Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''హిందూ రాజ్యమనేది అస్థిత్వంలోకి వస్తే ఈ దేశానికి ఖచ్చితంగా అదే పెద్ద విపత్తుగా తయారపుతుంది. ఎవరెన్ని మాటలు చెప్పినా హిందూయిజమనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు పెద్ద గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్యానికి హిందూయిజానికి అసలు పొసగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ''హిందూ రాజ్యాన్ని ఏర్పడకుండా చూడాల్సిందే'' అంటూ ''పాకిస్థాన్ అర్ది పార్టీషన్ ఆఫ్ ఇండియా'' పుట 358లో డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఇప్పుడు అక్షరాల నిజమని రుజువవుతున్నది. ఇది అంబేద్కర్ చెప్పి దాదాపు 75 సంవత్సరాలవుతున్నది. గత 8 సంవత్సరాల బీజేపీ పాలన చూశాక అంబేద్కర్ దూరదృష్టికి అందరు ఆశ్చర్యపోవడం సహజం.
బీజేపీ, విశ్వహిందూపరిషత్తు తదితర సంఫ్‌ుపరివార్ సంస్థలు తాము అధికారంలోకి రాకముందు దేశం అభివృద్ధి కాక పోవడానికి హిందూత్వ శక్తులు అధికారంలో లేకపోవడమే కారణమని చెప్పాయి. డెబ్బయి అయిదేండ్ల స్వాతంత్య్రంలో పేదరికం, నిరుద్యోగం, కనీస వేతనాలు లేకపోవడానికి కారణం హిందూ రాజ్యం రాకపోవడమేనని హోరెత్తించాయి. అసంతృప్తిగా ఉన్న కొన్ని తరగతులు నిజమేనేమో అని భ్రమపడ్డాయి.
గత ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతలు, బీజేపీ అధికారంలోకివస్తే నిజంగానే తమ జీవితాలు బలపడుతాయేమోనన్న భ్రమలతో బీజేపీకి అధికారమిచ్చారు ప్రజలు. హిందూ రాజ్యమంటే హిందువులకు ప్రయోజనాలు కలిగించేదేననే భ్రమల్లోకి ప్రజలను నెట్టగలిగారు. కానీ, హిందూ రాజ్యమంటే ఒక నిరంకుశ ఫాసిస్టు రాజ్యమని ఇప్పటికే క్రమంగా ఆచరణలో రుజువవుతున్నది. ఈ రాజ్యంలో కేవలం ముస్లింలను మాత్రమే కొంత నియంత్రిస్తారు కావచ్చు అని సాధారణ హిందువులు నిర్లిప్తత కనపరిచేవారు. కాని ఆచరణలో కేవలం ముస్లీంలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, ప్రత్యేకించి మహిళలకూ బీజేపీ వ్యతిరేకమని తేలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాజ్యం ఆదాని, అంబానీ లాంటి వారికి ఊడిగం చేసేదిగా ఆచరణలో బహిర్గతమయింది. సంఫ్‌ుపరివార్, బీజేపీ దృష్టిలో హిందువులంటే పెద్ద పెద్ద కుబేరులేనని భావించాల్సి వస్తున్నది. కార్పొరేటు సంస్థలకు ఆర్థిక బదిలీలు చేయడం కార్మికుల హక్కులను అణచి వేయడం, ప్రభుత్వ రంగాల్లోని ఆస్థులను తెగనమ్మడం, ప్రయివేటు సంస్థలకు దారదత్తం చేయడం, ప్రయివేటు సంస్థల ప్రయోజనాలకై భూసేకరణ సులభతరం చేయడం నిత్యం చూస్తూనే ఉన్నాం.
బీజేపీ పాలనలో ఆదాని, అంబానీల ఆస్థులు ఎన్నో రెట్లు పెరిగాయి. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా వారి ఎదుగుదలకేమి డోకాలేదు. కానీ, ప్రజల జీవితాలే పెనం మీది నుండి పొయ్యిలోకి జారాయి. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలోగానీ, విద్యా, వైద్యం అందించడంలో గానీ, ఉపాధి కల్పనలో గానీ దేశం మరింత దిగజారింది. ఐక్యరాజ్య సమితీ యిచ్చిన లెక్కలైనా జాతీయ సంస్థలిచ్చిన లెక్కలైనా చెపుతున్నదిదే. ప్రజల అసంతృప్తిని ప్రక్కదోవ పట్టించడానికి, ప్రజల మతవిశ్వాసాలు మూఢనమ్మకాలే పెట్టుబడిగా సొమ్ము చేసుకుంటున్నది బీజేపీ.
