Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. విదేశీ చెల్లింపుల లోటు చెయ్యి దాటిపోయింది. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. పాత అప్పుల వాయిదాలను చెల్లించలేని పరిస్థితి. ఆహారం, చమురు, ఎరువులు వంటి అత్యవసర సరుకులను సైతం దిగుమతి చేసుకోలేకపోతోంది. దేశంలో వ్యవసాయం దిగజారిపోయింది. ఆకలి, పోషకాహార లేమి తీవ్ర సమస్యలుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఏకంగా 17.5శాతానికి చేరింది. ఈ తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణం చైనా నుంచి అప్పులు తెచ్చి ఆ అప్పుల ఉచ్చులో ఇరుక్కోవడమేనని దేశంలో, ప్రపంచంలో ప్రధాన స్రవంతి మీడియా ప్రచారం చేస్తోంది. కాని వాస్తవాలేమిటి ?
శ్రీలంకకి ఉన్న మొత్తం అప్పులో చైనా ది కేవలం 10శాతం వాటా మాత్రమే. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, జపాన్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి శ్రీలంక తెచ్చిన అప్పు ప్రధాన భాగం. దీని వలనే శ్రీలంకకి ఈ దుస్థితి కలిగింది.
శ్రీలంక గత చరిత్ర
బ్రిటన్‌కి వలసగా ఉన్నకాలంలో యూరోపియన్ మార్కెట్ల అవసరాలు తీర్చడం కోసం శ్రీలంకలో వ్యవసాయం స్వభావాన్ని మార్చివేశారు. ఆహార పంటల స్థానంలో కాఫీ, రబ్బరు, తేయాకు తోటలను పెంచడం అప్పుడే మొదలైంది. ఆ తోటల్లో పని చేయడానికి తమిళ కూలీలను ఇండియా నుండి తీసుకువెళ్ళారు. 1948లో శ్రీలంకకి స్వతంత్రం వచ్చేసరికి ఈ మూడు పంటల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశపు జీడీపీలో మూడో వంతుగా ఉండేది. అదే సమయంలో ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, పాలు, చక్కెర వంటి ప్రజావసరాలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వచ్చేది. వ్యాపార పంటల తోటలన్నీ వలసపాలకుల యాజమాన్యం కింద ఉండటం వలన దేశ సంపదలో ఎక్కువ భాగం విదేశాలకు తరలిపోయేది. అందువలన దేశీయంగా పరిశ్రమలను స్థాపించడానికి అవసరమైన పెట్టుబడి పోగుపడడం సాధ్యం కాలేదు. స్వాతంత్య్రం వచ్చేనాటికి శ్రీలంక పారిశ్రామికంగా వెనుకబడిపోయింది.
అయితే, 1950 దశకం వరకూ అంతర్జాతీయంగా శ్రీలంక వ్యాపార పంటలకు గిరాకీ ఉండేది. మంచి రేటు వచ్చేది. అందువలన విదేశీ వ్యాపారంలో మిగులు ఉండేది. ఆ వ్యాపారం మీద ప్రభుత్వానికి సమకూరే పన్ను ఆదాయంతో ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, ఉచిత ప్రాథమిక వైద్యం, సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలు అందించగలిగేది. ప్రజల తలసరి ఆదాయం స్థాయి తక్కువగా ఉన్నా మానవాభివృద్ధి సూచికలలో శ్రీలంక ముందుకే పురోగమించగలిగింది.
1960 దశకం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. శ్రీలంక వ్యాపార పంటలకు వచ్చే ధరలు పడిపోయాయి. కాని దిగుమతుల ధరలు మాత్రం పెరిగిపోసాగాయి. 1965-66 నాటికి శ్రీలంక విదేశీ చెల్లింపుల లోటులో పడిపోయింది. ఆ పరిస్థితిలో ఐఎంఎఫ్ రంగప్రవేశం చేసింది. అప్పుతోబాటు షరతులు కూడా విధించింది. ఆ షరతుల ఫలితంగా విదేశీ వ్యాపారాల మీద వచ్చే పన్ను రాబడి పడిపోయింది. సామాన్య ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు తగ్గిపోయాయి. శ్రీలంక కరెన్సీ విలువను 20శాతం మేరకు తగ్గించారు.
1970 దశకంలో అధికారంలోకి వచ్చిన సిరిమావో బండారునాయకే ప్రభుత్వం ఈ విధానాల నుండి వెనక్కి మళ్ళే ప్రయత్నం చేసింది. భూసంస్కరణలను చేపట్టింది. పరిశ్రమలను జాతీయం చేయడానికి పూనుకుంది. సంక్షేమరంగాలకు కేటాయింపులు పెంచింది. ఈ మార్పును ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు తీవ్రంగా విమర్శించాయి. ఈ సమయంలో 1973లో చమురు ధరలను చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఒక్కసారిగా పెంచివేశాయి. దీంతో శ్రీలంక విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి. పారిశ్రామిక ఉత్పత్తి స్తంభించిపోయింది. నిత్యావసర సరుకులన్నీ దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రతికూల పరిస్థితులను పాలకపక్షం తట్టుకోలేపోయింది. ఆ ప్రభుత్వం 1977లో పడిపోయింది.
