Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కార్యశూరుడు విరేశలింగం
కదం తొక్కి పోరాడిన సింగం
దురాచారాల దురాగతాలను
తుదముట్టించిన అగ్ని తరంగం'' తెలుగు రచయిత, సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం పంతులు గూర్చి మహాకవి శ్రీశ్రీ వాక్కులివి. ఇది కందుకూరి వారి 174వ జయంతి. ((16 ఏప్రిల్ 1848 - 27 మే 1919).
''ఉద్యోగంలో చేరడానికి అమావాస్యనాడే ఎందుకు వచ్చా''వని అధికారి అడిగాడు. ''అయ్యా! అన్ని రోజులూ ఆ ఈశ్వరుడు సృష్టించినవనే చెపుతారు కదా? మరి అలాంటప్పుడు అన్ని రోజులూ మంచివే - అలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా, అది మంచి రోజే అవుతుంది!'' అని తాపీగా సమాధానమిచ్చారు వీరేశలింగం.
ఈ విషయం ''మూఢనమ్మకాలపై నా పోరాటం'' అనే గ్రంథంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు (పే.24). అభిరుచి ఉన్నవారు ఆ పుస్తకం సంపాదించి, క్షుణ్ణంగా చదవడం మంచిది. అందులో ఆయన అనేక ప్రహసనాలు రాశారు. అందులో ఒకటి 'శకునాలు' అనే శీర్షికతో ఉంది. ఉదాహరణకు ఇక్కడ అందులోని విషయాలు కొన్ని క్లుప్తంగా పొందుపరుస్తున్నాను. సున్నిత హాస్యం, వ్యంగ్యం మేళవించి ఎంతో మనోరంజకంగా రాశారు. గమనించండి!
కుటుంబాన్ని తీసుకుని ప్రయాణం చేయాలంటే వెనకటి రోజుల్లో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. అసలే రవాణా సౌకర్యాలు సరిగా లేని రోజులు. పైగా ఘడియ ఘడియకూ ముహూర్తాలు చూసుకునే పిచ్చి. మనువాదులు ఆ పిచ్చిని ఎప్పటికప్పుడు మరింతగా పెంచి పోషిస్తూ ఉండేవారు. ఆ విశేషాలన్నీ వీరేశలింగం సోదాహరణంగా రాసుకొచ్చారు. ఇన్నిన్ని చాదస్తాల మధ్య ఆ కాలం మనుషులు ఎలా బతికారబ్బా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది కూడా!
లిలిలి లిలిలి లిలిలి
ఆడవాళ్ళను తీసుకుని మంచీ చెడ్డా విచారించకుండా దురాభారం ఎలా బయలుదేరనండీ? పోనీ అమావాస్యకు ముందే బయలుదేరుదామంటే, దోవలో అమావాస్య వస్తే మంచిది కాదని పెద్దలు చెప్పినారు. అమావాస్య వెళ్ళిన పాడ్యమి ప్రయాణానికి బొత్తిగా మంచిది కాదు. విదియనాడు బయలుదేరుదామంటే ఆ రోజు శుక్రవారం అయ్యింది. అక్కడికీ మొండిగా చొరవచేసి బయలుదేరుదామని అనుకునేంతలో ఎవరో 'హాచ్చ్' మని తుమ్మినారు. అటువంటి అపశకునం అయిన తర్వాత ప్రయాణం ఎలా చేస్తామని ఆనాటికి మానేశాం. శనివారం ఉదయమా దుర్ముహూర్తం! పిల్లలను తీసుకుని ఎలా బయలుదేరడం? ఆ మధ్యాహ్నమేమో వర్జ్యం వచ్చింది. వర్జ్యం వెళ్ళిన తరువాతి రాత్రి బండి కోసం కబురు చేయబోతుంటే గుడ్లగూబ కూసింది. అలాంటప్పుడు ప్రయాణం మానేయక తప్పదు కదా? ఇక ఏం చేయడం? ఆ మరునాడు చవితి. ప్రయాణానికి చవితి ఏమాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే కదా?