దేవాలయాలు కట్టించడం, పూజలు, యజ్ఞాల పేరిట ప్రభుత్వ సొమ్మును దుబారా చేయడం, విద్యా సంస్థలలో అశాస్త్రియమైన పాఠ్యాంశాలు భోదించడం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. కుల వ్యవస్థను, బూజుపట్టిన సనాతన ప్రచారాలను పెంచి పోషిస్తున్న చిన్న జీయరు, రాందేవ్‌బాబా లాంటి వారిని ప్రభుత్వాలే నెత్తికెక్కించుకుంటున్నవి. వారు రాజగురువుల్లాగా చలామణీ అవుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకులు, పచ్చి మత వాదులు రాజ్యాలేలుతున్న పరిస్థితి. నగంగా తిరుగుతున్న మతిస్థిమితం లేని సాధువులు కనపడితే ప్రధాని రాష్ట్రపతి లాంటి వారే సాష్టంగ నమస్కారాలు చేస్తుంటే మనదేశం పరువు మంట కలుస్తుందన్న సోయి కూడా ఈ బీజేపీ పాలకులకు లేదు.
మంసాహారులంతా నీచులని, వేటి మాంసం తింటే వాటి బుద్ధులొస్తయని నూటికి 90శాతం హిందువులని అవహేళనచేసి అవమానపర్చడం ఈ మధ్యే చూశాం. గోవుల కోసం మనుషులను చంపడం తప్పుకాదని బహిరంగంగా ప్రకటించడమే కాక గోవులను హింసించారని దేశంలో అనేక చోట్ల మనుషులను చంపుతూనే ఉన్నారు.
ధర్మ రక్షణ పేరిట కులాంతర వివాహం చేసుకున్న వారిని, ప్రేమికులను వేదిస్తున్నారు. వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు. వీరి దౌర్జన్యాలు ఖండిస్తూ రచనలు చేసిన పన్సారే, డబోల్కర్, కల్బుర్గీ, గౌరిలంకేశ్ లాంటి వారిని హత్య చేశారు. మిగతా వారెవరు సంఫ్‌ుపరివార్ దురాగతాలను బహిర్గత పర్చకుండా ఉండటానికి ''ఊపా'' లాంటి చట్టాలు తెచ్చి మేధావులను, కవులను, రచయితలను నిర్బంధిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులన్నీ హరిస్తున్నారు.
కాబట్టే ప్రపంచంలో అమానుషమైన సంస్కృతి హిందూ మత సంస్కృతేనని అంబేద్కర్ చెప్పారు. ఏ మతం మనుషులందరు సమానం కాదని చెప్పలేదు. శ్రమ చేయడం అగౌరవమైనదిగా చెప్పలేదు. పూజారిగా ఒకే కులం వారే ఉండాలని చెప్పలేదు. కులాన్ని బట్టి శిక్షలు వేయాలని చెప్పలేదు. అత్యధికులు చదువుకోరాదు, సంపదలు కలిగి ఉండరాదని చెప్పలేదు. కొందరు ఎలాంటి శ్రమ చేయకూడదు, సోమరుల్లాగ తినాలని చెప్పలేదు. కాని ఇవన్నీ హిందూ ధర్మ శాస్త్రాలనబడే వాటినిండా రాసి ఉన్నాయి. భారతీయ సమాజం బ్రష్టు పట్టడానికి కారణం ఇవి. ఈ హిందూ మతాన్ని కాపాడటానికి సృష్టించబడిందే మనుధర్మశాస్త్రం. ఇది రెండున్నర వేల సంవత్సరాలనాడు ఏర్పడింది. అయినా దాని ప్రభావం తగ్గకపోవడం చూస్తేనే అది ఎంత పకడ్భందిగా రూపొందించబడిందో అర్థమవు తుంది. మనుధర్మ శాస్త్రం 26స్మృతులతో, 2500పైగా శ్లోకాలతో ఉన్నట్లు ఒక అంచనా, అందులో కొన్నిటిని పరిశీలిస్తే అది ఎంత దుర్మార్గమైందో అర్థమవుతుంది.
మనుషులు సమానం కాదు. ఎక్కువ తక్కువలు సహజం. అసమానతలు దేవుడే సృష్టించాడు. బ్రహ్మ తనముఖం నుండి బ్రాహ్మణులను, బాహువుల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను సృష్టించేను అని మనస్మృతి 31వ శ్లోకం ద్వారా చెప్పించారు.
