Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మత్తుమందులకు బానిసై మరణించిన విద్యార్థి ఉదంతం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడేలా చేసింది. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఓ పబ్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ ఉదంతం దారుణ పరిస్థితిని కళ్ళకు కట్టింది. అక్కడ పట్టుబడ్డ వారందరూ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పోలీసు కుటుంబాలకు చెందిన యువతే. 150 మందిని అరెస్టు చేసి 148మందిని గుర్తించి ఐదుగురిపై కేసు పెట్టి రిమాండ్లో ఉంచారు. ఈ ఐదుగురు డ్రగ్స్ సరఫరాదారులు, పబ్ నిర్వాహకుడు. కాగా ఈ పబ్ యజమాని ఉప్పల అభిషేక్ బీజేపీ నాయకుడు కావడం కొసమెరుపు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సంవత్సరాల కిందట డ్రగ్స్ కలకలం రేగింది. కొద్దిమంది సెలెబ్రిటీలను విచారించి చేతులు దులుపుకున్నారు. విచారణలో దోషులుగా ఎవరిని తేల్చారు, ఎంత వరకూ నడిచిందీ ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో హిందీ చిత్ర పరిశ్రమలోని సెలెబ్రిటీలను విచారణ చేశారు. కొద్ది రోజులకు వాతావరణం మారిపోయింది. షారుఖ్ ఖాన్ తనయుడు, మరికొంతమంది అరెస్టుతో మరలా తెర మీదకి డ్రగ్స్ భూతం వచ్చింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆర్యన్ ఖాన్ భద్రతా అధికారి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో తగులబెట్టిన గంజాయి గుట్టలు నోరు వెళ్ళబెట్టుకునేలా చేశాయి. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలు ఎవరికీ అంతుపట్టలేదు. ప్రతిసారి ఎవరో కొద్ది మంది డ్రగ్ డీలర్ల పేర్లు వినపడి వారి మీద విచారణ జరిగి కొంతకాలానికి అరెస్టు చేసినా ఈ 'మత్తు' మరణాలను ఆపగలరా? ఇంకా ఎన్ని పసి మొగ్గలు రాలిపోవాలి?
ఎంక్వైరీలో ఉన్న సెలెబ్రిటీలు, డబ్బు ఎక్కువై ఏం చేసుకోవాలో తెలియని కామందుల బిడ్డలు ఎఫ్ఐఆర్ దగ్గరకొచ్చేసరికి ఎందుకు అమాయకులుగా మారిపోతున్నారు. మైనర్లకు సిగరెట్లు అమ్మడం కూడా నిషేధం అయిన ఈ సమాజంలో వీధివీధికీ మాదక ద్రవ్యాలు ఎలా దొరుకుతున్నాయి? చట్టాలు చేయడం తప్ప అమలు విషయంలో కచ్చితత్వం ఏది ?
విద్యా సంస్థల్లోకి విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నా నియంత్రించలేక పోతున్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో, మధ్యతరగతి వారికి, విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లోను చిన్న పిల్లలకు మత్తు మందు అలవాటు చేసి తరువాత వారినే మాదక ద్రవ్యాల సరఫరాకు వాడుకుంటున్నారు. సరదాగా మొదలుపెట్టి తమను తాము గుర్తించలేని స్థితిలో మత్తుకు బానిసలుగా మారిపోతున్నారు. సరదా అలవాటుగా మారి ఆ తరువాత వ్యసనంగా రూపాంతరం చెందుతుంది. ఆ మత్తులోనే, ఆ మత్తు కోసమే నేరాలకు పాల్పడుతున్నారు. తెలియకుండానే సంఘవిద్రోహ శక్తులుగా మారిపోతున్నారు. ఇబ్బడిముబ్బడిగా సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియని ధనవంతులకు మాత్రం స్టేటస్ సింబల్. అర్థరాత్రి దాకా అడ్డగోలు చిందులు వేసి ఆ మత్తులోనే వాహనాలు నడపడం, ప్రాణాలు తీయడం పరిపాటిగా మారింది. డబ్బు లేని వారు నాశనమై ఎందుకూ కొరగాకుండా పోతున్నారు. ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతున్నాయి. పోలీసులకు పట్టుబడ్డ సందర్భంలో యువకులు మత్తులో చేతులపై కత్తులతోను, బ్లేడులతోను కోసుకుంటుంటే ఏం చేయాలో తెలియక పోలీసులు కూడా చేష్టలుడిగి చూస్తున్న ఉదంతాలు కోకొల్లలు.