దేశంలోనయా ఉదారవాద విధానాలు
1977లో జె.ఆర్ జయవర్దనె నాయకత్వంలో యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. అప్పటి నుంచీ దేశంలో నయా ఉదారవాద విధానాలు మొదలయ్యాయి. 1977 నుండి 1984 మధ్య మూడు సార్లు జయవర్దనె ఐఎంఎఫ్ రుణాలు తీసుకున్నాడు. శ్రీలంక రూపాయి విలువను తగ్గించడం, ధరలమీద నియంత్రణలు ఎత్తివేయడం, సబ్సిడీల కోత, వేతనాల కోత, ప్రయివేటు సంస్థలను ప్రోత్సహించడం వంటి చర్యలు అమలు చేశారు. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోవడం మొదలైంది. తలసరి ఆహార లభ్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదోవ పట్టించేందుకు జయవర్దనె సింహళ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి మెజారిటీ సింహళులకు, మైనారిటీ తమిళులకు మధ్య విద్వేషాన్ని రగిల్చాడు. దానికి ప్రతిస్పందనగా తమిళ ఈలమ్ (ప్రత్యేక తమిళ రాజ్యం) కావాలన్న డిమాండ్‌తో ఉద్యమాలు బయలుదేరాయి. ప్రభాకరన్ నాయకత్వంలో తమిళ టైగర్లు (ఎల్‌టిటిఇ) సాయుధ దళాలుగా ఏర్పడి సింహళ సైన్యం మీద దాడులకు సైతం దిగనారంభించారు.
ఈ ఘర్షణలను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం తమిళులపై 1983లో ఊచకోతకు తెగబడింది. అక్కడి నుండి దీర్ఘకాలం పాటు అంతర్యుద్ధం కొనసాగింది. ఇంకోపక్క నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న కార్మికోద్యమాలను అణచివేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడానికి, అధ్యక్ష తరహా పాలనను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం పూనుకుంది. దేశంలో పదే పదే అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఏకపక్ష పాలన సాగించింది.
అంతర్యుద్ధం అనంతర కాలం
1983లో మొదలైన అంతర్యుద్ధం 2009లో ముగిసింది. తమిళ ఉద్యమాన్ని సైనిక బలాలతో హింసాత్మక పద్ధతుల్లో అణచివేశారు. ఆనాటికి శ్రీలంక పొదుజన పెరుమన పార్టీ నాయకుడిగా మహింద రాజపక్స అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతర్యుద్ధంతో చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి మళ్ళీ ఐఎంఎఫ్ వద్ద రుణానికి సిద్ధపడ్డాడు. ఈ అంతర్గత పరిస్థితులకు 2008లో తలెత్తిన అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తోడైంది. యథావిధిగా ఐఎంఎఫ్ మరోసారి షరతులతో కూడిన రుణాన్ని ఇచ్చింది. ఐఎంఎఫ్ షరతుల కారణంగా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం కల్పించుకోగలిగిన శక్తిని కోల్పోయింది. మళ్ళీ విదేశీ మారకద్రవ్య నిల్వలు కరిగిపోయాయి. 2016లో మరోసారి ఐఎంఎఫ్ రుణానికి దరఖాస్తు చేసింది శ్రీలంక ప్రభుత్వం. 2016లో తీసుకున్న రుణం పదహారోది. యథావిధిగా ఐఎంఎఫ్ షరతులతో కూడిన రుణాన్ని మంజూరు చేసింది. ఈ షరతులను అమలు చేసిన ఫలితంగా శ్రీలంక జీడీపీ వృద్ధి రేటు 2015 నాటికి 5శాతంగా ఉన్నది కాస్తా 2019 నాటికి 2.9శాతానికి పడిపోయింది. ప్రభుత్వ ఆదాయాలూ పడిపోయాయి. ప్రభుత్వ రుణం విపరీతంగా పెరిగిపోయింది.
రెండు షాక్ లు, కరోనా మహమ్మారి
2019లో శ్రీలంకలోని చర్చిల్లో వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. 250మందికి పైగా పౌరులు మరణించారు. దేశం దిగ్భ్రాంతికి గురైంది. పర్యాటక రంగం ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీలంకకు ఈ ప్రేలుళ్ళ తర్వాత పర్యాటకులు విదేశాల నుండి రావడం మానుకున్నారు. టూరిజం 71శాతం తగ్గిపోయింది. దాంతో విదేశీ మారక ద్రవ్యం రావడం తగ్గిపోయింది.
