Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అఖండ భారతదేశం ఐక్యం'' నినాదంతో దేశ ప్రజల ముందుకొచ్చిన ఆర్ఎస్ఎస్, బీజేపీల అసలు పని విభజించడమేనని అనేక ఆధారాలతో 'ది దళిత్ ట్రూత్' ఆవిష్కరించింది. వివిధ రాష్ట్రాల్లోనూ, దేశ వ్యాప్తంగానూ బీజేపీ ఇదే ఫార్ములాను అమలు చేస్తున్న తీరు పట్ల, వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన పాత్రికేయులు, అఖిల భారత సర్వీసు అధికారులు, రాజ నీతిజ్ఞులు, ప్రొఫెసర్లు, ప్రజాస్వామిక వాదులు, సామాజిక మార్పుకోసం తపిస్తున్న దేశభక్తులు వారి వారి అభిప్రాయా లను దేశం ముంగిట చర్చకు పెట్టారు ఈ వ్యాసాల సంకలనంలో...
పాత్రికేయుడు, ఆర్.ఎస్.ఎస్. పూర్వ కార్యకర్త భన్వర్ మేఘవంశీ రాసిన 'సాఫర్నైజింగ్ ది దళిత్' వ్యాసంలో ఆర్.ఎస్.ఎస్ సంస్థ ప్రతిపాదిస్తున్న హిందూ రాష్ట్ర సిద్ధాంతం వెనకవున్న మూల ఉద్దేశ్యాలు, దాని నాయకుల రచనలు, ఆలోచనలు ఏవిధంగా బాహాటంగా మనుధర్మాన్ని బలపరుస్తున్నదీ, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నదీ, దోపిడీ కులవ్యవస్థను సమర్థిస్తున్నదీ, రిజర్వేషన్ల తొలగింపునకు ఏవిధంగా ప్రయత్నిస్తున్నదీ అనేక ఆధారాలతో వివరించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తన అధికార రాజకీయ విస్తరణకోసం, దళితులను తనవైపు తిప్పుకునేందుకు డాక్టర్ అంబేద్కర్‌కు ఆర్.ఎస్.ఎస్.తో స్నేహసంబంధాలు ఉన్నట్లు ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారో కూడా వివరించారు. దళిత ఉపకులాల మధ్య వైరుధ్యాలను ఆసరా చేసుకుని వారు ఆరాధించే దేవుళ్ళను, జాతరలను వాడుకుంటూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా హిందూ రాష్ట్ర భావనలో దళితులను భాగస్వాములను చేసేందుకు ఆర్.ఎస్.ఎస్. అనుసరిస్తున్న కుతంత్రాలను ఈ వ్యాసం అర్థం చేయిస్తుంది.
జి.బి. పంత్ సోషల్ సైన్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ బద్రి నారాయణ రాసిన ''హిందూత్వ అండ్ ద ప్యూచర్ ఆఫ్ దళిత్ - బహుజన్ పోలిటిక్స్ ఇన్ ఇండియా'' వ్యాసం బన్వర్ మేఘవంశీ చెప్పిన అంశాలకు కొనసాగింపుగా ఉంటుంది. దేశంలో అమలవుతున్న ఉదారవాద ఆర్థికవిధానాలు, మార్కెట్ రాజకీయాలు, రాజ్యం పాత్రను, బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూత్వ కార్యాచరణలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని చెపుతుంది. దేశంలో మధ్యతరగతి బాగా పెరుగుతున్నవైనాన్ని, వారి వ్యక్తిగత ఎదుగుదల ఆకాంక్షలను, ముఖ్యంగా దళిత బహుజనులను హిందూత్వ రాజకీయాలవైపు ఆకర్షించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేపడుతున్న కొత్త కుల సమీకరణ లను, సాంస్కతిక కార్యాచరణలను వివరిస్తూనే పాత దళిత ఉద్యమ కార్యాచరణలు ఏవిధంగా విఫలమవుతున్నాయో వివరిస్తుంది.
