Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏప్రిల్ మొదటి రెండు వారాలు కులవివక్ష, సామాజిక సమస్యలే ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగే కాలం. ఈ సారి కూడా అదే జరిగింది. కులవివక్ష ఇంకా ఉన్నదా? అందరూ కలిసి చదువుకుంటున్నారు. కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళల పట్ల వివక్ష ఉన్నదా? అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు కదా!? చదవటం, ఉద్యోగాలు చేయటమే కాదు... రాజకీయాల్లో కూడా ఎదుగుతున్నారు కదా అని అమాయకంగా ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. అంతేకాదు... కులవివక్ష, మహిళల పట్ల వివక్ష వేధింపులు వంటివి సామాజిక రుగ్మతలన్న విషయంలో ఎవరూ కాదనరు. కానీ... గత కాలపు వెనుకబాటు తనం నుంచి కొనసాగుతున్న అవశేషాలా? లేక ఇప్పటికీ, కావాలనే కొనసాగిస్తున్న ఆధిపత్యపు ధోరణులా? అనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది భూసామ్య సమాజపు ఆధిపత్య భావజాలం అనేది నిర్వివాదాంశం. కానీ అది మాత్రమే అయితే ఆధునిక పెట్టుబడిదారీ సమాజం వైపు పరుగులు తీస్తున్న సమాజంలో తగ్గిపోవాల్సిన వివక్ష ఎందుకు కొనసాగుతున్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకటం చాలా కీలకం. సమాజం అభివృద్ధితో పాటు వివక్ష కూడా కొత్త రూపాలలో విస్తరించటం గమనార్హం. అందుకే ఈ చర్చ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇలాంటి సమయంలో కార్మికవర్గం వివక్ష గురించి చర్చించటం, వివక్షకు వ్యతిరేకంగా సాగే ఉద్యమానికి అండగా ఉండాలని సీఐటీయూ పిలుపునివ్వటం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఏప్రిల్ 6 బిటి రణదివే వర్థంతి. 1990లో ఆయన మరణించారు. ఆయన అంబేద్కర్ సహచరుడు. సామాజికరంగంలో అంబేద్కర్ నిర్విరామకృషిలో ఉన్న సమయంలో కార్మికోద్యమ నిర్మాణం కోసం నిరంతర కృషిలో లీనమయ్యారు బీటీఆర్. వర్గపోరాటం గురించీ, కుల సమస్య గురించీ ఇద్దరి మధ్య అనేక చర్చలు జరిగిన కాలమది. అప్పుడే 'కులం, వర్గం, ఆస్తి సంబంధాల' మీద బీటీఆర్ ఒక పత్రం విడుదల చేసారు. కుల వివక్ష మీద పోరాడవల్సిన ప్రాధాన్యత గురించీ, కుల నిర్మూలన కోసం కార్మిక వర్గం పూనుకోవాల్సిన ఆవశ్యకత గురించీ ఆయన విశ్లేషించారు. ఆయన సీఐటీయూ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే శ్రామిక మహిళల సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఒక కేంద్ర కార్మిక సంఘంలో శ్రామిక మహిళల సమస్యలు చర్చించేందుకు వారితోనే ఒక కమిటీ వేయటం భారత కార్మికోద్యమ చరిత్రలోనే అది తొలి అడుగు. బిటి రణదివే, బీఆర్ అంబేద్కర్ల కన్నా కొన్ని దశాబ్దాల ముందే 1827 ఏప్రిల్ 11న జ్యోతిరావు ఫూలే జన్మించారు. ఛాందస భావాలూ, కుల బంధనాలు అత్యంత బలంగా ఉన్న ఆ కాలంలోనే ఫూలే కుల కట్టుబాట్లమీద, మహిళల పట్ల వివక్ష మీద తిరుగుబాటు చేశారు. అగ్రకుల ఆధిపత్యాన్ని తిరస్కరించారు. ఇక అంబేద్కర్ గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహానీయునిగా ప్రపంచమంతా గుర్తించిన మేధావి. సమాజాభివృద్ధికి కుల వ్యవస్థ పెద్ద ఆటంకంగా ఆయన గుర్తించారు. కుల నిర్మూలనే ప్రధాన కర్తవ్యంగా జీవితం అర్పించారు. మహిళల హక్కులను ఆమోదించని మంత్రివర్గంలో తాను కొనసాగలేనని, తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఆదర్శనేత ఆయన. ఈ ముగ్గురు అభ్యుదయ కాముకుల వర్థంతులు లేదా జయంతులు వచ్చిన కాలమే ఏప్రిల్ మొదటి రెండు వారాలు. కాబట్టి ఈ 15 రోజుల కాలానికి అంత ప్రాధాన్యత. అందుకే సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మిక నాయకులు, కార్యకర్తలు 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వివక్ష రూపాలను అధ్యయనం చేసారు. వివక్ష వ్యతిరేక పోరాటానికి కార్మిక వర్గం అండగా నిలవాలనీ, కార్మికవర్గం ఈ పోరాటంలో ముందుండాలనీ చైతన్య పరిచే ప్రయత్నం చేసారు.