శూద్రులు చదువ కూడదనే అంశాన్ని 2వ స్మృతి 16వ శ్లోకం ద్వారా చెప్పించారు. శూద్రులు ఆస్థులు కలిగి ఉండరాదనే అంశాన్ని 8వ స్మృతి 417వ శ్లోకం ద్వారా చెప్పించారు. శూద్రులు పుట్టిందే పైవర్గాలకు సేవలు చేయడానికనే అంశాన్ని 8వ స్మృతి 413వ శ్లోకం ద్వారా చెప్పించారు. శూద్రులను నీచమైన పేర్లతో పిలువాలి అనే అంశాన్ని 2వ స్మృతి 31వ శ్లోకం ద్వారా చెప్పించారు. బ్రాహ్మలు మూర్ఖులైనా, నీచులైనా దైవ సమానులే. వారు భూలోక దేవతలు. వారిని గౌరవించాలనే అంశాన్ని 9వ స్మృతి 317, 319వ శ్లోకాల ద్వారా చెప్పించారు. ఇలాంటి అమానుష సూక్తులు, స్మృతులు, శ్లోకాలతో అత్యధిక జనాభాగా ఉన్న శూద్రులను వేల సంవత్సరాలుగా అణచివేస్తున్నారు.
అందుకే డాక్టర్ అంబేద్కర్ ఈ మనుధర్మ శాస్త్రమే ఈ భారతీయ సమాజాన్ని హీనస్థితి తెచ్చిందన్నారు. అంటరాని తనానికి, కులవివక్షకు, పేదరికానికి మూఢవిశ్వాసాలకు ఈ హిందూ ధర్మశాస్త్రాలే కారణమన్నారు. రెండున్నర వేల సంవత్సరాలకు పైగా ప్రజల మస్కిష్కాలలో జొరబడ్డ మనుధర్మాలు ఇప్పటికి మనలను వదలలేదని, అందుకు ఈ మనుధర్మా సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మనుధర్మశాస్త్ర ప్రతులను తానే స్వయంగా ప్రతి డిసెంబర్ 25నాడు దహనం చేసే సంప్రదాయాన్ని ప్రారంభించారు. హిందూ మతంలో మాత్రమే కుల వ్యవస్థ ఉంది. ఈ అమానుషమైన కులవ్యవస్థ అంతం కావాలంటే హిందూ వ్యవస్థపైనే పోరాడాలన్నారు. హిందూ వ్యవస్థ అంతా అగ్రవర్ణాలను పోషించడానికి, వారిని సంఘంలో గౌరవనీయులుగా నిలపడానికి, వారి ప్రయోజనాలు కాపాడడానికే ఏర్పాటు చేయబడిందని చెప్పారు. ఇది ఆర్థిక, సామాజిక పీడన ద్వారా సంపన్న వర్గాల ప్రయోజనాల కొరకే ఉపయోగ పడుతూ, శ్రామిక జనాలను దోపిడీ చేస్తుందన్నారు.
వివిధ రకాల దోపిడీ వ్యవస్థలను కాపాడటానికి స్వార్థపర శక్తులు ఏర్పాటు చేసుకుందే ఈ మత వ్యవస్థని చెప్పారు అంబేద్కర్. అంతిమంగా ఇదంతా పెట్టుబడిదారి వ్యవస్థ రక్షణకే అన్నారు. ''బ్రాహ్మణిజం, క్యాపిటలిజం'' భారతీయ శామ్రిక వర్గాలకు కవల శత్రువులన్నారు. బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ఒకదానినొకటి కాపాడుకుంటున్నాయని తన రచనల్లో చాలా స్పష్టంగా వివరించారు. ఈ రెండింటికి వ్యతిరేకంగా జమిలిగా పోరాడాలన్నారు.
హిందూత్వ ప్రమాదం గతంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు భారతీయ సమాజం ఎదుర్కొంటున్నది. మన రాజ్యంగం ద్వారా దేశాన్ని లౌకిక, ప్రజాతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నాం. నెమ్మదిగానైనా అటువైపు కదులుతున్న సమయాన బీజేపీ రూపంలో హిందూత్వ మనువాదులు మళ్ళీ భారతీయ సమాజాన్ని మధ్యయుగాల వైపు మళ్ళించ జూస్తున్నారు. ఈ తరుణంలో జన చైతన్యానికి డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలు సదాగమనంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందూ రాజ్యం పూర్తిగా ఉనికిలోకి వస్తే దేశానికి మహా విపత్తే. అందుకే అంబేద్కర్ ఎట్టి పరిస్థితుల్లోను హిందూ రాజ్యం ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న అభ్యుదయ వాదులందరిపైన ఉందన్నారు. ఇప్పటికే హిందూత్వ మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వామపక్షవాదులు, అంబేద్కర్ వాదులు కలిసికట్టుగా పోరాడాలి. అభ్యుదయ శక్తులైన కవులు, రచయితలు, సామాజికోద్యమకారులు, మేధావులను కలుపుకొని మతోన్మాద మనువాద శక్తుల నెదిరించాలి. అప్పుడే డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చినవార మవుతాం. డాక్టర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా అభ్యుదయవాదులందరికి ఇదే ప్రతిన కావాలి.
- జి. రాములు