Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాటల తూటాలతో, 'బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో..' పాటలతో ప్రజల్లో నిప్పురవ్వ రగిలించిన ఉద్యమకారిణి కామ్రేడ్ మల్లు స్వరాజ్యం. ''నీ కాల్మొక్తా దొరా.. నీ బాంచన్' అని దొరలకు వెట్టిచాకిరీ చేస్తూ బానిస బతుకులు బతుకున్న ప్రజలను అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి ప్రోద్బలంతో 'దున్నే వాడిదే భూమి, గీసే వాడిదే చెట్టు, భూమి కోసం భుక్తి కోసం, ప్రజాస్వామ్య విముక్తి పోరాటమని నినదిద్దాం' అని యువతలో, మహిళల్లో చైతన్యం నింపి...తుపాకీ పట్టించిన ధీశాలి స్వరాజ్యం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాలంలో స్వరాజ్యాన్ని పట్టిస్తే రూ. పది వేలు ఇస్తామని తలకు వెలకట్టినా ప్రజలు డబ్బుకు ఆశపడకుండా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
భూస్వాముల ఇంట పుట్టిన ఆమెకు సకల సౌకర్యాలతో జీవించగలిగిన అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజల బానిస బతుకులు, కష్టాలు చూసి చలించేది. భూస్వాముల కుటుంబాలు ఏ పనీ చేయకపోయినా సర్వ సౌఖ్యాలు ఎలా పొందుతున్నారు? మిగతా అత్యధిక జనం బాధలతో నికృష్టమైన బతుకు బతుకుతున్నారని చిన్నతనంలోనే అన్న భిమిరెడ్డి ద్వారా తెలుసుకుంది. 'స్వాతంత్య్ర పోరాటం' ముమ్మురంగా జరుగుతోంది. ఓరుగల్లు- రుద్రమదేవి, ఝాన్సీరాణి వీరగాథల ప్రభావం నాపై ఉంది. మా అమ్మ చుక్కమ్మ ఇచ్చిన మాక్సిం గోర్కి రాసిన 'అమ్మ' నవల నెల రోజులు చదివా. అది చదివాక నాలో ఇంకా పట్టుదల పెరిగింద'ని చెప్పారు.
స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరనారిగా, మద్య నిషేధ ఉద్యమంలో రాష్ట్రమంతా మహిళలను ఉవ్వెత్తున కదిలించిన మల్లు స్వరాజ్యం ఇక లేరనే బాధ వెన్నాడుతూనే ఉంది. రాష్ట్ర మహిళా ఉద్యమంలో మానికొండ సూర్యావతి, మోటూరు ఉదయం, స్వరాజ్యం గారిని విడదీసి చూడలేం.
హైదరాబాద్ నడిబొడ్డున 1978లో పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు జరిపిన రమీజాబీ అత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్త ఆందోళన నిర్వహించాం. ఎంఎల్ఏగా ఉన్న స్వరాజ్యం అసెంబ్లీలోనూ, బయటా జరిగిన ఉద్యమాలతో ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనీయలేదు. నాడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ''మాటలు తూటాల లెక్కన ఎక్కుపెడతావ్. ఇది బహిరంగసభ కాదు. అసెంబ్లీ. ఎందుకంత ఆవేశపడతావ్?'' అన్నారని ఓ సందర్భంలో మల్లు స్వరాజ్యం చెప్పారు.