''సమృద్ధి భారత్ ఫౌండేషన్' సంస్థ, 'పెంగ్విన్ రేండమ్ హౌస్ ఇండియా' పుస్తక ప్రచురణ సంస్థలు సంయుక్తంగా ఇటీవల 'రీ థింకింగ్ ఇండియా' పేరుతో దేశంలో నేడు కీలకమైన అంశాలపై పుస్తకాలను ఇంగ్లీషులో సిరీస్‌గా ప్రచురిస్తున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఎనిమిదవదిగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది 'ది దళిత్ ట్రూత్' సంకలనం వచ్చింది. ఇది దళితుల జీవన ప్రస్థానాన్ని, ఒడిదుడుకులను సమగ్రంగా వివరించేందుకు పూనుకున్నది. భారత రాజ్యాంగ లక్ష్యాల వెలుగులో దళితుల విముక్తికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవసరమైన ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను నిర్దేశిస్తున్నది. వివిధ రంగాల్లో నిష్ణాతులయి గుర్తింపుపొందిన 13మంది ప్రముఖ దళిత మేధావుల రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఒక్కొక్క వ్యాసం ఒక పరిశోధనా గ్రంథమని చెప్పక తప్పదు. దీనిలోని వ్యాసాల సారాన్ని, లేవనెత్తిన ప్రశ్నలను సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం.
ప్రముఖ ఆర్థిక వేత్త ప్రొ.సుఖదేవ్ రాట్ ''ది దళిత్ ఐడియా ఆఫ్ నేషన్ ఇన్స్ఫైర్డ్ బై అంబేద్కర్'' అనే సిద్ధాంత వ్యాసం ఈ సంకలనంలో మొదటిది. దేశంలో ఒక వైపు పెట్టుబడిదారీ, మరోవైపు మెజారిటీ హిందూత్వ రాజకీయ విధానాలు (మనువు అండ్ మార్కెట్) ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను, సామాజిక, మత విద్వేషాలను పెంచుతూ రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను ఏవిధంగా విధ్వంసం చేస్తున్నదీ దేవ్రాట్ విశ్లేషించారు. 'దేశం, జాతీయత' అనే భావనలపై డా.అంబేద్కర్ ఇచ్చిన విస్తత అర్ధం ఏమిటి? ప్రస్తుతం ఇవి రాజకీయ అజెండాలో భాగమై ఎలాంటి పరిమిత అర్థంలో భావోద్వేగాలు రగిలిస్తున్నాయి? అనే అంశాన్ని లోతుగా వివరిస్తూ బుద్ధుడి బోధనల్లోని సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతోపాటు 'సామాజిక ప్రజాస్వామ్య భావన' భారతీయ సమాజానికి ఎంత అవసరమో వివరించారు. డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించిన 'స్టేట్ సోషలిజం' విధానాన్ని ఆమోదించకపోవడం వలన నేడు అమలవుతున్న నూతన ఆర్థిక, ప్రవేటీకరణ విధానాలతో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగి దేశం వర్గవైరుధ్యాల నిలయంగా మారుతుందని స్పష్టంచేసారు.
ఐ.ఎ.ఎస్. అధికారి రాజశేఖర్ ఉండ్రు రాసిన 'అంబేద్కర్స్ రిప్రజెంటేషనల్ పాలిటిక్స్ - ఎక్స్ పాండింగ్ పాజిబులిటీస్' అనే వ్యాసంలో బ్రిటిష్ కాలంలో సుమారు వందేండ్ల క్రితం నుండి దళితులకు, ఆదివాసులకు, వెనకబడిన కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం కోసం ఏవిధంగా ప్రయత్నాలు జరిగాయి? డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలో ఎన్నేళ్ళపాటు, ఏయే సందర్భాల్లో దళితుల ప్రాతినిధ్యం కోసం సుదీర్ఘ పోరాటం జరిగిందీ, ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నదీ ఒక క్రమంలో వివరించారు. సుప్రీంకోర్టు న్యాయవాది కిరుబా మునుసామి రాసిన 'కాస్ట్ అండ్ జ్యూడిషరీ ఇన్ ఇండియా' వ్యాసంలో భారతదేశ న్యాయవ్యవస్థ ఇప్పటికీ ఆధిపత్య కులవ్యవస్థ చట్రంలోనే ఏవిధంగా కొనసాగుతున్నదో దళితుల దృష్టికోణం నుంచి సాధికారికంగా విశ్లేషించారు.