తరువాతి రోజు పంచమి, బయలుదేరాలి. కానీ, ఉదయాన నక్షత్రం మంచిది కాదు. అదీ కాకుండా వర్జ్యం కూడా వచ్చింది. మధ్యాహ్నం బయలుదేరుదామని భోజనం చేసి పచార్లు చేస్తూ ఉంటే, మాలబల్లి మీదపడింది. జ్యోతిష్యుణ్ణి పిలిపించి స్నానం చేసి, దీపం పెట్టుకుని శాంతీ గీంతీ చేసుకునేప్పటికి దీపాల వేళయ్యింది. రాత్రి భోజనాలు చేసి బయలుదేరుదామంటే పెద్దలందరూ చుక్క ఎదురు వెళ్ళకూడ దన్నారు. సరే, ఆ మరుసటి రోజు షష్టి. ఒక్క షష్టి మాత్రమే అయితే ఎలాగయినా బయలుదేరుదును. కానీ, ఆ రోజు పిడుగువలె మంగళవారం కూడా వచ్చింది. ఈ రెంటికి తోడు ఆ రోజు వట్టి పాడు నక్షత్రం. ఇక సప్తమీ బుధవారం ప్రయాణానికి బహు అనుకూలమైంది. కానీ, ఆ రోజు మా చిన్న కుర్రవాడి పుట్టినదినం. ఆ పండుగ ముగించుకుని భోజనాలు చేస్తేగాని బయలుదేరేదిలేదని ఇంట్లో ఆడవాళ్ళు పట్టుబట్టారు. అసలు ఆ ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నానికే దొంగలమర్రి దాటిపోయేవాళ్ళం. దొంగలమర్రి అంటే దారిదోపిడీ దొంగలు పొంచి ఉండే చోటు. కానీ, భోజనాలు కాగానే బయలుదేరుదామని బండి కట్టించి తీరా ఎక్కబోయే సరికి వెధవముండ ఎదురుగా వచ్చింది. మళ్ళీ లోపలికి వెళ్ళి అర్థగంట సేపు ఆగినాము. అప్పుడు బయలుదేరినా దీపాలు పెట్టకముందే దొంగలమర్రి దాటిసేవాళ్ళం.
కానీ వీధి గుమ్మంలోకి వచ్చేసరికి ఒంటి బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చాడు. అందుకని లోపలికి వెళ్ళి కొంత సేపు ఆగినాము. ఇలా అయితే లాభం లేదని వీధిలో ఎవరూ నడవకుండా జాగ్రత్తపడి పొరుగింట్లో నుంచి ఒక ముత్తయిదువును ఎదురు రమ్మని చటుక్కున బండి ఎక్కి బయలుదేరినాము. ఎంత మంచి శకునం చూసి బయలుదేరినా... ఆ వెధవ ముండ ఎదురుగా వచ్చిన వేళ ఎటువంటిదో కానీ ఫలితం మాకు వెంటనే కనిపించింది. రాత్రి పదిగంటలకు మేము జడుస్తూనే దొంగలమర్రి దగ్గరకు చేరాము. దొంగలు వచ్చి నగలన్నీ ఎత్తుకుపోయారు. మేం మంచి శకునం చూసుకుని బయలుదేరడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాం. మొన్న ఓ సారి జాతకం చూపించుకుంటే... నాకు ధన నష్టం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. అంటే అంతా నిజమైనట్టే కదా? జ్యోతిష్యం తప్పలేదు.
లిలిలి లిలిలి లిలిలి
జ్యోతిష్యాన్ని నమ్మేవారు తాము నమ్మిన జోస్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటి అరా నిజమైతే వాటినే మళ్ళీ పట్టుకుని వేళ్ళాడుతారు. ఒక విధంగా జ్యోతిష్యం చెడిపోయిన గడియారం లాంటిది. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని, ఆగిపోయిన గడియారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిష్యాన్ని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం! వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెపితే, అందులో కొంతమేరకు నిజమయ్యే అవకాశాలు ఉంటే ఉంటాయి. ఉండకపోతే ఉండవు. ఇకపోతే, దేవుడి విషయం చూడ్దాం! ఒక కారుకు బ్రేకులు ఫెయిల్ అయి లోయలో పడిందని అనుకుందాం. ఆ ప్రమాదంలో బతికిన వాళ్ళు 'ఆదేవుడి దయ వల్ల బతికామ'ని చెప్పుకుంటారు కదా? మరి చనిపోయిన వారిని ఎవరు చంపినట్టూ? ఆ దేవుడు చంపాడని చెప్పాలి కదా? కానీ చెప్పరు. ఒకవేళ ప్రమాదానికి గురయిన ఆ కారులోని వారంతా చనిపోతే మీడియాలో వార్త ఇలా ఉంటుంది... ''కారు బ్రేకులు ఫెయిల్ అయి అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు'' అని ఉంటుంది. బ్రేకులు ఫెయిల్ కావడం హైలైట్ అవుతుందే తప్ప ఆ వార్తలో దేవుడి ప్రసక్తి ఉండదు.
ప్రయాణికులు బతికితే 'దేవుడి దయ' వల్ల బతికారనడం, మరణిస్తే మాత్రం తప్పు బ్రేకులు ఫెయిల్ కావడంపై పెట్టడం ఏమైనా బాగుందా? తప్పు దేవుడి మీద పెట్టి, ఆయనే చంపేశాడని అనుకునే ధైర్యం ఉండదు. ప్రజలు ఇలాంటి ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల కదా దేవుడు, జ్యోతిష్యం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధ విశ్వాసాలు సమాజంలో సజావుగా బతుకుతున్నాయి? ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగ గ్రస్తమవుతూ ఉంది? మన జీవితంలో మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని నిశితంగా పరిశీలిస్తూ, హేతుబద్ధంగా విశ్లేషించుకుంటే నిజానిజాలు బయటపడతాయి! ''దైవాన్నీ, జ్యోతిష్యాన్ని ప్రబోధించేవారు తమ సౌకర్యానుసారంగా ఆలోచనల్ని, విధి విధానాలని మార్చుకుంటూ ఉంటారని'' వీరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు. మరి, మనవాళ్ళు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదే? గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా మూఢనమ్మకాల్లో పడిపోతున్నారు. ఒక పెరియార్, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోరా వివేచన అనే దుడ్డు కర్రలతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి. జన చైతన్యానికి దోహదం చేస్తూనే ఉండాలి! ఇక ప్రస్థుత పరిస్థితుల్లోకి వద్దాం!