1979లో కృష్ణా జిల్లా కంభంపాడులో డివిజన్ మహాసభ జరిపాం. ఆ మహాసభకు కామ్రేడ్ స్వరాజ్యాన్ని వక్తగా ఆహ్వానించాం. తెలంగాణ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రాంతమిది. నీ బాంచన్ దొర, నీ కాల్మొక్త అనే బానిసత్వానికి, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, దున్నే వానికి భూమి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటంలో పదమూడు సంవత్సరాలకే దళ నాయకురాలిగా తుపాకీ పట్టి పోరాడిన వీర వనితగా ఆమెకు కృష్ణా జిల్లాలో వీరాభిమానం ఉండేది. బహిరంగసభకు విస్తృత ప్రచారం నిర్వహించాం. సభకు 2 వేల మంది హాజరయ్యారు. 1978లో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాదాసీదాగా, నిరాడంబరంగా ఉన్న స్వరాజ్యంని చూసి ఈమె ఎమ్మెల్యేనా అని అడిగేవారు. ఆమె ప్రసంగం విన్న తర్వాత వాళ్ళ నోళ్ళు మూతపడేవి. అనర్గళంగా తనదైన తెలంగాణ యాసతో నాటి పాలకుల విధానాలపై పదునైన మాటలతో ప్రజల దైనందిన సమస్యలను జోడించి ప్రసంగిస్తే ఆద్యంతం ప్రేక్షకుల చప్పట్లతో ప్రాంగణం మారుమోగిపోయేది. ఆ తర్వాత 1980, 1984లో సూర్యాపేట, మిర్యాలగూడెంలో జరిగిన రాష్ట్ర మహాసభలో ప్రతినిధిగా పాల్గొన్నాను. మల్లు స్వరాజ్యం, లక్షీసెహగల్, చాకలి అయిలమ్మ ప్రసంగాలు ఉత్తేజపరిచాయి. 1981లో చెన్నరులో జరిగిన మొదటి అఖిల భారత మహాసభలకు ప్రతినిధిగా వెళ్ళా. ఆ తరువాత కాలంలో పార్టీ, మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా మల్లు స్వరాజ్యంతో కల్సి పనిచేసే అవకాశం లభించింది. ముఖ్యంగా మహిళా సమస్యలపై 10 డిమాండ్లతో రాష్ట్ర వ్యాపితంగా సంతకాలు సేకరించి 5 వేల మంది మహిళలతో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాం. అసెంబ్లీ దగ్గర గన్‌పార్క్‌లో మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.ను సభ వద్దకు రావాలని స్వరాజ్యం, ఉదయం కోరిన మీదట ఆయన సభ వద్దకు వచ్చారు. లక్షలాది మహిళలు చేసిన సంతకాలతో కోర్కెల పత్రాన్ని అందజేశాం. మహిళా సంఘం పెట్టిన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి కమిటీని ఏర్పాటు చేసింది. అందులో స్వరాజ్యం కూడా ఉన్నారు. ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మహిళా సంఘం పోరాడి అనేక డిమాండ్లు సాధించుకుంది. మహిళలకు సమాన ఆస్తి హక్కు, మహిళా ప్రాంగణాలు, మరుగుదొడ్లు, వృత్తి శిక్షణా కేంద్రాలు, ప్రసూతి కేంద్రాలు, మహిళల ఉపాధి, వితంతు పెన్షన్లు, ప్రత్యేకంగా మహిళా కాలేజీలు, హాస్టళ్ల సమస్యలను పరిష్కారం అయ్యాయి.
నెల్లూరు జిల్లా దూబగుంటలో 1990లో... రోశమ్మ నాయకత్వాన సారా వ్యతిరేక ఉద్యమం సాగింది. దాన్ని మహిళా సంఘం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చింది. నెల్లూరు జిల్లాలో గ్రామగ్రామానా ప్రచారం నిర్వహించాం. సారా వేలం పాటలు అడ్డుకోవడానికి నెల్లూరు పుర వీధుల్లో భారీ ప్రదర్శన, సుబ్బారెడ్డి స్టేడియంలో బహిరంగ సభ జరిగాయి. ఆ సభలో నేనూ పాల్గొన్నాను. సభలో మల్లు స్వరాజ్యం ఉపన్యాసం కర్తవ్యబోధ చేసింది. జనాన్ని ఉత్తేజపరచడంతోపాటు ప్రభుత్వానికి ''డబ్బులు కావాలంటే ఆడవాళ్ల దగ్గరకు రండి. జోలి పట్టి వసూలు చేసి ఇస్తారు. మద్యం ఆదాయం కోసం ఆడవాళ్ల పుస్తెల తాడు తెంపొద్దు'' అని హెచ్చరించింది. మోటూరు ఉదయం, స్వరాజ్యం, సూర్యావతి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక మహిళా ఉద్యమాలు నడిచాయి.
స్వరాజ్యం పుట్టింది సంపన్నుల కుటుంబంలోనైనా ఆమె నడిచిన బాట ముళ్ల బాట. ముక్కుపచ్చలారని బాల్యంలోనూ తొంబయ్యవ పడిలోనూ ఆమెది ఒకటే మాట. పీడితుల పక్షాన పోరాటం చేయడంలో ఆమెది అదే బాట. దొడ్డి కొమరయ్య, ఐలమ్మ సాక్షిగా సాయుధ పోరాటంలో గెరిల్లా అవతారమెత్తి తుపాకీ పట్టింది. స్వాతంత్య్ర పోరాటం నుంచి తెలంగాణ పోరాటం, మహిళా ఉద్యమం వరకు అనేక దశల్లో తనదైన పాత్ర పోషించిన నిలువెత్తు ఉద్యమకారిణి స్వరాజ్యం. తన పాటలతో మాటలతో ప్రజలను కదిలించిన సాహసి. ఒక తరం వీరోచిత పోరాట గాథ పరిసమాప్తమైంది. జీవితకాల స్ఫూర్తిని మనకు అందించి ఉద్యమాల చిరునామా వెళ్లిపోయింది.
- కె. స్వరూపరాణి