ప్రముఖ రచయిత, ప్రజాపక్ష మేధావి సూరజ్ యాడ్లే రాసిన 'లీవరేజింగ్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూషన్స్ టు అడ్రస్ కాస్టిజం' అనే వ్యాసంలో అంతర్జాతీయ వేదికలపై కులవ్యవస్థ వివక్షతను, అణచివేతల స్వభావాలను ప్రస్తావించి కులవ్యవస్థ నిర్మూలనకు దేశపాలకులపై వత్తిడి పెంచే విధానాలకు సంఘీభావాన్ని కూడగట్టాల్సిన అవసరం ఏవిధంగా ఉందనేది వివరించారు. కులవివక్షత గురించి దేశం బయట మాట్లాడితే ఇది దేశం అంతర్గత సమస్య అనీ, పరువు పోతుందనే భావనలను పాలకులు కలిగిస్తున్నారని విశ్లేషించారు. జాతివివక్ష, లింగ వివక్ష, లాంటి అనేక అసమానతలను నిర్మూలించే కృషి అంత ర్జాతీయ స్థాయిలో జరగుతున్నప్పుడు అంతర్జా తీయ వేదికల పరపతిని వినియోగించి భారత దేశంలోని కులవివక్షతను కూడా నిర్మూలించు కోవాల్సిన అవసరాన్ని ప్రతిపాదిస్తుందీ వ్యాసం.
గుజరాత్ దళిత ఉద్యమ నాయకుడు, ఎమ్మెల్యే జిగేష్ మేవాని రాసిన 'ఎ బ్లూ ప్రింట్ ఫర్ ఎ న్యూ దళిత్ పాలిటిక్స్-ఎన్ ఓపెన్ లెటర్ టు ద దళిత్' వ్యాసంలో కేపిటిలిజం, మనువాద బ్రాహ్మనిజం కలగలిసిన ప్రమాదకర పరిణామాలు ఎదురవు తున్న నేటి చారిత్రక సందర్భాన్ని విశ్లేషిస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు దళితులు విశాల ప్రజా ఐక్యసంఘటనలకు పూనుకోవాలని, నీల్, లాల్ ఐక్యత అవసరమని ప్రతిపాదిస్తున్నారు. ప్రొఫెసర్ సుధాపాయి రాసిన 'న్యూ ఫేజ్ ఇన్ దళిత్ పోలిటిక్స్ : క్రైసిస్ ఆర్ రీజనరేషన్?' అనే వ్యాసంలో ఉత్తరాదిన 1990 దశకం నుంచీ నేటివరకూ జరుగుతున్న దళిత ఉద్యమాలను సమీక్షించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయాలను ఈ దళిత ఉద్యమాల కార్యాచరణలు చూపిస్తున్నాయని వివరించారు. ప్రముఖ సినీ దర్శకుడు పా.రంజిత్ రాసిన 'దళిత్ సినిమా ఇన్ ఇండియా' వ్యాసం కేరళ రాష్ట్రంలో 1903లో పుట్టిన పి.కె..రోజి భారతదేశంలోనే తొలి దళిత మహిళా నటి అని చరిత్రను వెలికితీస్తూ ఆమె ఎదుర్కొన్న నాటి విషాద పరిస్థితులను వివరిస్తూ మొదలైంది. సినిమాల్లో కులాల ప్రాభవాన్ని, ప్రస్థానానాన్ని విశ్లేషిస్తూ ఆధిపత్య కులాలమాదిరిగా దళితులకు గౌరవమైన చరిత్ర, సంస్కృతి లేవనే భావనలో ఆధిపత్య కుల నిర్మాతలు ఉండటమే కాకుండా దళిత కథాంశంతో వచ్చే సినిమాలను దళితేతరులు చూడరనీ, ఆర్థికంగా నష్టపోతామనే నమ్మకంతో ఉన్నారనీ వివరించారు. పరియేరమ్ పెరుమాల, మార్పును ఉమ్మడిగా రాసిన 'అనిహిలేటింగ్ ఎంటర్ ప్రేనర్షిప్ కాస్టిజం' వ్యాసంలో ప్రయివేటీ కరణ పరిణామాలు దళితుల అవకాశాలను ఏవిధంగా దెబ్బతీసాయో ఆధారాల తో సాధికారికంగా వివరించారు. ఐ.ఎ.ఎస్. అధికారి రాజశేఖర్ రాసిన 'రీ డిజైనింగ్ ద దళిత్ డవలప్ మెంట్ పారాడిమ్' వ్యాసంలో ఇప్పటి వరకూ అమలు అయిన దళిత పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవిధంగా విఫలం అయ్యాయో సోదాహరణంగా వివరించారు. నేడు దళితులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను, అడ్డంకులను అధిగమించడానికి దారిచూపే దివిటీలా 'ద దళిత్ ట్రూత్' వ్యాసాల సంకలనం నిలుస్తుంది.
- బి. అయోధ్యరెడ్డి
సెల్:9000182333