''మహాభారత కాలంలోనే సాటిలైట్, ఇంటర్నెట్ ఉంది'' అని అన్నాడు త్రిపుర ముఖ్యమంత్రి. నిజమే! ఆయన ఊహ ప్రకారం ఆరోజుల్లో చాలా చాలా జరిగేవేమో.. బహుశా ఆ ''ఊహలు'' ఇలా ఎందుకు ఉండకూడదూ? ఊహలకు పరిధి ఏముంటుంది? ఎలాగైనా ఉండొచ్చు. ఉదాహరణకు ఇలా కూడా ఉండొచ్చు...
(యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు భయానక యుద్ధ చిత్రాల్ని ట్విట్టర్లో అప్డేట్స్ పెడుతుండేవాడు. అర్జునుడు వాటిని ఫాలో అవుతూ ఇన్స్టాగ్రామ్లో తన సైనిక బలగాలకు సూచనలిస్తుండేవాడు.
ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషాల్ని ఆన్లైన్ ఎఫ్.ఎం. రేడియాలో వినేవాడు. పాండవులు తమ 'ఐఫోన్'తో సెల్ఫీలు దిగేవారు. కౌరవులు తమ వాట్సప్ గ్రూపుల్లో ఉత్సాహ భరితంగా సందేశాలు పంపుకునేవారు. తమ సైనికుల సాహసోపేతమైన దృశ్యాల్ని షేర్ చేసుకునేవారు. యుద్ధాన్ని మొత్తం ఫేస్బుక్ లైవ్లో ప్రసారం చేసేవారు. బిబిసి, యస్.యన్.ఎ, 24 ఫ్రాన్స్, వియాన్, ఇండియా టుడే, యన్డీటీవీలలో యుద్ధం వ్యూహాలపై విశ్లేషణలు జరిపేవారు....)
ఇలా అని కేంద్రంలో అధికారంలో ఉన్న దేశభక్తుల్ని మనం ఎద్దేవా చేయడం కాదు. వాళ్ళకు వాళ్ళే, వాళ్ళేమిటో నిరూపించుకుంటున్నారు? లేకపోతే అర్థసత్యాలతో, అబద్ధాలతో తీసిన 'కశ్మీర్ ఫైల్స్' సినిమా చూడండని ఈ దేశ ప్రజలకు స్వయంగా ఈ దేశ ప్రధాని చెపుతాడా? 'నేడే చూడండి' అంటూ ఊళ్ళల్లో ఓ మైకు రిక్షా తిరుగుతుండేది. ప్రధాని పదవి ఆ స్థాయికి చేరిందా? అదే ఎందుకు? గుజరాత్ అల్లర్లపై వచ్చిన 'పర్జానియా' (ూA=్గAచీ×్గ) పూర్తి హిందీ సినిమా యూట్యూబ్లో ఉంది. అది చూడమని చెప్పలేదెందుకూ? రేషన్ ఇవ్వడం చేతగాకే భాషణ్ లిస్తుంటాడని సగటు భారతీయుడికి అర్థమైంది. ఇటీవల పెరిగిన పెట్రోలు, డీజిల్లతో సామాన్యుల నుండి భారత ప్రభుత్వం వసూలు చేసిన టాక్స్ 26.51లక్షల కోట్లు. గతంలో కార్పొరేట్లకు ఇదే ప్రభుత్వం చేసిన రుణమాఫీ 10.86లక్షల కోట్లు.
మూఢనమ్మకాలు, జ్యోతిష్యం, వాస్తు, ఆవుపేడ, ఆవుమూత్రం వంటి వాటితో ఈ దేశ ప్రజల్ని విడగొట్టి, విభజించి, దేశాన్ని ''హిందూరాష్ట్ర్''గా మార్చాలన్న ఉద్దేశంతోనే విద్యారంగాన్ని కాషాయంలో ముంచు తున్నారు. ''దేశం కాషాయీకరణ చెందితే తప్పేంటి?'' అని దేశ ద్వితీయ పౌరుడైన తెలుగువాడు ప్రశ్నిస్తుంటే.. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? లేక సాధారణ శకానికి పూర్వకాలంలో ఉన్నామా? అని అనుమాన పడాల్సి వస్తోంది. ఇప్పుడు బంతి బాధ్యతాయుతంగా వ్యవహరిం చాల్సిన ప్రతిపక్షాల మీద ఉంది. ప్రశ్నించగల సామర్థ్యం, స్థైర్యం గల సామాన్య పౌరులు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే.. ప్రజాకవి వేమన, కందుకూరి వీరేశలింగం లాంటి వారి రచనల నుండి స్ఫూర్తిని పొందాల్సి ఉంది!
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమి విజేత, జీవశాస్త్రవేత్త.