కేవలం మాదక ద్రవ్యాలకు బానిసలై మరణిస్తున్న వారి సంఖ్య మన రాష్ట్రంలో తీసుకుంటే 2018లో 196గా ఉంటే 2020 నాటికి అది 385కు పెరిగింది (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం). ఇందులోను 40శాతం యువతే. మత్తుకు బానిసలై నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాల తరపు నుండి డీ అడిక్షన్ సెంటర్ల కోసం చేస్తున్న ఖర్చు నామమాత్రంగానే ఉంది. ఇది కేవలం ఒక కుటుంబంతోనో, ఒక పరిధి వరకో ఆగిపోదు. కరోనా వల్ల ఒకటి రెండు సంవత్సరాలు చదువు దెబ్బ తింటే దాని ప్రభావం కొన్ని సంవత్సరాలకు ఆర్థిక వ్యవస్థ మీద పడుతుందని మేధావులు తేల్చారు. అదే ఒక తరం ఉనికిలో లేకుండా నాశనం అయిపోతే దేశానికైనా, రాష్ట్రానికైనా భవిష్యత్తు ఉంటుందా?
ఇంత జరుగుతున్నా కేవలం అప్పటికప్పుడు బయటపడ్డ ఒక్క కేసుకు సంబంధించి ఎంక్వైరీలు చేస్తే సరిపోదు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎటువంటి పక్షపాత ధోరణికి పోకుండా బాధ్యత తీసుకుని మాదక ద్రవ్యాలను సమూలంగా తుడిచి పెట్టాల్సిన అవసరముంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలి. మరోసారి నేరానికి పాల్పడే అవకాశం లేకుండా చట్టాలను పటిష్టంగా అమలు పరచాలి. చిన్న, పెద్ద స్థాయిలో ఈ వ్యాపారాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రక్రియకు సమాంతరంగా డీ అడిక్షన్ కేంద్రాలు, కౌన్సిలింగ్ సెంటర్లను ఎక్కువగా నెలకొల్పాల్సిన అవసరముంది. వీటిపై ప్రజలకు అవగాహన పెంచాలి. మత్తు మందులను వాడితే శిక్ష తప్పదనే భయం పేద, గొప్ప బేధం లేకుండా అందరికీ కలుగజేయాలి. కౌన్సిలింగ్ సెంటర్లు పెంచాలి. అన్ని ప్రాంతాలకు, అన్ని స్థాయిల లోని వారికి ఈ సదుపాయం అందేలా ఏర్పాటు ఉండాలి. ఈ రెండు పనులు ఒకేసారి యుద్ధప్రాతిపదికన చేపడితే తప్ప మత్తు వ్యసనానికి అడ్డుకట్ట వేయలేము.
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా పరువు పోతుందని వారిని దాచిపెట్టడమో, ఒక్కసారిగా మార్పు తెచ్చేయాలని క్రూరంగా శిక్షించడమో, వారి ఖర్మకు వారిని వదిలేయడమో కాకుండా వారిలో మార్పు కోసం సహకరించాలి. వారిని నేరస్థులుగా చూడడం కాక ఆ అలవాటు కలిగేందుకు ప్రేరేపించినవి ఏమిటో తెలుసుకుని వాటిని నివారించాలి. మత్తు జోలికి పోకుండా భవిష్యత్తు మీద మంచి దృక్పథంతో పెరిగేలా పిల్లలకు క్రమశిక్షణ అలవరచాలి. తల్లి దండ్రులు సైతం వ్యసనాలకు దూరంగా ఉండాలి. మందు తాగించి అభివృద్ధి చేస్తామని చెప్పే ప్రభుత్వాలు... మత్తుకు బానిసలు కాకుండా ఎలా మార్చగలుగుతాయి? యువతను ప్రభావితం చేసే ప్రతి అంశంలోను బాధ్యతాయుతమైన ధోరణి ఉండాలి. ప్రభుత్వం, కుటుంబం, సమాజం అందరం బాధ్యత తీసుకుంటేనే భావి తరాలను కాపాడుకోగలవం. సమాజ భవిష్యత్తునూ కాపాడుకోగలం.
- వల్లభనేని గీతావాణి