Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనమేంటనేది మన తల్లి తిన్న ఆహారమే నిర్ణయిస్తుంది. తల్లి గర్భం దాల్చిన నాటి నుండి పిండానికి ఆమె నుంచి అందిన పోషకాలే బిడ్డ ఆరోగ్యాన్ని నిర్థేశిస్తాయి. ఎదిగే పిండానికి తల్లే సమస్తం. గర్భాశయంలోని ఉమ్మనీరు, మాయ ద్వారానే అన్ని పోషకాలు సరఫరా అవుతాయి. ఇవి ఒక పిండస్థదశలోనే కాదు, పుట్టిన తర్వాత పెరిగి పెద్దాయ్యాక కూడా మన ఆరోగ్యం మీద చెరగని ముద్రవేస్తాయి. తల్లి పోషణే బిడ్డకు రక్షణ కవచంగా నిలుస్తుంది. అందుకే మనదేశంలో గర్భిణీ ఆహారానికి అంత ప్రాధాన్యత ఇచ్చి మాతా శిశు సంరక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పరిచారు. సుమారు గత 45ఏండ్ల నుండి ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీలు బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని, ఆరోగ్య సంరక్షణను పూర్వ ప్రాథమిక విద్య సేవలు అందిస్తున్నాయి. మనదేశంలో సుమారు పదిలక్షలకుపైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకమైన సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్) ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తున్నాయి. కానీ చిన్నారుల జనాభాకు తగినట్లుగా అంగన్వాడీ కేంద్రాలకు, ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చడం లేదు. భవనాలు, విద్యుత్తు, మరుగుదొడ్లు, నీటి వసతి, చిన్నారులకు ఆట స్థలాలు వంటి మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 149 ఐసిడిఎస్ ప్రాజెక్టుల నియంత్రణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అందులో సుమారు 13,000 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. వీటికిగాను పట్టణ ప్రాంతాల్లో రూ.4,000లకు పైగానే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,000 వరకు చెల్లిస్తున్నారు. ఇంటి అద్దె నిధులు గతంలో రెండు, మూడు నెలలకోసారి మంజూరి చేసేది. రెండేండ్లుగా తీవ్ర జాప్యం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అద్దె అంగన్వాడీ కేంద్రాలకు 2021 ఏప్రిల్ నుంచి బకాయిలు పెండింగులో ఉన్నాయి. భవన యజమానులు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. అంగన్వాడీ సిబ్బంది వారి వేతనాల నుంచే అద్దెలు చెల్లిస్తున్నారు. ఈ పథకం(ప్రాజెక్టు)కింద గర్భిణులు, బాలింతలు 4 లక్షలు, ఆరేండ్లలోపు లబ్దిదారులు 14 లక్షలు ఉన్నారు. అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలకు మార్చాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఒక గదిని కేటాయించడంతో ఒకే గదిలో వంట సామానులు, పౌష్టికాహార సామాగ్రి పిల్లల ఆటల సామాగ్రి, కార్యాలయ సామాగ్రి, పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణులకు, బాలింతలకు పాలు, పౌష్టికాహారం గుడ్డు, పప్పులు, నూనెలు అందించడం, భద్ర పరచడం ఇబ్బందిగా ఉందంటున్నారు. మరి కొన్ని చోట్ల సర్కారీ పాఠశాలలో వారి విద్యార్థుల సంఖ్యకు, తరగతులకు సరిపడ గదులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. అంగన్వాడీ భవనాలకు అద్దె బకాయిలు విడుదల చేయాలని నిరసనలకు దిగితే? మెమోలంటూ బెదిరిస్తున్న అధికారుల తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీలను ఆయా జనాభాకు అనుగుణంగా విస్తరించాలి. నాణ్యమైన ఆహారం, పారిశుద్ధ్యం, ఆటస్థలాలు, ఆట బొమ్మలు, నిధులను నేటి ధరలకు అనుగుణంగా పెంచుతూ విడుదల చేయాలి. అదే విధంగా సిబ్బందికి సరైన వేతనాలు, ఐసీడీఎస్ ప్రణాళికలకు సరిపడేలా రోజు వారీ ఆహారానికి కేటాయించే నిధులు సరిపోవడం లేదని అధ్యయనంలో తేలింది. అంగన్వాడీ వ్యవస్థను అన్ని విధాల బలోపేతం చేయాలి. పర్యవేక్షణ పెంచి మహిళా శిశు సంరక్షణ భరోసాతో భవిష్యత్ తరాల సుస్థిర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
మన దేశంలో ''అంగన్వాడీ వ్యవస్థలో ఉన్న 8.19 కోట్ల చిన్నారుల్లో 33 లక్షల మందికిపైగా చిన్నారులు పౌష్టికాహార లోపంతో'' బాధపడుతున్నారు. వీరిలో సగం మందిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న చిన్నారులు గల తొలి రాష్ట్రాలుగా మహారాష్ట్ర, బీహార్, గుజరాత్‌లు ఉండడం గమనార్హం.
మానవ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన శిశు, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల లోపాల్ని నివారించడంలో అంగన్వాడీలు కీలకపాత్ర వహిస్తాయని సుప్రీం కోర్టు, కాగ్ నివేదిక, యునిసెఫ్ లాంటి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలియజేసాయి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రా(ఐసిడియస్)లను బలోపేతం చేయకుండా, ఆ బాధ్యతలను విస్మరిస్తున్న తీరు బాధాకరం. మరోవైపు పోషకాహారాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. అంగన్వాడీ ఉద్యోగులు, సిబ్బంది దేశవ్యాప్తంగా చేసిన అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటిగా కోల్పోతున్నారు. యూనిఫామ్‌లు, స్టేషనరీ, ఇంక్రిమెట్లు, ఇంచార్జి అలవెన్సులు చెల్లించడం లేదు. అంగన్వాడీలకు ప్రమాదకరమైన జీ.ఓ.లు 14, 19, 8లను సవరించాలని చాలాకాలంగా అడిగినా పాలకుల నుండి స్పందన లేదు. వారి పనులతో పాటు అదనపు పని భారం పెంచుచున్నారు. 12 జాతీయ సెలవులను రద్దు చేశారు. ఉన్న సమస్యలను పరిష్కరించకుండా హక్కులను హరిస్తున్నారు. పాలకులు బేషజాలకు వెళ్లకుండా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీ కేంద్రాలు భావి భారత పౌరులను, సమర్థ, ఆరోగ్యవంతమైన మానవ వనరులను తయారు చేస్తాయి. వాటిలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలి.
- మేకిరి దామోదర్
సెల్: 9573666650