర్శితమైంది. విశ్వవ్యాప్తంగా ఏ కళాకారునికి దక్కని అపూర్వ నివాళి ఇది.
అప్పటి నుండి హష్మీ వీధినాటిక జన జీవితాల్లో ప్రజా ఉద్యమాల్లో సందర్భం వచ్చినప్పుడల్లా దేశవ్యాప్తంగా ముందుకు ఉరుకుతూనే ఉన్నది. ఇంతకూ 'ఆగిపోని నాటిక' కథ ఏంటి? చిన్న పిల్లల జానపద కథ. అనగనగా ఓ రాజ్యానికి ఓ రాజు. ఆ రాజు భోగలాలసుడై జీవిస్తూ, మత్తులో చిందులేస్తూ మూర్చవచ్చి పడిపోతాడు. రాజు వైద్యులు వచ్చి వైద్యం చేయడంతో పాటు జ్యోతిష్యం చెపుతారు. రాజుగారికి సంగీత సాహిత్య గండం ఉందని అంటారు. ఇంకేముంది? రాజ్యంలో ఎవరూ పాటలు పాడరాదని, రాగాలు తీయరాదని నిషేధాజ్ఞలు విధిస్తాడురాజు. సైన్యం చాటింపు వేస్తుంది. పహారాకాస్తుంది. కానీ ప్రజలు ఏ పని చేసుకోవాలన్నా ఊపుకోసం పాట పాడాల్సిందే. పిల్లలకు పాఠశాలల్లో చదువుతో పాటు ఆట పాటలుండాల్సిందే. ఏ ఆట పాట లేకుండా నిస్సారంగా జీవితం గడపడం ప్రజలకు కష్టమవుతుంది. అసలు చేతకాదు. ఇదో జీవిత సత్యం. రాజుగారికి ఈ సత్యాన్ని ఎరుకపరిచేందుకు ఎక్కడికక్కడ విప్లవాలు ఉద్భవిస్తాయి. ప్రజలు తిరుగుబాటుకు సన్నద్దమవుతున్నట్టు రాజుగారికి సమాచారం అందుతుంది. రాజుగారికి నిద్ర పట్టదు. కలలో కూడా పాటలే విన్పిస్తుంటాయి. చివరకు ప్రజలంతా పాటలతో అంతఃపురాన్ని చుట్టుముడతారు. రాజు నేలకొరిగి పాటకు పట్టం గట్టడంతో నాటకం పరిసమాప్తమవుతుంది. కేవలం ఓ అరగటం నాటక దృశ్యంలో బంధింపబడిన ఈ కథాంశం చర్చిండానికి ఎంతో లోతైన విషయం ఉంది. విశ్వ జనీనమైన మానవ జీవన ప్రాసంగకిత ఉన్నది. విప్లవాలు, తిరుగుబాట్లు అంకురార్పణకు గల ప్రాతిపదికను రేఖామాత్రంగా చూపుతుంది. ఈ ఆగిపోని నాటిక.
సామాజిక విమర్శకన్నా, సాహితీ విమర్శ కన్నా జీవంతో జీవించే పాత్రలను సజీవంగా సృష్టించి చూపడమే నాటక కళాకారుల కర్తవ్యం. ఈ ఆల్కెమీని (పరుశవేది) ఒడిసి పట్టుకున్నవారు హష్మి, అతని బృందం. అందుకే వారు సృష్టించే పాత్రలు (మిషన్, ఔరత్, హల్లాబోల్ మొదలైన నాటకాల్లోనివి) ఏవైనా గాని జీవితంలోంచి అకస్మాత్తుగా రంగస్థల ప్రవేశం చేసి అంతే అకస్మాత్తుగా నిష్క్రమించి మరల జీవితంలో కలసిపోతాయి. నాటక కళలోని ఈ మ్యాజిక్ రియలిజం (వాస్తవాద్భుతం) చూసే కళ్ళకు పుట్టం పెట్టినట్టు స్పష్టంగా కన్పిస్తుంది.
ఇక్కడ లక్ష్యం సుస్పష్టం. ప్రదర్శనానంతరం ప్రజల్లో ఓ చైతన్యం, ఓ ధైర్యం, ఓ కదలిక, ఓ మార్పు రావాలి. ప్రజానుకూలంగా ప్రజా ఉద్యమాలతో కలసి పనిచేసే నాటక కర్తల దృక్పథానికి ఇతరుల దృక్పథానికి తేడా ఇదే. అంశం సమకాలీనం. అది రాజకీయం, ఆర్థికం, సామాజికం ఏదైనా కానీ, ప్రేక్షకుడు తన జీవితాన్ని ఆ నాటకం ద్వారా తెలుసుకోవాలి. నాటకంలో చూసుకోవాలి. నాటక రచనే ఆ విధంగా ప్రజా ఆలోచనలతో ముందుగా చిక్కబడుతుంది. సమిష్టితత్వంతో తర్వాత రాటుదేలి చక్కబడుతుంది. జీవితసారం గుదిగుచ్చి రంగ ప్రవేశం చేస్తుంది. ప్రదర్శనా శైలిలో ప్రతిభ కూడా అంతే సహజంగా ఇమిడిపోతుంది. ఇకప్పుడు ప్రేక్షకునికి వేరేధ్యాస ఉండదు. నాటకంతో ప్రేక్షకుడు మమేకం అవుతాడు. హష్మి సృష్టించిన ఆధునిక వీధినాటికకు ఈ విశిష్ట లక్షణాలన్ని ప్రాణప్రదంగా సమకూరాయి. నాటకానికి మరింత ఉన్నత రూపం చేకూరింది.
ఈ ఒరవడిని అందిపుచ్చుకున్న ప్రజానాట్యమండలి వంటి ప్రజాకళా సంస్థలు ఎన్నో వీధినాటికలను ఈ మార్గంలోనే రూపకల్పన చేసుకున్నాయి. చేస్తున్నాయి. గందరగోళాన్ని, వికృత విన్యాసాలను, సాంకేతిక డంబాచారాన్ని ప్రక్కనపెట్టి జీవితమంత సరళంగా సహజంగా చూపడానికి యధాశక్తిన ప్రయత్నిస్తున్నాయి.
'శ్రామికవర్గానికి కచ్చితంగా తెలుసు ఎవరు తమకు నిజమైన కళా మిత్రులో... ఎందుకంటే ఆ కష్టజీవుల జీవితాన్ని వారు ఆవాహన చేసుకున్నంతగా మరెవరూ చేసుకోలేరు' అని కామ్రెడ్ లెనిన్ ఓ సందర్భంలో అంటాడు. అలాంటి నిజమైన ప్రజాకళాసైనికుడు కామ్రేడ్ సప్థర్ హష్మి.
అవసరం వస్తువు. ఆకర్షణ శిల్పం. హష్మీ కనుగొన్న ఈ ఆధునిక వీధినాటిక దృశ్య కావ్యానికి అనివార్యంగా ఈ రెండు గుండెలు ఉంటాయి. ప్రజలకు, ముఖ్యంగా శ్రామికవర్గానికి చాలా చాలా సన్నిహితంగా ఈ రెండింటి మేళవింపు సాగుతాయి కనుకనే 20వ శతాబ్దపు పోరాటాయుధం అయింది. 21వ శతాబ్దపు ప్రజాకళ వికాస పూలబాట అవుతున్నది.
- కె. శాంతారావు
సెల్: 9959745723