2019లో గొటబాయ రాజపక్స ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పన్నులను తగ్గిస్తానని, రైతులకు రాయితీలు కల్పిస్తానని హామీలిచ్చి గెలిచాడు గొటబాయ రాజపక్స. పరోక్ష పన్నులతోబాటు పెట్టుబడిదారుల నుండి రాబట్టే ప్రత్యక్ష పన్నులను సైతం తగ్గించాడు. 200కోట్ల డాలర్ల మేరకు పన్ను రాబడి తగ్గింది. ఇది జీడీపీలో 2శాతం. విదేశీమారక ఆదాయం పడిపోవడం, దేశీయంగా పన్ను రాబడి తగ్గిపోవడం ప్రభుత్వానికి రెండు పెద్ద ఆర్థిక షాక్‌లుగా పరిణమించాయి. వీటికి కోవిడ్ మహమ్మారి తోడైంది. పరిస్థితి మరింత విషమించింది.
ప్రకృతి వ్యవసాయం, బూటకపు సైన్సు
వ్యవసాయానికి ఎరువులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే దేశం శ్రీలంక. విదేశీ మారకపు రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎరువుల దిగుమతులు నిలిపివేయడమే మార్గమని గొటబాయ రాజపక్స భావించాడు. రసాయన ఎరువులకు బదులు ఆర్గానిక్ ఎరువులను వాడాలన్న ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో కొన్ని సంస్థలు ప్రభుత్వంతో గొంతు కలిపాయి. వీరికి తోడు సూడో సైన్సు ప్రచారం కూడా మొదలైంది. రసాయన ఎరువుల వాడకం వల్లనే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయన్న తప్పుడు ప్రచారాన్ని చేశారు. అయితే దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. ఇంకొంతమంది రసాయన ఎరువులు నీటి ప్రవాహంలో కలిసినందువలన అవి ఆనకట్టలను కరిగించివేస్తాయన్న ప్రచారం కూడా చేశారు. ఇటువంటి ప్రచారాలు చేసినవారు గొటబాయ రాజపక్స సలహాదారులుగా ఉన్నారు. వారి సలహాల ఆధారంగా అధ్యక్షుడు రసాయన ఎరువుల దిగుమతులను నిషేధించాడు.
ఆర్గానిక్ వ్యవసాయం
ఆర్గానిక్ వ్యవసాయం శ్రీలంక పాలిట పెనుశాపంగా మారింది. నిజానికి ప్రపంచం మొత్తం మీద ఆర్గానిక్ వ్యవసాయం మొత్తం వ్యవసాయంలో కేవలం 1.5శాతం భూమిలో మాత్రమే సాగుతోంది. అటువంటి పరిస్థితిలో 100శాతం ఆర్గానిక్ వ్యవసాయానికి కేవలం ఒకే ఒక నెల వ్యవధిలో మారిపోవాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించడం వినాశకర ఫలితాలకు దారితీసింది. ఆర్గానిక్ వ్యవసాయానికి పూనుకుంటే వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని, హరిత విప్లవం సాధించిన విజయాలు అన్నీ నిష్ప్రయోజనం అవుతాయని శ్రీలంకలోని శాస్త్రవేత్తలందరూ ప్రభుత్వానికి విన్నవించారు. కాని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఫలితంగా ఫిబ్రవరి 2022 నాటికి వ్యవసాయంలో దిగుబడులు దారుణంగా పడిపోయాయి. అంతవరకూ వరి పంట దిగుబడిలో స్వయంసమృద్ధి కలిగివున్న శ్రీలంక ఒక్కసారిగా బియ్యాన్ని మయన్మార్ నుండి, చైనా నుండి దిగుమతి చేసుకోవలసిన దుస్థితికి చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్గానిక్ వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ముగింపు
మొత్తంగా చూస్తే శ్రీలంకలో నేడు తలెత్తిన సంక్షోభం వెనుక చాలా కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం, ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గడం. ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి మితవాదం వైపు మొగ్గడం అనే క్రమం. ఇప్పుడు ఈ సంక్షోభం నుండి బైట పడడానికి శ్రీలంక 17వ సారి ఐఎంఎఫ్ రుణం కోసం ప్రయత్నిస్తోంది. ఈసారి కూడా ఐఎంఎఫ్ మరిన్ని విషమ షరతులు విధించడం ఖాయం. ప్రజల పరిస్థితి మరింత దిగజారిపోవడమూ తప్పదు.
- ఆర్. రామ్‌కుమార్
(వ్యాసకర్త : ప్రొఫెసర్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ముంబై)