ఆధునిక సమాజమని గొప్పలు చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీల పట్ల పని స్థలాల్లో యాజమాన్యాల వివక్ష, వేధింపులు తప్పటం లేదు. అధికారులు, సూపర్వైజర్ల ఆగడాలకూ హద్దుల్లేవు.హైదరాబాద్ లాంటి మాహానగరమూ వీటికి మినహాయింపు కాదు. మహిళా పారిశుధ్య కార్మికుల నుంచి ప్రతి నెలా సూపర్వైజర్లు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. వరంగల్ మహానగరంలో కూడా రెండు వందలు సమర్పించుకోవాలి. దళిత మహిళలు కావటమే వారి నేరం. బొల్లారం పారిశ్రామిక వాడలో హైటెక్స్ కంపెనీ ఉన్నది. మహిళ పట్ల వేధింపుల కూడా ఉన్నాయి. హైటెక్ స్థాయిలోనే వేధింపులు తట్టుకోలేక, ప్రహరీ గోడ దూకి మహిళలు తప్పించుకోవాల్సి వచ్చింది. సంఘటితంగా నిలబడి ఉంటే, వేధించిన అధికారి భరతం పట్టి ఉండవచ్చు. యాజమాన్యం మాత్రం ఏదీ జరగనట్టే నటించింది. చెక్‌బుక్స్ ముద్రించే ఒక కంపెనీలో మహిళలు భోజన విరామ సమయంలో భోజనం చేయటం లేదా వాష్‌రూమ్‌కు వెళ్ళటం... ఏదో ఒకటే చేయాలట! వాష్‌రూమ్‌కు ఎక్కువ సేపు పోతున్నారని అధికారుల ఎత్తిపొడుపులు. ఖైతాన్ కంపెనీలో మహిళలకు పురుషుల కన్నా తక్కువ వేతనాలు. ముఖం చూసి జీతం పెంచుతారట. దీని అర్థం ఏమిటి? సంగారెడ్డి పరిసరాలలో ఉన్న ఒక బీర్ ఫ్యాక్టరీలో తక్కువ వేతనం ఇవ్వటం కోసం, కొన్ని రకాల పనులు గిరిజన మహిళలతో పీస్‌రేట్ పద్ధతిలో చేయిస్తున్నారు. భవన నిర్మాణం రంగంలో ఆడకూలి, మగ కూలి పేరుతో మహిళలకు తక్కువ వేతనం బహిరంగంగానే అమలు జరుగుతున్నది. వివక్షకు గ్రామం, పట్టణం అన్న తేడా లేదు. చేతి వృత్తులు, ఆధునిక పరిశ్రమలన్న తేడా కూడా లేదు.
ఇలాంటి రుగ్మతల నిర్మూలన లక్ష్యంతోనే అభ్యుదయ విలువల కోసం పోరాడిన ఆదర్శనేతల వర్థంతులు, జయంతులు నిర్వహించాలి. ఇది కేవలం రెండు వారాల తంతు కాకూడదు. మే 1 పుచ్చలపల్లి సుందరయ్య జయంతి, మే 19 ఆయన వర్థంతి. ఆ మహనీయుని జీవితమంతా దోపడీ నుంచీ, అన్ని రకాల వివక్షల నుంచీ మానవజాతి విముక్తి పోరాటంలోనే కరిగి పోయింది. ఇలాంటి నేతల స్ఫూర్తితో కులవివక్ష మీద, లింగ వివక్షమీద, వేధింపులకు, దాడులకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం చేయాలి. కానీ విషాదమేమంటే మహనీయుల జయంతులు, వర్థంతులు కూడా ఒక తంతుగా మారుతున్నాయి. కాదు... అలా దిగజార్చుతున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహానికి దండవేయకపోతే ఎక్కడ వెనుకబడిపోతామోనన్న ఆదుర్దాతో పోటీలు పడుతున్నారు. నిత్య జీవితంలో కుల వివక్ష, మహిళల పట్ల చిన్న చూపు ప్రదర్శించే 'పెద్ద మనుషులు' చాలా మంది అంబేద్కర్ జయంతి రోజు వేదికలెక్కి నీతులు చెప్పటం అలవాటుగా మారింది. అందరూ అంబేద్కర్‌ను ఆకాశానికెత్తుతున్న సమాజంలో ఇన్ని రకాల వివక్షలు ఎందుకు జడలు విప్పుతున్నాయి? ఈ గుట్టు విప్పి చిత్తు చేయటంలో కార్మిక వర్గం అగ్రభాగాన ఉండాలి.
బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ మహనీయుల జయంతి ఉత్సవాలను ఓట్ల వేటలో భాగంగానే చూస్తున్నాయి. అందుకే మహనీయుల పేరుతో వీరు ఎన్ని ఉపన్యాసాలు దంచినా, వీరి పాలనలోనే ఈ దురాచారాలు ప్రబలుతున్నాయి. మోడీ పాలనలో ఈ సంఖ్య దేశ చరిత్రలోనే అత్యధికం. తెలంగాణ రాష్ట్రంలో కూడా కుల దురహంకార హత్యల పట్ల పాలకుల మౌనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు కొన్ని సంస్థలు కులం పేరుతో అస్తిత్వాన్ని ముందుకు తెస్తున్నాయి. అంబేద్కర్ కుల అస్తిత్వాన్ని ప్రశ్నించిన నేత. ఆయన ఆదర్శాలు చెబుతూనే కులం అస్తిత్వానికి తోడ్పడే చర్యలు సమంజసం కాదు. కుల పునాదులను శాస్త్రీయంగా అర్థం చేసుకున్న కమ్యూనిస్టులు ఈ సమస్యలను పూర్తి భిన్నంగా చూస్తున్నారు. కులనిర్మూల కోసం కంకణ బద్ధులై ఉన్నారు. కుల వివక్ష మీద, లైంగిక దాడుల మీద, సామాజిక రుగ్మతలమీద శ్రామిక జనం ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. కమ్యూనిస్టుల పాలనలో ఇలాంటి దురాచారాలకు తావు లేదని రుజువు చేస్తున్నారు. బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాలలో దశాబ్దాల పాటు ఈ సామాజిక తరగతులకు భద్రత లభించింది. హక్కులు సాధించుకున్నారు. త్రిపురలో బీజేపీ, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మళ్లీ భద్రత కరువైంది. మరోవైపు కేరళ వామపక్ష ప్రభుత్వం దేశానికి వెలుగు దివ్వెగా నిలిచింది. కులవివక్ష, సామాజిక అణచివేత, లైంగిక దాడులకు తావులేని రాష్ట్రం. అన్ని రంగాలలో అన్ని తరగతుల ప్రజలు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. ఆలయంలో దళితులు కూడా అర్చకులుగా ఉండవచ్చని ఆచరించి చూపిిన రాష్ట్రం. సుప్రీం తీర్పుతో అయ్యప్ప దర్శనం కోరుకున్న మహిళలకు భద్రత కల్పించిన ప్రభుత్వం అది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా కార్మిక వర్గ స్పందించి కార్మిక రంగంలో ఉన్న వివక్ష రూపాలను గుర్తించే ప్రయత్నం చేసింది. వివక్ష మీద చేసే పోరాటానికి విరాళాలు ఇచ్చేందుకు కూడా కార్మికవర్గం ముందుకొచ్చింది. ఇది గడిచిన 15 రోజుల తంతుకాదు. ఇది నిరంతర కార్యాచరణ కావాలి. వివక్షకు వ్యతిరేకంగా ఏ మూలన ఏ పోరాటం జరిగినా కార్మికవర్గం కదలాలి. యూనియన్లు కేవలం ఆర్థిక సమస్యలే కాదు, సామాజిక సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేయాలి. కార్మికవర్గ ఐక్యత, శ్రామిక ప్రజల మధ్య సహకార బంధం బలడిపతే నష్టపోయేది పెట్టుబడిదారీ వర్గమే కదా! అప్పుడు వారి దోపిడీ సాధ్యపడదు. అందుకే కార్మికవర్గం ఐక్యం కాకుండా కులాల కుంపటిని రాజేస్తున్నది పెట్టుబడిదారీ వర్గమే. స్త్రీని వ్యాపార సరుకుగా మలిచేది పెట్టుబడిదారీ వర్గమే. అందుకే ఈ సమస్య కేవలం గత కాలపు అవశేషాల ఫలితం కాదు. ఆధునిక సమాజంలోని దోపిడీ వర్గాల చేతిలో ఆయుధంగా పని చేస్తున్నది. దీనిని ధ్వంసం చేయకుండా కార్మికవర్గం విముక్తి పొందటం సాధ్యం కాదు. అందుకే కార్మిక వర్గం శ్రమ దోపీడీ మీద, సామాజిక వివక్ష మీద యుద్ధం ప్రకటించాలి.
- ఎస్. వీరయ్య